2015 మే నెలలో భారతదేశం, రష్యాలు కుదుర్చుకున్న ఒక ఒప్పందం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ప్రాథమిక, అన్వేషక శాస్త్ర విజ్ఞాన రంగాలలో రిసర్చ్ ప్రాజెక్టులను అమలు చేయడానికి భారతదేశం, రష్యా పరిశోధకులకు స్పర్ధాత్మకమైన పరిశోధక గ్రాంటుల మంజూరుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
ఈ ఒప్పందం ఆరు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిని శాస్త్ర & సాంకేతిక విజ్ఞాన విభాగం (డీఎస్ టీ), రష్యన్ సైన్స్ ఫెడరేషన్ (ఆర్ఎస్ఎఫ్) ల పరస్పర సమ్మతితో పొడిగించేందుకు అవకాశం ఉంది.
గణితం, కంప్యూటర్ & సిస్టమ్ సైన్స్; భౌతిక శాస్త్రం & అంతరిక్ష శాస్త్రం; రసాయనిక శాస్త్రం & మెటీరియల్ సైన్స్; జీవశాస్త్రం, లైఫ్ సైన్స్; వైద్యం కోసం ప్రాథమిక పరిశోధన, వ్యవసాయ శాస్త్రం, భూ శాస్త్రం, ఇంజినీరింగ్ శాస్త్రం రంగాలలో ఈ పోటీని నిర్వహిస్తారు. నిధులు అందించవలసిన పరిశోధన ప్రాజెక్టులను గుర్తించడంలో డీఎస్ టీ, ఆర్ఎస్ఎఫ్ లు కలసి నిర్ణయాన్ని తీసుకుంటాయి. ఈ సహకారం తాలూకు ఫలితాలు కొత్త విజ్ఞాన ఆవిష్కరణ, సంయుక్త శాస్త్రవిజ్ఞాన ప్రచురణలు, సిబ్బందికి శిక్షణ, మేధాసంపత్తి సృజన లకు దారితీస్తాయి.