బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగస్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ నగరంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య సలహాదారు, భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షుడు, నేపాల్ ప్రధాని, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు, థాయీలాండ్ రాజ్య ప్రధాని పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్న మేము సమావేశమయ్యాము. మరి ఈ సందర్భంగా:- 1997నాటి బ్యాంకాక్ ప్రకటన నిర్దేశించిన మేరకు బిమ్స్ టెక్ సూత్రావళి, ఉద్దేశాలకు కట్టుబాటు ను పునరుద్ఘాటిస్తూ; నే పీ తా లో 2014 మార్చి 4 నాటి బిమ్స్ టెక్ మూడో శిఖర సమ్మేళనం ప్రకటన ను, 2016 అక్టోబరు 16నాటి బిమ్స్ టెక్ అధినేతల ముగింపు సమావేశ చర్చల సారాంశ పత్రాన్ని పునశ్చరణ చేసుకుంటూ ; మన ఉమ్మడి బలాలు, సమష్టి కృషి తో బంగాళాఖాత ప్రాంతాన్ని శాంతియుత, సంపన్న, సుస్థిర సీమ గా చేద్దామన్న మన దృఢ సంకల్పాన్ని ఉద్ఘాటిస్తూ; ఈ ప్రాంతం లోని కీలక రంగాలను గుర్తించి లోతైన సహకారాన్ని ప్రోది చేయగల గొప్ప అవకాశాన్ని మన భౌగోళిక సామీప్యం, అపార సహజ వనరులు-మానవ వనరులు, సుసంపన్నమైన చారిత్రక బంధాలు-సాంస్కృతిక వారసత్వం మనకు ఇచ్చాయని గుర్తిస్తూ; అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో మనకు ఎదురయ్యే ప్రధాన ప్రాంతీయ సవాలు పేదరిక నిర్మూలనే అని గుర్తిస్తూ; సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశ గా 2030 అజెండా అమలు కు ఉమ్మడి కృషి పట్ల స్థిర కట్టుబాటు ను ప్రకటిస్తూ; ప్రాం తీయ సహకారాన్ని ముందుకు తీసుకుపోయే మెరుగైన అవకాశం దిశగా బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల ఆర్థిక వ్యవస్థలు, సమాజాల మధ్య గల అంతర- ఆధార, అంతర- సంధానాలను అభినందిస్తూ; మన ప్రాంతం లోని అనుసంధాన చట్రాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించే, భాగస్వామ్య సంపద కు, ఆర్థిక సమగ్రత కు కీలకమైన బహుకోణీయ అనుసంధానం ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ; ఈ ప్రాంతం లో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించే ప్రధానాంశంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రాముఖ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ; ఈ ప్రాంతం లోని స్వల్ప ప్రగతి, అన్ని వైపులా భూభాగం గల వర్ధమాన దేశాల ప్రత్యేక అవసరాలు, పరిస్థితులను గుర్తిస్తూ.. వాటి అభివృద్ధి ప్రక్రియ కు అవసరమైన మేర అర్థవంతమైన మద్దతు ను ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ; బిమ్స్ టెక్ దేశాల్లో సహా అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర సవాలు విసురుతున్న ఉగ్రవాదం, సంధికాలపు వ్యవస్థీకృత నేరాల ముప్పు ను గుర్తిస్తూ.. వీటిని ఎదుర్కొనడం లో సభ్యత్వ దేశాల మధ్య సంయుక్త నిరంతర కృషి, సహకారం, సమగ్ర విధానాలు, చురుకైన భాగస్వామ్యాల ఆవశ్యకతను నొక్కిపలుకుతూ; అర్థవంతమైన సహకారం, లోతైన సమగ్రత ల ద్వారా శాంతియుత, సంపన్న, సుస్థిర బంగాళాఖాత ప్రాంతం దిశగా చురుకైన, ప్రభావవంతమైన ఫలితాలను లక్షించే ప్రాంతీయ సంస్థగా బిమ్స్ టెక్ ను తీర్చిదిద్దాలన్న బలమైన కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ; సముచితమైన, న్యాయమైన, నిబంధనాధారిత, సమాన, పారదర్శక అంతర్జాతీయ క్రమం నెలకొనాల్సిన అవసరాన్ని నొక్కిపలుకుతూ.. ఐక్య రాజ్య సమితి కేంద్రకంగా బహు పాక్షికత పైనా, నిబంధనాధారిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ మీదా విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ; బిమ్స్ టెక్ పరిధి లో ప్రాంతీయ సహకార ప్రక్రియను ప్రభావవంతంగా నడిపే ఉత్తేజకర వ్యవస్థాగత ఏర్పాట్ల కు గల ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ; శిఖర సమ్మేళనం నిర్ణయాలు, తీర్మాన పత్రాలకు భూటాన్ లో ఎన్నిక కాబోయే తదుపరి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యం లో పరిశీలన ప్రాతిపదికన భూటాన్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సదస్సు లో పాలుపంచుకోవడం, అంగీకారం తెలపడాన్ని గమనంలోకి తీసుకుంటూ; కింది విధంగా తీర్మానిస్తున్నాం: 1. ముందుగా 1997 నాటి బ్యాంకాక్ ప్రకటన లో పొందుపరచిన సూత్రావళి ని గుర్తు చేసుకుంటున్నాం. అలాగే సౌర్వభౌమిక సమానత్వం, ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, శాంతియుత సహజీవనం, పరస్పర లబ్ధి తదితరాలను గౌరవించడం ప్రాతిపదికగా బిమ్స్ టెక్ దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని పునరుద్ఘాటిస్తున్నాం. 