Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-ఇరాన్ సంయుక్త ప్రకటన (2018 ఫిబ్రవరి 17)


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇరాన్ అధ్యక్షుడు మాననీయ డాక్టర్ హసన్ రౌహానీ 2018 ఫిబ్రవరి 15 నుంచి 17వ తేదీవరకు తొలిసారి భారతదేశంలో పర్యటించారు.

  • ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ భారత పర్యటనలో కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి బృందం ఆయనతోపాటు పాల్గొంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 17న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆయనకు స్నేహపూర్వక, సౌహార్ద, ఘన స్వాగతం లభించింది. సందర్శక ప్రముఖుని గౌరవార్థం భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌ అధికారిక విందు ఇచ్చారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు హసన్ రౌహానీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సాగాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి కూడా ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. మరోవైపు భారత ఉప రాష్ట్రపతితోపాటు విదేశాంగ శాఖ మంత్రి కూడా సందర్శక ప్రముఖునితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అంతకుముందు అధ్యక్షుడు హసన్ రౌహానీ 2018 ఫిబ్రవరి 15-16 తేదీల్లో హైదరాబాద్ సందర్శించారు.
  • ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుపక్ష అంశాలపై సుహృద్భావ వాతావరణం నడుమ విస్తృత స్థాయిలో నిర్మాణాత్మక చర్చలు సాగాయి. ప్రధానమంత్రి మోదీ 2016 మే నెలలో ఇరాన్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల ప్రగతికి సంబంధించి 2003 జనవరి 23నాటికి ‘న్యూఢిల్లీ తీర్మానం’ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా సాధించిన పురోగతిపై ఉభయపక్షాలూ సంతృప్తి వ్యక్తం చేశాయి. అలాగే ద్వైపాక్షిక సహకారాన్ని బహుముఖంగా విస్తృతం చేసే దిశగా సంయుక్త సంకల్పాన్ని ప్రకటించాయి. ఈ ఉభయతారక సంబంధాలు రెండు దేశాల మధ్య రెండు శతాబ్దాలుగాగల సాంస్కృతిక, నాగరికత బంధం పునాదులపై ఆధారపడి పురోగమించాయని ఈ సందర్భంగా నాయకులిద్దరూ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమన్నది ప్రాంతీయ సహకారం, శాంతిసౌభాగ్యాలు, సుస్థిరతలకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
  • ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు రౌహానీల సమక్షంలో దిగువ పేర్కొన్న పత్రాల ఆదానప్రదానం పూర్తయిన అనంతరం పాత్రికేయులను ఉద్దేశించి వారిద్దరూ సంయుక్తంగా మాట్లాడారు:-
    ఆదాయంపై పన్నుకు సంబంధించి ద్వంద్వ పన్ను తప్పింపు-ద్రవ్య ఎగవేత నిరోధంపై ఒప్పందం.
    ii. దౌత్యపరమైన విదేశీ ప్రయాణ అనుమతి (పాస్‌పోర్ట్‌)గలవారికి దేశ ప్రవేశానుమతి (వీసా) నుంచి మినహాయింపుపై అవగాహన ఒప్పందం.
    iii. పరదేశీ/అపరాధుల అప్పగింత ఒప్పందానికి ఆమోద పత్రం.
    iv. సంప్రదాయ ఔషధ విధానాల రంగంలో సహకారానికి అవగాహన ఒప్పందం.
    v. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించే దిశగా వాణిజ్య ఉపశమన చర్యల రూపకల్పనకు నిపుణుల బృందం ఏర్పాటుపై అవగాహన ఒప్పందం.
    vi. వ్యవసాయం, అనుబంధ రంగాలలో సహకారానికి అవగాహన ఒప్పందం.
    vii. వైద్య, ఆరోగ్య రంగంలో సహకారానికి అవగాహన ఒప్పందం.
    viii. తపాలా రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.
    ix. చబహర్ వద్ద మధ్యంతర కాలంలో షాహిద్ బెహెస్తి రేవు తొలిదశ నిర్మాణానికి పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ఇరాన్ – ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్) మధ్య లీజు కాంట్రాక్టు.

