కోచి సముద్ర తీరానికి ఆవల యుద్ధవిమానాల వాహక నౌక ఐఎన్ ఎస్ విక్రమాదిత్య పైన త్రివిధ దళాల ప్రధాన అధికారుల ఏకీకృత సమావేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సాగింది.
ఒక ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ పైన త్రివిధ దళాల కమాండర్ల ఏకీకృత త సమావేశం జరగడం ఇదే తొలిసారి.
అంతకు ముందు కోచిలో ఐఎన్ ఎస్ గరుడ పైన ఏర్పాటైన త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. అనంతరం ఐఎన్ ఎస్ విక్రమాదిత్య పైకి చేరుకున్న ప్రధానికి త్రివిధ దళాల అధిపతులు స్వాగతం పలికారు.
సమావేశం తర్వాత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సముద్ర జలాల పైన వైమానికదళ సామర్థ్యాలకు సంబంధించిన ప్రదర్శనను తిలకించారు. నౌకాదళానికి చెందిన యుద్ధ విమానం టేకాఫ్ తీసుకోవడం, ల్యాండ్ కావడం, యుద్ధనౌక నుంచి క్షిపణి ప్రయోగం, హెలికాప్టర్లు, యుద్ధ విమానం కలిసి ఒకేసారి ఎగరడం, మెరైన్ కమాండో పని విధానం, ఐఎన్ ఎస్ విరాట్‌తో సహా యుద్ధ నౌకలు ఒకేసారి ప్రయాణించే ప్రదర్శన తదితర కార్యక్రమాలను ప్రధాని వీక్షించారు. ఐఎన్ ఎస్ విక్రమాదిత్య పైన పని చేసే సైనికులు, నావికులు, వైమానిక దళ సిబ్బందితో ప్రధాని కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా ప్రధాని ఇచ్చిన ప్రసంగంలోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి.
రక్షణ శాఖ మంత్రి శ్రీ మనోహర్ పారిక్కర్ గారు,
వైమానిక, సైనిక, నౌకాదళ అధిపతులారా,
త్రివిధ దళాల కమాండర్లలారా
మరోసారి మన దేశ మిలటరీ లీడర్లను కలుసుకోవడం నాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఢిల్లీకి వెలుపల ఇక్కడ ఈ ముఖ్యమైన మిలిటరీ స్థావరంపైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు మరింత సంతోషంగా ఉంది.
మీకు కూడా ఈ తేడా తెలుస్తూనే ఉందని అనుకుంటున్నాను. ఇండియా నావికాదళ ఆతిథ్యమొక్కటే ఈ తేడాకు కారణం కాదు.
కోచిని తీసుకుంటే ఇది హిందూ మహాసముద్రానికి శిరస్సులాంటిది. అంతే కాదు, ఇది మన సముద్ర జలాల చరిత్రలో నాలుగు మార్గాల కూడలి ప్రాంతంగా గుర్తింపు పొందింది.
భారతదేశ చరిత్రపైన సముద్రాల ప్రభావం చాలా ఉంది. మన భవిష్యత్ సౌభాగ్యం, భద్రత అనేవి ఈ సముద్రంపైన ఆధారపడి ఉన్నాయి.
అంతే కాదు, ప్రపంచ సంపదల బీరువాను తెరవడానికి కావాలసిన తాళం చెవి ఈ సముద్రమే.
మన నౌకాదళ సామర్థ్యంలో ఈ ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఇది మన నౌకాదళ బాధ్యతకు ప్రతీక లాంటిది.
భారత దేశ రక్షణ దళాలు కేవలం వాటి సామర్థ్యంవల్లనే పేరు సంపాదించుకోవడం లేదు…అవి ప్రదర్శించే స్థితప్రజ్ఞత, బాధ్యతల వల్ల కూడా అవి పేరెన్నికగన్నవి.
భారత దేశ రక్షణ రంగ దళాలు మన సముద్రాల్ని, దేశ సరిహద్దుల్నినిరంతరం కాపలాకాస్తూ కాపాడుతూ ఉన్నాయి. భారతజాతిని భద్రంగా ఉంచుతూ, పౌరుల క్షేమానికి కృషి చేస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సంఘర్షణలు జరిగినప్పుడు రక్షణరంగ దళాలందించే సేవ ఎంతో గొప్పది. అవి ప్రజలకు ఓదార్పు కలిగించడం కన్నా మిన్నగా సహాయం చేస్తున్నాయి. జాతి స్ఫూర్తిని రగిలించి ప్రపంచ ప్రజల నమ్మకాన్ని పొందుతున్నాయి.