2. బ్యాంకాక్ ప్రటకన-1997 నిర్దేశించిన లక్ష్యాలను, ఉద్దేశాలను సాకారం చేసేందుకు మన కృషి ని మరింత ముమ్మరం చేయడానికి అంగీకరిస్తున్నాం. అలాగే బంగాళాఖాతం ప్రాంతాన్ని శాంతియుత, సంపన్న, సుస్థిర సీమగా రూపొందించే లక్ష్యం దిశగా బిమ్స్ టెక్ ను మరింత చురుకైన, ప్రభావవంతమైన ఫలితాలను లక్షించే బలమైన ప్రాంతీయ సంస్థ గా తీర్చిదిద్దటానికి సంయుక్తంగా కృషి చేద్దామన్న మా ప్రతిజ్ఞ ను పునరుద్ఘాటిస్తున్నాం. 3. ఈ ప్రాంతం లో మెరుగైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి స్థాయి ని సాధించే క్రమం లో దక్షిణ-ఆగ్నేయాసియాలను సంధానించే వారధి గా బిమ్స్ టెక్ కు గల విశిష్ట స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దృఢ సంకల్పం పూనాం. సభ్యత్వ దేశాల మధ్య లోతైన సహకారం, సంఘటిత శక్తి తో శాంతి, సంపద, సుస్థిరత లను ప్రోత్సహించే సుస్థిర వేదిక గా మన సంస్థ ను పరివర్తన దిశగా నడిపించేందుకు పూర్తిగా కట్టుబడి వుంటాం. 4. బిమ్స్ టెక్ దేశాలు సహా ప్రపంచం లోని అన్ని దేశాల్లో ఉగ్రవాద దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎక్కడైనా, ఎవరిద్వారా అయినా సాగే అన్నిరూపాల్లోని, పద్ధతుల్లోని ఉగ్రవాద చర్యలను బలంగా ఖండిస్తున్నాం. ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా.. ఎలాంటి కారణంతోనైనా సమర్థించడం తగదని నొక్కి పలుకుతున్నాం. ఉగ్రవాద నిర్మూలన లో భాగంగా ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలు, చట్రాలపై పోరాడటమే గాక వాటిని ప్రోత్సహించే, ఆర్థిక సాయం అందించే, ఆశ్రయం కల్పించే, ఉగ్రవాద దుశ్చర్యలను సాహసంగా వక్రీకరించే దేశాలను, శక్తులను, సంస్థలను గుర్తించి జవాబుదారు చేయాలని పునరుద్ఘాటిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరాటానికి మా బలమైన వచనబద్ధత ను పునరుద్ఘాటిస్తూ దీనికి సంబంధించి అన్ని దేశాలూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయా దేశాల పరిధి లో ఉగ్రవాదులకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందకుండా నియంత్రణతో పాటు ఉగ్రవాద చేరికలు, ఉగ్రవాదుల సీమాంతర కదలికల నిరోధం కూడా ఈ విధానం లో భాగంగా ఉండాలి. అంతేకాకుండా ఉగ్రవాద దుర్బోధల నిరోధం, ఉగ్రవాదం కోసం ఇంటర్ నెట్ దుర్వినియోగాన్ని అరికట్టడం, ఉగ్రవాదులకు స్వర్గధామాలుగా మారిన స్థావరాల విధ్వంసం కూడా ఇందులో అంతర్భాగం కావాలి. 5. ఐక్య రాజ్య సమితి అధికార పత్రం లోని సూత్రావళి పైనా, దాని ఉద్దేశాల పైనా మా విశ్వాసాన్ని ముక్తకంఠంతో ప్రకటిస్తున్నాం. అదే సమయం లో ఈ అంతర్జాతీయ సంస్థ నిబంధనలను, వ్యవస్థలను, ఉపకరణాలను సంస్కరించడం ద్వారా వర్తమాన ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా బహు పాక్షిక వ్యవస్థ ను బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. మన సామూహిక ప్రయోజనాల పరిరక్షణ దిశగా సముచిత, న్యాయమైన, నిబంధానాధారిత, సమాన, పారదర్శక ప్రపంచ క్రమం కోసం సమష్టి గళాన్ని వినిపించేందుకు ఉమ్మడి గా పనిచేయడానికి అంగీకరిస్తున్నాం. వ్యవస్థాగత సంస్కరణ 6. బ్యాంకాక్-1997 ప్రకటన ఆధారంగా సంస్థ కోసం ఆధికారిక పత్రం ప్రాథమిక ముసాయిదా ను రూపొందించే బాధ్యత ను బిమ్స్ టెక్ సచివాలయానికి అప్పగించాలని నిర్ణయించాం. సహకార ప్రాథమ్యాలను, దీర్ఘకాలిక దార్శనికత కు నిర్వచిస్తూ.. వ్యవస్థాగత నిర్మాణం లోని విభిన్న అంచెల బాధ్యతలు, పాత్రలతో పాటు విధాన నిర్ణయ ప్రక్రియ లను స్పష్టంగా పేర్కొంటూ ఇది రూపొందవలసి వుంది. ఆ తరువాత ఐదో శిఖర సమ్మేళనం నాటికల్లా దీనికి ఆమోదం లభించే దృష్టి తో బిమ్స్ టెక్ శాశ్వత కార్యాచరణ కమిటీ (బిపిడబ్ల్యుసి) సహా ఇతర ఉన్నత స్థాయి వ్యవస్థల పరిశీలన కు ముసాయిదా ను సమర్పించవలసి వుంటుంది. ఆ తరువాత బిమ్స్ టెక్ లోని యంత్రాంగాల కోసం విధాన నిబంధనలు (ఆర్ఓపి) రూపొందించే బాధ్యత ను బీపీడబ్ల్యూసీ కి అప్పగించేందుకు అంగీకరించాం. 