Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా లోని తువామ్ వద్ద మోపా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం & ఎలక్ట్రానిక్ సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

గోవా లోని తువామ్ వద్ద మోపా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం & ఎలక్ట్రానిక్ సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


నేను జపాన్ నుండి గత అర్ధరాత్రి ఇక్కడకు వచ్చానని, మళ్ళీ ఉదయమే మీ సేవలో ఇక్కడ ఉన్నాననీ, శ్రీ లక్ష్మీకాంత్ గారు చెప్పారు. ఇక్కడ నుండి నేను కర్ణాటక కు వెళ్ళాలి. కర్ణాటక నుండి నేను మహారాష్ట్రకు వెళ్తాను. ఆ తరువాత అర్ధరాత్రి నాకు ఢిల్లీ లో ఒక
సమావేశం ఉంది. ప్రధాన మంత్రిని అయ్యాక, నేను ఒక రాత్రి కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలోనైనా ఉన్నానంటే, అది ఇక్కడ గోవా లోనే. ఈ రోజు,

లక్షలాది మంది గోవా ప్రజలను అభినందిస్తున్నాను; అలాగే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోవా ప్రభుత్వానికి, మనోహర్ గారికి, లక్ష్మీకాంత్ గారికి మరియు వారి యావత్తు బృందానికి నేను అభినందనలు తెలపాలనుకొంటున్నాను.

చాలా సంవత్సరాల తరువాత ఒక పెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇక్కడ గోవాలో జరుగుతోంది, అదే బ్రిక్స్ సదస్సు; దానిని ఎంత అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారంటే- ఈ రోజు ప్రపంచం లోని పెద్ద పెద్ద నాయకులందరూ గోవా, గోవా, గోవా అనే పేరును మాత్రమే జపిస్తున్నారు. అందువల్ల, నేను గోవా ప్రజలను, గోవా ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి మనోహర్ గారిని, ఆయన సహచరులను అభినందిస్తున్నాను. ఎందుకంటే, ఇది కేవలం గోవా గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయడమే కాదు, మొత్తం భారతదేశం గౌరవ, మర్యాదలను పెంపొందించింది. మీవల్లనే ఇది సాధ్యమైంది. అందువల్ల మీరందరూ తప్పకుండా అభినందనలు స్వీకరించడానికి అర్హులే.

సోదరులు మరియు సోదరీమణులారా, ఇది నాకు ఒక ఆనందదాయకమైన సందర్భం. రాజకీయ అస్థిరత గోవాను ఎలా దెబ్బతీసిందో మీరు చూసే ఉంటారు. ఇంత కాలం అదీ, ఇదీ అంటూ, ఏమేమి జరిగాయో మీకు తెలుసు. గోవాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, గోవాను, గోవా ప్రజలను వారి పూర్తి సామర్ధ్యానికి తగ్గట్టు పెంపొందడానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఒక రాజకీయ సంస్కృతిని తీసుకువచ్చిన మనోహర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాని వల్ల ఆయన కూడా చాలా నష్టపోవలసి వచ్చింది. ఎంతో మంది మంచి మిత్రులను దూరం చేసుకొన్నారు. అయితే, ఆయన ఉద్దేశం కేవలం గోవాను నూతన శిఖరాలకు తీసుకువెళ్ళాలి, గోవాలో సుస్థిరత, గోవా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అవసరమైన విధానాలతో అయిదు సంవత్సరాలు నడిచే ప్రభుత్వాన్ని రూపొందించాలి. ఆయన అది సాధించారు. 2012 నుండి 2017 వరకు సుస్థిరమైన ప్రభుత్వం ద్వారా గోవా ప్రయోజనం పొందింది. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా నడుపుతున్న రెండు పార్టీలు మరియు గోవా ప్రజలు సుస్థిర ప్రభుత్వం శక్తిని అర్ధం చేసుకున్నారు. ఇందుకోసమే నేను ఆ పార్టీలను, గోవా ప్రజలను అభినందిస్తున్నాను. వారిని నేను ప్రశంసిస్తున్నాను.

ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ప్రధాన మంత్రిని, నేను ఏ పార్టీకి చెందినవాడినో మీకందరికీ తెలుసు, లక్ష్మీకాంత్ గారు, మనోహర్ గారు ఏ పార్టీకి చెందినవారో కూడా మీకు తెలుసు, మనం ఒకరినొకరు ప్రశంసించుకుంటే, అప్పుడు మనల్ని మనమే పొగడుకొంటున్నామని ప్రజలు కచ్చితంగా అనుకొంటారు. ఒక వారం క్రితం ఒక స్వతంత్ర సంస్థ, ఒక పెద్ద మీడియా సంస్థ, దేశం లోని చిన్న రాష్ట్రాల స్థితి గతులను అధ్యయనం చూసినందుకు ఆనందంగా ఉంది. ఆ సంస్థ వివిధ అంశాలపై సర్వే నిర్వహించింది. భారతదేశం లోని చిన్న రాష్ట్రాలన్నింటిలో గోవాను ఒక ఉజ్జ్వలమైన రాష్ట్రంగా ఈ సహచరులు తీర్చిదిద్దినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. దేశంలోని అన్ని చిన్న రాష్ట్రాలలో సామాజిక భద్రత విషయంలోనైనా, లేదా, ఆరోగ్యం విషయంలో కానీ, లేదా, మౌలిక సదుపాయాల రంగంలో కానీ, వారు గోవాను నూతన శిఖరాలకు చాలా వేగంగా తీసుకువెళ్లి, గోవాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఇది గోవా ప్రజల భాగస్వామ్యం వల్ల మాత్రమే సాధ్యమైంది. లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అందువల్ల, ఈ సందర్భంగా, నేను వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. వారిని నేను అభినందిస్తున్నాను.

నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మనోహర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను మీకొక రహస్యం చెబుతాను. ఏదైనా విషయం పది వాక్యాల్లో చెప్పావలసివస్తే, మనోహర్ గారు ఆ విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పే వారు; ఒక్కోసారి ఆ విషయాన్ని అర్ధం చేసుకోవడం కష్టంగా ఉండేది. ఆ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని ఆయన నమ్మే వారు. ఆయన ఐఐటి నుండి వచ్చారు. నేనేమో సామాన్యమైన మనిషిని. అయితే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన ప్రణాళికలను అధ్యయనం చేసే వాడిని. పేదవారిలో అత్యంత పేదవారి సమస్యలను ఆయన ఎలా అర్ధం చేసుకునే వారో, వారికి పరిష్కారం ఎలా కనుగొనే వారో, నేను చూస్తూ ఉండే వాడిని. ఆయన చేపట్టిన ప్రతి పథకాన్నీ, ఆ తరువాత లక్ష్మీకాంత్ గారు మరింత ముందుకు తీసుకు పోయారు. 3 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన మహిళల కోసం రూపొందించిన గృహ ఆధార్ యోజన ను నేను గమనించినప్పుడు- ఈ పథకం కింద ఒక్కొక్క మహిళకు 1,500 రూపాయలు అందజేశారు. గోవాలో ఇటువంటి పథకం ఒకటి ప్రారంభమైందన్న సంగతి భారతదేశం లోని చాలా రాష్ట్రాలకు కనీసం అవగాహన కూడా లేదు. వయోవృద్దుల కోసం దయానంద్ సరస్వతి సురక్ష యోజనలో భాగంగా లక్షా 50 వేల మంది సీనియర్ సిటిజన్ లు నెలకు 2,000 రూపాయల ప్రయోజనం పొందుతున్నారు. ఇవన్నీ భారతదేశంలో ఎక్కడా అందుబాటులో లేవు. అవి గోవాలో మాత్రమే అందుబాటు ఉన్నాయి. సోదరులు మరియు సోదరీమణులారా, లాడ్ లీ లక్ష్మీ యోజన ను గోవా, మధ్య ప్రదేశ్ లు ప్రారంభించాయి. ఈ పథకంలో భాగంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి బాలిక కు లక్ష రూపాయల మేర సహాయాన్ని అందజేస్తారు. ఈ రోజు గోవాలో 45 వేల మంది ఈ పథకానికి అర్హతను పొందారు.

