ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం భారత, ఇజ్రాయెల్ దేశాలు జలవనరుల నిర్వహణ, అభివృద్ధిలో సహకారానికి అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకునేందుకు ఆమోదం తెలిపింది.
జల వనరుల సమర్థ వినియోగం, రీ సైక్లింగ్/రీ యూజింగ్, క్షార నిర్మూలన, అక్విఫయర్ రీచార్జ్, జలవనరుల సంరక్షణ విభాగాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాలు ఉభయులు ఇచ్చిపుచ్చుకుని సహకరించుకుని ప్రయోజనం పొందేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎంఓయూలోని భిన్న అంశాల అమలుకు సంబంధించిన కార్యకలాపాల పర్యవేక్షణకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
జలవనరుల నిర్వహణ, అభివృద్ధి సహకారానికి సంబంధించి భారత్ ఇప్పటికే ఆస్ర్టేలియా, కాంబోడియా, ఇరాన్, ఇరాక్, ఫిజీ, చైనా, బహ్రేన్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
నేపథ్యం:
కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునరుద్ధరణ మంత్రిత్వ శాఖ.. జలవనరుల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి వివిధ దేశాలతో విధానపరమైన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానం పంచుకునేందుకు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, శాస్త్ర సాంకేతిక సదస్సులు, సాంకేతిక గోష్ఠి, నిర్వహణకు, నిపుణులను పరస్పరం పంపించుకోవడంతో పాటు అధ్యయన పర్యటనల నిర్వహణకు కృషి చేస్తోంది. జలవనరుల సమర్థ నిర్వహణ, మైక్రో ఇరిగేషన్, వ్యర్థజలాల పునర్ వినియోగం, క్షారనిర్మూలన, అక్విఫయర్ రీచార్జ్ రంగాల్లో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని వారి అనుభవాలు, నైపుణ్యాలను సాధించడానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.