ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి 7-8-2018న చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో దివంగతులైన డాక్టర్ ఎం. కరుణానిధికి నివాళులర్పించింది.
కరుణానిధి స్మృత్యర్థం కేబినెట్ రెండు నిమిషాల మౌనం పాటించి,ఆయన మృతి పట్ల ఒక సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం కింది విధంగా ఉంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం. కరుణానిధి 7.8.2018న చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో మరణించడం పట్ల కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.వారి మరణంతో దేశం ఒక గొప్ప, ప్రముఖ నాయకుడిని కోల్పోయింది.వారిని ప్రేమతో ప్రజలు కలైంజ్ఞర్ అని పిలుచుకునే వారు.
ఆయన నాగపట్టణం జిల్లా తిరుక్కువాలై గ్రామంలో 1924 జూన్ 3న జన్మించారు. తమిళనాడు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రజా, రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్టించారు. ఆయన తన 33 సంవత్సరాల వయసులో, 1957 ఎన్నికలలో తమిళనాడులోని కులితలై సీటును గెలుచుకుని శాసనసభలో అడుగుపెట్టారు.1967లో ఆయన తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.ఆ తర్వాత 1969లో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఐదు పర్యాయాలు పనిచేశారు.
ఆయన రాజకీయ జీవితం, కెరీర్‌తోపాటు ఆయన తమిళ సినిమా రంగంలో ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్నారు. ద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆయన సినిమా మాధ్యమాన్ని వాడుకున్నారు. డాక్టర్ ఎం. కరుణానిధి తన రచనలు , ఉపన్యాసాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. తమిళ సాహిత్యానికి వారు అందించిన సేవలు ఎంతో గొప్పవి. కవితలు, స్క్రీన్ ప్లే, నవలలు, జీవిత చరిత్రలు, నాటకాలు, సంభాషణలు, సినిమా పాటు ఇలా ఆయన కలం నుంచి జాలువారాయి.
వారి మరణంతో తమిళనాడు ప్రజలు తమ పాపులర్ నాయకుడిని కోల్పోయారు.
భారత ప్రభుత్వం తరఫున , మొత్తం దేశ ప్రజల తరఫున కరుణానిధి కుటుంబ సభ్యులకు, తమిళనాడు ప్రజలకు కేబినెట్ తమ హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నది