చెన్నైలో వరదలు వచ్చినప్పుడు రక్షణ దళాలు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించి ప్రజలను కాపాడాయి. నేపాల్ భూకంప సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రేమ, దయలతో సేవ చేశాయి. నేపాల్ లో ప్రజలను కాపాడినట్టే యెమెన్ లో ఘర్షణ వాతావరణ సమయంలో అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలకు స్నేహహస్తం అందించాయి. అక్కడ నివసించే భారతీయులకే కాదు.. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పౌరుడిని కాపాడాయి.
మన రక్షణ రంగ దళాలు దేశ వైవిధ్యాన్ని, ఏకత్వాన్ని ప్రతిఫలిస్తున్నాయి. కాలాలకు అతీతమైన భారత సంస్కృతి మన రక్షణ దళాల సొంతం. అవి అత్యున్నతమైన సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. వాటి విజయం మీరు అందిస్తున్న నాయకత్వ పటిమవల్లనే సాధ్యం.
భారత జాతి తరఫున నేను మన మిలటరీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
దేశం కోసం పోరాటం చేస్తూ అమరులైన వారికి ఈ రోజున నేను నివాళి ఘటిస్తున్నాను. వారి త్యాగాల వల్లనే ఇండియా ముందుకు దూసుకుపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు పలు దేశాల్లో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో మన సైనికులు ఎంతో అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తున్నారు. వారిని తలుచుకోవడం మన కర్తవ్యం. అంతే కాదు, వారికి దూరంగా ఉన్న కుటుంబాల త్యాగాలను కూడా మనం మననం చేసుకోవాలి. విదేశాల్లో విధినిర్వహణలో భాగంగా అప్పుడప్పుడు మన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమవారు కాకుండా వారి శవపేటికలు తిరిగి వచ్చినప్పుడు కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతం… వారికి మనం అండగా ఉండాలి.
తన యవ్వనదశలో ఒక మిలిటరీ ఆఫీసర్ ఎంత కష్టపడినప్పటికీ తన తర్వాతి స్థాయిని చేరుకోలేకపోయినప్పుడు అతడు ఎంతో వ్యథ చెందుతాడు. అతను అన్ని విధాలా శక్తిసామర్థ్యాలున్నవాడైనప్పటికీ, ఒక్కోసారి వారికి ప్రమోషన్ రాకపోవచ్చు.
కాబట్టి మీ సేవలను గౌరవించడం, మీ సంక్షేమాన్ని కాపాడడం మా పవిత్రమైన కర్తవ్యం.
ఈ కారణంవల్లనే దశాబ్దాల తరబడి మూలనపడిన వన్ ర్యాంక్, వన్ పెన్షన్ హామీని నెరవేర్చడానికి ఎంతో వేగంగా అడుగులు వేస్తున్నాం. అంతే కాదు, రక్షణ దళాల సేవలకు గుర్తింపుగా మనం ఒక జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని, మ్యూజియాన్ని దేశ రాజధానిలో ప్రధానమైన స్థలంలో నిర్మించుకుంటున్నాం.
సైనికులు తమ పదవీవిరమణ చేసిన తర్వాత కూడా ఎంతో హుందాగా, గర్వంగా ఇతర ఉద్యోగాలు చేయడానికి వీలుగా వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతున్నాం. అంతే కాదు మాజీ సైనికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం కూడా.
సరిహద్దుల్లోనే కాదు దేశ అంతర్గత భద్రతకోసం సేవలందిస్తున్న రక్షణ దళాల సేవలు కూడా అమోఘమైనవి. వారి ధైర్యసాహసాలు, త్యాగాల కారణంగానే జమ్మూ- కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఓడించగలిగాం. వామపక్ష తీవ్రవాద హింసను తగ్గించగలిగాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పగలిగాం.
ఎంతోకాలంగా నలుగుతున్న నాగా సమస్యను పరిష్కరించడంలో గణనీయమైన ప్రగతిని సాధించడానికి కృషి చేసిన మధ్యవర్తులకు అభినందనలు.
ప్రస్తుతం ఇండియా ఎంతో ఉత్సాహంతో మార్పు ముంగిట్లో నిలబడి ఉంది. దేశవ్యాప్తంగా ఆశావాదం, బలమైన ధీమా వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు, అంతర్జాతీయంగా చూసినా మన దేశానికి ఇచ్చే ప్రాధాన్యం, దేశంపట్ల విశ్వాసంలో సరికొత్త స్థాయిలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధానమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. అంతే కాదు, మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైన పథంలో పయనిస్తోంది.