    ద్వైపాక్షిక ఆదానప్రదానాలు
     

  • తరచూ విస్తృత స్థాయిలో అభిప్రాయాల మార్పిడిద్వారా ప్రస్తుత ఉన్నతస్థాయి చర్చలను అన్ని స్థాయులలో మరింత ముమ్మరం, విస్తృతం చేయాలని అధ్యక్షుడు రౌహానీ, ప్రధానమంత్రి మోదీ అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలోగా భారత-ఇరాన్ సంయుక్త కమిషన్, దాని కార్యాచరణ బృందాల సమావేశాలు సహా విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు, రెండు దేశాల రక్షణ-భద్రత వ్యవస్థల మధ్య చర్చలు, విధాన ప్రణాళిక చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు పార్లమెంటరీ ఆదానప్రదానాలకూ నిర్ణయించారు.

అనుసంధానం

  • రెండు దేశాల మధ్యమాత్రమేగాక ఈ ప్రాంతమంతటా బహువిధ అనుసంధానంలో భారత-ఇరాన్ విశిష్ట పాత్ర పోషించాల్సి ఉందని ఉభయపక్షాలూ గుర్తించాయి. నిరుడు డిసెంబరు తొలినాళ్లలో చబహర్ రేవు తొలి దశ పనులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి; అలాగే అంతర్జాతీయ రవాణా, మార్గ కూడలి ఏర్పాటుకు అంగీకరిస్తూ భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి ఆమోద ముద్ర పడింది; భారత్ నుంచి సాయం కింద ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చబహర్ రేవుద్వారా గోధుమల రవాణా విజయవంతమై ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా తదనంతర సీమలకు కొత్త ముఖద్వారం తెరుచుకుంది. అలాగే చబహర్ వద్ద షాహిద్ బెహెస్తీ రేవు త్వరితగతిన పూర్తి, కార్యకలాపాల ప్రారంభానికి కట్టుబాటును ఉభయపక్షాలూ పునరుద్ఘాటించాయి. చబహర్ స్వేచ్ఛా వాణిజ్య మండలి (ఎఫ్టీజడ్)లో సంబంధిత పక్షాలకు పరస్పర ప్రయోజనకరమైన షరతుల ప్రకారం ఎరువులు, పెట్రో రసాయనాలు, ఖనిజ-లోహ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం భారతదేశం వైపునుంచి పెట్టుబడులపై ఇరాన్ వైపునుంచి హర్షం వ్యక్తమైంది.
  • ఇందులో భాగంగా చబహర్ వద్ద మధ్యంతర కాలంలో షాహిద్ బెహెస్తి రేవు తొలిదశ నిర్మాణానికి పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ఇరాన్ – ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్) మధ్య లీజు కాంట్రాక్టు కుదరడంపై రెండు దేశాల నేతలూ హర్షం ప్రకటించారు. అంతేకాకుండా త్రైపాక్షిక ఒప్పందం నిర్దేశిస్తున్న కాల వ్యవధికి అనుగుణంగా సమన్వయ మండలి సమావేశం కావాలని కూడా వారు ఆదేశించారు.
