Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“వ్యవసాయం 2022 : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

“వ్యవసాయం 2022 :  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

“వ్యవసాయం 2022 :  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

“వ్యవసాయం 2022 :  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం


దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చిన శాస్త్రవేత్తలు, రైతు మిత్రులు మరియు ఇక్కడ హాజరైన ప్రముఖులారా,

చాలా ముఖ్యమైన, తీవ్రమైన, ఒక సమయోచితమైన అంశాన్ని గురించి చర్చించడం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం.

మీరు సమర్పించిన అభిప్రాయాలను నేను చూశాను, మీ అభిప్రాయాలను విన్నాను. ఎంతో శ్రమతో కూడిన మీ కృషిని నేను అభినందిస్తున్నాను. మన నాగరకతను రూపుదిద్దడానికి, పటిష్టపరచడానికి వేల సంవత్సరాలుగా వ్యవసాయం ఒక ప్రధాన అంశంగా ఉన్న విషయం వాస్తవం. మన ప్రాచీన గ్రంధాల్లో పేర్కొన్న విధంగా –

‘‘కృషి ధన్య, కృషి మిధ్య

జంతోనావ్ జీవనం కృషి’’

వ్యవసాయం ఆస్తిని, మేధస్సును కల్పిస్తుంది; అదే మానవాళి జీవనానికి ఆధారం అని దీని భావం.

అంటే ఇది ఒక అతి ప్రాచీనమైన భావన. ఈ విషయంలో భారతీయ సంస్కృతి, భారతీయ పద్ధతులు మొత్తం ప్రపంచానికి దిశా నిర్దేశం చేశాయి. వ్యవసాయంలో అసంఖ్యాకంగా ఉపయోగించిన పద్ధతుల ద్వారా భారతదేశం ప్రపంచాన్ని చైతన్యపరచింది. ఈ అంశాన్ని ప్రస్తావించేటప్పుడు మనం గత చరిత్రను, ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి.

భారతీయ వ్యవసాయ పద్దతులను చూసి విదేశాల నుండి వచ్చిన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు చరిత్రలో ఈ రకమైన వివరణను గమనిస్తారు. ప్రపంచానికి నేర్పిన ఇటువంటి అధునాతన పద్ధతులను, సాంకేతికతలను మనం మన వ్యవసాయంలో పాటించాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని గురించి ఘాగ్ మరియు భద్దరి వంటి గొప్ప రైతు కవులు వారి పద్యాల ద్వారా రైతులను మార్గనిర్దేశం చేసే వారు. అయితే, దీర్ఘకాల వలస పాలనలో, ఈ అనుభవాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన రైతులు తమ కఠోర శ్రమ ద్వారా వ్యవసాయంపై తిరిగి నియంత్రణను సాధించారు. స్వాతంత్య్రం అనంతరం ధాన్యం గింజల కోసం ఆతృత పడిన రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి కలిగి ఉండేటట్టు చేశారు. గత ఏడాది కఠోర శ్రమ ద్వారా మన రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తిని, కాయగూరల ఉత్పత్తిని గతంలో ఎన్నడూ లేనంతగా పెంచారు. రైతుల అపారమైన సామర్ధ్యం మరియు శక్తి పప్పుధాన్యాల ఉత్పత్తి ని కేవలం ఒక సంవత్సరంలో దాదాపు 17 మిలియన్ టన్నుల నుండి 23 మిలియన్ టన్నులకు పెంచాయి. వ్యవసాయ రంగం విస్తరించినప్పటికీ, రైతుల అభివృద్ధి కుచించుకుపోతోంది. ఇతర రంగాలతో పోలిస్తే వ్యవసాయంపై రాబడి క్రమంగా తగ్గుతోంది. తదుపరి తరాలు క్రమంగా వ్యవసాయాన్ని విడచిపెట్టి, నగరాలలో ఉపాధి అవకాశాల కోసం అన్వేషించాయి. సంబంధం లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ప్రారంభించాయి. మనకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతులు తమ ఆదాయ భద్రత కోసం పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ మీకు తెలిసినవే. వాస్తవానికి ఈ విషయంలో నా కన్నా మీకే మంచి అవగాహన ఉంది.

అయినప్పటికీ, గతంలోని పరిస్థితుల గురించి నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే, గతంలోని పరిస్థితులను విశ్లేషించడం ఒక్కోసారి నూతన మార్గాలకు దారితీస్తుంది. వాటిని పరిష్కరించడంలో నూతన విధానాలను పొందే అవకాశముంది. గతంలో అనుసరించిన విధానాల్లోని లోపాలు వైఫల్యాలకు దారితీసిన విషయాన్ని మనం గుర్తించాం. అందువల్ల వాటిని మెరుగుపరచవలసిన అవసరముంది. ఈ విశ్లేషణే దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి ఆధారం కావాలి. పాత విధానాలవల్ల ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. అందుకోసం వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది.

ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో, ఈ లక్ష్యం ఒక పూర్తి స్థాయి వ్యవసాయ ఉద్యమంగా విస్తరించింది.

మిత్రులారా,

ఒక ఎద్దును పొలంలో ఒక పొడవైన తాడుతో కట్టినట్లైతే, అది గిర గిరా తిరగడం మొదలెడుతుంది. అది ఎంతో ముందుకు పోతున్నట్లు భావిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే, దాన్ని కట్టి ఉంచడం వల్ల పరిమితికి లోబడి పరిగెడుతూ ఉంటుంది. అటువంటి నిర్బంధంలో ఉన్న వ్యవసాయ రంగానికి స్వేచ్ఛ కల్పించవలసిన గొప్ప బాధ్యత ఇప్పుడు మనమీదే ఉంది.

రైతుల అభివృద్ధి మరియు వారి ఆదాయం పెరుగుదల కోసం విత్తనాల సమస్య నుండి విపణి వరకు ఉన్న సమస్యలపై చర్చలు చేపట్టడం జరిగింది. స్వయం సమృద్ధి యుగంలో, రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి కృషి జరుగుతోంది. పరిష్కారాలను సూచించడానికి వీలుగా నీతి ఆయోగ్ తో పాటు మీ వంటి పలువురు శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ రంగానికి చెందిన భాగస్వాములతో ఒక అంతర్ మంత్రిత్వ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం ఒక దిశా నిర్దేశం చేసి, ఆ మార్గంలో పయనిస్తోంది.

