Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తోలు మరియు పాద‌ర‌క్ష‌ల రంగంలో ఉద్యోగ క‌ల్ప‌న కోసం ఉద్దేశించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


తోలు మ‌రియు పాద‌ర‌క్ష‌ల‌ రంగంలో ఉద్యోగ క‌ల్ప‌న‌కు ఉద్దేశించిన ఒక ప్ర‌త్యేక ప్యాకేజీకి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం నుండి 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు మూడేళ్ళ కాలంలో రూ. 2600 కోట్ల‌కు పైగా ఆమోదిత వ్య‌యంతో ‘‘ఇండియ‌న్ ఫుట్‌వేర్‌, లెద‌ర్ & యాక్స‌స‌రీస్ డివ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్’’ అనే పేరుతో ఓ సెంట్ర‌ల్ సెక్ట‌ర్ స్కీమ్ ను అమ‌లు చేస్తారు.

తోలు రంగంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ఈ రంగానికి సంబంధించిన ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, అద‌న‌పు పెట్టుబ‌డులకు వెసులుబాటు, ఉపాధి క‌ల్ప‌న మ‌రియు ఉత్ప‌త్తి పెరుగుద‌ల వంటి ప‌రిణామాల‌కు ఈ స్కీము తోడ్ప‌డుతుంది. పన్ను ప్రోత్సాహ‌కాన్ని పెంచిన కార‌ణంగా ఈ రంగం పెద్ద ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించగ‌లుగుతుంది. కార్మిక చ‌ట్టంలో సంస్క‌ర‌ణలను త‌ల‌పెట్టినందువ‌ల్ల కూడా, ఈ రంగానికి ప‌రిమాణ పూర్వ‌క‌మైన ప్ర‌యోజ‌నాలు ఒన‌గూరేందుకు ఆస్కారం ఉంటుంది.

3 సంవ‌త్స‌రాల కాలంలో 3.24 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు అందివచ్చేందుకు ఈ ప్ర‌త్యేక ప్యాకేజీ వీలు క‌ల్పిస్తుంది. అంతేకాకుండా, 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నిశ్చిత రూపాన్ని ఇవ్వ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది.

ఇండియ‌న్ ఫుట్‌వేర్‌, లెద‌ర్ & యాక్స‌స‌రీస్ డివెల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్ యొక్క వివ‌రాలు:-

మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి (హెచ్ఆర్‌డి) స‌బ్‌-స్కీమ్: నిరుద్యోగుల‌కు ప్లేస్‌మెంట్ లింక్ డ్ స్కిల్ డివెల‌ప్‌మెంట్ ట్రైనింగ్ కోసం ఒక్కొక్క‌రికి రూ. 15,000 చొప్పున స‌హాయం, ఉద్యోగం చేస్తున్న శ్రామికుల‌కు నైపుణ్యాల మెరుగుద‌ల సంబంధిత శిక్ష‌ణ‌కు గాను ఒక్కొక్క ఉద్యోగికి రూ. 5,000 చొప్పున స‌హాయం మ‌రియు ట్రైన‌ర్ల‌కు శిక్ష‌ణ కోసం ఒక్కొక్క‌రికి రూ. 2 ల‌క్ష‌ల చొప్పున స‌హాయాన్ని అందించాల‌ని హెచ్ఆర్‌డి స‌బ్‌-స్కీము ప్ర‌తిపాదిస్తోంది. నైపుణ్యాల అభివృద్ధి తాలూకు శిక్ష‌ణ‌తో ముడిప‌డిన స‌హాయాన్ని పొంద‌డానికిగాను శిక్షితులైన వారిలో 75 శాతం మందికి తప్పనిసరిగా ప్లేస్‌మెంట్ ను చూపించాల‌న్న ప్రతిపాదన ఉంది. ఈ స‌బ్ స్కీము లో భాగంగా రూ. 696 కోట్ల ప్ర‌తిపాదిత ఖ‌ర్చుతో మూడు సంవ‌త్స‌రాల‌లో 4.32 ల‌క్ష‌ల నిరుద్యోగ వ్య‌క్తుల‌కు శిక్ష‌ణ‌ను ఇవ్వ‌డం/నైపుణ్యాలను అందించ‌డం, ఇప్ప‌టికే ఉద్యోగం చేస్తున్న 75,000 మందికి వారి యొక్క నైపుణ్యాల‌ను మ‌రింత‌గా మెరుగుప‌ర‌చ‌డం, ఇంకా 150 మంది మాస్ట‌ర్ ట్రైన‌ర్ ల‌కు శిక్ష‌ణ‌ను ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు.

