Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఆజాద్ హింద్ ఫౌజ్’ యొక్క 75వ వార్షిక ఉత్సవ సూచకం గా ఎర్ర కోట లో ప్రధాన మంత్రి ప్రసంగం

‘ఆజాద్ హింద్ ఫౌజ్’ యొక్క 75వ వార్షిక ఉత్సవ సూచకం గా ఎర్ర కోట లో ప్రధాన మంత్రి ప్రసంగం

‘ఆజాద్ హింద్ ఫౌజ్’ యొక్క 75వ వార్షిక ఉత్సవ సూచకం గా ఎర్ర కోట లో ప్రధాన మంత్రి ప్రసంగం

‘ఆజాద్ హింద్ ఫౌజ్’ యొక్క 75వ వార్షిక ఉత్సవ సూచకం గా ఎర్ర కోట లో ప్రధాన మంత్రి ప్రసంగం


నా మంత్రివర్గ సహచరుడు శ్రీ మహేశ్ శర్మ గారు, ఇవాళ మన మధ్య ఉన్న ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుడు, భరత మాత వీర పుత్రుడైన లాల్తీ రామ్ గారు, నేతాజీ సుభాష్ బాబు మేనల్లుడైన చంద్రకుమార్ బోస్ గారు, బ్రిగేడియర్ ఆర్.ఎస్. చికారా గారు, రక్షణ బలగాల అధికారులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,

ఈ రోజు.. అక్టోబరు 21వ తేదీ.  ఇది ఒక చారిత్రక దినం.  ఈ సందర్భంగా నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.  నేతాజీ సుభాష్ చంద్రబోస్ 75 ఏళ్ల కిందట ఇదే ఎర్ర కోట వేదిక గా విజయోత్సవ కవాతు ను గురించి స్వప్నించారు.  ఆనాటి ఆజాద్ హింద్ ప్రభుత్వం తొలి ప్రధాని గా ప్రమాణం చేస్తూ- ఎర్ర కోట పై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే రోజు తప్పక వస్తుందని ప్రకటించారు.  నాటి ఆజాద్ హింద్ సర్కారు అవిభక్త భారతదేశ ప్రభుత్వం.  అలాంటి ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ఇవే నా అభినందనలు.

మిత్రులారా,

జాతి కి తనను తాను అంకితం చేసుకున్న, లక్ష్య సాధన కోసం తన సర్వస్వాన్నీ ఒడ్డేందుకు సదా సంసిద్ధుడైన, సుస్పష్ట భవిష్యత్ దార్శనికుడైన ఒక వ్యక్తి ని స్మరిస్తూ తరతరాలు స్ఫూర్తి పొందుతున్నాయి.  భరత మాత కు అటువంటి వీరపుత్రుడి ని ప్రసాదించిన నేతాజీ తల్లితండ్రులకు నేను ఇవాళ ప్రణమిల్లుతున్నాను.  వారి కడుపున జన్మించిన ఆ శూరుడు మరెందరో సాహసులను తయారుచేసి, వారు వారి యొక్క జీవితాలను దేశం కోసం తృణప్రాయంగా అర్పించేలాగా వారిని తీర్చి దిద్దారు.  దేశ మాత దాస్య విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ వీర సైనికులకు, వారి కుటుంబాలకు నేను శిరస్సు ను వంచి నమస్కరిస్తున్నాను.  నేతాజీ శ్రీకారం చుట్టిన ఆ నాటి ఉద్యమానికి తమ వంతు కృషి ని జోడించి, అంకిత భావం తో వెన్నుదన్ను గా నిలబడి, సర్వ స్వతంత్ర, సంపన్న సాధికారిక భారతదేశ నిర్మాణానికి విలువైన సేవలను అందించిన విశ్వవ్యాప్త భారతీయులందరినీ ఈ వేళ స్మరించుకుంటున్నాను.

