సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారీ సంఖ్యలో సమావేశమైన యువకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ఐక్యతకు సర్దార్ పటేల్ ఒక శక్తిని ఇచ్చారని చెప్పారు. సర్దార్ పటేల్ నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రదర్శించిన అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదల దుష్ట శక్తుల దుశ్చర్యలను తిప్పికొట్టి ఆధునిక, స్వతంత్ర భారత్ ఆవిష్కారానికి దోహదపడ్డాయని ఆయన అన్నారు.
సర్దార్ పటేల్ మనకు ఏక్ భారత్ అందించారని, దాన్ని శ్రేష్ఠ భారత్‌గా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మనపై ఉన్నదని ఆయన అన్నారు. 125 కోట్ల మంది భారతీయులను ముందుకు నడిపించే శక్తి ఐక్యత, శాంతి, స్నేహ భావాలేనని ఆయన చెప్పారు.
1920 సమయంలో అహ్మదాబాద్ మేయర్‌గా సర్దార్ పటేల్ చేసిన సేవలను ప్రధాని గుర్తు చేశారు. ఆ సమయంలోనే సర్దార్ పటేల్ స్వచ్ఛత కోసం ప్రచారోద్యమం చేపట్టడమే కాకుండా మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారని ఆయన చెప్పారు.
రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేస్తూ “ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్” పేరిట ఒక కొత్త పథకం ఆవిష్కరించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకం కింద రెండు రాష్ట్రాలు ఐక్య భాగస్వాములుగా మారి ఏడాది పాటు విద్యార్థులను పరస్పరం పంపించుకుని సాంస్కృతిక బాంధవ్యం ఏర్పరచుకుంటాయని ప్రధాని అన్నారు. దీని వల్ల ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకునేందుకు, మరింత సన్నిహితం అయ్యేందుకు బాట పడుతుందని ఆయన చెప్పారు. ఇలా రాష్ట్రాలన్నీ ప్రతీ యేటా భాగస్వామ్యాలు విస్తరించుకోగలుగుతాయని ఆయన అన్నారు.
స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధాని ఆమెకు నివాళి అర్పించారు.
అలాగే అక్కడ సమావేశమైన ప్రజలతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఐక్యతా పరుగును ప్రారంభించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
I bow to Sardar Patel. May his blessings always be with the nation & inspire us to scale newer heights: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 31, 2015
Paying homage to Sardar Patel. pic.twitter.com/lRlswkIcuB
— Narendra Modi (@narendramodi) October 31, 2015