మన ఫ్యాక్టరీలు వాటి వాటి కార్యకలాపాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే తరం మౌలిక వసతుల్ని ఎంతో వేగంగా నిర్మించుకుంటున్నాం. విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. తద్వారా ప్రపంచ దేశాల్లో వ్యాపారం చేయడానికి అనుకూలమైన దేశంగా ఇండియా స్థానం నానాటికీ మెరుగవుతోంది. ప్రతి పౌరుడు తన ముందున్న అవకాశాలను అవగాహన చేసుకుంటున్నాడు. ప్రాథమిక అవసరాలను ఆత్మవిశ్వాసంతో తీర్చుకోగలుగుతున్నాడు. మన దేశ సౌభాగ్యానికి ఇది చాలా ముఖ్యం. అంతే కాదు మన దేశ భద్రతకు కూడా.
ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేని కాలమిది. కాబట్టి భారతదేశ ప్రగతి పూర్తిగా అంతర్జాతీయ భాగస్వామ్యాల మీద ఆధారపడి ఉంది. అలాగే దేశ భద్రత కూడా.
కాబట్టి మన విదేశీ విధానంలో ప్రత్యేక పటిష్టత, ఉద్దేశం ఉండేలా రూపుదిద్దాం. తూర్పున జపాన్, కొరియా, ఆసియాన్ దేశాలతో సంప్రదాయబద్ధంగా ఉన్న భాగస్వామ్యాలను బలోపేతం చేసుకున్నాం. ఆస్ట్రేలియా, మంగోలియా, పసిఫిక్ ద్వీప దేశాలతో సరికొత్త సంబంధాలను నెలకొల్పుకున్నాం.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన ప్రాబల్యాన్ని విస్తరించాం. సముద్ర జలాలకు సంబంధించి స్పష్టమైన వ్యూహాన్ని మొదటిసారిగా సమర్థంగా తయారు చేసుకున్నాం. ఆఫ్రికాతో బంధాన్ని సరికొత్త స్థాయికి తీసుకుపోయాం.
మధ్య ఆసియాతో అనాదిగా ఉన్న బంధాలను పునరుద్ధరించాం. పశ్చిమ ఆసియా, గల్ఫ్ దేశాలతో సంబంధాలను, భద్రతా సహకారాన్ని పటిష్టం చేసుకున్నాం. ఇరాన్ తో మనకు గల పూర్వ స్నేహ సంబంధాలు తిరిగి గాడిలో పడ్డాయి.
రష్యా ఎప్పటినుంచో మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న దేశం. భవిష్యత్తులో కూడా ఆ దేశంతో మనకుగల బంధం దృఢంగానే ఉంటుంది.
రక్షణరంగంతో సహా పలు రంగాల విషయంలో అమెరికాతో మన భాగస్వామ్యాన్నిసమగ్రమైన విధానం ప్రకారం మరింత ముందుకు తీసుకుపోయాం. యూరప్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరింత బలోపేతమయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా సరికొత్త ఆర్థిక కేంద్రంగా మాత్రమే అవతరించడం లేదు. ప్రాంతీయపరంగానూ, ప్రపంచపరంగానూ చూసినప్పుడు శాంతి, భద్రత, సుస్థిరత్వాలకు చిరునామాగా కూడా గుర్తింపు పొందుతోంది.
ఉగ్రవాదం, తీవ్రవాదాలు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు శ్రమిస్తున్నాయి. ఈ విషయంలో ప్రాంతాలకు అతీతంగా ముస్లిం దేశాలతో సహా పలు దేశాలు మన దేశ సహకారాన్ని కోరుతున్నాయి.
మన భవిష్యత్ బాగా ఉండాలంటే, ప్రపంచంలో మన స్థానం ప్రముఖంగా ఉండాలంటే, మన పొరుగు దేశాలతో మన సంబంధబాంధవ్యాలు ప్రధానమైన పాత్రను సంతరించుకున్నాయి.
అయితే మన ఇరుగు పొరుగు దేశాలు అన్ని రకాల భద్రతా సవాళ్లను విసురుతూ, క్లిష్టమైన సమస్యలకు మూలంగా ఉన్నాయి.