తోలు రంగం యొక్క స‌మ‌గ్ర అభివృద్ధి (ఐడిఎల్ఎస్‌) స‌బ్-స్కీమ్: ఐడిఎల్ఎస్ స‌బ్-స్కీమ్ లో భాగంగా సూక్ష్మ‌, ల‌ఘు మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌ (ఎమ్ఎస్ఎమ్ఇ)ల‌కు కొత్త‌గా యంత్ర ప‌రిక‌రాల వ్య‌యంలో 30 శాతం చొప్పున పెట్టుబ‌డి గ్రాంటు/స‌బ్సిడీ స‌మ‌కూర్చ‌డం మ‌రియు ఇప్ప‌టికే న‌డుస్తున్న యూనిట్ల ఆధునికీక‌ర‌ణ‌/ సాంకేతిక‌త మెరుగుద‌లతో పాటు కొత్త యూనిట్ల ఏర్పాటుకు కూడా అవ‌స‌ర‌మ‌య్యే యంత్ర ప‌రిక‌రాల వ్య‌యంలో 20 శాతం మేర‌కు బ్యాక్ ఎండ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రాంట్/స‌బ్సిడీ స‌మ‌కూర్చ‌డం ద్వారా ఉద్యోగ క‌ల్ప‌న‌తో పాటు పెట్టుబ‌డి మ‌రియు త‌యారీ ప్ర‌క్రియ‌ల‌కు ప్రోత్స‌ాహ‌కాన్ని అందించాల‌నే ప్ర‌తిపాద‌నలు ఉన్నాయి. ఈ స‌బ్- స్కీము లో భాగంగా లెద‌ర్, ఫుట్‌వేర్‌ అండ్ యాక్స‌స‌రీస్ & కంపోనంట్స్ సెక్ట‌ర్ లో మూడేళ్ళ కాలంలో రూ. 425 కోట్ల ప్ర‌తిపాదిత ఖ‌ర్చుతో 1000 యూనిట్ల‌కు ప్రోత్సాహ‌కాల‌ను అందించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది.

ఎస్టాబ్లిశ్‌మెంట్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఫెసిలిటీస్ స‌బ్- స్కీమ్‌: ఫుట్‌వేర్ డిజైన్ & డివ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డిడిఐ)ల యొక్క క్యాంప‌స్‌ల‌లో కొన్ని క్యాంప‌స్ ల స్థాయిని ‘‘సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌’’ స్థాయికి చేర్చ‌డానికి మ‌రియు త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌నున్న మెగా లెద‌ర్ క్ల‌స్ట‌ర్స్ కు తోడు కొత్త‌గా అన్ని వ‌స‌తుల‌తో కూడిన 3 నైపుణ్య కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి మూడు సంవ‌త్సరాల కాలంలో రూ. 147 కోట్ల‌ను వెచ్చించాల‌న్న ప్ర‌తిపాద‌న ఈ స‌బ్- స్కీములో ఓ భాగం.

మెగా లెద‌ర్‌, ఫుట్‌వేర్ అండ్ యాక్స‌ెస‌రీస్ క్ల‌స్ట‌ర్ (ఎమ్ఎల్ఎఫ్ఎసి) స‌బ్- స్కీమ్‌: లెద‌ర్ ఫుట్ వేర్ అండ్ యాక్స‌స‌రీస్ సెక్ట‌ర్ కు మౌలిక స‌దుపాయాల ప‌రంగా అండ‌దండ‌ల‌ను అందించ‌డ‌మే ధ్యేయంగా ఈ ఎమ్ఎల్ఎఫ్ఎసి స‌బ్- స్కీము రూపొందింది. ఇందుకోసం మెగా లెద‌ర్ ఫుట్‌వేర్ అండ్ యాక్స‌ెస‌రీస్ క్ల‌స్ట‌ర్ ను నెల‌కొల్పుతారు. అర్హ‌త క‌లిగిన ప్రాజెక్టుకు అయ్యే వ్య‌యంలో భూమి ఖ‌ర్చు మిన‌హా 50 శాతం వ‌ర‌కు ద‌శ‌ల వారీ స‌హాయాన్ని అందించాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. అయితే ప్ర‌భుత్వ‌ప‌రంగా గ‌రిష్ఠంగా స‌మ‌కూర్చే స‌హాయాన్ని రూ. 125 కోట్ల‌కు ప‌రిమితం చేస్తారు. 3 లేదా 4 కొత్త ఎమ్ఎల్ఎఫ్ఎసి ల‌కు మూడేళ్ళ కాలంలో రూ. 360 కోట్ల‌ను వెచ్చించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది.