రైతుల ఉత్పత్తులకు సరైన ధర చెల్లించాలని, ప్రభుత్వం ఇటీవలి బడ్జెటు లో ఒక ముఖ్య నిర్ణయాన్ని ప్రకటించింది. ఆయా పథకం గురించి పాశా పటేల్ ఎంతో ఉత్సాహంగా వివరించారు. ఈ పథకం కింద, రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా, అంటే వారి పంటల విలువకు ఒకటిన్నర రెట్లు అధికంగా చెల్లించే విధంగా హామీ ని ఇవ్వడం జరిగింది. ఈ పథకం యొక్క పూర్తి ప్రయోజనాన్ని రైతులు పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

గత పథకాల్లోని పరిమితులను తొలగించి, దానిని దోష రహితంగా మార్చవలసిన అవసరం ఉంది.

సోదరులు మరియు సోదరీమణులారా !

రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం నాలుగు వివిధ దశలపై దృష్టి పెట్టింది.

ఒకటోది.. వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి చర్యలు; రెండోది, వారి పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి చర్యలు; మూడోది, పొలం నుండి విపణికి రవాణా చేసేటప్పుడు పంట నష్టాన్ని తగ్గించడానికి చర్యలు; ఇక నాలుగోది రైతులకు అదనపు ఆదాయం కల్పించడానికి చర్యలు. ప్రభుత్వం తీసుకొనే విధాన నిర్ణయాలు, సాంకేతిక నిర్ణయాలు, చట్టపరమైన నిర్ణయాలు ఈ 4 దశలపైన ఆధారపడి తీసుకోవడం జరుగుతుంది. మా నిర్ణయాలలో ఎక్కువ శాతం నిర్ణయాలను సాంకేతికంగా అనుసంధానం చేయడానికి ప్రయత్నించాం. అందువల్ల ఈ రోజు మనం సానుకూల ఫలితాలు పొందుతున్నాం.

యూరియా కు వేప పూత నిర్ణయం వల్ల రైతుల పంట వ్యయం గణనీయంగా తగ్గింది. యూరియా కు 100 శాతం వేప పూత వేయడం సమర్ధవంతంగా పెరిగింది. ఈ రోజు, రైతులు తమ పొలాల్లో గతంలో కంటే తక్కువ యూరియాను వాడుతున్నారు. యూరియా తక్కువగా ఉపయోగించడం వల్ల వారి పంట వ్యయం తగ్గింది, ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా వారి ఆదాయం పెరిగింది. యూరియా కు వేప పూత వేయడం వల్ల ఈ మార్పు సాధ్యమైంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ రోజు వరకు 11 కోట్ల మందికి పైగా రైతులకు భూమి స్వస్థత కార్డులను జారీ చేయడం జరిగింది. భూమి స్వస్థత కార్డుల వల్ల ఉత్పాదకత పెరిగింది. తమ భూమికి అవసరమైన ఎరువుల గురించి రైతులకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. 19 రాష్ట్రాలలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, వ్యవసాయంలో భూమి స్వస్థత కార్డుల వినియోగం వల్ల రసాయన ఎరువుల వాడకం సుమారు 8 నుండి 10 శాతం మేర తగ్గింది. ఉత్పాదకత 5 నుండి 6 శాతం మేర పెరిగింది. అయినప్పటికీ, మిత్రులారా, రైతులందరూ భూమి స్వస్థత కార్డుల పథకాన్ని వినియోగించుకొన్నప్పుడే ఈ పథకం పూర్తి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. మొత్తం పర్యావరణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు ఇది సాధ్యపడుతుంది. భూమి ఆరోగ్య పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులకు అందించే వస్తువుల సమాచారం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న బి.ఎస్. సి (వ్యవసాయం) పాఠ్య ప్రణాళికలో చేర్చవలసిందిగా నేను సూచిస్తున్నాను. ఈ అంశాన్ని నైపుణ్యాభివృద్ధి ప్రణాళికతో కూడా అనుసంధానం చేయాలి.

ఈ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఒక ప్రత్యేక ధ్రువపత్రాన్ని అందజేయాలని మేము యోచిస్తున్నాం. ఈ ధ్రువపత్రం సహాయంతో విద్యార్థులు గ్రామాలలో స్వంతంగా భూమి పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకోవచ్చు. ముద్రా పథకం లో భాగంగా వారు రుణాలు పొందే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఈ ప్రయోగశాలు అన్నింటినీ సమీకృత సమాచార కేంద్రానికి అనుసంధానం చేస్తే, భూమి ఆరోగ్యానికి సంబంధించిన గణాంకాలు సెంట్రల్ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. అప్పుడు శాస్త్రవేత్తలు, రైతులు ప్రయోజనం పొందుతారు. భూమి స్వస్థత కార్డు సమీకృత సమాచార కేంద్రంలో ఉండే సమాచారాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు భూమి స్వస్థతను గురించి, సాగు నీటి లభ్యతను గురించి, వాతావరణాన్ని గురించి రైతులకు తెలియజేయడానికి వీలుగా ఒక విధానాన్ని రూపొందించాలి.

మిత్రులారా,

దేశ వ్యవసాయ విధానానికి కొత్తగా దిశా నిర్దేశం చేయాలని మా ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ పథకం అమలు విధానాన్ని మార్చడం జరిగింది. ఉదాహరణకు, ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన.. ఈ పథకంలో భాగంగా రెండు వేరు వేరు విషయాలపైన దృష్టి పెట్టడం జరిగింది. వాటిలో ఒకటోది దేశంలో సూక్ష్మ నీటి పారుదల పరిధిని పెంపొందించడం మరియు రెండోది ప్రస్తుతం ఉన్న సాగునీటి పారుదల వ్యవస్థను పటిష్ట పరచడం.