గోవా చాలా గొప్ప పని చేసింది; మనోహర్ గారు, లక్ష్మీకాంత్ గారుల దూరదృష్టిని ఒకసారి చూడండి. ఈ రోజు ఎలక్ట్రానిక్ సిటీ శంకుస్థాపన జరుగుతోంది. అయితే, దానికంటే ముందు, ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఎటువంటి యువ ప్రతిభ అవసరం ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ స్టూడెంట్స్ స్కీమ్ ద్వారా యువతను డిజిటల్ ప్రపంచానికి అనుసంధానం చేసే విధంగా ఈ ఇద్దరు మేధావులు ఒక ఒక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధమైన దూరదృష్టికి నేను వారిని అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో అనారోగ్యం అనేది ఎంత వ్యయంతో కూడినదో మనందరికీ తెలుసు, అదే పేద వారు అస్వస్థులైతే, అది వారికి ఎంత దుర్భరమో ఆలోచించండి. దీన్ దయాళ్ ఆరోగ్య సేవ ద్వారా సుమారు 25,000 కుటుంబాలు అంటే గోవా లోని దాదాపు అన్ని కుటుంబాలు ఏడాదికి 3 లక్షల రూపాయల భద్రతా పరిధి లోకి వచ్చాయి. ఇది మన గోవా ప్రభుత్వం ప్రత్యేకత. ఈ విధంగా వారి ఆరోగ్యం గురించి కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోంది. అది ఒక రైతు కావచ్చు, ఒక మత్స్యకారుడు కావచ్చు.. ప్రజల క్షేమం కోసం ఇంకా అనేక ప్రణాళికలు ముందు ముందు అమలుకానున్నాయి. గోవా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దేశ ప్రధాన మంత్రి కూడా ఇక్కడకు రావడానికి సంతోషించడంతో పాటు ఇక్కడ శిరస్సును వంచడానికి గర్వపడుతున్నాడు కూడాను.

ఈ రోజు మూడు ప్రాజెక్టులు ప్రారంభమౌతున్నాయి. మోపా కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. బహుశా, ఈ రోజు 50 ఏళ్ల వయస్సు లో ఉన్న గోవా ప్రజలకు ఈ విషయాలపై అవగాహన ఉండి ఉంటుంది. ఏదో ఒక రోజు గోవాలో ఒక విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని, విమానాలు వస్తాయని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని- వింటూనే ఉండవచ్చు. ఈ విషయాలు విన్నారా, లేదా నాకు చెప్పండి. గత ప్రభుత్వాలన్నీ ఈ విషయాలు చెప్పాయా లేదా, అన్ని రాజకీయ పక్షాలు ఈ విషయాన్ని చెప్పాయా, లేదా? అయితే, ఒకసారి ఎన్నికలు పూర్తి కాగానే, విమానాలు వారి సొంత ప్రదేశాలకు వెళ్లాయి. గోవా మాత్రం ఎప్పటిలాగే మిగిలిపోయింది. ఇది జరిగిందా, లేదా ? స్నేహితులారా, నాకు చెప్పండి. అటల్ బిహారీ వాజ్ పేయి గారు చేసిన వాగ్దానం నెరవేరినందుకు ఈ రోజు నేను సంతోషిస్తున్నాను. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం ఈ రోజు నాకు లభించింది. కొత్త విమానాలు కేవలం గాలిలో ఎగరడమే కాదు, అవి మీ కొత్త విమానాశ్రయానికి వస్తాయి. గోవా జనాభా 15 లక్షలు. ఈ విధానం అభివృద్ధి చెందాక గోవా జనాభాకు మూడు రెట్లు, అంటే సుమారుగా 15 లక్షల మంది ప్రజలు గోవాకు రావడం ప్రారంభిస్తారు. పర్యాటకం ఏమేరకు పెరుగుతుందో మీరు ఊహించవచ్చు. గోవా పర్యాటకం అభివృద్ధి చెందిందంటే, భారతదేశ పర్యాటక రంగానికి నూతన శక్తిని ఇవ్వడానికి గోవా ఒక అత్యంత సమర్ధవంతమైన ప్రదేశం అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. గోవాలో సౌకర్యాలు తప్పకుండా మెరుగుపడతాయి. అదేవిధంగా గోవా ప్రజలకు కూడా సౌకర్యాలు పెరుగుతాయి. దీని నిర్మాణ సమయంలో ఇక్కడ ఉన్న వేలాది యువకులకు ఉపాధి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. దీని నిర్మాణం పూర్తి అయిన తరువాత పర్యాటక రంగానికి, గోవా ఆర్ధిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద అవకాశాన్ని ప్రసాదిస్తుంది.

సోదరులు మరియు సోదరీమణులారా, ఈ రోజు ఒక ఎలక్ట్రానిక్స్ తయారీ నగరానికి కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక పారిశ్రామిక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని మీరు భావించవద్దు. ఎలక్ట్రానిక్ తయారీ నగరం నిర్మాణం అంటే చాలా కొద్ది మంది మాత్రమే అర్ధం చేసుకుంటారు. సోదరులు మరియు సోదరీమణులారా, ఈ రోజు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. డిజిటల్ గా శిక్షణ పొందిన, యువత నడిపిస్తున్న, ఒక అధునాతన, 21వ శతాబ్దపు గోవా కోసం ఈ రోజు శంకుస్థాపన చేసినట్లు నేను భావిస్తున్నాను. డిజిటల్ గా శిక్షణ పొందిన, యువత నడిపిస్తున్న, అధునాతన గోవా కు శంకుస్థాపన చేయడం జరిగింది. అది సాంకేతికంగా సమర్ధవంతమైన గోవా గా

రూపుదిద్దుకొంటుంది. గోవా కేవలం గోవా ఆర్ధిక వ్యవస్థ కోసమే కాదు లేదా గోవాకు చెందిన యువత ఉపాధి కోసమే కాదు. భారత భవిష్యత్తును, ముఖ చిత్రాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధంగా గోవా తయారవుతుందని నేను భావిస్తున్నాను. ఈ చర్య మొత్తం 21వ శతాబ్దాన్ని ప్రభావితం చేయనుంది.