మిత్రులారా,

ఆజాద్ హింద్ ప్రభుత్వమన్నది కేవలం ఒక పేరు కాదు.. నేతాజీ నాయకత్వం లోని ఆ ప్రభుత్వం ప్రతి రంగానికీ సంబంధించి అనేక పథకాలను రూపొందించింది.  ఆ ప్రభుత్వానికి తనదైన బ్యాంకు, కరెన్సీ, తపాలా బిళ్ల, నిఘా చట్రం వంటివన్నీ ఉండేవి.  అటువంటి భారీ ప్రభుత్వాన్ని పరిమిత వనరులతో.. అందునా దేశం వెలుపల ఉంటూ రూపొందించడం అసాధారణమని నేను విశ్వసిస్తాను.  అప్పటికి ప్రపంచం లోని అనేక దేశాల్లో బలమైన పట్టున్న ప్రభుత్వానికి వ్యతిరేకం గా నేతాజీ ప్రజలను ఏకం చేశారు.  అటువంటి వీరత్వ ప్రదర్శనకు ఆయన బాల్యం లోనే పునాది పడిందని నేతాజీ రచనలను చదివితే మనకు అర్థమవుతుంది.  సుమారు 106 ఏళ్ల కిందట 1912 ప్రాంతంలో సుభాష్ బాబు తన తల్లి కి ఒక ఉత్తరం రాశారు.  భారతదేశం బానిస సంకెళ్ల లో మగ్గిపోవడం పై ఆయన ఎంతటి తీవ్ర వేదన ను అనుభవించిందీ తెలిపే ప్రత్యక్ష సాక్ష్యం ఆ ఉత్తరం.  అప్పటికి ఆయన వయస్సు  15-16 ఏళ్లు మాత్రమే అనే వాస్తవాన్ని ఈ సందర్భం గా మనం గుర్తుంచుకోవాలి.  అనేక ఏళ్ల వలస పాలన ఫలితం గా దేశం దు:స్థితి కి నెట్టబడిందన్న తన బాధ ను తల్లి కి రాసిన లేఖ లో ఆయన కళ్లకు కట్టారు.  అదే లేఖ లో తన తల్లి ని ఇలా ప్రశ్నించారు- ‘‘అమ్మా! కాలం గడిచే కొద్దీ మన దేశం ఇలా పతనం కావాల్సిందేనా ?  ఈ దీన భరత మాత సంతానం లో స్వార్థ ప్రయోజనాలను త్యజించి తన  జీవితాన్ని మాతృ భూమి కోసం అంకితం చేయగల పుత్రుడు ఒక్కరైనా లేరా ? చెప్పమ్మా! మనం ఎన్నడీ గాఢ నిద్ర నుండి మేల్కొంటాం ?’’ సుభాష్ చంద్రబోస్ కేవలం 15-16 ఏళ్ల ప్రాయం లో తన తల్లి కి సంధించిన ప్రశ్నలు ఇవీ.. కానీ;

సోదరీ సోదరులారా,

అదే లేఖ లో ఆ ప్రశ్నలకు తానే సమాధానాలను కూడా రాశారు.  ఇక ఎంతో కాలం వేచి ఉండే పరిస్థితి లేదని తన తల్లి కి స్పష్టం చేశారు.  నిష్క్రియాపరత్వం తో ఎవరూ ఉండిపోరాదని, గాఢ నిద్ర నుండి మేల్కొనాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు.  బద్ధకాన్ని వదిలించుకుని, కార్య రంగం లో దూకడం అవసరమని వివరించారు.  15-16 ఏళ్ల వయస్సు లోనే.  అదీ సుభాష్ బాబు వ్యక్తిత్వం.  తరుణ ప్రాయం లోని సుభాష్ బాబు హృదయం లో ఉప్పొంగిన ఈ ప్రగాఢ భావనే ఆయన ను నేతాజీ సుభాష్‌ గా మార్చింది.  నేతాజీ కి ఉన్నది ఒకటే లక్ష్యం.. ఒకే కార్యాచరణ.. మాతృ భూమి ని దాస్య శృంఖలాల నుండి విడిపించి, స్వేచ్ఛా భారతాన్ని కనులారా చూడడమే ఆయన ఏకైక ధ్యేయం.  అదే ఆయన సిద్ధాంతం, కార్యక్షేత్రం.