అందువల్ల ముందుగా గత 2- 3 దశాబ్దాలుగా నిలచిపోయిన 99 సేద్యపునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 80 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన నిరంతర కృషి ఫలితంగా సుమారు 50ప్రాజెక్టులు ఈ ఏడాది చివరికి పూర్తి కానున్నాయి. మిగిలినవి వచ్చే ఏడాదికల్లా పూర్తి అవుతాయి. అంటే, గత 25- 30 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులను 25- 30 మాసాలలో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. పూర్తి అవుతున్న సేద్యపు నీటి పారుదల ప్రోజెక్టుల వల్ల సాగు వ్యయం తగ్గుతుంది, రైతులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన కు చెందిన సూక్ష్మ సాగునీటి పారుదల పథకం లో భాగంగా ఇంతవరకు 20 లక్షలకు పైగా హెక్టార్లు సాగు లోకి వచ్చాయి.

వ్యవసాయ రంగంలో బీమా పరిస్థితి ఏమిటన్నది మీ అందరికీ బాగా తెలిసిందే. రైతులు వారి పంటల బీమా కోసం ఎక్కువ మొత్తంలో ప్రీమియమ్ చెల్లించవలసి వస్తోంది. బీమా పరిధి కూడా చాలా పరిమితంగా ఉంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లో భాగంగా ప్రభుత్వం ప్రీమియమ్ ను తగ్గించడంతో పాటు బీమా పథకం పరిధిని కూడా విస్తరించింది.

మిత్రులారా,

ఈ పథకంలో భాగంగా దాదాపు 11 వేల కోట్ల రూపాయలు నష్టపరిహారంగా రైతులకు అందజేసినట్లు నాకు చెప్పారు. ఒక్కొక్క రైతుకు లేదా ఒక్కొక్క హెక్టారుకు చొప్పున లెక్కకట్టి రెట్టింపు నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగింది. ఈ పథకం ఎంతోమంది రైతుల జీవితాలను కాపాడింది. ఇది ఎన్నో కుటుంబాలను కాపాడుతోంది. దురదృష్టవశాత్తు ఈ విజయం ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కలేదు. దీనిని నిర్లక్ష్యం చేశారు. అందువల్ల ఈ పథకాన్ని గురించి రైతులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది.

2018-19 సంవత్సరానికల్లా విత్తిన పంటలలో కనీసం 50 శాతం పంటలను ఈ పథకం కిందకు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశ వ్యవసాయ రంగంలో మార్కెట్ నిర్మాణాన్ని మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. సహకార సమఖ్య స్ఫూర్తిని కాపాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయాలతో ముందుకు వస్తే రైతులు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

అందువల్ల రైతుల సంక్షేమం కోసం అధునాతన చట్టాలను అమలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. రైతులను పటిష్టపరచేందుకు వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగు, గిడ్డంగుల మార్గదర్శకాలలో సరళీకరణతో కూడిన భూమి కౌలు చట్టం మరియు ఇటువంటి అనేక నిర్ణయాలతో ప్రభుత్వం ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తోంది.

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెంట్టింపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. రవాణాలో పంట నష్టం జరగకుండా అరికట్టడానికి ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన లో భాగంగా కృషి జరుగుతోంది. వ్యవసాయ రంగం పటిష్ఠతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. పొడిగా ఉండే వస్తువులు నిల్వ చేసుకోడానికి వీలుగా గోదాములు, శీతల గిడ్డంగులు, ఇతర గిడ్డంగుల సహాయంతో మొత్తం సరఫరా వ్యవస్థను సంస్కరించవలసి ఉంది.

బడ్జెటు లో ప్రకటించిన ‘‘ఆపరేషన్ గ్రీన్’’ కూడా సరఫరా వ్యవస్థ మౌలిక సదుపాయాలతో ముడిపడి ఉంది. పువ్వులు, కాయగూరలు పండించే రైతులకు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పాల ఉత్పత్తి పెరగడానికి, లక్షలాది రైతుల ఆదాయాం పెరగడానికి అమూల్ విధానం ఏ విధంగా విజయవంతమైందో అదే విధంగా ‘‘ఆపరేషన్ గ్రీన్’’ కూడా ‘టిఓపి’ (టొమాటో, ఉల్లిపాయలు, బంగాళదుంపలు) పండించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మిత్రులారా,

రూల్ ను రిటర్న్ మార్కెట్ తో మరియు గ్రామ స్థాయిలో ఎపిఎమ్ సిని ప్రపంచ మార్కెట్ తో జోడించవలసిన అవసరం ఉంది.

బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఒక కమిశన్ ను ఏర్పాటు చేసినట్లు నాకు చెప్పారు. రైతుల కోసం ప్రతి 5-6 కిలోమీటర్లకు ఒక మార్కెట్ ఉండాలని కమిశన్ కూడా సిఫారసు చేసింది. వంద సంవత్సరాల క్రితం ప్రతిపాదించిన ఈ ఆలోచన ను ఇప్పుడు అమలుచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీని ఫలితంగానే, గ్రామీణ వ్యవసాయ రిటైల్ మార్కెట్ అనే సంకల్పాన్ని బడ్జెటు లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 22 వేల గ్రామీణ మార్కెట్ లను అభివృద్ధి చేసి, అప్ గ్రేడ్ చేసి వాటిని చివరికి ఎపిఎమ్ సి లోకి విలీనం చేయడం జరుగుతుంది. అంటే దేశం లోని ఏ మార్కెటుతో అయినా అనుసంధానం కావడానికి సహాయపడే ఒక వ్యవస్థ రైతులకు 5, 10 లేదా 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ గ్రామీణ మార్కెట్ ల ద్వారా రైతులు వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించగలుగుతారు. రానున్న రోజులలో ఈ కేంద్రాలు రైతుల ఆదాయం, ఉపాధి కల్పన, వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా తయారవుతాయి. ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్ పిఒ) ను ప్రోత్సహిస్తోంది. తమ స్థాయిలో చిన్న సంఘాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులు వారి ప్రాంతంలోని గ్రామీణ మార్కెట్ లకు, పెద్ద మార్కెట్ లకు కూడా అనుసంధానం కావచ్చు. అటువంటి సంస్ధలలో సభ్యులు కావడం ద్వారా వారు టోకుగా క్రయ, విక్రయాలు చేయవచ్చు; తద్వారా వారి ఆదాయాలను పెంపొందించుకోవచ్చు.