ఉగ్రవాదం, కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు మామూలే. ఆషామాషీ వ్యవహరంగా భావిస్తూ చేస్తున్న అణు శక్తి నిర్మాణం, దానికి సంబంధించిన బెదిరింపులు, సరిహద్దుల దగ్గర అతిక్రమణలు, మిలిటరీ ఆధునికీకరణ, విస్తరణ పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియా అస్థిరత్వం రాను రాను బలపడుతోంది. దీనికి తోడు మన ప్రాంతం అనేక రాజకీయ అనిశ్చితులకు ఆలవాలంగా మారింది. బలహీనమైన సంస్థలు, అంతర్గత సంక్షోభాలు ఉండనే ఉన్నాయి. మన ప్రాంతంలోని ప్రధానమైన దేశాలు సైతం మన భూమిపైన, సముద్ర జలాల్లోను కార్యకలాపాలను పెంచాయి.
సముద్ర జలాల విషయంలో మాల్దీవులు, శ్రీలంకల నుంచి పర్వత దేశాలైన నేపాల్, భూటాన్‌ల దాకా మన ప్రాధాన్యతల్ని, మన సంబంధ బాంధవ్యాల్ని కాపాడుకుంటూనే వస్తున్నాం.
బంగ్లాదేశ్‌తో భూభాగ సరిహద్దుల ఒప్పందం ద్వారా ఆ దేశంతో మన సంబంధబాంధవ్యాలు, భద్రతాపరమైన సహకారం పటిష్టం చేసుకున్నాం.
పాకిస్థాన్ తో పలు విషయాలపైన చర్చలు చేస్తున్నాం. గత చరిత్ర పునరావృతం కాకుండా చూడాలని, ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలను ఆపాలని, శాంతియుత సంబంధాలను నెలకొల్పడానికి కృషి చేయాలని, సహకారాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ ప్రాంతంలో సుస్థిరత్వాన్ని, సౌభాగ్యాన్ని నెలకొల్పుకుందామని ఆశిస్తూ ఈ చర్చలు చేస్తున్నాం.
అయితే ఈ పయనంలో ఎన్నెన్నో సవాళ్లున్నాయి; అడ్డంకులున్నాయి. వాటిని అధిగమించడానికి చేస్తున్న కృషి ముఖ్యమైనది. ఎందుకంటే, తద్వారా వచ్చే శాంతిసౌభాగ్యాలు చాలా ముఖ్యమైనవి. మన పిల్లల భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుంది.
భవిష్యత్ సంబంధాలు ఎలా ఉండాలనే దానిపైన పాకిస్థాన్ ఆంతర్యాన్ని తెలుసుకోవడానికే చర్చలు మొదలుపెట్టాం. ఉభయ దేశాల భద్రతా నిపుణులు ముఖాముఖి కలుసుకొని చర్చించడానికి వీలుగా జాతీయ భద్రత సలహాదారుల స్థాయిలో సంప్రదింపులు ఆరంభించాం.
అయితే దేశ రక్షణ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదు. అదే సమయంలో ఉగ్రవాదంపైన వారిచ్చిన హామీలు ఎంతమేరకు నెరవేరుతున్నాయో ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది.
అఫ్గాన్ ప్రజలకు మాట ఇచ్చినట్టుగాగానే ఐక్య, శాంతియుత, సౌభాగ్యకరమైన, ప్రజాస్వామిక అఫ్గానిస్థాన్ ను నిర్మించుకోవడానికి వీలుగా వారికి మన దేశ సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మన ఆర్థిక భాగస్వామ్యంలోని పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి వీలుగా చైనాతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూనే, సరిహద్దుల్లో సుస్థిరత్వాన్ని కాపాడుకుంటూనే, పరస్పర అవగాహనను మెరుగుపరుచుకుంటూనే ఆ దేశంతో సంబంధాలు కొనసాగుతాయి.
ఇరు దేశాల మధ్య గల సంబంధాల్లోని సంక్లిష్టత నేపథ్యంలో ఇండియా, చైనా రెండూ తమ తమ ప్రాధాన్యాల్ని, బాధ్యతల్ని ఎరిగిన దేశాలుగా తమ సమస్యల్ని నిర్మాణాత్మకంగా పరిష్కరించుకుంటాయని నేను నమ్ముతున్నాను.