మిత్రులారా,

జీవిత ధ్యేయాన్ని నిర్ణయించుకొని, దాని కోసమే తన మనుగడ ను అంకితం చేయగలిగే మంత్ర సిద్ధి ని స్వామి వివేకానంద వ్యక్తిత్వం, బోధనల నుండే సుభాష్ బాబు పొందారు.  ‘‘ఆత్మానో మోక్షార్థమ్ జగత్ హితాయ చః’’ .. దీనికి  భావం ‘లోక సేవ తోనే మోక్షం సిద్ధిస్తుంది’  అని.  ఆ మేరకు ప్రజలకు సేవ చేయడమే ఆయన సిద్ధాంత పునాది.  దేశాని కి సేవ చేయాలన్న ఈ తపన తోనే ఆయన ప్రతి బాధ ను అనుభవించారు.. ప్రతి సవాలు ను ఎదుర్కొన్నారు… ప్రతి కుట్ర ను తిప్పికొట్టారు.

సోదరీ సోదరులారా,

లక్ష్యాన్ని స్థిరంగా మనస్సు లో ఉంచుకొని కాలంతో పాటు తమకు తాము పరివర్తన చెందిన స్వాతంత్ర్య ఉద్యమ సైనికులలో సుభాష్ బాబు కూడా ఒకరు.  తొలి నాళ్ల లో దేశం లోనే ఉండి మహాత్మ గాంధీ తో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు గా దేశ విముక్తి కోసం తన వంతు కృషి ని చేసినప్పటికీ తదనంతరం పరిస్థితులకు అనుగుణం గా ఆయన సాయుధ విప్లవ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణమిదే.  స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం లో సుభాష్ బాబు ఎంచుకున్న ఈ మార్గం కీలక పాత్ర పోషించింది.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసిన ఆలోచనల సారం భారతదేశాన్నేగాక ఇతర దేశాలనూ ఎంతగానో ఆకట్టుకుంది.  స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఆ దేశాలన్నీ సుభాష్ చంద్రబోస్ ద్వారా ప్రేరణ ను పొందుతూ వచ్చాయి.  ఏదీ అసాధ్యం కాదని, తాము కూడా ఏకమైతే బ్రిటిష్ పాలకులను సవాలు చేసి, స్వాతంత్ర్యం పొందగలమని వారు గుర్తించారు.  దక్షిణాఫ్రికా విద్యార్థి ఉద్యమం సందర్భంగా సుభాష్ చంద్ర‌బోస్‌ ను తమ నాయకుడుగా, తన హీరోగా పరిగణించానని గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు, భారత రత్న నెల్సన్ మండేలా గారు కూడా చెప్పారు.

సోదరీ సోదరులారా,

నేడు మనం ఆజాద్ హింద్ ప్రభుత్వ 75 వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాం.. మరో నాలుగేళ్ల కు అంటే 2022వ సంవత్సరం లో భారతదేశ 75 స్వాతంత్ర్య వేడుకలు చేసుకోబోతున్నాం.  ఆనాడు.. 75 ఏళ్ల కిందటే తన ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు గల భారతదేశాన్ని నిర్మిస్తానని నేతాజీ వాగ్దానం చేశారు.  ప్రాచీన సంప్రదాయాల స్ఫూర్తి తో అత్యంత గొప్ప, సుసంపన్న భారతావని ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు.  దేశం లోని ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయడం ద్వారా స్వేచ్ఛా భారతం లో సమతుల ప్రగతి కోసం కృషి చేస్తానని మాట ఇచ్చారు.  దేశాన్ని చిరకాలం దాస్య శృంఖలాల్లో బంధించిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని కూకటివేళ్ల తో పెకలిస్తానని కూడా వాగ్దానం చేశారు.  కానీ, స్వాతంత్ర్యం సిద్ధించి అనేక సంవత్సరాలు గడుస్తున్నా నేతాజీ కలలు నేటికీ సాకారం కాలేదు.  భారత్ ప్రగతి పథం లో చాలా దూరం పయనించిన కొత్త శిఖరాలను ఇంకా అందుకోవాల్సి ఉంది.  ఈ లక్ష్యం దిశగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలలు గన్న  ‘నవ భారత’ నిర్మాణ సంకల్పం తో 125 కోట్ల మంది భారతీయులు ఇవాళ ముందడుగు వేస్తున్నారు.  దేశ స్వాతంత్ర్యం, ఐక్యత, సార్వభౌమత్వంపై లోపలా, వెలుపలా విచ్ఛిన్న శక్తులు దాడి చేస్తున్న నేటి పరిస్థితుల్లో ఆ శక్తులపై ఉద్యమించి వాటి ని నిర్మూలించడం కోసం దేశంలోని ప్రతి పౌరుడూ నేతాజీ నుండి స్ఫూర్తి ని పొందవలసి ఉంది.  దాంతో పాటు దేశాభివృద్ధి కి అకుంఠిత దీక్ష తో కృషి చేస్తామని ప్రతిన తీసుకోవలసి ఉంది.