సహకార సంఘాలకు ఇచ్చినట్లే వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఇచ్చినట్లు బడ్జెటు లో ప్రకటించడం జరిగింది. రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో భాగంగా ఎఫ్ పిఒ సహాయంతో మహిళా స్వయంసహాయ బృందాలను సుగంధాలు, మూలికలు మరియు సేంద్రియ వ్యవసాయంతో అనుసంధానం చేయడం ఒక ముఖ్యమైన చర్య.

మిత్రులారా,

ప్రస్తుతం హరిత విప్లవం, క్షీర విప్లవం లతో పాటు జల విప్లవం, నీలి విప్లవం, మధుర విప్లవం, సేంద్రియ విప్లవాలను సమన్వయపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ రైతులు అదనపు ఆదాయం పొందడానికి అనువైన వనరులు. సేంద్రియ వ్యవసాయం, పట్టు పురుగుల పెంపకం, సముద్ర నాచు సాగు, సౌర శక్తి ఆధారిత వ్యవసాయం మొదలైన ఎన్నో ఆధునిక ప్రత్యామ్నాయాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని గురించి సాధ్యమైనంత ఎక్కువగా రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది.

వీటన్నింటి గురించి, ముఖ్యంగా సంప్రదాయ మరియు సేంద్రియ వ్యవసాయం గురించి మీకు వివరించడానికి నాకు ఒక డిజిటల్ వేదిక అవసరం. మార్కెట్ డిమాండు, పెద్ద వినియోగదారులు, సరఫరా వ్యవస్థ, సేంద్రియ వ్యవసాయం మొదలైన వాటి గురించి రైతులకు ఈ డిజిటల్ వేదిక ద్వారా పూర్తి అవగాహనను కల్పించాలి.

ఇటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేసే రైతులకు సులభంగా రుణాలు అందజేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. చేపల పరిశ్రమ, పశువుల పెంపకం వంటి రంగాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుతం బడ్జెటు లో 10 వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కోసం ఒక నిధి ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ సంస్థల నుండి, బ్యాంకుల నుండి రుణాలు పొందడంలో రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలలో ఈ రుణాల మొత్తాన్ని 8 లక్షల కోట్ల నుండి 11 లక్షల కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది.

రైతులకు సులభంగా రుణాలు అందేలా చూడటంతో పాటు ఆ రుణాలు అవసరమైనంత మేరకు సకాలంలో పొందేలా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

చిన్న, సన్నకారు రైతులు సహకార సంఘాల నుండి రుణాలు పొందడానికి తరచుగా ఇబ్బందులు పడుతున్నట్లు గమనించడమైంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్నిప్రాధమిక వ్యవసాయ సంఘాలను కంప్యూటరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 63 వేల సంఘాలలో కంప్యూటరీకరణ పూర్తి అయితే రుణాల మంజూరు ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది.

జన్ ధన్ యోజన మరియు కిసాన్ క్రిడిట్ కార్డులు కూడా రైతులు రుణాలు పొందడానికి మార్గాన్ని మరింత సులభతరం చేశాయి. మిత్రులారా, దశాబ్దాల నాటి పాత చట్టాల ప్రకారం, వెదురును ఒక చెట్టుగానే పరిగణించారు. అందువల్ల అనుమతి లేకుండా దాన్ని కొట్టలేం. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. నిర్మాణ రంగంలో వెదురు విలువ అందరికీ తెలిసిందే. గృహోపకరణాలు, హస్త కళా ఖండాలు, అగరువత్తులు, గాలిపటాలతో పాటు అగ్గి పుల్లలను తయారుచేయడానికి కూడా వెదురును ఉపయోగిస్తారు. అయితే, వెదురు చెట్లను నరకడానికి అనుమతి పొందే ప్రక్రియ చాలా గజిబిజిగా ఉండటంతో రైతులు వారి పొలాల్లో అసలు వెదురు సాగును చేపట్టడమే లేదు. మేము ఇప్పుడు ఈ చట్టాన్ని మార్చాం. వెదురు సాగు చేసే రైతులు వారి ఆదాయం పెంచుకోడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

చెట్ల జాతులకు సంబంధించి మేము మరొక మార్పు చేశాం. మిత్రులారా, మన దేశంలో కలప ఉత్పత్తి మన అవసరాల కన్నా చాలా తక్కువగా ఉంది. గిరాకీ కి, సరఫరా కు మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. అందువల్ల చెట్ల రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బహుళ ప్రయోజనాలు ఉండే చెట్ల జాతుల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అటువంటి చెట్లను పెంచుకొని 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల తరువాత తన అవసరాలకు అనుగుణంగా వాటిని నరికే స్వాతంత్య్రం రైతుకు ఉంటే, ఆదాయపరంగా అతను ఎంత ప్రయోజనం పొందుతాడో ఒక్కసారి ఊహించండి.

