ఎన్నికల నిర్వహణ, పాలనా పద్ధతుల్లో సహకారం కోసం నమీబియా ఎన్నికల కమిషన్ (ECN), పనామా ఎన్నికల ట్రిబ్యునల్ (ETP)లు భారత్తో కుదుర్చుకున్న అవగాహన సహకారం ఒప్పందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ముఖ్యాంశాలు:
ఎన్నికల నిర్వహణ, పాలన పద్ధతుల రంగంలో సహకారాన్ని ఈ ఒప్పందంలోగల ప్రామాణిక నియమాలు/నిబంధనలు ప్రోత్సహిస్తాయి. ఎన్నికల ప్రక్రియలో సంస్థాగత, సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి రంగాల్లో విజ్ఞానం, అనుభవాల ఆదానప్రదానానికీ ఇది దోహదపడుతుంది. సమాచార ఆదానప్రదానంలో మద్దతు, సంస్థాగత బలోపేతం, సామర్థ్య నిర్మాణం, సిబ్బందికి శిక్షణ, క్రమం తప్పకుండా సంప్రదింపులు వంటివన్నీ ఈ ఒప్పందాల కిందకు వస్తాయి.
ప్రభావం:
నమీబియా ఎన్నికల సంఘం (ECN), పనామా ఎన్నికల ట్రిబ్యునళ్ల(ETP)లో సాంకేతిక సామర్థ్య నిర్మాణం/మద్దతు లక్ష్యంగా ద్వైపాక్షిక సహకారాన్ని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది. తమతమ దేశాల్లో ఒక మెట్టు మెరుగైన రీతిలో ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల యాజమాన్యం, పాలన పద్ధతుల రంగంలో సహకరించడం దీని ప్రధానోద్దేశం. అలాగే భారత అంతర్జాతీయ సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుంది.
నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంబంధిత అంశాలు, ఎన్నికల ప్రక్రియల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు భారత ఎన్నికల సంఘం (EC) ఆయా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోంది. ఈ మేరకు కొన్ని ఇతర దేశాలు, అక్కడి సంబంధిత పక్షాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాల ద్వారా సహకారం అందిస్తోంది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల కసరత్తు సాగే భారత్లో ఆ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేది రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘమే. విభిన్న సామాజిక-రాజకీయ-ఆర్థిక నేపథ్యాలుగల 85 కోట్ల మంది ఓటర్లున్న విశాల దేశంలో సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం ఈసీ బాధ్యత. ఆ విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్య విజయం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి దేశంలోని రాజకీయ వ్యవస్థనూ ఆకట్టుకుంది.
ఎన్నికల రంగంలో నైపుణ్యాన్వేషణ దిశగా అనేక విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థల నుంచి ఎన్నికలు-తత్సంబంధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం వివిధ ప్రతిపాదనలను భారత ఎన్నికల సంఘం అందుకుంటోంది. ఇలా అందిన ప్రతిపాదనలను కేంద్ర చట్ట-న్యాయ, శాసన మంత్రిత్వశాఖలకు పంపి, వాటిద్వారా నమీబియా ఎన్నికల సంఘం (ECN), పనామా ఎన్నికల ట్రిబ్యునళ్ల(ETP)తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
**