  • చబహర్ రేవుతోపాటు ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియాలకు దాని అనుసంధానతను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దృష్టితో చబహర్-జాహెదాన్ రైలు మార్గం నిర్మాణానికి మద్దతునిచ్చేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ప్రసుతం ఇర్కాన్, ఇండియాతో సీడీటీసీ, ఇరాన్ మధ్య చర్చలు సాగుతున్న నేపథ్యంలో కాలావధి ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు కోసం సాంకేతిక పరామితులు, ఆర్థిక ఎంపికాంశాల ఖరారుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైల్వేల రంగంలో రైలు పట్టాలు, మలుపు కూడళ్లు (టర్నౌట్లు), ఇంజన్ల సరఫరాలో సహకారానికి కృషి చేయాల్సిందిగా నాయకులిద్దరూ విశేష ప్రోత్సాహమిచ్చారు.
  • అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ) ఏర్పాటుకు రెండు పక్షాలూ తమ కట్టుబాటు పునరుద్ఘాటించాయి. ఈ చట్రంలో చ‌బ‌హ‌ర్‌ను అంతర్భాగం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. ఇందులో భాగంగా టెహ్రాన్లో ఐఎన్ఎస్టీసీ సమన్వయ సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తామని ఇరాన్ ప్రకటించింది. ప్రాంతీయ అనుసంధానం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి కేంద్రాల సంధానం పెంచే చర్యల దిశగా టీఐఆర్ తీర్మానం, అష్గబత్ ఒప్పందాలు భార‌త్‌కు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తమైంది.
  • దీనదయాళ్ రేవు, కాండ్లా, చబహర్ వద్ద షాహిద్ బెహెస్తీ టెర్మినళ్లకు ప్రతీకగా నిలిచే తపాలా బిళ్లను నాయకులిద్దరూ ఆవిష్కరించారు. మరింత అనుసంధానతద్వారా సౌభాగ్య వృద్ధిని ఇది ప్రతిబింబించింది.
  • చబహర్ స్వేచ్ఛా వాణిజ్యమండలిలో భారత్ నుంచి ప్రైవేటు/ప్రభుత్వ రంగ పెట్టుబడులను ఆకర్షించే దిశగా తగిన వాతావరణాన్ని మెరుగుపరుస్తామని ఇరాన్ పక్షం సంసిద్ధత తెలిపింది. ఇందులో భాగంగా వ్యాపార ప్రోత్సాహక కార్యక్రమాన్ని ఇరాన్ నిర్వహిస్తుంది. చబహర్ రేవు ద్వారా ఒనగూడే ఆర్థికావకాశాలను ప్రస్ఫుటం చేయడం లక్ష్యంగా ఈ ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతీయ దేశాలు కూడా ఇందులో పాలుపంచుకుంటాయి.

