సార్క్ దేశాల కోసం కరెన్సీ పరస్పర బదలాయింపు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాల వ్యవస్థను (మార్పులు చేర్పులు చేసి) మరో రెండు సంవత్సరాలపాటు (నవంబర్ 14, 2017వరకు) కొనసాగించాలంటూ ప్రతిపాదన. అవసరమైతే ఆ తర్వాత కూడా కొనసాగిస్తారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం సార్క్ దేశాల మధ్యన కరెన్సీ పరస్పర బదలాయింపు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాల వ్యవస్థను -మార్పులు చేర్పులతో కలిపి- మరో రెండు సంవత్సరాలపాటు కొనసాగించనున్నారు. ఈ నిర్ణయం 2017 నవంబర్ 14 వరకు అమలులోకి వస్తుంది. ఆ తర్వాత కొనసాగించాల్సిన అవసరం ఏర్పడితే కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకారంతో కొనసాగించవచ్చు.
సార్క్(సౌత్ ఏషియన్ అసోషియేషన్ ఫర్ రీజనల్ కో ఆపరేషన్- ఎస్ ఏ ఏ ఆర్ సి)లో సభ్యత్వం కలిగిన దేశాలకు( అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు) ఈ సౌకర్యం ప్రకారం వివిధ పరిమాణాలు కలిగిన డబ్బును పరస్పర బదలాయింపు చేసుకునేలా భారతీయ రిజర్వుబ్యాంక్ వెసులుబాటును కలిగిస్తోంది. ఆ దేశాల రెండు నెలల దిగుమతి అవసరాల ప్రకారం రెండు బిలియన్ అమెరికా డాలర్ల లోపు మొత్తం ఉండేలా.. ఈ పరస్పర బదలాయింపు అమెరికా డాలర్లలో గానీ, యూరోలలో గానీ, భారతీయ రూపాయల్లో గానీ ఉంటుంది.
2013 అక్టోబర్ 9న అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో 27వ సార్క్ ఆర్థిక విభాగ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న సార్క్ దేశాల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు కరెన్సీ పరస్పర బదలాయింపు విధివిధానాల వ్యవస్థకు మార్పులు చేర్పులు చేశారు. అప్పటిదాకా చేసిన కరెన్సీ పరస్పర బదలాయింపుద్వారా పొందిన అనుభవంతో ఈ మార్పులు చేర్పులు చేశారు. విధివిధానాల వ్యవస్థలోని క్లాజుల్లో స్పష్టత తేవడానికి వీటిని చేశారు.
కేంద్ర కేబినెట్ ఆమోదం అయిపోయింది కాబట్టి ఇక ముందు భారతీయ రిజర్వ్ బ్యాంకు దీనికి సంబంధించిన కార్యాచరణ వివరాలు ఎలా ఉండాలో ఆయా సార్క్ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులతో ద్వైపాక్షిక సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణయిస్తుంది. ఈ ద్వైపాక్షిక ఒప్పందాలపైన ప్రభుత్వం ఆమోదం రాగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంతకం చేస్తుంది. విధివిధానాల వ్యవస్థకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా కేంద్ర ఆర్థిక మంత్రి ముందస్తు ఆమోదం తప్పనిసరి.
సార్క్ దేశాల కోసం చేసుకున్న కరెన్సీ పరస్పర బదలాయింపు ఏర్పాటు విధివిధానాల వ్యవస్థవల్ల సార్క్ దేశాలతో భారతదేశ సంబంధ బాంధవ్యాలు మరింత దృఢపడతాయి. ఈ ఏర్పాటు దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. అంతే కాదు సార్క్ దేశాల్లో భారతదేశానికి గౌరవం, విశ్వసనీయత పెరుగుతాయి. సార్క్ దేశాలకొరకు కరెన్సీ పరస్పర బదలాయింపు సౌకర్యాన్ని కొనసాగించడంవల్ల దక్షిణాసియా ప్రాంతంలో ఐకమత్యం బలపడుతుంది. అంతే కాదు పరస్పర సహకారం మెరుగవుతుంది. ఈ ప్రాంతంలో భారతదేశ ఆర్థిక ప్రభావం కూడా అధికమవుతుంది.
విధివిధానాల వ్యవస్థ ఏర్పాటును కొసాగించినంతమాత్రాన ఆర్థికపరమైన ప్రతిస్పందనలు రావు. కరెన్సీ పరస్పర బదలాయింపు ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ద్వైపాక్షిక సంతకాలు అయిపోయిన తర్వాత ఇరువురిలో ఏ ఒక్కరు గానీ, ఇరువురుగానీ డబ్బు డ్రా చేసుకుంటే రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉన్న విదేశీ ద్రవ్యం నిలువలు రెండు బిలియన్ అమెరికా డాలర్ల వరకు తగ్గిపోతాయి. అమెరికా డాలర్లలోగానీ, యూరోలలోగానీ, భారతీయ రూపాయలలోగానీ డబ్బును డ్రా చేసుకునేవారు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
నేపథ్యం:
సార్క్ దేశాల కరెన్సీ పరస్పర బదలాయింపు ఒప్పంద విధివిధానాల వ్యవస్థకు 2012 మార్చి నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తక్కువ వ్యవధిగల విదేశీ మారక ద్రవ్య అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో ఈ విధివిధానాల వ్యవస్థను రూపొందించుకోవడం జరిగింది. ఇరువురి మధ్య మిగిలిపోయిన చెల్లింపుల్లో వచ్చే సంక్షోభాలను దీర్ఘకాలిక ఏర్పాట్లు చేసుకునేలోపు పరిష్కరించడానికి లేదా తక్కువ వ్యవధిలోపే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ విధివిధానాల వ్యవస్థను రూపొందించుకోవడం జరిగింది.