పొలం గట్ల మీద చెట్లు పెంచడం వల్ల రైతుల అవసరాలు తీరడంతో పాటు దేశ పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ మార్పులను దేశంలోని 22 రాష్ట్రాలు అమలుచేయడం నాకు ఆనందంగా ఉంది. వ్యవసాయ రంగంలో సౌరశక్తిని అత్యధికంగా ఉపయోగిస్తే రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని గత మూడేళ్ళలో ప్రభుత్వం రైతుల కోసం సుమారు 3 లక్షల సోలర్ పంపులను ఆమోదించింది. ఇందుకోసం సుమారు 2.5 వేల కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించింది. దీనివల్ల డీజిల్ పై ఖర్చు గణనీయంగా ఆదా అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వం సోలర్ పంపులను గ్రిడ్ కు అనుసంధానం చేసే ప్రక్రియపై దృష్టి పెట్టింది. దీనివల్ల సోలార్ పంపు నుండి అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తు ద్వారా రైతుకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

వ్యవసాయ భూముల నుండి వచ్చే ఉప ఉత్పత్తులు కూడా మంచి ఆదాయ వనరులుగా ఉపయోగపడతాయి. గతంలో ఎవరూ దీనిపై తగినంత దృష్టి పెట్టలేదు. కానీ, మన ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవసాయ వ్యర్ధాలను సంపదగా మార్చే ప్రక్రియపై దృష్టి పెట్టింది. వ్యర్ధాల గురించి మనందరికీ బాగా తెలుసు. ఉదాహరణకు, అరటి చెట్టు నుండి వచ్చిన పండ్లను విక్రయిస్తాము. అలాగే దాని ఆకులను, కాండాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, వాటిని చెత్తగా పరిగణిస్తాం. ఈ కాండాలు రైతుకు తలనొప్పిగా మారతాయి. ఈ కాండాలను తొలగించడానికి వేలాది రూపాయలను తప్పనిసరిగా చెల్లించాల్సి వస్తుంది. ఆ తరువాత కూడా ఈ కాండాలను రోడ్ల పక్కన విసరివేస్తారు. అయితే, ఈ కాండాలను పారిశ్రామిక కాగితాలు తయారుచేయడానికి, వస్త్రాలు తయారుచేయడానికి ఉపయోగించవచ్చు.

వ్యవసాయ వ్యర్ధాలు, పీచు వ్యర్ధాలు, కొబ్బరి చిప్పలు, వెదురు వ్యర్ధాలు, పంట దిగుబడి తీసుకున్న తరువాత పొలంలో మిగిలిపోయిన వ్యర్థాలు వంటి వాటిని సద్వినియోగం చేసుకోవడంపై దేశంలోని అనేక ప్రాంతాలలో పలు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రైతులకు, వారి ఆదాయం పెంచుకోవడానికి సహాయపడతాయి.

బడ్జెటు లో గో-బర్ ధన్ యోజన ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం గ్రామీణ పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు గ్రామాలలో బయో- గ్యాస్ వినియోగం ద్వారా రైతులకు, పశు పోషణలో నిమగ్నమైన రైతులకు ఆదాయాన్ని చేకూర్చి పెడుతుంది. ఇది సంపదగా మారే ఒక ఉప ఉత్పత్తి గానే కాక, వైవిధ్యంగా ఉపయోగపడి, రైతుల ఆదాయాన్ని పెంపొందించే ఒక ప్రధాన పంటగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు, చెరకు గడల నుండి ఇథనాల్ ను తయారు చేయవచ్చు. మన ప్రభుత్వం ఇథనాల్ విధానంలో భారీ మార్పు చేసింది. 10 శాతం ఇథనాల్ ను పెట్రోలు లో కలపడానికి ఇప్పుడు అనుమతిని ఇచ్చింది. అంటే, చక్కెర తయారీకి వినియోగించగా మిగిలిన చెరకును ఇథనాల్ తయారీలో ఉపయోగించవచ్చు. దీనివల్ల చెరకు రైతుల పరిస్థితి మెరుగుపడింది.

దేశంలో వ్యవసాయ రంగం పని తీరును మన ప్రభుత్వం మారుస్తోంది. వ్యవసాయ రంగంలో ఒక కొత్త సంస్కృతి నెలకొంటోంది. ఈ సంస్కృతే మన బలం. మనకు సౌకర్యం. అదే మన కలలను సాకారం చేసే మాధ్యమం. ఈ సంస్కృతే 2022 కల్లా ‘ సంకల్పం ద్వారా సాధించాలి’ (సంకల్ప్ సే సిద్ధి) గమ్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. దేశం లోని గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. దేశం సాధికారితను సాధించినప్పుడే రైతులు కూడా వారంతట వారే సాధికారితను సాధిస్తారు.

అందువల్ల ఈ రోజు మీరు సమర్పించిన నివేదిక ద్వారా నేను విన్న ఆలోచనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. పాశా పటేల్ తనకు 8 నిముషాలు మాత్రమే సమయం ఇచ్చినట్లు పిర్యాదు చేస్తున్నారు. మీరు మీ అభిప్రాయాలను చాలా తక్కువ సమయంలో తెలియజేయవలసి వచ్చిన విషయం వాస్తవమైనప్పటికీ మొత్తం సమాచారాన్ని సేకరించి చిన్న చిన్న బృందాలల ఆ మొత్తం సమాచారాన్ని విశ్లేషించడానికి మీరు చేసిన కృషి వృథాగా పోదు. ప్రభుత్వ స్థాయిలో మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా తిరిగి పరిశీలించడం జరుగుతుంది. ఇందులో కొన్ని సలహాలను బహుశా వెంటనే అమలుచేయడం జరుగుతుంది. మిగిలిన వాటి అమలుకు కొంత సమయం పట్టవచ్చు; కానీ, వాటిని అమలుచేయడానికి గట్టి ప్రయత్నం, కృషి జరుగుతాయి. రైతుల ప్రాథమిక సమస్యల వంటివి అర్ధం చేసుకోడానికి ప్రభుత్వ రంగం ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఇది అవసరం. వారితో ఎంత ఎక్కువగా కలిసి మెలిసి తిరిగితే అంత ఎక్కువగా వారి సమస్యలను అర్ధం చేసుకోగలుగుతాం. అందువల్లనే అనుభజ్ఞులైన మీలాంటి వారితో ఈ విషయాలు చర్చిండానికి మేము ప్రయత్నించాం.

