ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఈ కింది ప్రతిపాదనను ఆమోదించింది.-
హిందూస్థాన్ ఉర్వారక్, రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్ ఎల్)కు భూమిని లీజుపై ఇవ్వడానికి,
ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్)కు చెందిన గోరఖ్‌పూర్,సింద్రి యూనిట్లు, హిందూస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు(హెచ్.ఎఫ్.సి.ఎల్) బరౌని యూనిట్‌ను హెచ్.యు.ఆర్.ఎల్ ద్వారా పునరుద్ధరణకు రాయితీ ఒప్పందాలు, భూమి లీజు ఒప్పందాలు చేసుకునేందుకు అలాగే గోరఖ్‌పూర్, సింద్రి, బరౌనీ మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఎఫ్.సి.ఐ.ఎల్, హెచ్.ఎఫ్.సి.ఎల్లకు హెచ్.యు.ఆర్.ఎల్ ల మధ్య ప్రత్యామ్నాయ ఒప్పందాలు, అలాగే ఇతర ఒప్పందాల ఆమోదానికి వీటిమధ్య ఇంకా ఏవైనా ఒప్పందాలు అవసరమైతే వాటిని కుదుర్చుకునేందుకు అంతర్ మంత్రిత్వశాఖ కమిటీ(ఐ.ఎం.సి)కి అధికారం ఇచ్చే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రభావంః
ఎఫ్.సి.ఐ.ఎల్, హెచ్.ఎఫ్.సి.ఎల్ లకు చెందిన గోరఖ్‌పూర్, సింద్రీ, బరౌనీ యూనిట్ల పునరుద్ధరణతో ఎరువుల రంగంలోకి గణనీయమైన పెట్టుబడులు రావడానికి వీలు కలుగుతుంది.తూర్పు భారతదేశంలో కీలక మౌలికసదుపాయాల అభివృద్ధికి వేయనున్న జగదీశ్‌పూర్- హల్దియా పైప్‌లైన్‌కు ఈ యూనిట్లు కీలక కస్టమర్లుగా ఉంటాయి.ఇవి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి.అలాగే తూర్పు ప్రాంతంలో, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది. ఈ ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణతో దేశీయంగా యూరియా ఉత్పత్తి మరింత పెరగడంతోపాటు యూరియా రంగంలో దేశ స్వావలంబన మరింత ఇనుమడిస్తుంది.
వివరాలుః
ఎన్.టి.పి.సి., ఐఒసిఎల్, సిఐఎల్, ఎఫ్‌సిఐఎల్, హెచ్ఎఫ్సిఎల్ ల సంయుక్త రంగ కంపెనీగా హెచ్.యు.ఆర్.ఎల్ 2016 జూన్‌లో ఏర్పడింది.గోరఖ్‌పూర్, సింద్రి, బరౌనిలలో ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టేందుకు దీనిని ఏ ర్పాటు చేశారు.
హెచ్.యు.ఆర్.ఎల్ సంస్థ ఈ మూడు ప్రదేశాలలో ఎరువుల కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఎప్.సి.ఐల్, హెచ్.ఎఫ్.సి.ఎల్ సంస్థలు హెచ్.యు.ఆర్.ఎల్తో ఒక లీజు ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ భూమిని 55 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వనున్నారు.
లీజుగా భూమిని అందుకుంటున్న హెచ్.యు.ఆర్.ఎల్ సంస్థ నామ మాత్రపు లీజు అద్దెగా లీజుకు ఇచ్చిన ఎఫ్.సి.ఐ.ఎల్, హెచ్.ఎఫ్.సి.ఎల్లకు ఏటా లక్ష రూపాయల లీజు అద్దెను చెల్లిస్తుంది.
ఎఫ్.సి.ఐ.ఎల్‌కు చెందిన సింద్రి, గోరఖ్‌పూర్ యూనిట్లు, హెచ్.ఎఫ్.సి.ఎల్‌కు చెందిన బరౌని యూనిట్‌కు సంబంధించి రాయితీ ఒప్పందాలను ఎఫ్.సి.ఐ.ఎల్, హెచ్.ఎఫ్‌సిఎల్, హెచ్‌యుఆర్ ఎల్ ల మధ్య కుదుర్చుకోనున్నారు.ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం,ప్రొక్యూర్మెంట్, టెస్టింగ్,అమలు, ఈ ఎ రువుల ప్లాంటుల ప్రారంభం, నిర్వహణ, వాటి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి హెచ్.యు.ఆర్.ఎల్‌కు ఈ ఒప్పందం హక్కును కల్పిస్తుంది. ఇక ప్రత్యామ్నాయ ఒప్పందం అనేది హెచ్.యు.ఆర్.ఎల్, ప్రత్యేక ప్రాజెక్టుకు లెండర్ ప్రతినిధులు, ఎఫ్.సి.ఐ.ఎల్, హెచ్.ఎఫ్.సి.ఎల్ ల మధ్య త్రైపాక్షిక ఒప్పందంగా ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం హెచ్.యు.ఆర్.ఎల్ తనకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి వీలుగా దీనిని కుదుర్చుకుంటారు.ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి లెండర్ల సిండికేషన్ పూర్తి అయిన తర్వాత ఈ సంతకాలు జరుగుతాయి.