సోదరులు మరియు సోదరీమణులారా, వీటన్నిటితో పాటు ఈ రోజు మనం మరో అతి ముఖ్యమైన ప్రాజెక్టు ను చేపట్టబోతున్నాము. భద్రత రంగంలో భారతదేశం సొంతంగా నిలదొక్కుకోవాలనే విషయంలో మనం స్పష్టంగా ఉన్నాం. 70 సంవత్సరాలుగా దేశం స్వతంత్ర దేశంగా ఉంది. మరొకరి దయ దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలని మనం కోరుకోవడం లేదు. మనంతట మనం జీవిస్తాము. ఒక వేళ చనిపోతే, మనం మన ప్రజల కోసం, మన గౌరవం కోసం మరణిస్తాం. 35 ఏళ్ల వయస్సు లోపల 1800 మిలియన్ యువత మన దేశంలో ఉన్నారు. ఉడుకు రక్తంతో, చురుకుగా, తెలివైన ప్రతిభావంతులైన ప్రజలు ఆవిష్కరణలు చేయగలరు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం తో పాటు అన్నీ ఉన్నాయి; అయితే, భద్రత విషయంలో ప్రతి దానికీ మనం ఇంకా విదేశాలపై ఆధారపడి ఉన్నాము. ‘మేక్-ఇన్-ఇండియా’ దిశగా సముద్ర సంబంధ భద్రత రంగంలో ఈ రోజు గోవాలో ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నాము.

సోదరులు మరియు సోదరీమణులారా, ఈ రోజు నేను గోవాకు ప్రత్యేకతమైన కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకొంటున్నాను. అక్బర్ గారిని గురించి చెప్పేటప్పుడు ఆయన దర్బారులో ‘నవ రత్నాలు’ ఉన్నాయని అంటారు. అక్బర్ గారి పాలనను గురించి చెప్పేటప్పుడు, ఈ నవ రత్నాల గురించి, వాటి లక్షణాల గురించి చర్చిస్తారు. అదేవిధంగా, నా బృందంలో కూడా చాలా రత్నాలు ఉండడం నా అదృష్టం. అందులో బాగా మెరిసే ఒక రత్నాన్ని గోవా ప్రజలు నాకు ఇచ్చారు. ఆ రత్నం పేరు శ్రీ మనోహర్ పర్రికర్. 40 ఏళ్లుగా మన సైన్యాన్ని పట్టి పీడిస్తున్నఒక సమస్య పరిష్కారం కోసం పగలు-రాత్రి నిర్విరామంగా కృషి చేసిన ఒక రక్షణ మంత్రి, మన దేశానికి చాలా ఏళ్ల అనంతరం లభించారు. 40 ఏళ్లుగా నలుగుతున్న మన సాయుధ దళాల ‘వన్ ర్యాంక్ – వన్ పెన్షన్’ సమస్యను పరిష్కరించడం మనోహర్ పర్రికర్ గారి ధైర్యానికి ప్రతీక. లేకపోతే, దేశం కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైనికుల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండేది. మనోహర్ గారిని నేను అభినందిస్తున్నాను. మనోహర్ గారి లాంటి సమర్ధుడైన వ్యక్తిని నాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. కొంతకాలం పాటు దేశంలో రక్షణ మంత్రి లేరు. వారిని గురించి ఎవరూ ప్రశ్నించలేదు. నా సహచరునిగా మనోహర్ గారిని నేను అభినందిస్తున్నాను. నాకు ఒక గొప్ప భాగస్వామి లభించాడు. అదే విధంగా మనోహర్ గారి లాంటి వ్యక్తిని ఈ దేశం కోసం అందించిన గోవా ప్రజలను నేను అభినందిస్తున్నాను. ఈ విషయమే గోవాకు వందనం.

సోదరులు మరియు సోదరీమణులారా, భారతదేశ సముద్ర సంబంధ భద్రత రంగంలో, ఈ ‘మైన్ కౌంటర్ మెజర్ వెసల్ ప్రోగ్రాం’ (ఎంసిఎంపి) ఒక అతి ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఇది ప్రజలకు ఉపాధి కల్పించడం మాత్రమే కాక, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పనిచేస్తుంది.

గోవాకు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, గోవా ప్రజలకు నేను ఈ రోజు మరికొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను.

8వ తారీఖు రాత్రి 8 గంటలకు కోట్లాది ప్రజలు ప్రాంతంగా నిద్రపోవడానికి ఉపక్రమించారు. లక్షలాది ప్రజలు నిద్ర మాత్రల కోసం వెతుక్కున్నారు. అయితే అవి వారికి దొరకలేదు.

ప్రియమైన నా దేశ పౌరులారా, దేనికోసమైతే దేశం పోరాడుతోందో, దేనికోసమైతే ప్రతి ఒక్క నిజాయితీపరుడు పోరాడుతున్నాడో, అదే నల్లధనానికి వ్యతిరేకంగా, అదే అవినీతికి వ్యతిరేకంగా నేను రాడుతున్నాను. ఈ దిశగా 8వ తారీఖు రాత్రి 8 గంటలకు నేను ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అయితే, చాలా మంది తమ స్వంత ఆలోచనలను విస్మరించారు. ఎవరైతే వారి భావజాలానికి అనుగుణంగా లేరని భావిస్తారో, ఎవరైతే అందుకు అనుగుణంగా నడచుకోలేదని తలపోస్తారో, అప్పుడు వారు, ఏదో తప్పు జరిగిపోయిందని గగ్గోలు పెడతారు.