లెద‌ర్ టెక్నాల‌జీ, ఇన్నోవేశ‌న్ అండ్ ఎన్‌వైర‌న్‌మెంట‌ల్ ఇశ్యూస్ స‌బ్- స్కీమ్‌: ఈ స‌బ్- స్కీము లో భాగంగా కామ‌న్ ఎఫ్ల‌ుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (సిఇటిపి)ల స్థాప‌న‌/స్థాయి పెంపున‌కు గాను ప్రాజెక్టు వ్య‌యంలో 70 శాతం మేర‌కు స‌హాయం అందించాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ స‌బ్- స్కీముకు గాను మూడేళ్ళ కాలంలో రూ. 782 కోట్ల‌ను వెచ్చించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది.

లెద‌ర్‌, ఫుట్‌వేర్ అండ్ యాక్స‌ెస‌రీస్ సెక్ట‌ర్ లో భార‌తీయ బ్రాండ్ లకు మద్దతివ్వడానికి ఉద్దేశించిన స‌బ్- స్కీమ్‌: బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం ఆమోదించిన అర్హ‌మైన యూనిట్ల‌కు ఈ స‌బ్ స్కీములో భాగంగా స‌హాయాన్ని అంద‌జేస్తారు. ప్ర‌తి ఒక్క బ్రాండు కు 3 సంవ‌త్స‌రాల పాటు ఏటా రూ. 3 కోట్ల ప‌రిమితితో- ప్రాజెక్టు మొత్తం వ్య‌యంలో 50 శాతం మేర‌కు- ప్ర‌భుత్వ స‌హాయాన్ని అందించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. ఈ స‌బ్- స్కీము లో భాగంగా మూడేళ్ళ కాలంలో రూ. 90 కోట్ల ప్ర‌తిపాదిత వ్య‌యంతో 10 భార‌తీయ బ్రాండ్ లకు అంత‌ర్జాతీయ విప‌ణి లో మద్దతును అందిస్తారు.

లెద‌ర్‌, ఫుట్‌వేర్ అండ్ యాక్స‌ెస‌రీస్ సెక్ట‌ర్ లో అద‌న‌పు ఉపాధి ప్రోత్సాహ‌క సంబంధిత స‌బ్- స్కీమ్‌: ఈ స్కీము లో భాగంగా లెద‌ర్‌, ఫుట్‌వేర్ అండ్ యాక్స‌ెస‌రీస్ రంగంలోని కొత్త‌గా ఉద్యోగంలో చేరిన వారంద‌రికీ ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) లో చేరిన త‌రువాత మొద‌టి 3 సంవ‌త్స‌రాల‌లో యాజ‌మాన్య సంస్థ‌లు చెల్లించాల్సిన 3.67 శాతం చందాను స‌మ‌కూర్చాల‌ని ప్ర‌తిపాదించారు. రూ. 15,000 వ‌ర‌కు జీతం తీసుకొనే ఉద్యోగుల‌కు ఈ స‌బ్- స్కీము వ‌ర్తిస్తుంది. ఈ రంగాల‌లో సుమారుగా 2,00,000 ఉద్యోగాలకు నిశ్చిత రూపాన్ని ఇవ్వడంలో స‌హ‌క‌రించేందుకు రూ. 100 కోట్ల‌ను వెచ్చించాల‌ని ప్ర‌తిపాదించారు.

ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్రోత్సాహ‌కాలు మ‌రియు కార్మిక చ‌ట్టాల స‌ర‌ళీక‌ర‌ణ కోసం కొన్ని చ‌ర్య‌ల‌తో కూడిన ఒక ప్ర‌త్యేక ప్యాకేజీకి కూడా మంత్రివ‌ర్గం త‌న ఆమోదాన్ని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం లోని 80JJAA సెక్షన్ పరిధిని అధికం చేయడం, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్ మెంట్ (స్టాండింగ్ ఆర్డర్) యాక్ట్, 1946 లోని సబ్ సెక్షన్ (1)లో భాగంగా ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్ ను ప్రవేశపెట్టడం వంటి చర్యలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

***