అయితే, ఈ నిర్ణయాలే కాకుండా అంతే ప్రాధాన్యం గల అంశం మరొకటి ఉంది.  అదే- జాతీయత, భారతీయతా భావన ను మది లో పాదుకొల్పి, ప్రస్ఫుటంగా ప్రకటించడం.  భారతదేశ భావన ను తన మది లో ముద్రించిన తొలి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని ఎర్ర కోట కు సంబంధించిన విచారణ సందర్భంగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడు షానవాజ్ ఖాన్ గారు ప్రకటించడం ఈ సందర్భం గా గమనార్హం.  ఆ విధంగా భారతీయుడి దృష్టికోణం లో భారతదేశం ఎలా ఉంటుందో తెలియజెప్పిన మొదటి వ్యక్తి ఆయన. షానవాజ్ ఖాన్ గారు ఆ విషయాలను గురించి చెప్పిన తరువాత సంభవించిన పరిణామాలు ఏమిటి ?  భారతదేశాన్ని భారతీయుడి దృష్టి కోణం నుండి చూడవలసిన అవసరం ఏమిటి ?  దేశం లో నేటి పరిస్థితులను గమనిస్తే ఈ విషయాన్ని మనం మరింత బాగా అర్థం చేసుకోగలం.

సోదరీ సోదరులారా,

కేంబ్రిడ్జి లో తన విద్యాభ్యాస కాలాన్ని గుర్తుచేసుకుంటూ- ఐరోపా అంటే గ్రేట్ బ్రిటన్ భారీ స్వరూపాని కి ప్రతీక గా భారతీయులకు నాడు బోధించేవారని సుభాష్ బాబు రాశారు.  అందుకే ఐరోపా అనగానే ‘ఇంగ్లాండ్ కళ్లతో’ చూడడానికి మనం అలవాటు పడిపోయామని ఆయన పేర్కొన్నారు.  దీంతో మన సంస్కృతి, మనవైన గొప్ప భాషలు, విద్యావ్యవస్థ, పాఠ్యాంశ నిర్మాణ శైలి.. ఇలా వ్యవస్థ మొత్తం ఈ భావన తీవ్రత ను మోయవలసి వచ్చింది. సుభాష్ బాబు గారు, సర్దార్ పటేల్ గారు ల వంటి గొప్ప నాయకుల మార్గదర్శనం మనకు కొనసాగి ఉంటే స్వతంత్రం వచ్చిన తరువాతి దశాబ్దాల్లో భారతదేశం పై మన దృష్టికోణాని కి సంబంధించి విదేశీ ప్రభావం రూపుమాసిపోయేదని, పరిస్థితులు విభిన్నంగా ఉండేవని నేను ఇవాళ సంపూర్ణ విశ్వాసంతో ప్రకటించగలను.