7. బిమ్స్ టెక్ కేంద్రాలు, సంస్థలతో పాటు సచివాలయ పాలన, ఆర్థికపరమైన అంశాలను పర్యవేక్షించడానికి, సమావేశాల అనుసూచికల తయారీతో పాటు సంస్థ కార్యకలాపాల ప్రాథమ్యీకరణ, హేతుబద్ధీకరణల కోసం బిమ్స్ టెక్ శాశ్వత కార్యాచణ కమిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 8. సభ్యత్వ దేశాల నుండి స్వచ్ఛంద విరాళాలతో.. తగిన తరుణం లో బిమ్స్ టెక్ అభివృద్ధి నిధి (బిడిఎఫ్) ఏర్పాటు సాధ్యాసాధ్యాల అన్వేషణ కోసం ఆయా ప్రభుత్వాలకు చెందిన సంబంధిత మంత్రిత్వశాఖలు/జాతీయ సంస్థలను ఆదేశించాలని నిర్ణయించాం. సభ్యత్వ దేశాల అంగీకారానికి అనుగుణంగా ఈ నిధి ని బిమ్స్ టెక్ పరిశోధనలు, ప్రణాళికల కోసం ప్రాజెక్టులు, కార్యక్రమాలతో పాటు బిమ్స్ టెక్ కేంద్రాలు-సంస్థల ఇతరత్రా కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించడానికి వినియోగిస్తాం. 9. బిమ్స్ టెక్ కార్యకలాపాలు, కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణ, అమలు కోసం బిమ్స్ టెక్ సచివాలయానికి వెసులుబాటు ను కల్పించే దిశగా మానవ వనరులను, ఆర్థిక వనరులను సమకూర్చడం సహా వ్యవస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు అంగీకారం; సభ్యత్వ దేశాల ఆమోదం మేరకు ప్రాజెక్టు ప్రతిపాదన లపై చొరవ కు, తనకు అప్పగించిన ఇతర బాధ్యత లను సమర్థంగా, ప్రభావవంతంగా నెరవేర్చడం కోసం తోడ్పాటు; ప్ర తి సభ్యత్వ దేశం నుండి ఒక్కొక్కరు వంతున అంచెల వారీ పద్ధతి లో డైరెక్టర్ల సంఖ్య ను 7కు పెంచడానికి అంగీకారం. 10. అంతర్జాతీయ వేదిక లపై బిమ్స్ టెక్ స్థాయి, హోదా దృగ్గోచరత ల మెరుగుకు గల ప్రాధాన్యాన్ని గుర్తించాం. అంతేగాక ఇతరత్రా సామూహిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో సముచిత రీతిలో ఉమ్మడి హోదాలను కల్పించడం, వివిధ బహు పాక్షిక సంస్థలు, వ్యవస్థలు, ప్రక్రియ లలో బిమ్స్ టెక్ బృందానికి గుర్తింపు కోరడం కూడా ఇందులో భాగంగా ఉంటాయి. 11. కీలక రంగాలలో సహకార ప్రగతి ని వేగవంతం చేయాల్సిన అవసరానికి ప్రాధాన్యం.. బిమ్స్ టెక్ లోని ప్రస్తుత రంగాలకు సంబంధించి సహకారంపై సమీక్ష, పునర్నిర్మాణం, హేతుబద్ధీకరణతో పాటు కార్యకలాపాల కోసం విధానాల క్రమబద్ధీకరణ; ప్రత్యక్ష ఫలితాల కోసం బిమ్స్ టెక్ కింద గల కార్యక్రమాలు, ప్రాజెక్టుల అమలు; దీంతో పాటు బిమ్స్ టెక్ లో సహకారానికి సంబంధించిన మూలస్తంభాలను 5 కు క్రమబద్ధీకరించడంపై “సహకార మూలస్తంభాల పునఃప్రాధాన్యం” భావనపై థాయీలాండ్ పత్రాన్ని సమర్పించడం పై హర్షం వ్యక్తం చేశాం. దీనిపై నిర్ణయం బిమ్స్ టెక్ శాశ్వత కార్యాచరణ కమిటీ తదుపరి చర్చలకు లోబడి ఉంటుంది. 12. ఖరారు, ఆమోదం నిమిత్తం అంతర్గత ఆమోదం ప్రక్రియ పెండింగ్ లో ఉన్న చట్టపరమైన పత్రాలు, ఉపకరణాలపై ప్రాధాన్యం ప్రాతిపదికన పరిశీలనకు అంగీకారం. 13. ఈ ప్రకటన అనుబంధం లో పేర్కొన్న మేరకు సంబంధిత రంగాల్లో పురోగతి ని సాధించిన ప్రధాన దేశాల పాత్ర ను అభినందిస్తూ మరింత ప్రగతి ని సాధించే దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసేలా వాటిని ప్రోత్సహిస్తాం. 14. బిమ్స్ టెక్ కు సంబంధించిన పనులను ముందుకు తీసుకుపోవడం లో పూర్వ సెక్రటరీ జనరల్ శ్రీ సుమిత్ నకందలా తన పదవీకాలంలో అందించిన సేవలకు మా అభినందనలను తెలియజేస్తున్నాం. అలాగే బాంగ్లాదేశ్ కు చెందిన శ్రీ ఎం.శాహిదుల్ ఇస్లామ్ బిమ్స్ టెక్ సెక్రటరీ జనరల్ గా నియమితులు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. 