కేంద్ర ప్రాయోజితమైన జాతీయ ఆయుష్ మిశన్ (ఎన్ఎఎమ్) ను మూడు సంవత్సరాల పాటు, 01.04.2017 నుండి 31.03.2020 వరకు, రూ.2400 కోట్ల వ్యయంతో కొనసాగించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ను 2014 సెప్టెంబరు లో ప్రారంభించడమైంది.
ప్రధాన అంశాలు:
ఆయుష్ వైద్య సేవలను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో అందరి అందుబాటు లోకి తీసుకురావడం కోసం ఆయుష్ మిశన్ ను ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తోంది. ఇందులో ఇతర అంశాలతో పాటు..
• ఆయుష్ ఆసుపత్రులు, వైద్య శాలల స్థాయిని పెంపొందించడం;
• ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిహెచ్ సిలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు (సిహెచ్ సిలు) మరియు జిల్లా ఆసుపత్రులను (డిహెచ్ లు)లో ఆయుష్ సదుపాయాలను సైతం సమకూర్చడం;
• రాష్ట్రాల స్థాయిలో ఆయుష్ విద్యా సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ, ఎఎస్ యు & హెచ్ ఫార్మసిల స్థాయిని పెంచడం ద్వారా సంస్థాగత సామర్ధ్యాన్ని పటిష్టపరచడం;
• ఔషధ పరీక్షా ప్రయోగశాల ల ఏర్పాటు, ఆయుష్ అండ్ హెల్త్ అమలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం;
• మంచి వ్యవసాయ పద్దతులను (జిఎపి లు) ప్రోత్సహించడం ద్వారా ఔషధ మొక్కల సాగుకు మద్దతివ్వడం, తద్వారా ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్ధాల లభ్యత స్థిరంగా ఉండేలా చూస్తూ, ఔషధ మొక్కలను నిల్వ చేసేందుకు తగ్గ మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం
.. వంటివి భాగంగా ఉన్నాయి.
ఆరోగ్య రంగం అవసరాలకు అందుబాటులో ఉన్న అవకాశాలకు మధ్య గల వెలితిని భర్తీ చేయడంలో రాష్ట్రాల ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలకు జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ఎఎమ్) అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుంది. మరీముఖ్యంగా సాధారణ వైద్య సేవలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాలలోను, మారుమూల ప్రాంతాలలోను వైద్య సేవలను అందించడంలో ఎన్ఎఎమ్ కీలక పాత్రను పోషిస్తోంది. అటువంటి ప్రాంతాల నిర్దిష్ట అవసరాలను తీర్చడంపైన, అలాగే వారి యొక్క వార్షిక ప్రణాళికలలో అధిక నిధుల కేటాయింపు పైన ఎన్ఎఎమ్ వైపు నుండి ప్రత్యేక శ్రద్ధను కనబరచడం జరుగుతుంది.
ఈ మిశన్ నుండి ఆశిస్తున్న పర్యవసానాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
i. ఆయుష్ సేవలను అందించే ఆరోగ్యసంరక్షక సేవలను ఉత్తమమైన రీతిలో పలువురికి అందుబాటులోకి తీసుకు రావడం, మందులు మరియు శిక్షణ పొందిన సిబ్బంది మరింత విస్తారంగా లభ్యమయ్యేటట్లు చూడడం
ii. చక్కటి మౌలిక వసతులతో కూడినటువంటి ఆయుష్ విద్యా సంస్థల సంఖ్యను పెంచుతూ ఆయుష్ విద్య ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయడం
ఇప్పటికే జాతీయ ఆయుష్ మిశన్ మెరుగైన విద్యసేవలను అందించడంలో, మందులు, మానవ వనరుల సరఫరా లో ముందడుగు వేసింది. అలాగే ఆయుష్ వైద్య విద్యను అందించే విద్య సంస్థల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
iii. గుణాత్మకమైన ఫార్మసిలు మరియు ఔషధ పరీక్షా ప్రయోగశాల ల సంఖ్యను పెంచడం వాటి తనిఖీ యంత్రాంగాన్ని పటిష్టపరచడం, తద్వారా నాణ్యమైన ఆయుష్ మందుల లభ్యతను మెరుగుపరచడం.
iv. యోగా మరియు ప్రాకృతిక చికిత్సల వైపు మొగ్గు చూపేందుకు చైతన్యాన్ని పెంపొందించడం
v. మూలికా ఓషధుల సంబంధిత ముడి పదార్ధాలకు దేశీయంగా పెరుగుతున్న గిరాకీని అందుకోవడంతో పాటు ఈ సరుకుల ఎగుమతికి అండగా నిలబడడం.
పూర్వ రంగం:
మన పూర్వికులు మనకు అందించిన ఆయుర్వేదం, సిద్ధ, యూనానీ, హోమియోపతి (ఎఎస్ యు & హెచ్) ల వంటి అద్వితీయ వైద్య వారసత్వ సంపదను బలోపేతం చేయడం లక్ష్యంగా జాతీయ ఆయుష్ మిశన్ పనిచేస్తోంది. ఇది స్వాస్థ్య సదుపాయ రంగంలో అపారమైనటువంటి జ్ఞాన భండారంగా ఉంది. భారతీయ వైద్య విధానాలలోని సానుకూల అంశాలు ఏమిటంటే, అవి వైవిధ్యభరితమైనవి; చౌక అయినటువంటివి; సాధారణ ప్రజానీకంలో పెద్ద వర్గం యొక్క ఆదరణకు నోచునకొన్నవీ, దేశవాసులలో ఒక పెద్ద వర్గం యొక్క ఆరోగ్య అవసరాలను నెరవేర్చగలిగేవీనూ.
***