ఇక రెండో విషయానికి వస్తే దీనిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం ముందుగా భారత ప్రభుత్వానికి సంబంధించిన శాఖల అధికారులు, మంత్రులు ఇక్కడకు తరలివచ్చారు. నీతి ఆయోగ్ నాయకత్వం కింద అన్ని సిఫారసుల ఆధారంగా ఈ మంత్రిత్వ శాఖలను ఏ రకంగా సమన్వయ పరచగలం ? చర్చల అనంతరం కార్యాచరణ అంశాలను మనం ఏవిధంగా చేపట్టగలం, వాటిలో ప్రాధాన్యాలను ఏ విధంగా నిర్దేశించాలి ?. వనరుల కొరత వల్ల ఏ పని నిలిచిపోకూడదని నేను విశ్వసిస్తున్నాను.

ఇక రెండోది, మనం ఈ పాత సంప్రదాయాల వలయం నుండి బయటపడాలని నేను భావిస్తున్నాను. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఆమోదించాలి. అయితే శాస్త్ర విధ్వంసానికి దూరంగా ఉండాలి. మనకు కావాలనుకొనే సమయానికి అది కాలం చెల్లినది అవుతుంది. అప్పుడు దానిని మనం కొనసాగించలేం. మనం దాని నుండి బయటపడాలి. అంతకు మించి మనం అదనంగా చేయవలసిన కృషి ఏమీ లేదు. ఉదాహరణకు, మనం స్టార్ట్- అప్ సంస్థల గురించి మాట్లాడుకొంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విషయాలపై వారు పనిచేయగలరా ? అదేవిధంగా వ్యవసాయ విద్యార్థులకు హ్యాకథన్ ల వంటి కార్యక్రమాలను మనం ఏర్పాటు చేయగలమా ? కొన్ని రోజుల క్రితం నిర్వహించిన హ్యాకథన్ కార్యక్రమానికి, ఇంజీనియరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రభుత్వానికి చెందిన సుమారు 400 సమస్యలను తీసుకు వచ్చారు. సుమారు 50- 60 వేల మంది విద్యార్థులు దాదాపు 36 గంటల పాటు నిర్విరామంగా ఈ సమస్యలపై చర్చించి, సంప్రదించి తమ సూచనలను ప్రభుత్వానికి అందజేశారు. కొన్ని శాఖలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ యువజనులు సాంకేతికంగా సరైన పరిష్కారాలను సూచించారు.

మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా హ్యాకథన్ ను నిర్వహించాలని నేను భావిస్తున్నాను. ఐఐటి లు, ఐఐఐటి లు, ఇంజీనియరింగ్ కళాశాలలు రోబోటిక్ వారోత్సవాలను లేదా సాంకేతిక వారోత్సవాలను జరుపుకొంటాయి. ఇది చాలా మంచి పని. అదేవిధంగా ఈ సంస్థలు కూడా వ్యవసాయ సాంకేతిక వారోత్సవాల వంటివి, పండుగలు వంటివి నిర్వహించలేవా ? దేశం లోని సాంకేతిక మేధావులంతా భారతదేశానికి సంబంధించిన సమస్యలపై చర్చలు, సంప్రదింపులు జరపవచ్చు. దీనిలో స్పర్థ అంశాన్ని కూడా చేర్చవచ్చు.

దీనిని మనం మరింత ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. అదే విధంగా భూమి స్వస్థత కార్డు వంటి సమస్యలు అన్నింటినీ నా ప్రసంగంలో ప్రస్తావించాను. ఈ రోజు మనం రక్త పరీక్ష కోసం ఎక్కడకి వెళ్లినా అక్కడ పాథాలజీ ప్రయోగశాలలు ఒక పెద్ద వ్యాపారంగా దర్శనమిస్తున్నాయి. అక్కడ ప్రయివేటు పాథాలజీ ప్రయోగశాలలు చాలా ఉన్నాయి. అదే విధంగా ప్రతి గ్రామంలో భూమి పరీక్ష ప్రయోగశాలలను నిర్వహించలేమా ? ఇది సాధ్యమేనా ? ఇందుకోసం విశ్వవిద్యాలయాలు ధ్రువపత్రాలు అందజేయాలి, ముద్రా యోజన లో భాగంగా వారు రుణాలు పొందుతారు. వారికి సాంకేతిక పరికరాల పై అవగాహన ఉండాలి. తమ భూమిని పరీక్ష చేయించుకుని మార్గదర్శకత్వం పొందే విధంగా రైతులను ప్రత్సాహించాలి. భూ పరీక్షా ప్రయోగశాలలపై దృష్టి కేంద్రకరిస్తే మనం పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. అప్పుడు లక్షలాది యువజనులు ఉపాధిని పొందుతారు. వ్యవసాయ కార్యకలాపాలను, శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడానికి ఇది ఒక ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తుంది.

భూ పరీక్ష ఎంత అవసరమో, అదే ప్రయోగశాలలో సాగు నీటి పరీక్ష చేయవలసిన అవసరం కూడా అంతే ఉంది. అది ఎలాగంటే రైతు గతంలో విత్తనాలను గుడ్డ సంచి లో కొనుగోలు చేసినట్లయితే ఈ సారి కూడా అతను ప్లాస్టిక్ సంచి లో విత్తనాల బదులు దాన్నే ఇష్టపడినట్లు. కొనుగోలు చేసేటప్పుడు అతను కేవలం ఇటువంటి వాస్తవాలనే గుర్తిస్తాడు.

రైతు యొక్క మొబైల్ ఫోన్ లో డిజిటల్ ఏనిమేశన్ ను ఉపయోగించి అతడికి పరిస్థితులను వివరించాలి. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలో అతనికి తెలియజేయాలి. అప్పుడు వాటిని అతను అర్ధం చేసుకొని ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తాడు.

గుజరాత్ లోనూ, దేశవ్యాప్తంగానూ మొత్తం జనాభా కన్నా మొబైల్ ఫోన్ ల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ డిజిటల్ అనుసంధానం ఉంది. ఏనిమేశన్ ను ఉపయోగించడం ద్వారా మనం ఏ విధంగా ఈ విషయాలను రైతులకు దగ్గరకు తీసుకుని వెళ్ళగలం అని ఆలోచించాలి. ఈ సూచనలతో మనం ఒక గొప్ప మార్పును తీసుకు రాగలమని నాకు నమ్మకం ఉంది. నేను పశువుల పెంపకాన్ని గురించి మాట్లాడినట్లే మనకు చట్టాలు లేకుండా ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి.