15. బిమ్స్ టెక్ కు 2014 మార్చి నెల నుండి సమర్థ నాయకత్వం వహించిన నేపాల్ కు హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తూ బిమ్స్ టెక్ కొత్త చైర్మన్ గా బాధ్యతలను స్వీకరిస్తున్న శ్రీ లంక ను స్వాగతిస్తున్నాం. 16. ప్రాంతీయ సహకార ప్రక్రియ ను ముమ్మరం చేసే దిశగా బిమ్స్ టెక్ శిఖర సమ్మేళనం, దాని యంత్రాంగాల ఇతరత్రా సమావేశాలను నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించడం పై మా కట్టుబాటు ను పునరుద్ఘాటిస్తున్నాం. 17. ఈ ప్రకటనలో భాగంగా చేర్చిన అనుబంధం లో పేర్కొన్న మేరకు రంగాల వారీ సమీక్ష కు సంబంధించి మా వైఖరి మేరకు ఆదేశాలు, కట్టుబాట్లు, ప్రకటనల జారీ కి అంగీకరిస్తున్నాం. 18. శిఖర సమ్మేళనం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అపూర్వమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చిన నేపాల్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక ప్రశంసలను, కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నాం. బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం ప్రకటన కు అనుబంధం రంగాల వారీ సమీక్ష పేదరికం నిర్మూలన 1. 2030 సుస్థిరాభివృద్ధి అజెండా కు అనుగుణం గా బంగాళాఖాత ప్రాంతం లో 2030 నాటికి పేదరిక నిర్మూలన కు మా నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం. అలాగే బిమ్స్ టెక్ పేదరిక నిర్మూలన కార్యాచరణ ను నిబద్ధత తో అమలుచేయడానికి, పేదరిక నిర్మూలన కు సంబంధించిన విలువైన లక్ష్యాల సాధన కు వీలుగా అన్ని రంగాల సన్నద్ధత కు పిలుపునివ్వడం జరుగుతోంది. 2 జాతీయ ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి సేవలు, ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెంచడం, శ్రామిక శక్తి కి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్మాణాత్మక చర్యలను తీసుకోవడం ద్వారా శ్రామిక శక్తి ని ప్రోత్సహించేందుకు మా నిబద్ధత ను వ్యక్తం చేస్తున్నాం. రవాణా , కమ్యూనికేశన్స్ (సంధానం) 3. బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల ప్రత్యేక అవసరాలను, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బిమ్స్ టెక్ మోటారు వాహనాల ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడం, బిమ్స్ టెక్ కోస్టల్ శిప్పింగ్ ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించడం, ఈ ప్రాంతం లో విమానయానం, సముద్రయానం, జల రవాణా, రైల్వేలు, జాతీయ రహదారుల ఆధునీకరణ , విస్తరణ, అభివృద్ధి ద్వారా సులభమైన, సౌకర్యవంతమైన, నిరంతరాయ బహుళ విధ రవాణా సంధానాన్ని కల్పించేందుకు నిబద్ధత ను పునరుద్ఘాటించడం జరుగుతోంది. 4. రవాణా సంధానంపై బిమ్స్ టెక్ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రూపకల్పన విషయం లో సంతృప్తి ని వ్యక్తం చేస్తూ, దానిని త్వరగా అమలు లోకి తీసుకురావాలని పిలుపునివ్వడం జరుగుతోంది. అలాగే మాస్టర్ ప్లాన్ తయారీ లో తగిన మద్దతిచ్చినందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కు కృతజ్ఙతలు తెలుపుతూ, దాని అమలుకు అవసరమైన విధి విధానాలకు రూపకల్పన చేయవలసిందిగా బిమ్స్ టెక్ ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటి వర్కింగ్ గ్రూపు (బిటిసిడబ్ల్యుజి) కి లక్ష్యాన్ని నిర్దేశించడమైంది. మాస్టర్ ప్లాన్ ఒక వ్యూహాత్మక పత్రంగా ఉపయోగపడుతూ, తగిన కార్యాచరణకు మార్గనిర్దేశం చేయగలదు. అలాగే వివిధ సంధాన సంబంధ ఫ్రేమ్‌వర్క్ లకు అంటే ఏసియన్ మాస్టర్ ప్లాన్ ఆన్ కనెక్టివిటి 2025 (ఎంపిఎసి 2025), అయేయవాడి- కావో ఫ్రాయా- మెకాంగ్ ఆర్థిక సహకార వ్యూహం (ఎసిఎంఇసిఎస్) ల వంటి వాటి విస్తృత సంధానానికి, ఈ ప్రాంత సుస్థిరాభివృద్ధికి ఇది దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నాం. 