ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి శ్రీ అదెల్ బిన్ అహ్మద్ అల్ జుబేర్ కు సాదరంగా స్వాగతం పలికారు.
సౌదీ అరేబియాతో ఉన్న సన్నిహిత, స్నేహ పూర్వక సంబంధాలకు భారతదేశం ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
సౌదీ అరేబియా భారతదేశంతో తమకు ఉన్న సంబంధాలకు తమ విదేశాంగ విధానంలో ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు సౌదీ విదేశాంగ మంత్రి చెప్పారు. భారతీయులు సౌదీ అరేబియా అభివృద్దిలో పోషిస్తున్న నిర్మాణాత్మక భూమికను ఆయన ఎంతగానో ప్రశంసించారు.
వ్యాపారం, పెట్టుబడులు, శక్తి, ఇంకా భద్రత సంబంధ సహకారం వంటి రంగాలు సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకొనే అంశంపై ఇరువురు నేతలు వారి అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజేసుకున్నారు. ప్రాంతీయ స్థితిగతులను గురించి కూడా వారు చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను పరిరక్షించడంలో ఉభయదేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా రాజ్యంలో త్వరలో తాను జరపనున్న పర్యటన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక కొత్త స్థాయికి చేర్చే అవకాశాన్ని కల్పిస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
***