ఈ దేశంలోని విధానాలను విశ్లేషించే ఆర్థికవేత్తలు, పాత ప్రభుత్వాలు, పాత నాయకులు అమలు చేసిన ప్రమాణాలలో మార్పుచేసినట్లయితే, నేను వచ్చాక ఈ సమస్య తలెత్తేది కాదు. దేశం ఎన్నుకొన్న ప్రభుత్వం నుండి కొన్ని అంచనాలు ఉంటాయని వారు అర్ధం చేసుకోవాలి. సోదరులు మరియు సోదరీమణులారా, మీరు చెప్పండి.. 2014 లో మీరు అవినీతికి వ్యతిరేకంగా వోటు వేశారా, లేదా ? ఈ పని చేయండి అని మీరు నన్ను అడగలేదా, నల్లధనానికి వ్యతిరేకంగా పనిచేయమని మీరు నన్ను అడగలేదా ? మీరు నాకు చెప్పండి.. మరి, మీరు నన్ను అడిగితే, నేను ఆ పనిని చేశానా, లేదా ? ఈ పనిని చేయమని మీరు నన్ను అడిగితే, నేను ఆ పని చేస్తే, కనీసం కొంత ఇబ్బంది ఉంటుందని మీకు కూడా తెలుసు. అది మీకు తెలియదా ? మీరు నాకు చెప్పండి.. మిఠాయిలు కావాలంటే వాటంతట అవి సులువుగా నోటి దగ్గరికి రావనే విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పాటైన వెను వెంటనే, సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి నాయకత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటి) ని ఏర్పాటు చేశాం. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి లావాదేవీలు జరిగినా ఈ బృందం దాని మీద పనిచేసి, ప్రతి 6 నెలలకు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ను ఇస్తుంది. గత ప్రభుత్వాలు ఈ పనిని నిలిపి ఉంచాయి. అయితే మేము దాన్ని చేశాము. పిల్లల వికాసం బాల్యంలోనే తెలుస్తుంది; పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మనకు ఒక సామెత ఉంది. అటువంటి ఒక పెద్ద, కఠినమైన నిర్ణయాన్ని మొట్టమొదటి రోజునే నేను మంత్రివర్గంలో తీసుకున్నానంటే ఆ తరువాత కూడా నేను ఈ విధమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం కావడం, లేదా ? నేను ఆ విషయాన్ని ఏమైనా మరుగుపరచానా ? లేదు. నేను అలా చేయలేదు. నేను ప్రతి సారీ ఈ విషయం చెబుతున్నాను. ఈ రోజు నేను మీకు ఆ వివరాలు అందజేస్తున్నాను. దేశం నా మాటలు వింటోంది. నేను దేశాన్ని ఎప్పుడూ అంధకారంలో ఉంచలేదు. నేను దేశాన్ని ఎప్పుడూ మోసం చేయలేదు. నేను దాపరికం లేకుండా, చిత్తశుద్ధితో మాట్లాడుతాను.

సోదరులు మరియు సోదరీమణులారా, రెండో ముఖ్యమైన పని గత 50- 60 ఏళ్లుగా ప్రపంచం లోని ఇతర దేశాలతో మనం కుదుర్చుకొన్న ఒప్పందాల ఫలితంగా, మనం ఎటూ కదలలేక నిలచిపోయాం. ఆయా దేశాల నుండి ఎటువంటి సమాచారం పొందలేక పోతున్నాం. ప్రపంచం లోని ఇతర దేశాలతో కుదుర్చుకొన్న ఆ ఒప్పందాలను మార్చడం మనకు చాలా ముఖ్యం. ఆ దిశగా మనం కొన్ని దేశాలతో ఒప్పందాలపై సంతకాలు చేశాం. ఏ భారతీయుడి నుండి అయినా ధనం రావడం గాని, పోవడం గాని ఎప్పుడు జరిగితే అప్పుడు వెంటనే ఆ సమాచారం మనకు అందజేసే విధంగా ఒప్పందం చేసుకోడానికి అమెరికా వంటి ఒక దేశాన్ని ఒప్పించడంలో నేను విజయం సాధించాను. దేశంలోని చాలా దేశాలతో నేను ఈ విధంగా చేశాను. ఇతర దేశాలతో కూడా ఈ విధమైన ఒప్పందాల కోసం పని పురోగతిలో ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే, భారతదేశం నుండి ధనం దోపిడీకి గురైనా, అపహరణకు గురైనా ఆ విషయాన్ని వెంటనే మనకు తెలియజేసే విధంగా మనం ఏర్పాట్లు చేశాము.

ఢిల్లీకి చెందిన ఉన్నతాధికారులకు ఇక్కడ గోవాలో అపార్టుమెంట్లు ఉన్న విషయం మాకు తెలుసు; మీకు కూడా తెలుసు. ఇది వాస్తవం కాదా ? గోవా భవన నిర్మాణదారులు నేను తప్పు పట్టను. గృహాలను విక్రయించడం వారి వ్యాపారం. అయితే వారు ఏడు తరాల నుండి ఎప్పుడూ గోవాలో నివసించలేదు. ఎక్కడో పుట్టి, ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న ఒక పెద్ద ఉన్నతాధికారి గోవాలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు, ఎవరి పేరు మీద ? తమ స్వంత పేరు మీద వారు కొనుగోలు చేయరు. దాన్ని ఎవరి పేరు మీదనో కొంటారు, వారు అలా చేయరా ? ఇతరుల పేరు మీద ఏ ఆస్తి (అంటే బేనామీ ఆస్తి) ఉన్నా, ఆ ఆస్తిని చట్టం ద్వారా స్వాధీనం చేసుకొనే విధంగా మేము ఒక చట్టాన్ని రూపొందించాం. అటువంటి ఆస్తి దేశానికి చెందుతుంది. అది దేశంలోని పేదలకు చెందుతుంది. పేద ప్రజలకు సహాయపడడమే నా ప్రభుత్వ విధి. నేను తప్పకుండా ఆ పని చేస్తాను.

గృహాలలో వివాహం గాని, మరి ఏ ఇతర పవిత్రమైన సందర్భం గాని జరిగినప్పుడల్లా ఆభరణాలు కొనుగోలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అది శ్రీమతి జన్మదినం అయితే, ఆభరణాలు లేదా బంగారం, ఒక్కొక్క సారి రత్నాలు వంటివి కొనుగోలు చేస్తాం. సమస్య ఏమీ లేదు; ఒక సంచి నిండా డబ్బులు తీసుకు రండి; వాటిని తీసుకువెళ్ళండి. రసీదులు లేవు, లెక్క లేదు, ఏమీ లేదు .. ఇదే జరుగుతోందా, లేదా ? లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయా, లేదా ? ఇది పేద ప్రజలు చేస్తున్నారా ? దీన్ని అరికట్టాలా, వద్దా ? 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసి నగలు కొనుగోలు చేస్తే, అప్పుడు మీరు పాన్ నంబర్ ను ఇవ్వవలసి ఉంటుందంటూ మేం ఒక నిబంధన పెట్టాం. దీనిని కూడా వ్యతిరేకించారు. ‘మోదీ గారూ, దయచేసి ఈ నిబంధన పెట్టకండి’ అని పార్లమెంటులో సగానికి పైగా సభ్యులు నా దగ్గరకు వచ్చి అడిగారని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. అందులో కొంతమంది ఈ విషయమై లేఖ రాసే ధైర్యం కూడా చేశారు.

ఈ విషయాన్ని నేను బహిరంగంగా ప్రకటించిన రోజు వారు తమ ప్రాంతాలకు వెళ్లగలరో లేదో నాకైతే తెలియదు. మీ దగ్గర డబ్బులు ఉంటే, మీరు బంగారం లేదా రత్నాలు కొనుగోలు చేసుకోండి, ఆదాయపు పన్ను కు సంబంధించిన మీ పాన్ నంబరు ను తెలియజేయమని మాత్రమే మేం అడిగాం. అది ఎవరు కొనుగోలు చేశారో, ఆ ధనం ఎక్కడ నుండి వచ్చింది, అది ఎక్కడికి పోతోంది ? కనీసం మాకు తెలియాలి.

