నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భం గా జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని నవ్సారీ జిల్లా లో గల దండి లో దేశ ప్రజల కు అంకితం చేశారు.
మహాత్మ గాంధీ మరియు దండి ఉప్పు యాత్ర లో ఆయన ను అనుసరించిన 80 మంది సత్యాగ్రహీ లకు చెందిన విగ్రహాల ను కూడా ప్రధాన మంత్రి స్మారక స్థలి లో ఆవిష్కరించారు. బ్రిటిషు చట్టాన్ని ఉల్లంఘించి సముద్రపు నీటి నుండి ఉప్పు ను తయారు చేయడం కోసం మహాత్ముడు మరియు 80 మంది సత్యాగ్రహీ లు దండి యాత్ర ను నిర్వహించారు. 1930 వ సంవత్సరం లో చోటు చేసుకొన్న చరిత్రాత్మక ఉప్పు యాత్ర ను కళ్ళ కు కట్టే వివిధ ఘట్టాల ను మరియు కథ లను వివరించే 24 కుడ్య చిత్రాలు కూడా ఈ స్మారకం లో ఉన్నాయి. స్మారక భవన సముదాయం యొక్క శక్తి అవసరాల ను తీర్చడం కోసం సోలర్ ట్రీస్ ను అక్కడ అమర్చారు. ప్రధాన మంత్రి స్మారక భవన సముదాయం అంతటా కలియదిరిగారు.
ఒక జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్మారకం రూపుదిద్దుకోవడానికి పాటుపడిన ప్రతి ఒక్కరి కి అభినందన లు తెలిపారు. ‘‘స్వాతంత్య్ర సాధన కోసం మన దేశ ప్రజలు చేసినటువంటి గొప్ప త్యాగాల ను ఈ స్మారక భవనం మనకు గుర్తు చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దండి స్మారక భవనం స్వదేశీ కై మహాత్మ గాంధీ యొక్క ఆగ్రహం, అలాగే సత్యాగ్రహం మరియు సత్యాగ్రహ ఆదర్శాల ను చాటిచెప్తుందని, అది రానున్న రోజుల లో పర్యటకుల కు ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణ కాగలదని ఆయన అన్నారు.
‘‘గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయే ప్రయత్నం లో భాగం గా ఖాదీ కి సంబంధించిన సుమారు 2 వేల సంస్థ లను మా ప్రభుత్వం ఆధునికీకరించింది. ఇది లక్షలాది హస్తకళాకారుల తో పాటు, శ్రామికుల కు లబ్ది ని చేకూర్చింది. ఖాదీ ప్రస్తుతం ఒక ఫ్యాశన్ స్టేట్మెంట్ గానే కాక మహిళల సశక్తీకరణ కు ఒక సంకేతం గా కూడా ఉంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం లో స్వదేశీ ఒక బ్రహ్మాండమైన పాత్ర ను పోషించిందని, అదే మాదిరి గా పేదరికాన్ని అధిగమించడానికి చేనేత లు ఒక సాధనం గా మారుతాయని ఆయన చెప్పారు. చేనేత లను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ ని చేనేత ల దినం గా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
స్వచ్ఛత కు గాంధీ కట్టబెట్టిన ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఒక స్వచ్ఛ భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం మనం ఆ విలువల ను స్వీకరించామన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రభావం ఎటువంటిదంటే గ్రామీణ ప్రాంతాల లో పరిశుభ్రత 2014వ సంవత్సరం లో కేవలం 38 శాతం గా ఉన్నది కాస్తా ఎన్డిఎ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన అనంతరం 98 శాతాని కి పెరిగింది అని ఆయన వివరించారు.
పల్లెల కు కనీస సౌకర్యాల ను అందించే దిశ గా తాను చేస్తున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ పల్లెవాసు లకు స్వచ్ఛమైన వంటింటి ఇంధనం మొదలుకొని విద్యుత్తు దాకా, మరి అలాగే ఆరోగ్య సంరక్షణ నుండి ఆర్థిక సేవల వరకు ఈ కృషి సాగుతోందని, ‘గ్రామోదయ్ నుండి భారత్ ఉదయ్’ అనే ఆలోచన వరకు ఉద్యమించాలన్న ఆశయాని కి అనుగుణంగా ఇది ఉందన్నారు.
ప్రధాన మంత్రి గుజరాత్ లో ఒక రోజంతా పర్యటించారు. అంతక్రితం ఆయన సూరత్ విమానాశ్రయం టర్మినల్ భవన విస్తరణ పనుల కు శంకుస్థాపన చేశారు. సూరత్ లో వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించారు. సూరత్ లోని అత్యాధునిక రసీలాబెన్ సేవంతీలాల్ వీనస్ ఆసుపత్రి ని దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు. సూరత్ లో జరిగిన న్యూ ఇండియా యూత్ కా న్ క్లేవ్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.
**