మన రక్షణ సామర్థ్యాల్ని బలోపేతం చేసుకుంటూనే మౌలిక వసతుల నిర్మాణం కొనసాగుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటూ ప్రాంతీయంగాను, ప్రపంచవ్యాప్తంగానూ మన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందాం. సముద్రజలాల్లో భద్రతతో సహా అన్ని విషయాల్లోనూ బలోపేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం అనేక పాత, కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. భూమిపైనా, సముద్రాలపైన, గగనతలంలో మన దేశం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లకు పరిమితి లేదు. ఉగ్రవాదంనుంచి, అణుశక్తి దాకా అనేక సవాళ్లు మన ముందున్నాయి.
మన దేశ బాధ్యతలు సరిహద్దులకు, తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి కాదు. మన ప్రాధాన్యాలు, ప్రజల ఆశయాల ప్రకారం దేశ బాధ్యతలు విస్తరించాయి. ఊహించలేని ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
మన ప్రపంచం మారుతోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థల స్వరూప స్వభావాలు మారుతాయి. సాంకేతిక విజ్ఞానానికి ప్రాధాన్యం పెరుగుతుంది. సంఘర్షణల స్వభావం మారుతుంది. దాంతో పాటు యుద్ధ లక్ష్యాలు కూడా మారుతాయి.
పాత శత్రుత్వాలనేవి కొత్త కొత్త పద్ధతుల్లో మన మీద దాడి చేయవచ్చు. అంతరిక్షంలోనూ, సైబర్ ప్రపంచంలోనూ మనకు ప్రమాదం పొంచి ఉంది. అయితే నూతన సాంకేతికతల్ని ఉపయోగించుకొని సంప్రదాయ, నూతన సవాళ్లను ఎదుర్కోవాలి.
వర్తమానంలో జీవిస్తూనే, భవిష్యత్ విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉండాలి.
ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసినా, దానిని తిప్పికొట్టడానికి మన రక్షణ దళాలు తయారుగా ఉన్నాయనే ధీమా దేశ ప్రజల్లో ఉంది.
రక్షణరంగంలో మన దేశ వ్యూహాత్మక ప్రతిఘటన ఘనంగాను, విశ్వసనీయంగాను ఉంది. అణుశక్తి వినియోగ విధివిధానాల ప్రకారం ఈ ప్రతిఘటనను రూపకల్పన చేసుకున్నాం. దీనిపైన రాజకీయ సంకల్పం కూడా స్పష్టంగా ఉంది.
రక్షణ రంగానికి కావలసిన ఆయుధాలను సమకూర్చుకునే విధానాన్ని వేగవంతం చేశారు. పెండింగులో ఉన్న డిమాండ్లకు ఆమోదం తెలపడం జరిగింది. కొరతను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. పాతవాటిని మార్చి కొత్తవాటిని చేరుస్తున్నాం.
సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనను విస్తరించాం. ఆయుధాలతో సహా మన బలగాలు సంచరించడానికి వీలుగా అనేక చర్యలు చేపట్టాం. సరిహద్దు ప్రాంతానికి చేరుకోవడానికి వీలుగా వ్యూహాత్మక రైలు మార్గాలనునెలకొల్పుకుంటున్నాం.
విప్లవాత్మకమైన నూతన విధానాలు, చర్యల ద్వారా మన దేశ రక్షణరంగ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నాం.
ఈ సవాల్ కు అనుగుణంగా పబ్లిక్ సెక్టర్ లో మార్పులు వచ్చాయి. ప్రైవేట్ సెక్టర్ కూడా ఈ విషయంలో ఇనుమడించిన ఉత్సాహంతో స్పందిస్తోంది.
ఇండియాలోనే తయారీ విధానానికి అనుకూలంగా విదేశీ రక్షణరంగ సంస్థలు కొత్త కొత్త ప్రతిపాదనలతో వస్తున్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల నుంచి రవాణా విమానాల దాకా అనేకం మన దేశంలోనే తయారీ కావడానికి ఈ ప్రతిపాదనలు దోహదపడతాయి.
రక్షణరంగంలో దేశీయంగా సామర్థ్యాలను పెంపొందించుకోనంత కాలం మన దేశాన్ని భద్రమైన దేశం పరిగణించలేం. అంతవరకూ మన సైనిక సంపత్తి దృఢమైనదిగా అవతరించలేదు. దేశీయంగా సామర్థ్యాన్ని పెంచుకుంటే చాలా మటుకు ఖర్చు తగ్గుతుంది. అంతే కాదు, దేశంలోనే రక్షణరంగ పరికరాల తయారీవల్ల దేశీయ పరిశ్రమలు లబ్ధి పొందడమే కాకుండా ఉపాధి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.