సోదరులు మరియు సోదరీమణులారా, ఇది 70 ఏళ్ల నాటి సమస్య, 17 నెలల్లో దాన్ని నేను తొలగించాలి. సోదరులు మరియు సోదరీమణులారా, మేము మరో పని చేశాం, దానిని గత ప్రభుత్వాలు కూడా చేశాయి. బంగారం వ్యాపారం చేసే ఈ నగల వ్యాపారులపై ఎక్సయిజ్ డ్యూటీ లేదు. గత ప్రభుత్వాలు కూడా ఇది విధించాలని ప్రయత్నించాయి; అయితే చాలా తక్కువగా. అయితే నగల వ్యాపారులందరూ, నగల వ్యాపారుల సంఖ్య చాలా తక్కువ, ఏ గ్రామంలోనైనా కేవలం ఒకరు లేదా ఇద్దరు నగల వ్యాపారులు ఉండే వారు. అలాగే పెద్ద నగరాలలో ఆ సంఖ్య 50 లేదా 100 ఉండేది, కానీ వారికి అపారమైన శక్తి ఉండేది. కొంతమంది పార్లమెంటు సభ్యులు వారి చెప్పుచేతలలో ఉన్నారు. నేను నగలపై ఎక్సయిజ్ సుంకం విధించినప్పుడు నా మీద అపారమైన ఒత్తిడి వచ్చింది. పార్లమెంటు సభ్యులు, ప్రతినిధి బృందాలు, మనకు బాగా తెలిసిన వారి నుండి ఒత్తిడి వచ్చింది. ‘‘అయ్యా, ఆదాయపు పన్ను అధికారులు వారిని దోపిడీ చేస్తారు, వారిని నాశనం చేస్తారు’’ అని చెప్పారు. అటువంటి కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ పని చేస్తే ఆ తర్వాత ఏమి జరుగుతుందోనని నేను కూడా చాలా భయపడ్డాను. మనం రెండు కమిటీలు వేద్దాం. ఆ తరువాత మనం చర్చిద్దాం అని చెప్పాను. ఆ విధంగా వారు ఎవరినైతే విశ్వసిస్తారో వారితో ప్రభుత్వం తరఫు నుండి మేం ఒక కమిటీ వేశాం. దాంతో గత ప్రభుత్వాలు తమ ఆలోచనలను వెనుకకు తీసుకోవలసి వచ్చింది. చూడండి.. నేను ఈ దేశాన్ని నిజాయతీతో నడపాలని అనుకొంటున్నాను. అందువల్ల నా నిర్ణయాన్ని వెనుకకు తీసుకోలేదు. నగల వ్యాపారులపై అదనపు భారం పడదని, ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎవరైనా వారిపై అనవసరంగా దాడి చేస్తే దానిని మీ మొబైల్ ఫోను లో రికార్డు చేయండి, అటువంటి వ్యక్తులపై నేను చర్య తీసుకుంటాను అంటూ వారికి హామీ ఇచ్చాను. మేం ఈ చర్య తీసుకున్నాం, వీటిని గురించి అవగాహన ఉన్న వారు, వీటినన్నింటినీ చూసి, ఆ తర్వాత మోడీ ఏమి చేయదలచుకున్నారు? అని తప్పకుండా ఆలోచించారు. అయితే, వారందరూ, తమ తమ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీల లాగానే ఆయన కూడా వస్తాడు, చివరికి వెళ్తాడు – అని అనుకున్నారు. నా సోదరులు మరియు సోదరీమణులారా, ఏ పదవి కోసం నేను జన్మించలేదు. నా దేశ ప్రజలారా, దేశం కోసం. నేను నా యింటిని, నాకుటుంబాన్నీ, అన్నింటినీ వదిలేశాను.

మరోపక్క మేము ఈ విషయంపై కూడా దృష్టి పెట్టాము. కొన్ని ఒత్తిళ్లు కారణంగా కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. వారిలో అందరూ అవినీతిపరులు కాదు. ప్రతి ఒక్కరూ చోరులు కాదు. కొన్ని పరిస్థితుల్లో వారు సరిపెట్టుకోవాల్సి రావచ్చు. వారికి అవకాశం వస్తే,, సరైన మార్గంలో వెనక్కి రావడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఇటువంటి వారు చాలా పెద్ద సంఖ్య లో ఉన్నారు. ప్రజల ముందుకు మేము ఒక పధకాన్ని తీసుకువచ్చాము. అటువంటి లెక్కల్లో చెప్పుకోలేని మార్గంలో వచ్చిన నిధులు వారి దగ్గర ఉంటే, అప్పుడు వారు ఆ ధనాన్ని ఐ.డి.ఎస్. చట్టం కింద జమ చేయవచ్చు. వర్తించే జరిమానాలు చెల్లించండి. దానిలో నేను ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. అయితే, ఇటువంటి విషయాలు ఆకళింపు చేసుకోవడంలో వ్యాపారస్తులు చాలా తెలివైనవారు. “ఆయన ఎదో ఒకటి చేస్తాడు” అని – వారు మోడీని బాగా అర్ధం చేసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ 70 ఏళ్లలో అనేక సార్లు ఇదేవిధమైన పథకాలు తీసుకువచ్చారు. అయితే, ఈ సారి, ప్రప్రథమంగా ప్రజలు, ప్రజలు జరిమానాతో సహా 67,000 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ రెండేళ్లలో మొత్తం సర్వేలు, సోదాలు, డిక్లరేషన్ల ద్వారా 1.2 లక్షల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నిధులు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. ఈ ఖాతా నిల్వ 1.2 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. గత రెండేళ్లలో చేసిన పని వివరాలను – ఈరోజు – గోవా భూభాగం నుండి మొత్తం దేశానికి తెలియజేస్తున్నాను.

ఆ తరువాత ఏమి చెయ్యాలో మేం తెలుసుకొన్నాం. మేము జన్- ధన్ ఖాతాలను తెరిచాం. ఈ పథకాన్ని నేను ప్రారంభించినప్పుడు పార్లమెంటులో ఏ రకమైన ప్రసంగాలు చేశారో, నన్ను ఏవిధంగా ఎగతాళి చేశారో మీకు గుర్తుండే ఉంటుంది. అవన్నీ ఎందుకు చెప్పారో నాకు తెలియదు ? మోడీ జుట్టు లాగితే ఆయన భయపడతాడని వారు భావించారు. మీరు మోడీని సజీవంగా దహనం చేసినా, మోదీ భయపడడు. ప్రారంభంలో మేము వచ్చినప్పుడు మేం ఒక పని చేశాం. ప్రధాన మంత్రి జన్- ధన్ యోజన ద్వారా మేము పేద ప్రజల బ్యాంకు ఖాతాలను తెరిచాము. మోడీ ఎందుకు ఈ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారో ఆ సమయంలో ప్రజలకు అర్ధం కాలేదు. ఈ బ్యాంకు ఖాతాల ప్రయోజనాలు ఏమిటో, ఇప్పుడు ప్రజలకు అర్ధమయ్యింది.