5. ఈ ప్రాంతం లోని ప్రజల మొబైల్ కమ్యూనికేశన్స్, మరింత అందుబాటు లో హై స్పీడ్ ఇంటర్ నెట్ సేవలు వంటి అంశాలకు సంబంధించి ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ, కమ్యూనికేశన్ సంబంధిత అంశాలపై ఒక వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. ఇందుకు సంబంధించి న్యూ డిజిటల్ హొరైజాన్స్-కనెక్ట్, క్రియేట్, ఇనవేట్ ఇతివృత్తం గా 2018 అక్టోబర్ 25- 27 మధ్య న్యూ ఢిల్లీ లో జరుగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సు సందర్భంగా బిమ్స్ టెక్ మంత్రుల స్థాయి సదస్సు నిర్వహణ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ను మేము స్వాగతిస్తున్నాము. ఇందులో అన్ని సభ్యత్వ దేశాలు పాల్గొనేందుకు మేం ప్రోత్సహిస్తాం. వాణిజ్యం, పెట్టుబడులు 6. బిమ్స్ టెక్ ఫ్రీ ట్రేడ్ ఏరియా (ఎఫ్ టిఎ) సంప్రదింపులు, త్వరలోనే ముగించేందుకు మా నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాము. అలాగే బిమ్స్ టెక్ ట్రేడ్ ఎకనామిక్ మినిస్టీరియల్ మీటింగ్ (టిఇఎంఎం) దాని అనుబంధ సంస్థలు, వాణిజ్య సంప్రదింపుల కమిటీ (టిఎన్‌సి) బిమ్స్ టెక్ ఎఫ్‌టిఎ సంబంధిత ఒప్పందాలను వీలైనంత త్వరగా ఖరారు చేసే పని ని వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించడమైంది. సరకులపై వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం, కస్టమ్స్ సహకారంపై ఒప్పందం పురోగతి విషయంలో మా సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నాం. అదే విధంగా క్రమం తప్పకుండా టిఎన్‌సి సమావేశాలలో పాలుపంచుకోవలసిందిగా సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలను ఆదేశించడమైంది. 7. బిమ్స్ టెక్ వీసా ఫెసిలిటేశన్ కు విధివిధానాల ఖరారు కు సంబంధించి సంప్రదింపులు కొనసాగించేందుకు వీసా అంశాలపై బిమ్స్ టెక్ నిపుణుల బృందానికి లక్ష్య నిర్దేశం చేయడం జరుగుతోంది. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ-ప్రైవేటు రంగ సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి బిమ్స్ టెక్ వ్యాపార వేదిక, బిమ్స్ టెక్ ఆర్థిక వేదిక ల కార్యకలాపాలను పునరుత్తేజితం చేసేందుకు అంగీకరించడమైంది. 8. 2018 డిసెంబర్‌లో నిర్వహించే బిమ్స్ టెక్ స్టార్ట్- అప్ సమ్మేళనానికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం చేసిన ప్రతిపాదన కు స్వాగతం పలుకుతూ సభ్యత్వ దేశాలన్నీ ఇందులో పాల్గొనాల్సిందిగా కోరడమైంది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం, సీమాంతర నేరాలు 9. ఉగ్రవాదం ఈ ప్రాంత శాంతి , సుస్థిరత లకు పెనుముప్పుగా ఉన్నదన్న విషయాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అన్ని రూపాల లోని ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు మా గట్టి నిబద్ధతను ప్రకటిస్తున్నాం. 10. క్రిమినల్ అంశాల విషయాలలో పరస్పరం న్యాయపరమైన సహాయాన్ని అందించుకునేందుకు బిమ్స్ టెక్ ఒప్పందం పై సంతకాలు జరగగలవని భావిస్తున్నాం. దీనిని వీలైనంత త్వరగా ఆమోదించాల్సిందిగా సభ్యత్వ దేశాలకు పిలుపునిస్తున్నాం. ఇప్పటికే పలు సభ్యత్వ దేశాలు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారానికి సంబంధించిన బిమ్స్ టెక్ ఒప్పందాన్ని, అలాగే సీమాంతర వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ను ఎదుర్కొనేందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఆమోదించాయి. మిగిలిన దేశాలు వీటిని ఆమోదించవలసిందిగా పిలుపునివ్వడమైనది. 11. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల విషయంలో, సీమాంతర నేరాలను ఎదుర్కొనే విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే క్రమం లో బిమ్ స్టెక్ హోం మంత్రుల స్థాయి లో సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయించడమైంది. అలాగే భద్రతా సంస్థలు, నిఘా విభాగాలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ ల మధ్య సహకారం, సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు మా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. 12. 