ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ)కి, సౌదీ ఆర్గనైజేశన్ ఫర్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ (ఎస్ఒసిపిఎ) కి మధ్య 2014 లో సంతకాలైన అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఓయూ) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. మరి అలాగే కార్పొరేట్ పరిపాలన, సాంకేతిక పరిశోధన & సలహాలు, నాణ్యత సంబంధ హామీ, ఫోరెన్సిక్ అకౌంటింగ్ రంగాలు, స్మాల్ మరియు మీడియమ్ సైజ్డ్ ప్రాక్టీసెస్ (ఎస్ఎమ్‌పి స్) యొక్క అంశాలు, ఇస్లామిక్ ఫైనాన్స్, కంటిన్యూయింగ్ ప్రొఫెశనల్ డివెలపింగ్ (సిపిడి) రంగాలతో పాటు అకౌంటెన్సీ వృత్తి కి సంబంధించినటువంటి పరస్పర ప్రయోజనాలు ముడిపడ్డ ఇతర విషయాలలో ఐసిఎఐ, ఎస్ఒసిపిఎ ల మధ్య సహకారపూర్వక ఫ్రేమ్ వర్క్ ను పెంపొందించడం కోసం ఈ ఎంఓయూ ను ఉద్దేశించారు.
ప్రధాన ప్రభావం:
ఐసిఎఐ సభ్యులు, విద్యార్థులు మరియు వారికి చెందిన సంస్థల హితం కోసం ఒక పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని తీర్చిదిద్దడం కోసం కృషి చేయడం దీని ధ్యేయం.
ఐసిఎఐ సభ్యులకు వారి వృత్తిపరమైన అవకాశాలను విస్తరించుకొనేందుకు ఒక అవకాశాన్ని ఈ ఎమ్ఒయు కల్పిస్తుంది. అదే సమయంలో స్థానిక పౌరులకు సహాయాన్ని అందించే సంస్థ గా ఐసిఎఐ రూపొందుతుంది.
అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ వృత్తి ని ఐసిఎఐ ప్రోత్సహించేందుకు ఈ ఎంఓయూ అవకాశాన్ని ప్రసాదిస్తుంది.
లబ్దిదారులు:
జెద్దా, రియాధ్ మరియు సౌదీ అరేబియా లతో కూడిన ఈస్టర్న్ ప్రావిన్స్ లో ఐసిఎఐ కి 3 చాప్టర్లు ఉన్నాయి. వేరు వేరు వృత్తి స్థాయిలలో నిమగ్నమైవున్న 200కు పైగా సభ్యులు ఈ సంస్థకు ఉన్నారు. ఐసిఎఐ ఇంకా ఎస్ఒసిపిఎ ల మధ్య బలమైన కృషి సంబంధాలను ఈ ఎంఓయూ ఏర్పరుస్తుంది. తద్వారా భారతదేశం లోని భారతీయ చార్డర్డ్ అకౌంటెంట్ల కు వృత్తి రీత్యా గట్టి అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా, ఈస్టర్న్ ప్రావిన్స్ లోని యాజమాన్య సంస్థలకు మరింత విశ్వాసాన్ని చేకూరుస్తుంది. ఫలితంగా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆస్కారం ఉంటుంది.
పూర్వరంగం:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) అనేది భారత పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన చార్డర్డ్ అకౌంటెన్స్ యాక్ట్, 1949 కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ. ఇది భారతదేశం లో చార్డర్డ్ అకౌంటెన్సీ వృత్తిని క్రమబద్ధం చేసేందుకు నెలకొల్పబడింది. సౌదీ అరేబియా లో అకౌంటెన్సీ, ఆడిటింగ్ వృత్తి ని ప్రోత్సహించే బాధ్యత ను సౌదీ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ రెగ్యులేశన్స్ పేరిట రాయల్ డిక్రీ ని జారీ చేయడం ద్వారా ‘‘సౌదీ ఆర్గనైజేశన్ ఫర్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్’’ (ఎస్ఒసిపిఎ) కు అప్పగించడం జరిగింది.
***