200 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. భారతదేశంలో ధనిక వర్గాల ప్రజల
జేబుల్లో వివిధ బ్యాంకుల క్రిడెట్, డెబిట్ కార్డులు ఉన్నాయి. ఈ రకంగా ఉపయోగపడే ఒక కార్డు ఉన్నదని, పేద ప్రజలు కనీసం ఊహించలేదు. ఇది వారికి తెలియదు. సోదరులు మరియు సోదరీమణులారా, ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ద్వారా కేవలం బ్యాంకు ఖాతాలు తెరవడం మాత్రమే కాదు, ఈ దేశంలోని 200 మిలియన్ మంది ప్రజలకు మేము రూపే డెబిట్ కార్డులు అందజేశాము. మేము ఇవన్నీ ఒక ఏడాది క్రితమే చేశాము. వారి ఖాతాలో డబ్బులు ఉంటే, ఈ డెబిట్ కార్డు ద్వారా మార్కెట్ నుండి ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సదుపాయం కూడా ఆ కార్డులో ఉంది. అయితే, ఇతర రాజకీయ గిమిక్ ల మాదిరి గానే ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడగా కొంతమంది ప్రజలు భావించారు. దేశ ఆర్ధిక ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి నేను క్రమంగా వివిధ రకాల ఔషధాలను ఇస్తున్నాను. నెమ్మదిగా నేను మోతాదు పెంచుతున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా, ఇప్పుడు, నా దేశంలోని పేద ప్రజల గొప్ప తనాన్ని చూడండి.. మీరు బ్యాంకులో అడుగు పెట్టండి చాలు అని నేను వారికి చెప్పాను. వారు డబ్బులు ఏమీ కట్టకుండానే బ్యాంకు ఖాతాను తెరవవచ్చు. తద్వారా వారు ఈ ఆర్ధికవ్యవస్థలో ఒక భాగం కావచ్చు. అయితే, స్నేహితులారా, మన దేశంలోని పేద ప్రజల గొప్పతనం చూడండి. ఈ ధనిక ప్రజలు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోలేరు. అయితే మన పేద ప్రజల గొప్పతనాన్ని చూడండి. వారు ఎటువంటి నిల్వ లేకుండా (జీరో బాలన్సు)తో ఒక బ్యాంకు ఖాతా ప్రారంభించగలరని నేను చెప్పాను. అయినా, నా దేశంలోని పేద ప్రజలు 45,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లోని జన్-ధన్ ఖాతాలలో జమ చేశారు. దేశం లోని సామాన్య పౌరుల శక్తిని మనం తప్పక గుర్తించాలి. 20 కోట్ల మంది ప్రజలకు రూపే కార్డులు ఇచ్చాము. అయినా కొంతమంది నమ్మటంలేదు. దీనిని ఒక రాజకీయ ఎత్తుగడగా కొంతమంది భావిస్తున్నారు. ఈ సమస్య క్రమంగా పరిష్కారం అవుతుంది. మేం రహస్యంగా ఒక పెద్ద పని చేశాం, మనోహర్ గారు చేసినట్లు నేను చేయలేను. నేను 10 నెలలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాను. నమ్మకమైన మనుషులతో నేను ఒక చిన్న బృందాన్ని తయారుచేసుకున్నాను. ఎందుకంటే, పెద్ద మొత్తంలో కొత్త నోట్లు ముద్రించి, సరఫరా చేయడం చాలా పెద్ద పని. విషయాన్ని మరుగున పెట్టి, వారిని రహస్యంగా ఉంచడం చాలా కష్టం. లేకపోతే, ఈ వ్యక్తులు బయటపడితే, వారు వారి వారి ఏర్పాట్లు చేసేసుకొంటారు.

మరి స్నేహితులారా, 8వ తేదీ నాటి రాత్రి 8 గంటలకు దేశంలోని నక్షత్రాలు కాంతివంతంగా మెరిసేందుకు ఒక కొత్త అడుగును వేశాం. ఆ రాత్రి ఈ నిర్ణయం వల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉంటాయని కూడా నేను తెలియజేశాను. ఈ విషయం మొట్టమొదటి రోజునే చెప్పాను. అయితే, సోదరులు మరియు సోదరీమణులారా, దేశంలోని మిలియన్ ల కొద్దీ ప్రజల ముందు ఈ రోజు నేను నా శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను. సినిమా హాళ్ల ముందు బారు తీరినప్పుడు అక్కడ కూడా కొట్లాట జరగడానికి ఆస్కారం ఉంటుంది. గత నాలుగు రోజులుగా నేను అన్ని వైపులా చూస్తున్నాను.. డబ్బుల కోసం క్యూ లైన్ లలో నిలబడదామంటే స్థానం లేదు; అవును, అసౌకర్యమైతే ఉంది; నిలువుకాళ్ల మీద ఉండాలంటే మన కాళ్లు నొప్పి పెడుతున్నాయి. అయితే, దీని వల్ల మన దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇలా నిల్చొని ఉందాం అని అంతా అంటున్నారు.

బ్యాంకు ఉద్యోగులందరికీ నేను ఈ రోజు బహిరంగంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ఏడాదిలో, నా మాటలు గుర్తు పెట్టుకోండి. ఒక ఏడాదిలో ఏ బ్యాంకు ఉద్యోగి అయినా ఎంత పని చేస్తారో, గత వారం రోజులుగా వారు అంత కంటే ఎక్కువ పని చేస్తున్నారు. 70 లేదా 75 ఏళ్ల వయస్సులో ఉన్న పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులు బ్యాంకులకు వెళ్లి ‘‘అయ్యా, మేము రిటైర్ అయ్యాం; అయినా మాకు ఈ పని తెలుసును; ఈ పవిత్రమైన కార్యంలో కొంత బాధ్యతను మీరు మాకు అప్పగిస్తే సేవ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని చెబుతున్నట్టు నేను సామాజిక మాధ్యమంలో చూసి చాలా సంతోషించాను. తాము పని చేసిన పాత బ్యాంకు శాఖలకు వెళ్లి సహాయం చేయడానికి తమ సేవలను వినియోగించుకోవలసిందిగా కోరిన రిటైరైన అటువంటి బ్యాంకు ఉద్యోగులందరికీ నేను నమస్కరిస్తున్నాను.

మండుటెండలో బారు తీరి నిలబడి ఉన్న ప్రజలకు, తమ సొంత ఖర్చులతో త్రాగునీటిని సరఫరా చేసిన యువతను, వయోవృద్దులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు పట్టుకుని పరిగెట్టిన వారిని కూడా నేను అభినందిస్తున్నాను. దేశంలోని యువతరం, ముఖ్యంగా ఈ సమయంలో, ఈ పనిని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసింది. ఈ పని విజయవంతం కావడానికి 8వ తేదీ 8 గంటలకు మోదీ

తీసుకొన్న నిర్ణయం కారణం కాదు. కొన్ని లక్షల మంది మినహా, ఈ దేశంలోని 1.25 బిలియన్ ప్రజలు వారి శక్తినంతా కూడదీసుకొని కృషి చేయడమే ఈ పని విజయవంతం కావడానికి కారణం. కాబట్టి, సోదరులు మరియు సోదరీమణులారా, ఈ పథకం తప్పకుండా విజయవంతం అవుతుంది.