ఇంధన రంగ భాగస్వామ్యం

  • ఇంధన రంగంలో సహజ భాగస్వామ్యం, పరిపూరక ప్రయోజనాలను ఉభయపక్షాలూ గుర్తించాయి. ఆ మేరకు సంప్రదాయక విక్రయదారు-కొనుగోలుదారు పాత్రలకు అతీతంగా దీన్ని దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ‘ఫర్జాద్-బి’ చమురు క్షేత్రంసహా ఇంధన సహకారంలో తగు ఫలితాల సాధన దిశగా సంప్రదింపుల వేగం పెంచేందుకూ ఉభయపక్షాలు అంగీకరించాయి.

వాణిజ్యం-పెట్టబడులలో సహకారం
 

  • రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులపై సహకార విస్తృతికి నాయకులిద్దరూ అంగీకరించారు. ఇందులో భాగంగా వాణిజ్య లావాదేవీల కోసం సమర్థ బ్యాంకింగ్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇరాన్ దేశానికి చెందిన పసర్గడ్ బ్యాంకు భారతదేశంలో తమ శాఖను ప్రారంభించేందుకు అనుమతికి సంబంధించి పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు ప్రకటించాయి. క్రియాశీల చెల్లింపు మాధ్యమాల ఏర్పాటు దిశగా రూపాయి-రియాల్ ఒప్పందం, ఆసియా క్లియరింగ్ యూనియన్ యంత్రాంగంసహా ఆచరణాత్మక మార్గాలపై అధికారులతో సంయుక్త కమిటీని నియమించాలని అంగీకారం కుదిరింది.
  • ద్వంద్వ పన్ను తప్పింపు ఒప్పందం ఖరారు కావడాన్ని వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహించేదిగా ఉభయపక్షాలూ హర్షించాయి. ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై కంప్యూటర్ ఆధారిత సంప్రదింపులకు అంగీకరించాయి. దీంతోపాటు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడికను నిర్దిష్ట వ్యవధిలో ఖరారు చేయాలని నిర్ణయించాయి.
  • ఆర్థిక, వాణిజ్య సహకారంలో పరిశ్రమలు, వ్యాపారవేత్తల పాత్రకుగల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ నిరుడు టెహ్రాన్ నగరంలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడంపై నాయకులిద్దరూ హర్షం ప్రకటించారు. అలాగే రెండు దేశాల్లోని వివిధ వాణిజ్య సంస్థల మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలను స్వాగతించారు. కాగా, భారతదేశంలో ఇరాన్ వాణిజ్య-పరిశ్రమల సమాఖ్య కార్యాలయ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నట్లు భారత బృందం కూడా తెలిపింది.
  • ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఇరాన్ భాగస్వామ్యానికి భారత్ పూర్తి మద్దతు తెలిపింది. ఆ సంస్థను సమ్మిశ్రిత, సార్వజనీనమైనదిగా రూపొందించే లక్ష్యం దిశగా సదరు ప్రక్రియను పునరుద్ధరించడం కోసం అందులోని సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయ సాధన కృషికి తోడ్పాటు ప్రకటించింది.

ప్రజల మధ్య సంబంధాలు, స్నేహపూర్వక ఆదానప్రదానాలకు ప్రోత్సాహం
 

  • రెండు దేశాల మధ్య స్నేహపూర్వక ఆదానప్రదానాలకు వీలు కల్పిస్తూ ఇరాన్ పౌరులకు భారత ప్రభుత్వం… భారత పౌరులకు ఇరాన్ ప్రభుత్వం పరస్పరం ఎలక్ట్రానిక్ వీసా మంజూరు చేసేలా అంగీకారం కుదిరింది. దౌత్య పాస్ పోర్టు కలిగినవారికి వీసా మినహాయింపునిస్తూ కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఈ దిశగా వేసిన మరో అడుగు. అలాగే రెండు దేశాల పౌరులకు సంబంధించిన మానవతావాద సమస్యల పరిష్కారానికిగల ప్రాముఖ్యాన్ని కూడా ఉభయపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరాన్ లోని భారతీయ కాన్సలేట్ కార్యాలయాల స్థాయి పెంపుపై భారత్ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించేందుకు ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది.
  • ఇరాన్లో 2018-19లో భారతీయ మహోత్సవం నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది. బలమైన నాగరికత, సాంస్కృతిక బంధం పునాదులను మరింత దృఢం చేయడం, అన్నిస్థాయులలోనూ పరస్పర అవగాహనను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు. అలాగే టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో భారత అధ్యయన పీఠం ఏర్పాటు; భారత విదేశీ సేవల సంస్థలో ఇరాన్ దౌత్యవేత్తలకు భారత చరిత్ర, సంస్కృతి, తత్త్వశాస్త్ర అంశాలపై అవగాహన కోర్సుల నిర్వహణ; భారతదేశంలో పర్షియన్ భాషల కోర్సులకు తోడ్పాటు; పురాతత్వ విజ్ఞానం, ప్రదర్శనశాలలు, భాండాగారాలు, గ్రంథాలయాలకు సంబంధించి సహకారం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.