ఈ విషయాలన్నింటినీ విడమరచి చెప్పే విధంగా సంబంధిత శాఖలన్నీ చట్టాలు రూపొందించాలని నేను కోరుతున్నాను. లోపాలను తొలగించి, ఒక ప్రామాణికమైన విధానాన్ని అభివృద్ధి చేయాలి. ఈ సూచనలన్నీ నిజంగా నాకు ఎంతో సమాచారాన్ని తెలియజేశాయి. నేను చాలా నేర్చుకోగలిగాను. ఈ అంశాల పట్ల నేను ఎల్లప్పుడూ ఎంతో ఆసక్తిగా ఉంటాను. అయితే, ఈ రోజు ఇక్కడ చాలా విషయాలు నాకు కొత్తగా ఉన్నాయి. మన శాఖలతో పాటు మీకు కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చర్చ తప్పకుండా ఫలవంతమయినట్లు నేను భావిస్తున్నాను.

మనం ప్రతి రాష్ట్రంలో ఇటువంటి నివేదికలతో కూడిన, పొలాల్లో పనిచేసే రైతులు లేదా పొలం పనుల్లో నిపుణులైన వ్యక్తులు హాజరయ్యే కార్యక్రమాలను నిర్వహించగలమా ? ఇటువంటి ప్రయత్నం అక్కడ కూడా చేయగలం. ఎందుకంటే, మన దేశం చాలా విశాలమైనది. ఒకసారి ఒక రాష్ట్రంలో పనిచేసిన ఒక ప్రయోగం మరొక రాష్ట్రంలో విఫలం కావచ్చు. ఒక చోట ఒక విధమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటే, మరొక రాష్ట్రంలో వేరే విధమైనవి ఉండవచ్చు.

రాష్ట్రాల వారీగా లేదా వ్యవసాయం వారీగా, లేదా వాతావరణ ప్రాంతాల వారీగా మనం దీన్ని ముందుకు తీసుకువెళ్లగలిగితే ఇది అత్యంత ప్రయోజనకరం అవుతుంది.

ఇక మూడోది, ఈ సమస్యలన్నింటి మీదా మన విశ్వవిద్యాలయ స్థాయిలో చివరి సంవత్సరం చదువుతున్న లేదా అంతకు ముందు సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించగలమా ? మేధోమధనం తరహాలో సమావేశాలను ఏర్పాటు చేసి, ఆ చర్చలు కింది స్థాయి వరకు చేరితే తప్ప మనం ఫలితాలను పొందలేం.

అందువల్ల, దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి విశ్వవిద్యాలయాలతో, విద్యార్థులతో, నిపుణులతో కలసి మనం ఒక మార్గసూచీని రూపొందించుకోవాలి. బహుశా, ఇవన్నీ అక్కడ ఉపయోగపడక పోవచ్చు. అయితే అవసరమైనచోట్ల వీటిని ఎలా ఉపయోగంలోకి తేవాలి ?

దీనికి మనం విస్తృతంగా విలువను జోడించలేం. గుజరాత్ లో 24 గంటల విద్యుత్తు సరఫరా కోసం జ్యోతి గ్రామ యోజన ను ప్రారంభించినప్పుడు దేశంలో దీనిని ఒక విప్లవాత్మకమైన చర్యగా పరిగణించారు. 24 గంటల విద్యుత్తు సరఫరా గ్రామాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది ? ఇది టెలివిజన్ ను చూడడానికా లేదా దానిని రాత్రి సమయంలో వినియోగించుకోడానికా ? అంతే, అదే వారికి తోచింది. తమ జీవితాల్లో మార్పు కోసం విద్యుత్తును ఎలా వినియోగించుకోవాలో వారికి అర్థమయ్యేటట్లుగా మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం.

గాంధీనగర్ కు సమీపంలో మిర్చి పండించే ఒక గ్రామం ఉంది. ఇప్పుడు మన దేశంలో ఒక సమస్య ఉంది. ఒక రైతు ఒక పంట వేస్తే ఆ ప్రాంతంలోని మిగిలిన రైతులందరూ అదే పంటను పండిస్తారు. ఉదాహరణకు గాంధీనగర్ లో మిర్చి లాగా. ఫలితంగా, దానికి ధర పడిపోతుంది. మొత్తం మిర్చి ని విక్రయించాక, ఆ గ్రామానికి ఎప్పుడూ 3 లక్షల కంటే ఎక్కువగా ఆదాయం రాలేదు. అంతకన్నా ఎక్కువ పొందడం సాధ్యం కాదు. అందువల్ల గ్రామస్తులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడాలని నిర్ణయించుకున్నారు. వారికి 24 గంటల విద్యుత్తు సరఫరా అందుబాటులో ఉండడంతో వారు విద్యుత్తు కనెక్షన్ ను తీసుకొని మిర్చి నుండి కారం పొడి ని తయారుచేయాలని భావించారు. కారం పొడి తయారీ యంత్రాలను కొనుగోలు చేసి చివరికి ప్యాకింగ్ పూర్తి చేశారు. 3 లక్షల రూపాయలకు అమ్ముడుపోయే మిరపకాయలు 3- 4 నెలల ప్రణాళిక అనంతరం 18 లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.

నేను ఇప్పుడు చెప్పదలచుకున్నది ఏమిటంటే ఈ అదనపు జోడింపును గురించి రైతులకు వాళ్లకు అర్ధమయ్యే మంచి భాషలో తెలియజేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎగుమతి, దిగుమతులు వేగంగా జరుగుతున్నాయి. కొరతగా ఉన్న వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది.

