Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌర ఇంధ‌నంపై భార‌త్‌, జ‌ర్మ‌నీల మధ్య అవగాహనపూర్వ‌క‌ ఒప్పందం


సౌర ఇంధ‌న స‌హ‌కారంపై భార‌త్‌, జ‌ర్మ‌నీల మ‌ధ్య కుదిరిన అవగాహనపూర్వ‌క‌ ఒప్పందానికి ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ సార‌థ్యంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం భార‌త్‌, జ‌ర్మ‌నీల మ‌ధ్య 2015 అక్టోబ‌రులో జ‌రిగింది. సౌర ఇంధ‌న రంగంలో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని మ‌రింతగా పెంచుకోవ‌టం, సాంకేతికంగా, ఆర్థికంగా సాయం అందించ‌టం ద్వారా భార‌త్‌లో సౌర ఇంధ‌న వినియోగం పెరిగేలా చేయ‌టం ఈ ఒప్పందం ఉద్దేశం. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల ద్వైపాక్షిక స‌హ‌కారం మ‌రింత బ‌లోపేత‌మ‌వుతుంది. ఈ ఒప్పందం కింద వ‌చ్చే ఐదేళ్ళ‌లో జ‌ర్మ‌నీ క్రెడిటాన్‌స్టాల్ట్ ఫ‌ర్ వైడ‌రఫ్‌బా (కెఎఫ్‌డబ్ల్యూ) ద్వారా బిలియ‌న్ యూరోల దాకా సుల‌భ‌రుణాల‌ను ఇస్తుంది. ఈ కెఎఫ్‌డబ్ల్యూ నిధుల‌ను అంతిమ వినియోగ‌దారుల‌కు భాగ‌స్వామ్య బ్యాంకుల ద్వారా సాఫ్ట్‌రుణాలుగా కూడా అంద‌జేస్తారు.
ఈ ఒప్పందం ద్వారా సౌర‌ పైక‌ప్పుల రంగంలో స‌హ‌కారం అందుతుంది. సౌర పార్కులు, సౌర మండ‌లాలు (వీలైతే భార‌త్‌-జ‌ర్మ‌నీ ఆర్థిక స‌హ‌కారం కింద కెఎఫ్‌డబ్ల్యూ ద్వారా ఏర్పాట‌య్యే గ్రీన్ ఎన‌ర్జీ కారిడార్ల‌కు ద‌గ్గ‌ర‌గా) అభివృద్ధి జ‌రుగుతుంది. స్వ‌చ్ఛ‌, సుస్థిర ఇంధ‌నం అందేలా సోలార్ ఆఫ్ గ్రిడ్ చ‌ర్య‌లు చేప‌డ‌తారు.