మయన్మార్ లో త్రైపాక్షిక హైవేకు సంబంధించిన తము-కైగాన్-కలేవా (టికెకె) రోడ్డుపై అప్రోచ్ రోడ్లతో సహా 69 వంతెనల నిర్మాణానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి రూ. 371.58 కోట్లు ఖర్చవుతాయి.
ఈ నిర్మాణాలతో అన్ని కాలాల్లోను టికెకె రోడ్డును ఉపయోగించుకోవచ్చు. ఇది ఇంఫాల్ నుంచి మాండలేకు వెళ్లే బస్సు సర్వీసు రూటులో ఒక భాగం కూడా. ఈ నిర్మాణాలతో ఇండియాకు, మయన్మార్‌కు మధ్య రవాణా మార్గం మెరుగుపడుతుంది. అంతే కాదు, వస్తువుల రవాణా, ప్రయాణికుల రాకపోకలు సౌకర్యవంతంగా మారుతాయి.
నేపథ్యం:
గతంలో, అంటే 2012 మే నెలలో.. భారతదేశ ప్రధాని మయన్మార్ ను సందర్శించినప్పుడు త్రైపాక్షిక హైవేకు సంబంధించిన తము-కైగాన్-కలేవా (టికెకె) రోడ్డు పైన 71 వంతెనలు నిర్మించవలసిందిగా మయన్మార్ ప్రభుత్వం కోరింది. మయన్మార్ విజ్ఞప్తికి భారతదేశం అంగీకరించింది. ఆ తర్వాత మయన్మార్ ప్రభుత్వం సొంతగా తమ అవసరాల రీత్యా రెండు వంతెనల్ని వెంటనే నిర్మించింది. మిగిలిన 69 వంతెనల నిర్మాణాన్ని భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్నారు.
ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ (పిఎంసి) ద్వారా ఇంజినీరింగ్ ప్రొక్యూరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఇపిసి) విధానంలో ఈ నిర్మాణాల ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. యంగాన్ లోని భారతదేశ ఎంబసీ, పిఎంసి, విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ నిశిత పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. 2019 సంవత్సరం మధ్యకల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్సించారు.