2019 మార్చిలో బిమ్స్ టెక్ జాతీయ భద్రత సిబ్బంది అధిపతుల మూడో సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు థాయీలాండ్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. పర్యావరణం, విపత్తుల నిర్వహణ 13. బంగాళా ఖాత ప్రాంతంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోనేందుకు పరస్పర సహకారం, ముందస్తు సన్నద్ధత వ్యవస్థ లను మెరుగుపరచే విధంగా కార్యాచరణను రూపొందించుకుని చేపట్టడం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థతో పాటు పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా విపత్తుల నిర్వహణ విషయంలోసన్నిహిత సహకారానికి ప్రోత్సాహం అందజేయడం జరుగుతుంది. జల వాయు పరివర్తన 14. పర్యావరణ ముప్పు, జల వాయు పరివర్తన ల కారణంగా దుష్ప్రభావం, హిమాలయ ప్రాంతంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, హిమాలయ పర్వతాల పర్యావరణ వ్యవస్థలలో మార్పులు, బంగాళా ఖాతం, హిందూ మహాసముద్రం వంటి వాటిపై ప్రభావం విషయంలో మా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అలాగే, పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ, మన ప్రజల జీవనం పైన, జీవనోపాధి పైన వ్యతిరేక ప్రభావం చూపుతున్న పర్యావరణ అంశాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గురించి, ఈ ప్రాంతంలో జల వాయు పరివర్తన లను ఎదుర్కొనేందుకు ఉమ్మడి బాధ్యత కింద కార్యాచరణ ప్రణాళిక ను అభివృద్ధి చేసేందుకు ఒక అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించడంతో పాటు వివిధ దేశాల పరిస్థితులు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని పారిస్ ఒప్పందం కార్యాచరణ లోకి వచ్చేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఇంధనం 15. ఈ ప్రాంతం లోని ఇంధన వనరుల అధిక సామర్ధ్యాన్ని గుర్తించి, ప్రత్యేకించి పునరుత్పాదక ఇంధన వనరులు, పరిశుభ్ర ఇంధన వనరులను గుర్తించి ఇంధన సహకారానికి సమగ్ర ప్రణాళిక అభివృద్ధికి మన ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకారం తెలుపుతున్నాం. ఇందుకు సంబంధించి ఈ ప్రాంతం లోని దేశాలు పరస్పరం సన్నిహితంగా సహకరించుకునేందుకు, ఇంధన రంగంలో నవీకరణయోగ్య, హైడ్రో పవర్ రంగం లో సహకారాన్ని విస్తృతం చేసేందుకు నిపుణులతో కూడిన అంతర్ ప్రభుత్వ బృందాన్ని నియమించేందుకు నిర్ణయించడమైంది. 16. ఇంధన వాణిజ్యం తో సహా మన ప్రజలకు నిరంతరాయ, అందుబాటు ధరలో విద్యుత్తు సరఫరా కు తిరిగి కట్టుబడి ఉన్నాం. అలాగే బిమ్స్ టెక్ గ్రిడ్ అనుసంధానత పై అవగాహనపూర్వక ఒప్పందం పై సంతకాలు జరగడాన్ని స్వాగతిస్తున్నాం. గ్రిడ్ సంధానానికి గల అవరోధాలను తొలగించేందుకు, నిర్వహణపరమైన ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన సాంకేతిక, ప్రణాళిక, నిర్మాణాత్మక చర్యలు తీసుకొనేందుకు సంబంధిత ఏజెన్సీలను ఆదేశించడం జరిగింది. దీనితో పాటు త్వరలోనే బిమ్స్ టెక్ గ్రిడ్ ఏర్పాటు కు వీలు కల్పించేందుకు హామీని ఇస్తున్నాం. బిమ్స్ టెక్ ఇంధన కేంద్రం వీలైనంత త్వరలో ఆచరణ లోకి వచ్చేందుకు ఆ దిశగా ఇంధన రంగంలో సహకారాన్ని ఈ ప్రాంతంలో బలోపేతం చేసేందుకు చర్యలకు పిలుపునివ్వడం జరుగుతోంది. సాంకేతిక విజ్ఞానం 17. అందుబాటు లోని సాంకేతిక విజ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకొనేందుకు, అభివృద్ధి చేసేందుకు సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించడమైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి వివిధ రంగాలలో సుస్థిరాభివృద్ధి ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ లంక లో బిమ్స్ టెక్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ ఏర్పాటు కు అవగాహనపూర్వక ఒప్పందం పై సంతకాలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతించడం జరుగుతోంది. 