మిత్రులారా,

దేశంలో కేవలం ఒక్క కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తడం కోసం సర్దార్ పటేల్ గారు, బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ గారు, నేతాజీ ల వంటి భరత మాత పుత్రుల త్యాగాలను పూర్వపక్షం చేయడానికి తీవ్ర స్థాయి లో ప్రయత్నాలు సాగడం దురదృష్టకరం.  ఈ పరిస్థితి ని చక్కదిద్దడానికి మా ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోంది.  నేను ఇక్కడకు వచ్చే ముందు జాతీయ పోలీసు స్మారకాన్ని జాతి కి అంకితం చేసే కార్యక్రమం లో పాల్గొనడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది.  నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేస్తామని ఆ సందర్భంగా నేను అక్కడ ప్రకటించాను.  ప్రకృతి వైపరీత్యాల్లో విపత్తు నిర్వహణ లో, రక్షణ విధులలో తమ జీవితాలను పణంగా పెట్టే పోలీసు, సైనిక సాహసులకు నేతాజీ పేరిట నెలకొల్పే ఈ పురస్కారాన్ని ఏటా ప్రదానం చేస్తాం.  పోలీసు, సైనిక, అర్థసైనిక బలగాల సిబ్బంది ఈ పురస్కారానికి అర్హులు.

మిత్రులారా,

సమాజం లోని వివిధ వర్గాల అభివృద్ధి లో సమతూకం, జాతి నిర్మాణం లో ప్రతి పౌరుడి పాత్ర- నేతాజీ విస్తృత దార్శనికత లో ప్రధానాంశాలు.  ఆయన నాయకత్వం లో ఏర్పడ్డ ఆజాద్ హింద్ ప్రభుత్వం దేశ స్వాతంత్ర్యానికి తూర్పు భారతాన్ని ముఖ ద్వారం గా మార్చింది.  ఆ మేరకు కల్నల్ శౌకత్ మాలిక్ గారి నాయకత్వాన ఆజాద్ హింద్ ఫౌజ్ 1944 ఏప్రిల్ నెల లో మణిపుర్ పరిధి లోని మొయిరాంగ్‌ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది.  ఈశాన్య, తూర్పు భారత ప్రాంతాల నుండి స్వాతంత్ర్య ఉద్యమం లో పాలుపంచుకున్న అటువంటి సాహస సేనానుల త్యాగాలను వెలుగు లోకి తేకపోవడం మన దురదృష్టం.  చివరకు అభివృద్ధి పరంగానూ దేశం లోని ఈ ప్రధాన ప్రాంతం వెనుకబడే ఉండడం శోచనీయం.  అయితే, ఆనాడు తూర్పు భారతానికి నేతాజీ ఎంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చారో అదే తరహా లో మా ప్రభుత్వం ఇవాళ ప్రాముఖ్యమిస్తూ ఈ ప్రాంతాన్ని దేశ వృద్ధి, ప్రగతి చోదకం గా మార్చేందుకు కృషి చేస్తుండడం నాకు సంతృప్తి ని కలిగిస్తోంది.

సోదరీసోదరులారా,

నేతాజీ సేవలను పలుమార్లు దేశం ముందుంచడంతో పాటు ఆయన చూపిన బాట లో నడిచే అవకాశం లభిస్తుండడం నాకు దక్కిన అదృష్టం గా నేను భావిస్తున్నాను.  అందుకే ఈ కార్యక్రమం లో పాల్గొనవలసిందని నాకు ఆహ్వానం అందిన క్షణం లోనే గుజ‌రాత్‌ లో సుభాష్ చంద్రబోస్ పని చేసిన రోజులు నా జ్ఞాపకాల్లో మెదిలాయి.

మిత్రులారా,

గుజరాత్ ముఖ్యమంత్రి గా నేను ఉన్నపుడు 2009లో చారిత్రక ‘హరిపుర కాంగ్రెస్ సమావేశం’ జ్ఞాపకాలను పునరుద్ధరించాం.  ఆనాటి సదస్సు పరిస్థితులను మేం పున:సృష్టించాం.  అప్పట్లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు తదితరులు గుజరాత్ వ్యాప్తంగా ఎడ్ల బండ్ల తో సుదీర్ఘ ప్రదర్శన ను నిర్వహించారు.  సరిగ్గా అటువంటి దృశ్యాన్నే 2009లో పున:సృష్టించి చరిత్ర ను పునరుజ్జీవింపజేశాం.  అది కాంగ్రెస్ పార్టీ సమావేశమైనప్పటికీ చరిత్ర లో ఓ కీలక అధ్యాయం.. దానికి మేం పున:చిత్రీకరణ చేశాం.