రక్షణ రంగ ఆయుధాల, పరికరాలను సమకూర్చుకునే విధానాలు, పద్ధతుల్లో త్వరలో సంస్కరణలు తెచ్చుకుందాం. రక్షణరంగ సాంకేతికతల సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి మనం అనుసరించబోయే దేశీయ తయారీ విధానం ఒక వ్యూహాత్మక విధానంగా పని చేస్తుంది. రక్షణ రంగ సాంకేతికతను సమకూర్చుకోవడం అనేది జాతీయ స్థాయిలో జరిగే గొప్ప ప్రయత్నంగా భావించాలి. తద్వారా దేశంలోని పలు సంస్థల సామర్థ్యాన్ని వెలికి తీయగలుగుతాం.
ఇండియాలోనే తయారీ అనే బృహత్తర కార్యక్రమ విజయానికి సైనిక దళాల పాత్ర ప్రధానమైనది. ఈ విషయంలో మీరు రూపొందించిన పథకాలు బాగున్నాయి. ముఖ్యంగా నౌకాదళ, వైమానిక దళాల నుంచి వచ్చిన పథకాలు నాకు ధైర్యాన్నిస్తున్నాయి.
దేశీయంగా రక్షణరంగ ఆయుధాల్ని సమకూర్చుకోవడానికి స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి. ఏమేమి కావాలనే దానిపైన మరింత స్పష్టత ఉండాలి. పరిశోధన, రూపకల్పన, అభివృద్ధిలో సైనికదళాలు మరింత మెరుగైన పాత్రను పోషించాలి. ముఖ్యంగా యుద్ధక్షేత్రంలో నిలబడి ఆయుధాలను ఉపయోగించేవారు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించి మెరుగైన ఆయుధాల తయారీలో భాగం పంచుకోవాలి.
అన్నిటికీ మించి.. భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా సైనిక సంపత్తిని తయారు చేసుకోవాలి. మూస పద్ధతుల్ని అనుసరించడం ద్వారా ఈ పని చేయలేం. కాలం చెల్లిన సిద్ధాంతాల ఆధారంగాను, ఆర్థిక వాస్తవాలకు దూరంగా జరిగి సైనిక శక్తిని పెంపొందించలేం.
గత సంవత్సరం నాకు ప్రగతి కనిపించింది. అయితే మన సైనిక దళాలు, ప్రభుత్వం తమకున్న నమ్మకాల్లో, సిద్ధాంతాల్లో, లక్ష్యాల్లో, వ్యూహాల్లో సంస్కరణలు తేవాలని నేను భావిస్తున్నాను. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మన లక్ష్యాలను, వాటిని చేరుకోవడానికి వీలైన విధానాలను నిర్వచించుకోవాలి.
రక్షణరంగంలో బలమైన దేశాలుగా పేరొందిన దేశాలు తమ బలగాల సంఖ్యను తగ్గించుకొని, సాంకేతిక సామర్థ్యంపైనే ఎక్కువ ఆధారపడుతున్నాయి. అయితే మనం మాత్రం మన బలగాల సంఖ్యను పెంచుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నాం.
బలగాల విస్తరణ, ఆధునికీకరణ.. ఈ రెండింటిని ఒకే సారి చేయడం కష్టం. అంతే కాదు, అది అనవసరమైన లక్ష్యం కూడా.
ఎంతో చాకచక్యంగా వ్యవహరించే బలగాలు మనకు కావాలి. సాంకేతిక సామర్థ్యం సాయంతో అవి పని చేయాలి. కేవలం మనిషికుండే ధైర్యసాహసాలే సరిపోవు.
తక్కువ సమయంలో యుద్ధాన్ని గెలవగలిగే సామర్థ్యాలు మనకు కావాలి. ఎందుకుంటే, ఎక్కువ కాలంపాటు యుద్ధాలు చేయగలిగే రోజులు కావివి. భారీ స్థాయిలో నిధులను మింగేస్తున్న విధానాలను పునః పరిశీలించాలి.
మన భద్రతా పరిమితులు, బాధ్యతలు మన సముద్ర తీరాలను, దేశ సరిహద్దులను దాటి విస్తరించాలి. మన సైనిక బలగాల్ని ఎక్కడికైనా వెళ్లగలిగేలా, ఎంతటి దూరంలోని శత్రువుతోనైనా యుద్ధం చేయగలిగేలా తయారు చేయాలి.