18. సాంకేతిక విజ్ఞానం విధ్వంసకర ప్రభావాలను దృష్టిలో ఉంచుకుంటూ, ఈ ప్రాంతంలో సాంకేతిక విజ్ఞానం అభివృద్ధికి మానవ వనరుల అభివృద్ధి, విద్యా సహకారంపై దృష్టి పెట్టేందుకు అంగీకరించడం జరిగింది. వ్యవసాయం 19. వ్యవసాయ అనుబంధ రంగాలలో సహకారాన్ని మరింత పెంచేందుకు నిర్ణయించడం జరిగింది. పంటలు, పశుగణాభివృద్ధి, పండ్ల తోటలు, వ్యవసాయ యంత్రపరికరాలు, పంట కోత యాజమాన్యం ల వంటి వాటి ద్వారా ఉత్పాదకత పెంపు, వ్యవసాయ రాబడి ని నిరంతరాయంగా వృద్ధి చేయడం, ఆహారం, పౌష్టికాహార భద్రత కు సంబంధించి సహకారాన్ని పెంపొందించేందుకు సంబంధిత అధికారులకు లక్ష్య నిర్దేశం. సంప్రదాయ వ్యవసాయానికి సంబంధించిన విజ్ఞానాన్ని విస్తృతం చేయడం, ఆధునిక వ్యవసాయ విధానాలతో సంప్రదాయ వ్యవసాయ విధానాలను అనుసంధానం చేయడం, సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గించడం, రాబడి పెంపు, వ్యవసాయదారుల కష్టాలను తీర్చడం, సభ్యత్వ దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్యం పెంపుదల, పేదరిక నిర్మూలన కు చేయూతనివ్వడం, ఉపాధి కల్పన, మన దేశాలలో జీవన ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవడానికి పరస్పరం సహకరించకునేందుకు నిర్ణయం తీసుకోవడమైంది. 20. బిమ్స్ టెక్ మంత్రుల స్థాయి లో 2019 లో వ్యవసాయం పై సమావేశం నిర్వహించేందుకు మయన్మార్ ముందుకు రావడాన్ని, అలాగే 2019 లో వాతావరణ మార్పులకు అనుగుణ్యమైన వ్యవసాయానికి సంబంధించిన బిమ్స్ టెక్ సదస్సు కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. మత్స్య పరిశ్రమ 21. ఈ ప్రాంతం లో సముద్ర వనరుల సుస్థిర వినియోగం, నిర్వహణ, పరిరక్షణ ల విషయంలో సహకారాన్ని కొనసాగించాలని నొక్కి పలకడమైంది. ఈ ప్రాంత ప్రజల జీవనోపాధి ని మెరుగుపరచడానికి ఆహార భద్రత కు పూచీ పడడానికి మత్స్య పరిశ్రమ రంగం లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అంగీకరించడం జరిగింది. సముద్ర మత్స్య సంపద సుస్థిర అభివృద్ధికి అర్థవంతమైన కొలాబరేషన్లకు గల అవకాశాన్ని అన్వేషించేందుకు నిర్ణయించడమైంది. అలాగే నలువైపులా భూమి మాత్రమే ఉన్న సభ్య దేశాలు దేశీయంగా మత్స్య పరిశ్రమ ద్వారా ఎలా అభివృద్ధి చెందవచ్చో దానికి గల వివిధ అవకాశాలను పరిశీలించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించడమైంది. ప్రజారోగ్యం 22. సాంక్రమికేతర వ్యాధులకు సంబంధించి పరస్పర సహకారాన్ని విస్తృతం చేసేందుకు అంగీకారం. అలాగే బిమ్స్ టెక్ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక ప్రగతి ని దెబ్బతీసే విధంగా ఉన్న హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా, డెంగూ, టిబి, వైరల్ ఇన్‌ఫ్లూయంజా, ఏవియన్ స్వైన్ ఫ్లూ ఇతర ప్రజారోగ్య సమస్యల విషయంలో సహకారాన్ని పెందపొందించడం, సంప్రదాయ వైద్య రంగం లో పురోగతి పై పరస్పర సహకారం, ఈ రంగంలో పరస్పరం కార్యకలాపాలు సాగించడం, పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొంటూ సహకారాన్ని పెంపొందించుకోవడం, ఆయా దేశాల అనుభవాలను పంచుకోవడం, ఇలాంటి వ్యాధుల నిరోధానికి పటిష్టమైన కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టడానికి నిర్ణయించడమైంది. సంప్రదాయ వైద్య రంగం లో సహకారానికి సంబంధించి థాయీలాండ్ చేస్తున్న కృషికి అభినందనలు తెలపడమైంది. ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలు 23. సభ్యత్వ దేశాల మధ్య లోతైన అవగాహన, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు, వివిధ స్థాయిలలో ఆయా దేశాల ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందింపచేయడం, బిమ్స్ టెక్ గురించిన అవగాహన ను పెంపొందింపచేయడానికి సంకల్పించడమైంది. అలాగే బిమ్స్ టెక్ నెట్‌వర్క్ పాలిసీ మేధో మధనం పట్ల సంతృప్తి వ్యక్తం చేయడమైంది. బిఎన్‌పిటిటికి సంబంధించి టరమ్స్ ఆఫ్ రెఫరన్స్ ను ఖరారు చేయవలసిందిగా సంబంధిత ఏజెన్సీలను కోరడమైంది. 24. వివిధ దేశాల మధ్య ప్రజలకు- ప్రజలకుమద్య సంబంధాలను పెంపొందించేందుకు పార్లమెంటేరియన్ లు, విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు, పరిశోధన కేంద్రాలు, సాంస్కృతిక సంస్థలు, ప్రసార మాధ్యమాలు తదితర రంగాలకు సంబంధించి తగిన వేదిక ల ఏర్పాటు కు గల అవకాశాలను పరిశీలించేందుకు నిర్ణయించడమైంది. సాంస్కృతిక సహకారం 25. మన ప్రజల మధ్య చరిత్రాత్మక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల్లో సాంస్కృతిక బృందాల రాకపోకలను విస్తరించవలసిన అవసరాన్ని నొక్కిపలకడం; సాంస్కృతిక వైవిధ్యం కోసం పరస్పర గౌరవాన్ని, సహనాన్ని ప్రోత్సహించడం; ఈ ప్రాంత సంధానంలో అంతస్సూత్రంగా గల బౌద్ధం ప్రాధాన్యాన్ని గుర్తించడం, బౌద్ధ పర్యాటక వలయాన్ని స్థాపించేందుకు కట్టుబడి ఉండడం. 