రక్షణ-భద్రత రంగాల్లో సహకారం

  • రెండు దేశాల జాతీయ భద్రత మండళ్ల మధ్య పెరుగుతున్న సమాలోచన బంధంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు తరచూ వ్యవస్థాగత సంప్రదింపులను మరింత పెంచేందుకు వారి మధ్య అంగీకారం కుదిరింది. అలాగే ఉగ్రవాదంతోపాటు వ్యవస్థీకృత నేరాలు, అక్రమ ద్రవ్య చలామణీ, మాదకద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలవంటి భద్రత సంబంధ అంశాల్లోనూ ఈ ప్రక్రియ అమలవుతుంది.
  • సముద్ర ప్రయాణ, రవాణాలకు సంబంధించి సహకార విస్తరణకుగల అవకాశాలపై రెండు పక్షాలూ ఆసక్తి కనబరిచాయి. రక్షణకు సంబంధించి రక్షణ ప్రతినిధి బృందాలకు శిక్షణ, క్రమబద్ధ ఆదానప్రదానం, నావికాదళ నౌకల నుంచి రేవులో లంగరుకు వినతులు తదితరాలపై సహకారం దిశగా చర్యల పరిశీలన కోసం చర్చలు చేపట్టాలని కూడా అంగీకారం కుదిరింది.
  • శిక్షకు గురైన వ్యక్తుల బదిలీపై ద్వైపాక్షిక ఒప్పందం అమలులో సాధించిన ప్రగతిపై ఉభయపక్షాలూ సానుకూల స్పందన వ్యక్తంచేశాయి. దీంతోపాటు రెండు దేశాల మధ్య అప్పగింత ఒడంబడికతోపాటు పౌర, వాణిజ్య అంశాల్లో పరస్పర న్యాయ సహకారంపైనా అంగీకారంపై హర్షం ప్రకటించాయి.

ఇతరత్రా అంశాలు
 

  • పరస్పర ఆసక్తి, అంగీకారంగల అనేక ఇతర అంశాలపైనా ద్వైపాక్షిక సహకారాన్ని ఉభయ పక్షాలూ స్వాగతించాయి. విద్య, శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయం, కార్మికశక్తి, వ్యవస్థాపన, పర్యాటకం, తపాలా తదితరాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ మేరకు ఈ రంగాల్లో వ్యవస్థాగత యంత్రాంగాల ఏర్పాటు, క్రమబద్ధ సమాలోచనలద్వారా సహకారం ఉంటుంది. తదనుగుణంగా ఇతర వివరాలపై అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత అధికారవర్గాలను ఆదేశించాయి.

ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు 

  • ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై నాయకులిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించుకున్నారు. బహుపాక్షికతను బలోపేతం చేసే దిశగా అంతర్జాతీయ వేదికలపై మరింత కీలక పాత్ర పోషించాలన్న భారత ఆకాంక్షను అధ్యక్షుడు రౌహానీ గుర్తించారు. ఐక్యరాజ్యసమితి పటిష్ఠంగా రూపుదిద్దుకోవడం, ప్రస్తుత భౌగోళిక-రాజకీయ వాస్తవ స్థితిగతులకు అనుగుణంగా భద్రత మండలిలో సత్వర సంస్కరణలకుగల ప్రాముఖ్యాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. భద్రత మండలిలో సమగ్ర సంస్కరణల కోసం అంతరప్రభుత్వ సంప్రదింపులకు తమ కట్టుబాటును కూడా వారు మరోసారి నొక్కిచెప్పారు. బహపక్ష ఆర్థిక సంస్థలలోనూ సంస్కరణలుసహా వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ నొక్కి చెప్పారు.  దీంతోపాటు వాటిలో అంతర్జాతీయ ఆర్థిక విధాన నిర్ణయాత్మకతలోనూ వర్ధమాన దేశాల గళానికి ప్రాధాన్యం పెంచడంపైనా సంకల్పం చాటారు.
  • ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం విసురుతున్న సవాళ్లను నాయకులిద్దరూ గుర్తించారు. ఆ మేరకు అన్ని రూపాలు, స్వభావాలుగల ఉగ్రవాదంపై పోరులో తమ అకుంఠిత దీక్షను పునరుద్ఘాటించారు. అంతేకాకుండా ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా దాన్ని సమర్థించే పరిస్థితి ఉండరాదని బలంగా ప్రకటించారు. ఉగ్రవాదుల, వారి సంస్థల, వాటి సమూహాల నిర్మూలనకు మాత్రమే ఉగ్రవాదంపై పోరు దీక్ష పరిమితం కారాదని స్పష్టం చేశారు. ఆ మేరకు వాటన్నిటికీ వెన్నుదన్నుగా ఉన్న పరిస్థితులను గుర్తించి, తీవ్రవాద సిద్ధాంతాల నిర్మూలన దిశగానూ విస్తరించాలని ఆకాంక్షించారు. మతం, జాతీయత, తెగలతో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం ముడిపడకుండా చూడాలని దీక్షబూనారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు ఆశ్రయం-అండదండలు తక్షణం అంతం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదానికి సహాయపడుతున్న, ఉసిగొల్పుతున్న లేదా ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న దేశాల చర్యలను అంతర్జాతీయ సమాజం బహిరంగంగా ఖండించాలని  కోరారు. ఆ మేరకు ఉగ్రవాదంపై పోరులో ఎంపికచేసిన, పాక్షిక విధానాలకు స్వస్తి చెప్పాలని, ఈ దిశగా నిర్దిష్ట ఒప్పందం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధంపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సంపూర్ణ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రతిపాదించిన ‘‘ఉగ్రవాద-తీవ్రవాద వ్యతిరేక ప్రపంచం’’ (వేవ్) ఆలోచన నుంచి 2013లో రూపుదిద్దుకున్న ఐరాస సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని భారత-ఇరాన్ ఉభయపక్షాలూ అంగీకరించాయి. ఇందులో భాగంగా ఉగ్రవాద శక్తుల నిర్మూలన, వారికి మద్దతిచ్చే చర్యల నిర్మూలన, ప్రత్యేకించి ఉగ్రవాద సంస్థల ఆర్థిక మద్దతుకు స్వస్తి చెప్పే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి.
  • ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఆమోదిత సంయుక్త కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో, ప్రభావవంతంగా అమలు చేయడంపై తమ మద్దతును భారత పక్షం పునరుద్ఘాటించింది. అణు నిరాయుధీకరణ చట్రం, అంతర్జాతీయ శాంతి, సుస్థిరత, భద్రతలకు తోడ్పాటులో ఇదెంతో కీలకమని స్పష్టం చేసింది.
  • బలమైన, ఐక్య, సంపన్న, బహుళపక్ష, ప్రజాస్వామిక, స్వతంత్ర ఆఫ్ఘనిస్థాన్ రూపుదిద్దుకోవడం ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల ప్రయోజనాలకు ఎంతో కీలకమన్న వాస్తవాన్ని భారత్-ఇరాన్ నొక్కిచెప్పాయి. ఈ మేరకు ఆ దేశంలో జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. భారత-ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ నడుమ త్రైపాక్షిక సంప్రదింపులు, సమన్వయంలోగల ప్రాముఖ్యాన్ని వారు నొక్కిచెప్పారు. అలాగే చబహర్ రేవుపై సహకారాన్ని తగువిధంగా అందించాల్సిన అవసరాన్ని కూడా పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ప్రాంతీయ అనుసంధానం పెంచుకునే దిశగా ఈ ప్రాంతంలోని దేశాలు ముందుకు రావాలని, తదనుగుణంగా అడ్డంకుల తొలగింపు, భూభాగాల బదిలీకి తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
  • భారత పర్యటన సందర్భంగా తనకు, తమ బృందానికి లభించిన అపూర్వ ఆతిథ్యంపై అధ్యక్షుడు రౌహానీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు ప్రకటించారు. ఇరాన్ సందర్శనకు రావాల్సిందిగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆయన ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ పర్యటనకు అనుగుణమైన తేదీలపై దౌత్య మార్గాల్లో పరిశీలనకు వారు అంగీకరించారు.

***