భారతదేశం చాలా సువిశాలమైన దేశం. పొలాలకు, విమానాశ్రయానికి లేదా నౌకాశ్రయానికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఉత్పత్తులు తిరస్కరించబడుతున్నాయి. ఇందులో కొన్ని విషయాలు మీకు తెలిసివుండవచ్చును. భారదేశం ఒక మంచి నాణ్యమైన చాప తయాలుచేసినా, బాల కార్మికుల చేత తయారుచేయబడిందన్న నెపంతో అది తిరస్కరించబడుతుంది. అంతే, దాంతో, ఆ వ్యాపారం అప్పుడే అక్కడే ముగుస్తుంది. అందువల్ల, ఈ అవాంతరాలను అధిగమించడానికి, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా విచారణను మనం పటిష్ఠపరచాలి. ఈ విషయాలను మన రైతులకు మనం వివరించాలి. ఈ విధమైన అన్యాయానికి వ్యతిరేకంగా నేను వివిధ దేశాలతో పోరాడుతున్నాను. వారి నియమాలను మన రైతుల ఉత్పత్తుల ఎగుమతులపై తప్పుగా అన్వయిస్తున్నారని వారికి తెలియజెప్పడం కోసం నేను పోరాడుతున్నాను. ఈ విధమైన వివరణ తప్పు, వారి ఆధారం తప్పు.

అందువల్ల మనం గొప్ప కృషి చేస్తేనే మన మామిడి పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. అయితే అంతర్జాతీయ విపణి లో ఒక పటిష్టమైన పోటీ ఉందన్న సంగతి మన రైతులకు వివరించాలి. అదేవిధంగా మన పద్ధతులను, ప్రక్రియలను అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణీకరించాలి.

ఈ కారణంగా నేను ఒక సారి ఎర్ర కోట బురుజుల నుండి ప్రసంగిస్తూ తయారీ రంగంలో ‘జీరో డిఫెక్ట్, జీరో ఇఫెక్ట్’ భావనను గురించి ప్రస్తావించాను. వ్యవసాయ ఉత్పత్తి అయినా, దాని ప్యాకింగ్ అయినా వాటి విషయంలో మనం అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించాలి. సేంద్రియ వ్యవసాయ ధ్రువీకరణ కోసం మనం ప్రయోగశాలలను, సంస్థలను ఏర్పాటు చేసుకోకపోతే మన సేంద్రియ ఉత్పత్తులు అంతర్జాతీయ విపణి లో ఆమోదించబడవు.

సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి ప్రస్తుతం 40 శాతంగా ఉందని నాతో చెప్పారు. ఈ 40 శాతం వృద్ధి కి ఆధారభూతంగా నిలుస్తోంది వ్యవసాయమే. సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి వ్యవసాయమే ఆధారం కాబట్టి భారతదేశం లాంటి దేశంలో ఇది చాలా మందికి ఉపాధిని ప్రసాదిస్తుంది. ఈ సుగంధ ద్రవ్యాల ప్రపంచంతో ఎన్నో విషయాలను అనుసంధానం చేయవచ్చు. అందువల్ల సుగంధ ద్రవ్యాల రంగంలో భారతదేశానికి పూర్తి వైవిధ్యభరితమైన అవకాశాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల రంగంలో మనం ఎంతో చేయవచ్చు; సహజ ఉత్పత్తులు సరఫరా చేయవచ్చు. అంతర్జాతీయ విపణి ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏ విధంగా సహాయపడగలమో మనం ఆలోచించాలి. ఒక రోజున గల్ఫ్ దేశాల ప్రజలతో నేను మాట్లాడుతున్నాను. వారు ఏ రకమైన, ఎటువంటి నాణ్యత కల ఫలాలు, కాయగూరలు ఇష్టపడతారో సూచించండని నేను వారిని అడిగాను. ఆ నాణ్యతను కొనసాగించడానికి వీలుగా మా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పిస్తాం. కానీ, దయచేసి మా ఉత్పత్తులను రైతుల పొలం నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. మీ శీతల గిడ్డంగులు, వేర్ హౌసింగు, రవాణా విధానాలను కూడా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. మొత్తం గల్ఫ్ ప్రాంతానికి సరఫరా చేయడం మా దేశానికి చెందిన రైతుల బాధ్యత.

ఇటీవలి కాలంలో ఈ విషయాలను వివిధ దేశాలతో నేను చర్చిస్తూనే ఉన్నాను. అయితే, మీరు పడ్డ కష్టానికి తగ్గ గొప్ప ప్రతిఫలాన్ని మీరు తప్పక పొందుతారని నేను చెప్పదలచాను. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను అధికారులను అడిగాను. ఎందుకంటే అందరి కన్నా ఎక్కువగా వారికి దీని గురించి తెలుసు కాబట్టి. అయ్యా, ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటిది జరగలేదని వారు నాతో చెప్తున్నారు. వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు, ప్రగతిశీల వ్యవసాయదారులు, విధాన రూపకర్తలు.. అంతా పూర్తి సమాచారంతో ఇక్కడ కలుసుకొని చర్చల ద్వారా, సంభాషణల ద్వారా దీనిని సాధించడం ఇదే మొదటి సారి.

ఈ కృషి సరైన దిశలో జరుగుతోందని నేను భావిస్తున్నాను. ఏదైనా ఒకటి అమలు కాకపోతే, దయచేసి నిరాశ చెందవద్దు. బహుశా దానిని అమలుచేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది ఒక పెద్ద ప్రభుత్వ యంత్రాంగం. ఒక చిన్న స్కూటరును కదపాలంటే ఎంతో సమయం పట్టదు; కానీ, అదే ఒక పెద్ద రైలును కదపాలంటే, చాలా సమయం పడుతుంది. అయితే, తప్పక నమ్మండి, ఖచ్చితంగా మనందరం కలిసి దీన్ని పూర్తి చేస్తాం.

మీ అందరితో కలసి ఈ పని చెయ్యాలి. ఈ పనిని మనం తప్పకుండా చేయగలమని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మన సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. అది వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కానీ, పశువుల పెంపకం, మధుర విప్లవం (తేనెటీగల పెంపకం) లేదా నీలి విప్లవం వంటి దేని ద్వారానైనా సరే. రైతుల అభివృద్ధికి దోహదం చేసే అన్ని మార్గాలను మనం అన్వేషించాలి. ఈ నమ్మకంతో, మీరు చేసిన కృషికి నేను మీకు అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.

***