26. బిమ్స్ టెక్ సాంస్కృతిక మంత్రుల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు, బిమ్స్ టెక్ సాంస్కృతిక సంరంభాలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు నిర్ణయించడమైంది. బిమ్స్ టెక్ తొలి సాంస్కృతిక సంబరాల నిర్వహణ, బిమ్స్ టెక్ మంత్రుల రెండో సమావేశాన్ని నిర్వహించేందుకు బాంగ్లాదేశ్ చేసిన ప్రతిపాదనను స్వాగతించడమైంది. ఈ రెండు ప్రధాన ఘట్టాలలో పాల్గొనవలసిందిగా మన సాంస్కృతిక శాఖ మంత్రులను ప్రోత్సహించడానికి నిర్ణయించడమైంది. పర్యటన రంగం 27. బిమ్స్ టెక్ దేశాల మధ్య పర్యాటక రంగ అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తీసుకొనేందుకు అంగీకారం. పర్యటన రంగంలో గల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తగిన వ్యూహాలను రూపొందించవలసిందిగా సంబంధిత అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించడం, 2005లో కోల్‌కతా లో తీర్మానించిన విధంగా బిమ్స్ టెక్ ప్రాంతం లో పర్యటన రంగ అభివృద్ధి ప్రోత్సాహానికి సంబంధించిన కార్యాచరణ, 2006 వ సంవత్సరంలో కాఠ్ మాండూ లో జరిగిన పర్యటన మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశం, సదస్సు ల వంటి గత చర్యల ఆధారంగా భవిష్యత్ అవకాశాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించడమైంది. యాత్రికుల భద్రత కు, రక్షణ కు పూచీ పడుతూ అందుకు తగిన సౌకర్యాల కల్పనకు నిర్మాణాత్మక చర్యలను తీసుకోవడం జరుగుతోంది. అలాగే పర్యటన ప్రాంతాలకు సులభ ప్రయాణ సదుపాయం, బౌద్ధ పర్యటన వలయం అభివృద్ధి ని ప్రోత్సహించడం, పురాతన నగరాలు గల ప్రాంతాలను పర్యటనల పరంగా అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, వైద్య పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించడానికి నిర్ణయించడమైంది. 2020 వ సంవత్సరంలో నేపాల్ సందర్శన సంవత్సరం సందర్భం గా పర్యాటక సదస్సు కు ఆతిధ్యాన్ని ఇచ్చేందుకు నేపాల్ చేసిన ప్రతిపాదన ను స్వాగతిస్తున్నాం. పర్వత ప్రాంత ఆర్థిక వ్యవస్థ 28. పర్వత ప్రాంత పర్యావరణ పరిరక్షణ కు వీలుగా నిర్మాణాత్మక చర్యలను తీసుకోవలసిన అవసరాన్ని గుర్తిస్తూ, సుస్థిరాభివృద్ధి కి వీలుగా జీవ వైవిధ్యాన్ని కాపాడడం, బిమ్స్ టెక్ దేశాల పర్వత ప్రాంత ఆర్థిక వ్యవస్థలను పెంపొందించేందుకు నేపాల్ రూపొందించిన విధాన పత్రాన్ని స్వాగతిస్తూ, ఈ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక ను అభివృద్ధి చేసేందుకు అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందాన్ని నియమించాలని నిర్ణయించడమైంది. సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ 29. సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యాన్ని గుర్తించి, ఈ ప్రాంతం లో ఈ రంగానికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి సాధన కు పరస్సర సహకారానికి అంగీకారం తెలపడం. అలాగే బిమ్స్ టెక్ దేశాలలో నలువైపులా భూమి కలిగిన దేశాల ప్రత్యేక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి విషయమై కార్యాచరణ కు అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందాన్ని నియమించేందుకు నిర్ణయించడమైంది. 30. 2017 లో బాంగ్లాదేశ్ లో జరిగిన బ్లూ ఎకానమీ అంతర్జాతీయ సదస్సు కు బంగ్లాదేశ్ ఆతిథ్యానికి, బిమ్స్ టెక్ సభ్యదేశాల నుండి ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడం పట్ల సంతృప్తి ని వ్యక్తం చేయడమైంది. **
PM @narendramodi with other leaders during the BIMSTEC retreat in Kathmandu. pic.twitter.com/3wDFqylp8Z
— PMO India (@PMOIndia) August 31, 2018
Wonderful discussions and exchange of ideas on strengthening BIMSTEC during the retreat of leaders in Kathmandu this morning. pic.twitter.com/tQpPVVfpTt
— Narendra Modi (@narendramodi) August 31, 2018