ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలెండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర ప్రముఖులు, మరియు శ్రీ బిల్ గేట్స్, విశిష్ట అతిథులారా..
మొట్టమొదటగా ఫ్రాన్స్ ప్రజలతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ హోలెండ్ ప్రదర్శిస్తున్న ధైర్యానికి, సంకల్పానికి వందనం; అలాగే, ఫ్రాన్స్ కోసం, పారిస్ కోసం కలసి ముందడుగు వేసిన ప్రపంచదేశాలకు కూడా నా వందనములు తెలియజేస్తూ, నా ప్రసంగాన్ని ఆరంభిస్తాను. మన సమావేశం కోసం గొప్పగా చేసిన ఏర్పాట్లు ఈ ఘనమైన దేశ సత్ప్రవర్తనకు అద్దం పడుతున్నాయి. మనం నివసిస్తున్న పృథ్వి మనుగడ గతిని మార్చి, నిలకడతో కూడిన దారిలోకి తీసుకువెళ్లేటందుకు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పారిస్లో కొలువుదీరాయి. కర్బన ఉద్గారాలకు పరిమితులను, లక్ష్యాలను ఏర్పరచుకోవడంపైనా, ప్రపంచ ఉష్ణోగ్రత పెచ్చుపెరుగుతుండటం పైనా మనం మాట్లాడుకొనే తీరాలి.
అంతే కాకుండా, ఈ భూమిని దాని సహజసిద్ధమైన స్థాయికి తీర్చిదిద్దుకోగలగడానికి తోడ్పడే సాధనాలపైన మన దృష్టిని కేంద్రీకరించడం కూడా అంతే ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అంశమంటాను.
మానవాళిలో చాలా ఎక్కువ శాతం మంది ఇప్పటికీ పేదరికం గుప్పిట్లోనే నలుగుతున్నారు. వారు సూర్యాస్తమయం తరువాత చీకటిలోనే మగ్గుతున్నారు. వారి ఇళ్లలో వెలుగులు నింపడానికి, వారి భవిష్యత్తుకు ఊతం అందడానికి వీలుగా వారికి ఇంధనాన్ని సమకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అంతే కాకుండా, శిలాజ ఇంధనం అండతో ఎదిగిన పారిశ్రామిక యుగం తనకు తోడుగా తెచ్చిపెట్టిన పర్యవసానాల బారిన ఎక్కువగా పడింది కూడా వాళ్లే.
ఇంధనం అందుబాటులో ఉండడం, మంచి జీవన శైలి అనేవి అందరూ కోరుకునేవే. అలాగే, పరిశుద్ధమైన పర్యావరణం, ఆరోగ్యదాయకమైన జనావాస ప్రాంతాలు కూడా సర్వులూ కావాలనుకొనేవే.
కర్బనం వెలికి పంపడానికి అందుబాటులో ఉన్న ఖాళీస్థలం చాలా తక్కువగానే మిగిలి ఉన్న గ్రహం మీద వర్ధిల్లేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు తాపత్రయపడుతున్న తరుణంలో మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.
అభివృద్ధి అనే నిచ్చెనలో ఇప్పటికీ తొలి మెట్లను ఎక్కడం మొదలుపెట్టిన దేశాలే అనేకం ఉండగా, వాటికి అవకాశాలనేవి మిగలకుండా చేసేలా కొన్ని దేశాల తీరు ఉండకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగినంత జాగాను సంపన్న దేశాలు వదలిపెట్టాల్సిందే. మనం వృద్ధి పథంలో సాగే క్రమంలో పర్యావరణంలోకి వదలిపెట్టే కర్బన ఉద్గారాల స్థాయి పరిమితంగా ఉండేటట్లుగా మనం పాటుపడాలి.
ఇందుకోసం శుద్ధమైన ఇంధనం మన అందరి అందుబాటులోకి వచ్చేలాగా మనం అంతా కలసి భాగస్వామ్య స్ఫూర్తిని అలవర్చుకోవడం తప్పనిసరి.
వాతావరణంలో మార్పులపై ఎదురొడ్డి పోరాడటంలో, వాతావరణ న్యాయ పరిరక్షణలో నవకల్పన (ఇన్నొవేషన్) కీలక పాత్రను పోషించగలుగుతుంది. ఈ దిశగా నవకల్పనపై నిర్వహించుకొంటున్న ప్రస్తుత శిఖరాగ్ర సమావేశానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం మనందరినీ ఒక ఉమ్మడి లక్ష్య సాధనకు ఒక్కతాటిపైన నిలుపుతోంది.
