Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వలసదారులకు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన/స్వదేశానికి పంపబడిన వారికి పూర్తి స్థాయిలో సహాయం చేయడానికి మరియు వారి యొక్క పునరావాస కల్పనకు ఉద్దేశించిన పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


“వలసదారులకు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన/స్వదేశానికి పంపబడిన వారికి సహాయం చేయడానికి మరియు వారి యొక్క పునరావాస కల్పన’’కు ఉద్దేశించి హోం మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న 8 పథకాలను 2020 వ సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఆర్థిక ప్రభావం:

ఈ పథకాల అమలు విస్తరణకు 2017-18 నుండి 2019-2020 మధ్య కాలంలో 3183 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇందులో 2017-18 కు గాను 911 కోట్ల రూపాయలు, 2018-19 కు గాను రూ.1372 కోట్ల రూపాయలు, 2019-2020 కు గాను 900 కోట్ల రూపాయలు కేటాయిస్తారు.

ప్రయోజనాలు:

శరణార్ధులు, కాందిశీకులు, ఉగ్రవాద కార్యకలాపాలు/మత కల్లోలాలు/వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల కారణంగాను, ఇంకా సరిహద్దు ప్రాంతాలలో జరిగే ఎదురు కాల్పులు మరియు భారత భూభాగంలో మందుపాతర పేలుళ్ళు/ఐఇడి విస్ఫోటాలలోను బాధితులైన పౌరులతో పాటు వివిధ ఘటనలలో పోట్లాటల బాధితులకు ఈ పథకాల ద్వారా సహాయాన్ని, పునరావాస సంబంధిత సహకారాన్ని కల్పించడం జరుగుతుంది.

వివరాలు :

మంత్రివర్గం ఆమోదించిన ఈ 8 పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. ప్రతి పథకం లో భాగంగా లక్షిత లబ్ధిదారులకు నిర్దేశిత ప్రమాణాల మేరకు ప్రయోజనాలను కల్పించడం జరుగుతుంది.

ఈ పథకాలు దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి :

పాక్ ఆక్రమిత జమ్ము & కశ్మీర్ (పిఒజెకె) నుండి నిర్వాసితులైన వారు మరియు చాంబ్ కు చెంది వుండి జమ్ము & కశ్మీర్ లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్న కుటుంబాలకు ఒక సారి మాత్రమే అందించే కేంద్ర సహాయం.

భూ సరిహద్దు ఒప్పందం ప్రకారం భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య భూభాగాల బదిలీ అనంతరం బంగ్లాదేశ్ భూభాగాలకు మరియు కూచ్ బిహార్ జిల్లా కు పునరావాస ప్యాకేజి ని అమలు చేయడం మరియు మౌలిక సదుపాయాలను నవీనీకరించడం.

తమిళ నాడు, ఒడిశా లలోని శిబిరాలలో బస చేస్తున్న శ్రీ లంక శరణార్ధులను ఆదుకునేందుకుగాను వారికి సాయం అందించడం.

టిబెట్ కు చెందిన సెటిల్ మెంట్ ల తాలూకు పాలనపరమైన మరియు సాంఘిక సంక్షేమ వ్యయాలకుగాను సెంట్రల్ టిబెటన్ రిలీఫ్ కమిటీ (సిటిఆర్ సి)కి గ్రాంట్- ఇన్- ఎయిడ్ ను అందించడం.

త్రిపుర లోని సహాయక శిబిరాలలో ఉంటున్న బ్రూస్ నిర్వహణకై త్రిపుర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం.

త్రిపుర లోని బ్రూస్/రియాంగ్ పరివారాలకు మిజోరమ్ లో పునరావాస కల్పన.

1984 సంవత్సరంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల లో మరణించిన వారికి ఉద్దేశించినటువంటి ఉపశమన రాశి ని పెంచి, మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వంతున వారి యొక్క సంబంధికులకు ఇవ్వడం.

ఉగ్రవాద కార్యకలాపాలు/మత కల్లోలాలు/వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల కారణంగాను, ఇంకా సరిహద్దు ప్రాంతాలలో జరిగే ఎదురు కాల్పులు మరియు భారత భూభాగంలో మందుపాతర పేలుళ్ళు/ఐఇడి విస్ఫోటాలలోను బాధితులైన పౌరుల/పౌరుల కుటుంబాలకు ఉద్దేశించినటువంటి కేంద్ర సహాయక పథకం

***