ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ లైంగిక నేరాలనుంచి బాలలకు రక్షణ కల్పించే పి.ఒ.సి.ఎస్.ఓ చట్టం 2012 సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి శిక్షను మరింత కఠినతరం చేసేందుకు దీనిని ఉద్దేశించారు.
ముఖ్యాంశాలు :
బాలల ప్రయోజనాలు, వారిబాగోగుల రక్షణ, వారిపై లైంగిక దాడులు, వేధింపుల నిరోధం, అశ్లీల చిత్రీకరణ వంటి వాటినుంచి వారిని రక్షించేందుకు 2012లో పోస్కో చట్టాన్ని తీసుకువచ్చారు.
ఈ చట్టం కింద 18 సంవత్సరాలకు లోపు కలిగిన ఏ వ్యక్తినైనా బాలలుగా గుర్తిస్తారు. ప్రతి దశలో కూడా బాలల ప్రయోజనాలే పరమావధిగా వారి మానసిక, శారీరక, మేధాపరమైన ఆరోగ్యంతో పాటు సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే ఈ చట్టం బాల బాలికలకు ఇరువురికీ సమానంగా వర్తిస్తుంది.
బాలలను లైంగిక వేధింపులనుంచి తగినవిధంగా రక్షించేందుకు ఈ చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 9, సెక్షన్ 14, సెక్షన్ 15, సెక్షన్ 42కు ఈ సవరణలను ఉద్దేశించారు. దేశంలో బాలలపై లైంగిక వేధింపులు పెరిగిపోకుండా నిరోధించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకునేదిశగా ఈ సవరణలను తీసుకువస్తున్నారు.
బాలలను లైంగిక వేధింపులనుంచి రక్షించేందుకు, వారిపై లైంగిక అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు ఉరిశిక్ష సహా కఠిన చర్యలను ఈ చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6కు సవరణల ద్వారా ప్రతిపాదించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, విపత్తుల సమయంలో బాలలపై లైంగిక వేధింపులు జరగకుండా నిరోధించేందుకు, వారు త్వరగా సెక్సువల్ మెచూరిటీ సాధించడానికి హార్మోన్లు ఎక్కించడం,వారిపై ఎలాంటి రసాయనాలైనా వాడడాన్ని నిరోధించేందుకు సెక్షన్9 కి కూడా సవరణలు ప్రతిపాదించారు.
2012 నాటి పోస్కో చట్టంలోని సెక్షన్ 14, సెక్షన్ 15లను కూడా సవరించాలని ప్రతిపాదించారు. బాలల అశ్లీల చిత్రీకరణ బెడద నిరోధానికి ఈ సెక్షన్‌కు సవరణలు ప్రతిపాదించారు. బాలల అశ్లీల చిత్రీకరణ మెటీరియల్‌ను ధ్వంసం చేయకుండా ఉండడం, తొలగించకుండా ఉండడం, దానికి సంబంధించి రిపోర్టు చేయకుండా ఉండడం వంటినేరాలకు పెనాల్టీ విధించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా కోర్టులోసాక్ష్యం కోసమో లేక ఫిర్యాదు చేయడం కోసమో కాక ఇతరత్రా అలాంటి మెటీరియల్‌ను పంపినా, నిర్వహించినా, ప్రచారంలో పెట్టినా అలాంటి వ్యక్తులకు పెనాల్టీ విధించడం, జైలుకు పంపడం, ఇంకా ఈ రెండింటినీ ఏకకాలంలో విధించనున్నారు. ఏరూపంలో అయినా చిన్నపిల్లలకు సంబంధించి అశ్లీల మెటీరియల్ ను వాణిజ్యఅవసరాలకు నిల్వచేసినా, కలిగిఉన్నా అలాంటి నేరాలకు సంబంధించి పీనల్ ప్రొవిజన్లను మరింత కఠినతరం చేశారు.
ప్రయోజనాలుః
ఈ సవరణ బాలలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి ,చట్టంలో కఠిన శిక్షలను చేర్చడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది బాలలను విషమ పరిస్థితులనుంచి కాపాడడానికి వారి ప్రయోజనాల పరిరక్షణకు ఉపకరిస్తుంది. వారి భద్రతకు వారి గౌరవానికి పూచీపడుతుంది. ఈ సవరణ బాలలపై లైంగిక వేధఙంపుల అంశం, శిక్షల విషయంలో మరింత స్పష్టతనిచ్చేదిగా ఉంది.