ప్రాంతీయ విమానయాన భాగస్వామ్యం సంబంధిత సహకారం అంశం పై బ్రిక్స్ సభ్యత్వ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, ఇంకా దక్షిణాఫ్రికా ల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ముఖ్యాంశాలు:
పౌర విమానయాన రంగంలో సహకారానికి గాను ఒక సంస్థాగత చట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బ్రిక్స్ సభ్యత్వ దేశాలు ప్రయోజనాన్ని పొందాలనేది ధ్యేయంగా ఉంది. ఈ దిగువన పేర్కొన్న రంగాలను సహకారానికి గాను గుర్తించడమైంది:
* ప్రాంతీయ సర్వీసులలో ఉత్తమమైన విధానాలు మరియు పబ్లిక్ పాలిసీలు;
* ప్రాంతీయ విమానాశ్రయాలు;
* విమానాశ్రయ సంబంధిత మౌలిక సదుపాయాల నిర్వహణ మరియు గగనతల మార్గనిర్దేశక సేవలు;
* నియంత్రణ సంస్థల మధ్య సాంకేతిక పరమైన సహకారం;
* నూతన ఆవిష్కరణలు;
* ప్రపంచ స్థాయి కార్యకలాపాల తాలూకు సంప్రదింపులు సహా పర్యావరణ పరంగా స్థిరత్వ సాధన;
* క్వాలిఫికేశన్ అండ్ ట్రయినింగ్;
* పరస్పరం నిర్ణయించిన మేరకు ఇతర రంగాలు
ప్రభావం:
భారతదేశానికి మరియు ఇతర బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు మధ్య పౌర విమానయాన సంబంధాల లో ఈ ఎమ్ఒయు ఒక ముఖ్యమైన మైలు రాయి గా పేరు తెచ్చుకోగలుగుతుంది. అలాగే బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడి, పర్యాటకం మరియు సాంస్కృతిక బృందాల రాకపోకలను పెంపొందించే సత్తా ఈ ఎమ్ఒయు కు ఉంటుంది.