మీకు మరో విషయాన్ని నేను చెప్పదలచుకొన్నాను. వోటర్ల జాబితాను తయారుచేయడానికి అన్ని రాజకీయ పార్టీలు పని చేస్తాయి కదా. నాకు చెప్పండి.. ప్రభుత్వ ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులు వారి పని వారు చేస్తారా, లేదా ? అయినప్పటికీ, పోలింగు రోజున, జాబితాలో నా పేరు లేదు, జాబితాలో మా సమాజం పేరు లేదు, వోటు వేయడానికి నన్ను అనుమతించలేదు, అనే ఫిర్యాదులు మనం వింటున్నామా, లేదా ?

సోదరులు మరియు సోదరీమణులారా, ఎన్నికల సమయంలో మనం ఏం చేస్తాం.. కేవలం ఒక మీట నొక్కి బయటకు వస్తాం. ఇది మాత్రమే చెయ్యాలి. అవునా, కాదా ? అయినప్పటికీ, ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 90 రోజులు పడుతుంది. ఈ పనిలో పోలీసు యంత్రాంగం, సిఆర్ పిఎఫ్, ఎస్ఆర్ పి, బిఎస్ఎఫ్, ప్రభుత్వం లోని ప్రతి ఉద్యోగి, రాజకీయ పక్షాలకు చెందిన కోట్లాది కార్యకర్తలు రాత్రి, పగలు 90 రోజుల పాటు పని చేస్తారు. అప్పుడే మన దేశం వంటి ఒక పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. దీనికి 90 రోజులు పడుతుంది. సోదరులు మరియు సోదరీమణులారా, నేను ఈ దేశ ప్రజలను కేవలం 50 రోజుల సమయం కోరాను. సోదరులు మరియు సోదరీమణులారా, డిసెంబర్ 30వ తేదీ వరకు నాకు సమయం ఇవ్వండి. డిసెంబర్ 30వ తేదీ తరువాత నా నిర్ణయంలో ఏదైనా లోపం గమనించినా, నా తప్పు ఏదైనా మీరు గమనించినా, నా ఉద్దేశ్యం తప్పుగా ఉందని మీరు భావిస్తే, అప్పుడు మీరు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉంటాను.

అయితే, దేశంలోని నా సాటి పౌరులారా, ప్రపంచం ముందుకు దూసుకువెళ్తోంది. భారతదేశాన్ని ఈ అనారోగ్యం మన దేశాన్ని ధ్వంసం చేస్తోంది. 800 మిలియన్ మంది, 65 శాతం మంది ప్రజలు 35 సంవత్సరాల లోపు వారు ఉన్నారు; వారి భవిష్యత్తు మన చేతుల లోనే ఉంది. అందువల్ల, సోదరులు మరియు సోదరీమణులారా, ఎవరైతే రాజకీయం చేద్దామనుకుంటున్నారో, వారు అది చేయండి. ఎవరైతే దోపిడీకి గురయ్యారో వారు విలపిస్తూనే ఉండవచ్చు. చెత్త ఆరోపణలు చేసేవారు చేస్తూ ఉంటారు. కానీ, నా ప్రియమైన నిజాయితీ పరులైన దేశవాసులారా, దయచేసి నాతో రండి. కేవలం 50 రోజులు, డిసెంబరు 30వ తేదీ తరువాత, మీరు కోరుకొన్న విధంగా హిందుస్తాన్ ను మీకు అందిస్తానని వాగ్ధానం చేస్తున్నాను.

ఎవరైనా బాధపడుతూ ఉంటే, నాకు నొప్పిగా ఉంటుంది. సోదరులు మరియు సోదరీమణులారా, నా దేశ ప్రజల సమస్యలు నాకు తెలుసు, వారి కష్టాలు నాకు తెలుసు. అయితే, ఈ బాధలు కేవలం 50 రోజుల వరకే. 50 రోజుల తరువాత శుభ్రపరచడంలో మనం విజయం సాధిస్తాము, ఒకసారి శుభ్రపరచడం పూర్తి అయ్యిందంటే కనీసం ఒక్క దోమ కూడా రాదని నేను విశ్వసిస్తున్నాను. నిజాయతీ గల ప్రజలపై నమ్మకంతో నేను ఈ సమరాన్ని ప్రారంభించాను, నిజాయతీపరుల శక్తిని నేను విశ్వసిస్తాను, నాకు నమ్మకం ఉంది, నాకు పూర్తి విస్వాసం ఉంది. ఎటువంటి వ్యక్తుల ధనం మునిగిపోయిందో మీరు ఊహించలేరు. తల్లి గంగాదేవి కూడా ఆశ్చర్యపోయింది, ఒక్క పైసా కూడా ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని వ్యక్తులు, ఈ రోజు కరెన్సీ నోట్లను కుమ్మరించారు. ఆ పేద వితంతువైన తల్లి మోదీని ఆశీర్వదించింది. ఎప్పుడూ ఆమెను చూడని, ఆమె కుమారుడు, కోడలు, నిన్న వచ్చి, ఆమె బ్యాంకు ఖాతాలో 2.5 లక్షల రూపాయలు జమ చేశారు. అటువంటి వితంతువైన తల్లుల దీవెనలు దేశం యొక్క విజయోత్సవాలకు మరింత ఊతమిచ్చాయి. మీరు ఇంతవరకు బిలియన్ లు, ట్రిలియన్ రూపాయల మేర 2- జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం మొదలైనవి మీరు చూసారు. ఆ కుంభకోణాల సూత్రధారులు నాలుగు వేల రూపాయల కోసం ఇప్పుడు క్యూలో నుంచోవలసి వచ్చింది.

వందలాది మిలియన్ ప్రజల ప్రేమ, అభిమానం లేకపోయినట్లయితే, నా మీద వారికి విశ్వాసం లేకపోయినట్లయితే, ఈ పాటికి అనేక ప్రభుత్వాలు వచ్చి, పోయి ఉండేవి. సోదరులు మరియు సోదరీమణులారా, ఏది ఏమైనా, దేశ భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంది. దేశ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం మనం కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కోసారి నేను ఆశ్చర్య పోతాను. నిన్ననే ఒక విలేకరి నాతో మాట్లాడాడు. మనకు తప్పకుండా యుద్ధం రావాలి అని అతను రోజూ పగలు, రాత్రి ఫోన్ చేసే వాడు. ఒకవేళ అక్కడ సమస్యలుంటే నీవు ఏమి చేస్తావని నేను అడిగాను. విద్యుత్తు సరఫరా ఆగిపోతుంది. వచ్చే సరుకులన్నీ ఆగిపోతాయి. అది ఆ విధంగానే జరుగుతుందా ? అని అతను అడిగాడు. ఏదైనా విషయం గురించి చెప్పడం చాలా సులువు; బోధించడం కూడా చాలా సులభం. నీవు నిర్ణయాలు తీసుకొన్నాక సామాన్య ప్రజలకు ఎటువంటి సమస్యా ఉండకూడదు.