మిత్రులారా,

దేశ దాస్య విముక్తికోసం ప్రాణ త్యాగం చేసే అదృష్టం నాటి ఉద్యమం లో దూకిన వారికి లభించింది.  అయితే, అలాంటి అవకాశం రాని మనకూ దేశం కోసమే జీవించే, దేశ ప్రగతికి జీవితాన్ని అంకితం చేసే ఒక అవకాశం అందుబాటులోనే ఉంది.  అనేక త్యాగాల తర్వాత మనకు ‘స్వరాజ్యం’ లభించింది.  ఆ స్వరాజ్యాన్ని సుపరిపాలన తో కొనసాగించే బాధ్యత 125 కోట్ల మంది పైన ఉంది. ‘‘మీరు ఆయుధ బలం తో, మీ రక్తమే మూల్యం గా స్వాతంత్ర్యం సముపార్జించాలి.  అటుపైన ఆ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవడం లో దేశానికి మీరు రక్షణ బలగం గా నిలవాలి’’ అని నేతాజీ చెప్పారు.  ఇవాళ నేతాజీ కలలుగన్న సైనిక బలగం నిర్మాణం దిశ గా భారత్ ముందడుగు వేస్తోందని నేను ఘంటాపథంగా చెప్పగలను.  సమరోత్సాహం, పట్టుదల లు మన సైనిక సంప్రదాయాలలో ఎల్లప్పుడూ భాగాలు.  దీనికి నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు తోడవుతున్నాయి.  మన సైనిక బలం సదా మన ఆత్మరక్షణ కోసమే.. ఇతరుల భూభాగం పై మనకు ఎన్నడూ ఆశ లేదు.  ఇది చారిత్రకంగానూ సుస్పష్టంగా కనిపించే వాస్తవం.  అయితే, భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా సవాలు చేస్తే రెట్టింపు శక్తి తో ప్రతిదాడి ని మన దేశం రుచి చూపించగలదు.

మిత్రులారా,

సైనిక బలగాల బలోపేతానికి గడచిన నాలుగేళ్లుగా అనేక వినూత్న చర్యలు చేపట్టాం.  ప్రపంచం లోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యం లో ఒక భాగం చేశాం.  సైనిక బలగాల సామర్థ్యం మెరుగుపరచడం కావచ్చు.. వీర సైనికులకు జీవన సదుపాయాల కల్పన కావచ్చు.. సత్వర, ఉత్తేజకర నిర్ణయాలు తీసుకోవడం లో ఈ ప్రభుత్వం సాహసం చూపింది;  భవిష్యత్తు లోనూ చూపుతుంది.  నిర్దిష్ట లక్ష్యం పై దాడుల (సర్జికల్ స్ట్రైక్స్) నుండి నేతాజీ కి సంబంధించిన రహస్య పత్రాల వెల్లడి దాకా సాహసోపేత నిర్ణయాలను తీసుకున్న మా ప్రభుత్వమే.  ఇక అనేక ఏళ్లు గా పట్టించుకోని ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ డిమాండు ను నెరవేరుస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకున్నదీ మా ప్రభుత్వమే అనడానికి ఇక్కడ ఉన్న చాలా మంది మాజీ సైనికులే ప్రత్యక్ష సాక్షులు.  అంతేకాకుండా విశ్రాంత సైనిక సిబ్బందికి బకాయి పడిన రూ.11వేల కోట్ల విడుదల తో లక్షలాది సైనికోద్యోగులకు లబ్ధి చేకూరింది.  దీంతోపాటు ఏడో వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా వాటి అమలు తరువాత పింఛన్ మొత్తం కూడా పెంచబడింది.  అంటే.. నా సైనిక సోదరులు తమ పెన్షన్ మీద రెట్టింపు లబ్ధి పొందగలిగారన్న మాట.  సైనికుల జీవితాలు మెరుగుపరచే దిశగా నాలుగేళ్ల లో ఇలాంటి అనేక వినూత్న చర్యలు తీసుకున్నాం.  ఇక జాతీయ యుద్ధ స్మారక ప్రదర్శనశాల నిర్మాణం చివరి దశలో ఉంది.  మన వీర సైనికుల పరాక్రమం గురించి భవిష్యత్తరాలకు తెలియజేయడమే దీని నిర్మాణ లక్ష్యం.