డిజిటల్ నెట్ వర్క్ ల సామర్థ్యాన్ని, అంతరిక్షంలో మన కోసం పని చేస్తున్న వ్యవస్థల్ని సైన్యం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వాటిని రక్షించుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన శత్రువుల మొదటి లక్ష్యాలు అవే కాబట్టి.
సైన్యానికి సంబంధించిన అన్నిదళాల, ఏజెన్సీలలోని నెట్ వర్క్ ల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. అవి కచ్చితత్వంతో, స్పష్టంగా, వేగంగా స్పందించాలి.
సైనిక దళాల నిర్మాణాలను సంస్కరించే కార్యక్రమాన్ని నెమ్మదిగా కొనసాగిస్తున్నాం. పోరాట యోధులు, వారికి సహాయంగా నిలిచే సిబ్బంది నిష్పత్తి (టూత్- టు- టెయిల్ నిష్పత్తి)ని తక్కువ చేయాలి.
సైనిక దళాల్లోని ప్రతి స్థాయిని దేనికదే అన్నట్టుగా వదిలేయకుండా ఒకదానితో మరోదాన్ని కలపడానికి కృషి చేయాలి. సైనికులుగా మనం వివిధ రంగుల యూనిఫాంలు ధరిస్తుంటాం. అయితే అందరూ ఒకే లక్ష్యంతోనే పని చేస్తున్నారు. అందరి జాతీయ జెండా ఒకటే. సైన్యంలోని అత్యున్నత స్థాయిలో ఒకరికొకరం అనే భావన ఇంకా పెంపొందాల్సి ఉంది.
సీనియర్ మిలిటరీ అధికారులకు త్రివిధ దళాల ఆదేశాల విషయంలో తగిన అనుభవం ఉండాలి. టెక్నాలజీ ఆధారంగా పని చేసే వాతావరణంలో అనుభవం సంపాదించుకోవాలి. అన్ని రకాల సవాళ్లను తెలుసుకొని ఉండాలి. ఉగ్రవాదం నుంచి, వ్యూహాత్మక వ్యవహారాల దాకా అన్ని అంశాల పైన పట్టు ఉండాలి.
క్షేత్ర స్థాయిలో అత్యున్నత స్థాయి పరిజ్ఞానంతో వ్యవహరించే మిలిటరీ కమాండర్లు మనకు చాలా అవసరం. అయితే వారు దూరదృష్టితో వ్యవహరిస్తూ మన దళాలను, భద్రతా వ్యవస్థలను భవిష్యత్ సవాళ్లకు దీటుగా రూపొందించాలి.
ఇతరుల అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అయితే మన వ్యవస్థల్ని, ఆదేశాల్ని మన సొంత బుద్ధితోనే రూపొందించుకోవాలి. త్వరలోనే జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం అందుబాటులోకి రాబోతున్నది.
పై స్థాయి రక్షణ నిర్వహణ వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత ఉంది. గతంలో ప్రతిపాదించిన పలు రక్షణ శాఖ సంస్కరణలు అమలుకు నోచుకోకపోవడం విచారకరం. ఇప్పుడు ఈ సంస్కరణలే నాకు ప్రధానం.
దేశంలోనే కాకుండా విదేశాల్లో సేవలందిస్తున్న సైనిక బలగాలకోసం సమగ్రమైన వ్యూహం ఉండాలి. తద్వారా మన సామర్థ్యాలు అభివృద్ధి చేసుకోవచ్చు. శాంతి సుస్థిరతలను వేగంగా నెలకొల్పాలనే మన బాధ్యతలు త్వరగా నెరవేరుతాయి. ఇది విస్తరించబడిన సముద్ర జలాల ప్రాంతాల్లోను జరగాలి.
ఐక్యరాజ్యసమితి శాంతిదళాల్లో మన సైనికులు సమర్థంగా పని చేస్తున్నారు. మన దళాలు శాంతి దూతలుగా వ్యవహరిస్తూ రేపటిపైన అందరిలోను ఆశల్ని చిగురింపచేయాలి. ఉదాహరణకు సుదూరంలో ఉన్న ద్వీప దేశాలకు వైద్య సాయం అందించే నౌకలను పంపుతూ ఆయా దేశాల మిలిటరీ వ్యవస్థలతో సంబంధాలను నిర్మించుకోవాలి.