పునర్వినియోగ ఇంధనాన్ని ఇప్పటికన్నా మరింత చౌకగాను, మరింత ఆధారపడదగిందిగాను, ప్రసార జాలక వ్యవస్థలకు మరింత సులువుగా అనుసంధానించే వీలు ఉన్నదిగాను మలచుకోవడానికి మనం పరిశోధనలపైనా, కొత్త మార్పుల పైనా దృష్టి సారించాలి.
సంప్రదాయ ఇంధనాన్ని ఎటువంటి కాలుష్యానికి తావు లేకుండా ఉత్పత్తి చేయడం మనకు చేతనవును. అంతే కాదు, మనం కొత్త కొత్త పునర్వినియోగ తరహా ఇంధన వనరులను కనిపెట్టగలం కూడా.
నవకల్పన కోసం మనం తీసుకొనే చొరవలు ఒక్క మార్కెట్ ప్రోత్సాహకాలతోనే ఆగిపోకుండా, మేధోసంపత్తి, దాంతో పాటే ప్రజాహితం ఆలంబనలుగా సాగాలి.
దీని అర్థం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరాదారులుగా ఉండే వర్గాలు ప్రజల పట్ల ఎంతో చిత్తశుద్ధిని చాటుకోవాలని కూడాను.
అటువంటి వైఖరి స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అన్ని దేశాలు ఈ తరహా ఇంధనాన్నిసంపాదించి వినియోగించుకొనే వీలు ఏర్పడుతుంది.
మన భాగస్వామ్యం ప్రయివేటు రంగానికున్న నవకల్పన సామర్ధ్యాన్ని ప్రభుత్వాల బాధ్యతతో పెనవేయగలదు. పరిశోధనలు, నవకల్పనలపైన మనం పెడుతున్న పెట్టుబడులను రెట్టింపు చేద్దాం; ఒక దేశానికి మరొక దేశం.. ఇలాగ మనం పరస్పరం ఇప్పటి కన్నా ఎక్కువగా సమన్వయంతో పనిచేద్దాం.
మనం రానున్న పదేళ్లలో పునర్వినియోగ ఇంధనంపై దృష్టిని కేంద్రీకరించేందుకు 30- 40 విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలతో కూడిన ఒక అంతర్జాతీయ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలి.
మన నవకల్పన అందుకయ్యే ఖర్చులను భరించగలిగేటంత స్థాయిని కలిగిందిగానూ, ఆచరణసాధ్యమైందిగానూ ఉండేటట్లుగా రూపుదిద్దుకోవాలి.
ప్రస్తుతం ఇక్కడ గుమికూడిన అనేక దేశాలతో మనం ఎంతగానో విజయవంతమైన పబ్లిక్- ప్రయివేట్ భాగస్వామ్యాల నమూనాను కలిగి ఉన్నాము.
అభివృద్ధి చెందిన దేశాలకు, చిన్న చిన్న ద్వీప దేశాలకు పునర్వినియోగ ఇంధన వనరులను భారత్ కూడా సమకూర్చుతోంది.
శుద్ధమైన ఇంధన సాంకేతిక పరిజ్ఞానం, దాని తాలూకు వ్య యాల విషయంలో సాధిస్తున్న పురోగతి బాగుంది. మనం మన ప్రయత్నాలను మరింతగా పెంచితే, ప్రపంచంలో పరివర్తనను తీసుకురాగలం.
అంతటితోనే ఆగకుండా, మనం సరికొత్త తక్కువ కర్బన యుగానికి చోటిచ్చే నూతన ఆర్థిక వ్యవస్థకు పునాదిరాయిని వేసుకోగలుగుతాము.
పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు నడుమ, వారసత్వానికి- భావి తరాల పట్ల మనకున్న బాధ్యతకు మధ్య సమతూకాన్ని మనం పునరుద్ధరించినవారం కాగలం. అలాగే, మనం చూడని ప్రపంచం కోసం కూడా మనం జాగ్రత్త వహించాలి అంటూ పిలుపునిచ్చిన గాంధీజీ ఆకాంక్షను నెరవేర్చినవారమూ అవుతాం.
ధన్యవాదాలు.
Talked about the importance of innovation to combat climate change at the Innovation Summit hosted by @POTUS. https://t.co/Yev9nklBBF #COP21
— Narendra Modi (@narendramodi) November 30, 2015
Through research & innovation, we must make renewable energy cheaper, reliable & conventional energy cleaner. #COP21 @COP21 @India4Climate
— Narendra Modi (@narendramodi) November 30, 2015
Together, we shall live up to Mahatma Gandhi's call to care for a world that we shall not see. #COP21 @COP21 @COP21en @India4Climate
— Narendra Modi (@narendramodi) November 30, 2015