మిత్రులారా,

రేపు… అంటే అక్టోబరు 22నాటికి ఝాన్సీ రెజిమెంట్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.  సాయుధ బలగాల్లో మహిళలను సమాన భాగస్వాములను చేయడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ శ్రీకారం చుట్టారు.  సుసంపన్న భారత సంప్రదాయాలపై సుభాష్ బాబు కు గల తిరుగులేని విశ్వాసానికి దేశంలో ఆనాటి తొలి సంపూర్ణ మహిళా సైనిక దళమే నిదర్శనం.  చాలా మంది వ్యతిరేకించినా ఈ మహిళా సైనికదళం నుండి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించడం విశేషం.  నేతాజీ 75 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ కృషి ని నిజమైన నిబద్ధత తో ముందు తీసుకుపోయింది మా ప్రభుత్వమేనని నేను సగర్వంగా చెప్పగలను.  తదనుగుణంగా షార్ట్ సర్వీస్ కమిషన్ కింద సైనిక బలగాల్లో నియమితులైన మహిళా అధికారులకు పారదర్శక ఎంపిక ప్రక్రియ ద్వారా, పురుష అధికారులతో సమానంగా శాశ్వత కమిషన్ ఇస్తామని ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్ర కోట బురుజుల మీది నుండి నేను ప్రకటించాను.

మిత్రులారా,

నాలుగేళ్లు గా ప్రభుత్వం చేస్తున్న కృషి కి ఇది కొనసాగింపు మాత్రమే.  భారత వాయుసేన లో మహిళా పైలట్ల నియామకంతో పాటు నావికాదళంలోనూ మహిళలకు స్థానం కల్పించాలని 2016 మార్చిలో నిర్ణయించాం.  కొద్ది రోజుల కిందటే ఆరుగురు భారత నావికాదళ సాహస మహిళాధికారులు సుదీర్ఘ సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి మహిళా శక్తిని ప్రపంచానికి చాటారు.  అంతేకాకుండా మన దేశ తొలి యుద్ధవిమాన మహిళా పైలట్ సగర్వంగా తలెత్తుకున్నదీ ఈ ప్రభుత్వ హయాంలోనే.  ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా దేశ సైనిక బలగాల నిర్వహణ, బలోపేతం చేసే బాధ్యతలు ఒక మహిళ రక్షణ మంత్రి- శ్రీమతి నిర్మల సీతారమణ్ గారి చేతి లో ఉండడం నాకు అమిత సంతోషాన్ని కలిగిస్తోంది.

మిత్రులారా,

మీ అందరి సహకారం, సైనిక బలగాల అంకిత భావం, నైపుణ్యం తోడ్పాటు తో దేశం నేడు సంపూర్ణ భద్రత తో, సామర్థ్యం తో కళకళలాడుతూ ప్రగతి పథం లో నిర్దేశిత లక్ష్యాల సాధన దిశ గా శర వేగం గా దూసుకెళ్తోంది.  ఈ నేపథ్యం లో ఇటువంటి శుభ సందర్భాన  125 కోట్ల మంది ప్రజానీకానికి మరొక్క సారినా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  మన సమైక్య, సమగ్ర, ఆత్మవిశ్వాసం తో కూడిన ఈ పయనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశీస్సు లతో అప్రతిహతం గా పురోగమించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఇప్పుడు… నాతో పాటు మీరంతా ఎలుగెత్తి నినదించండి-
భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

వందే మాతరమ్

వందే మాతరమ్

వందే మాతరమ్.

**