దేశంలోని నా తోటి పౌరులకు నేను మరొక విషయం చెప్పదలచుకున్నాను. అవినీతి, నల్లధనం గురించి మాట్లాడటానికి ఈ రోజుల్లో చాలా మందికి ధైర్యం లేదు. ఎందుకంటే దానిని గురించి ఎవరు మాట్లాడితే వారిని పట్టుకొంటున్నారు, ఇదేదో చేపలను పడుతున్నట్టు అనిపిస్తోంది. మోదీ ఏది చేసినా అది మన మంచికే అని, ప్రతి ఒక్కరూ, నవ్వు ముఖంతోనే చెబుతున్నారా, లేదా. ఆ తరువాత, వారు ఒక స్నేహితుడ్ని పిలిచి, ఏదైనా మార్గం ఉందా? అని అడుగుతారు. ‘‘లేదు. మోదీ అన్ని మార్గాలను మూసివేశారు ” – అని ఆ స్నేహితుడు చెపుతాడు. ఇక అప్పుడు వారు వదంతులు వ్యాపింపచేస్తారు. ఉప్పు ధర పెరిగిందని ఓ రోజు ఒక వదంతి వ్యాపించింది. ఇప్పుడు చెప్పండి, 1,000 లేదా 500 రూపాయల నోట్లతో ఉప్పు ఎవరు కొంటారు. 70 ఏళ్ల నుండి దాచుకొన్న వాళ్ళ ధనాన్ని దోచుకోబడుతోందని వారికి తెలుసు. వారు చాలా ఖరీదైన తాళాలు ఉపయోగించారు. అయితే, ఇప్పుడు వాటిని తీసుకునేవారు లేరు. 1,000 రూపాయల నోటు చెల్లదని చెప్పి, ఇప్పుడు యాచకులు కూడా దాన్ని తీసుకోవడం లేదు.

సోదరులు మరియు సోదరీమణులారా, నిజాయతీపరులకు ఎటువంటి సమస్యా లేదు. ఇది వాస్తవమో, కాదో, తెలియదు. అయితే, కొంతమంది వారి పాత 500 రూపాయల కరెన్సీ నోట్లను 450 రూపాయలకే విక్రయిస్తున్నట్లు కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మరికొంత మంది 300 రూపాయలకే విక్రయిస్తున్నారు. మీ 500 రూపాయల నుండి ఒక్క పైసా తగ్గించడానికి కూడా ఎవరికీ అధికారం లేదని, నా దేశ ప్రజలకు నేను చెప్పదలచుకున్నాను. మీ 500 రూపాయలు అంటే కచ్చితంగా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వంద పైసలు. అటువంటి ఏ వ్యాపారం లోనూ మీరు భాగస్వాములు కావద్దు. క్యూలో నిలబడి 2,000 రూపాయల నోట్లు తెచ్చి పెట్టమని, మీకు కూడా కొంత ఇస్తామని కొంతమంది అవినీతిపరులు మిమ్మల్ని కోరవచ్చు.

సోదరులు మరియు సోదరీమణులారా, మీ అందరికీ ఇది నా విన్నపం. ప్రస్తుతం సజీవంగా లేని మీ బాబాయి, మీ మేనమామ, తండ్రి, సోదరుడు వంటి వారు ఎవరైనా ఏదైనా చేసి ఉండవచ్చు; దానిని గురించి మీకు అవగాహన లేకపోవచ్చు. అందులో మీ తప్పు లేదు. మీరు బ్యాంకుకు వెళ్లి ఆ నగదును జమ చేయండి, జరిమానా ఎంత అయితే అంత చెల్లించండి. ప్రధాన స్రవంతి లోకి రండి. ఇది మనందరికీ మంచిది. నేను మరొక విషయం చెబుతాను.. కొంత మంది తరువాత చూద్దాంలే అని అనుకుంటారు; ఆ తరువాత అప్పుడు ఏమి జరుగుతుందో. నా గురించి వారికి తెలియదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ వారి రహస్యాలు అన్నింటినీ నేను బయటపెడతాను. నిజాయతీ లేకుండా ఎవరైతే వ్యవహరిస్తారో వారు ఇది ఒక కాగితం ముక్కే కదా అని ఇప్పుడు అనుకోవచ్చు. దానిని గురించి వారు ఎక్కువగా కష్టపడవద్దు. ఈ పని మీద అవసరమైతే, లక్ష మంది కొత్త ఉద్యోగులను నియోగించవలసివస్తే, నేను వారిని మోహరిస్తాను. కానీ, దేశంలో ఈ పని కొనసాగుతూనే ఉంటుంది. అవినీతి కార్యకలాపాలు అరికట్టబడాలి. ప్రజలు వారు నన్ను అర్ధం చేసుకొంటారు. ఇంతవరకు వారు నన్ను సరిగా అర్ధం చేసుకోలేదు. కానీ, భారీ మోతాదు పడిన తరువాత ఇప్పుడు వారు నన్ను అర్ధం చేసుకొంటారు. అయితే, ఇది అంతం కాదు. నేను బహిరంగంగా చెబుతున్నాను. ఇది అంతం కాదు. దేశంలో అవినీతిని, మోసాన్ని అరికట్టడానికి నా మనస్సులో అనేక ఆలోచనలు, ప్రాజెక్టులు ఉన్నాయి. అవి త్వరలో బయటకు వస్తాయి. కష్టపడి పనిచేస్తూ, నిజాయతీగా జీవనం సాగిస్తున్న నా దేశం లోని పేద ప్రజల కోసం నేను ఇది చేస్తున్నాను. వారు సొంత ఇంటిని పొందాలి. వారి పిల్లలకు మంచి విద్యను అందించాలి. వారి ఇంటి లోని పెద్ద వారికి మంచి ఆరోగ్య సంరక్షణ కల్పించాలి. అందుకోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను.

నాకు గోవా ప్రజల దీవెనలు కావాలి. లేచి నిలబడి, మీ కరతాళ ధ్వనుల ద్వారా నన్ను ఆశీర్వదించండి. నిజాయతీ గల ప్రజలను దేశం చూస్తుంది. దేశంలో నిజాయితీపరులకు లోటు లేదు. రండి.. నిజాయతీతో కూడిన ఈ పనిలో భాగస్వాములు కండి. గోవా లోని నా సోదర సోదరీమణులారా.. ధైర్యంగా ఉండండి. శిరస్సును వంచి మీకు వందనం చేస్తున్నాను. ఇది కేవలం గోవా మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని ప్రతి నిజాయతీపరుని గళం.

సోదరులు మరియు సోదరీమణులారా, ఎటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో నాకు తెలుసు. ఏ రకమైన ప్రజలు నాకు వ్యతిరేకంగా వెళ్తున్నారో నాకు తెలుసు. వాళ్ళు 70 ఏళ్లుగా దాచుకున్న దానిని నేను వారి నుండి లాగేసుకొంటున్నానని నాకు తెలుసు. వారు నన్ను హతమారుస్తారు. వారు నన్ను నాశనం చేస్తారు. వారు ఏది తలచుకుంటే, అది చేస్తారు. సోదరులు మరియు సోదరీమణులారా, దయచేసి నాకు 50 రోజులు సహకరించండి. దయచేసి నాకు 50 రోజులు సహకారం అందించండి. గట్టిగా చప్పట్లతో మీ ఆమోదాన్ని తెలియజేయండి.

అనేకానేక ధన్యావాదములు.

***