చివరగా నేను చెప్పేదేమంటే, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి సంస్థ తనను తాను సంస్కరించుకోవాలి. మనందరం ఐకమత్యంతో కదిలితేనే మన దేశం ప్రగతి సాధిస్తుంది.
వ్యయాన్ని తగ్గించే సంస్కరణలను చేపట్టడంలో మీరు ముందుండి నడిపించాలి. స్వచ్ఛమైన ఇంధన తయారీలోను, ఇంధనాన్ని సమర్థవంతంగా వాడుకోవడంలోను మీరు అందరికీ ఆదర్శంగా ఉంటారని భావిస్తున్నాను.
మీరు సంస్కరణలు చేపట్టి ఫలితాలు పొందుతుంటే మీ అవసరాలను తీర్చడానికిగాను, మీరు అన్ని విధాలా తయారుగా ఉండడానికిగాను మేం చేయాల్సిందంతా చేస్తాం.
మన ఆర్థికరంగం అభివృద్ధి చెందుతుంటేనే దేశ భద్రత క్షేమంగా ఉంటుంది.
మన సైనిక బలగాల చేతిలో భద్రంగా ఉన్నానని దేశం భావించినప్పుడు దేశం తాను కంటున్న కలల్ని సాకారం చేసుకుంటుంది.
మిలిటరీ అధిపతులారా,
ఈ సంవత్సరమే రెండు ప్రపంచ యుద్ధాల ముగింపు దినోత్సవాలతో పాటు, 1965 సంఘర్షణ ముగింపు దినోత్సవాన్నిజరుపుకున్నాం.
అంతే కాదు ఈ సంవత్సరమే పేదరికంపైన పోరాటం చేయడానికి, వాతావరణ మార్పులను అరికట్టడానికి మాన వాళంతా కలిసికట్టుగా కదిలి ఐక్యరాజ్యసమితి ఆధ్యర్యంలో సమావేశమైంది. గతంలో జరిగిన పెను విషాద ఘటనల జ్ఞాపకాల నుంచి, మంచి భవిష్యత్ గల ప్రపంచం కోసం కలిసికట్టుగా చేస్తున్న కృషి నుంచి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రగతి, ప్రమాదాలు రెండూ మానవాళి గాథలో భాగమేననే విషయాన్ని విస్మరించరాదు.
అంతే కాదు, యూనిఫాం వేసుకున్న సైనికులందరు తమ బాధ్యతల్ని గుర్తు పెట్టుకోవాలి. శాంతి కోసం సేవలందించాలనే తపనను మరిచిపోరాదు. ఎంతో అప్రమత్తంగా ఉంటూ, ప్రగతిని కాపాడుకునే సైనికులమనే విషయాన్ని మరిచిపోరాదు.
మన సైనిక బలగాలు ఈ విషయంపైన సంపూర్ణమైన నమ్మకం కలిగివున్నాయనే విషయం నాకు తెలుసు. దేశం కోసం, స్నేహితుల కోసం, ప్రపంచం కోసం మీరు పాటుపడతారని నాకు తెలుసు.
ప్రపంచ పటంలో ఇండియాకు సగర్వమైన స్థానం లభించడానికి, దేశాభివృద్ధికి మీరు శాయశక్తులా కృషి చేయగలరని భావిస్తూ.
అందరికీ కృతజ్ఞతాభివందనాలు…
With defence personnel at INS Vikramaditya. PM @narendramodi is in Kerala for a 2-day visit. pic.twitter.com/CUQzEGa8ex
— PMO India (@PMOIndia) December 15, 2015
Chaired Combined Commanders Conference on board INS Vikramaditya. Last year we had mooted the idea of holding the conference outside Delhi.
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Elaborated on the changes in India. Our factories are humming with activity, next-gen infrastructure is being built & investment is rising.
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Spoke about the changes in the defence sector. Impetus is being given to manufacturing, process of procurements is being quickened.
— Narendra Modi (@narendramodi) December 15, 2015
To transform India, every institution must reform itself. Together we will work towards India's overall progress. https://t.co/perYxUmYeA
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Some pictures from earlier today. pic.twitter.com/AUlK3uUA8n
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Our Armed Forces defend our seas, protect our borders & keep India safe. We are extremely proud of them. pic.twitter.com/g0qfkBIQca
— NarendraModi(@narendramodi) December 15, 2015
Our Armed Forces defend our seas, protect our borders & keep India safe. We are extremely proud of them. pic.twitter.com/g0qfkBIQca
— Narendra Modi (@narendramodi) December 15, 2015