గ్రామీణ ప్రజలకు మంచి నాణ్యమైన సేవలు అందేటట్టు జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి) పున: వ్యవస్థీకరణ ను మరియు ఈ కార్యక్రమాన్ని ఫలితాల ప్రాతిపదికన, స్పర్ధాత్మకంగా, పనితీరు రీత్యా పథకాల అమలుపై మరింత శ్రద్ధతో, పక్కా పర్యవేక్షణతో కొనసాగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2017-18 నుండి 2019-20 వరకు అమలు కావలసిన 14వ ఆర్థిక సంఘం (ఎఫ్‌ఎఫ్‌సి) కార్యక్రమంలో భాగంగా ఈ పథకానికి రూ.23,050 కోట్ల కేటాయింపును కూడా ఆమోదించడమైంది. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజానీకం అంతటికీ ఈ పథకం వర్తిస్తుంది.
పథకం పునర్నిర్మాణం వల్ల కార్యక్రమం మరింత విస్తృతంగా, ఫలితం వచ్చేలా, పోటీతత్వంతో జరుగుతుంది. దీంతో పాటుగా.. స్థిరమైన గొట్టపుమార్గం ద్వారా నీటి సరఫరా అందించే లక్ష్యాలను పెంచుకొనేలా మంత్రిత్వ శాఖకు సాయంగా నిలుస్తుంది.
నిర్ణయం లోని పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి:
1. జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి).. 2020 మార్చి వరకు 14వ ఆర్థిక సంఘంతో కలిసి పనిచేస్తుంది.
2. ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి పునర్నిర్మాణం ద్వారా.. జపనీస్ మెదడువాపు వ్యాధి (జెఇ)/తీవ్రమైన మెదడువాపు వ్యాధి లక్షణాలు (ఎఇఎస్) ప్రభావిత ప్రాంతాల్లో నిధుల కోసం 2 శాతం నిధుల కేటాయింపు.
3. ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి లో భాగంగా కొత్త ఉప కార్యక్రమం.. జాతీయ నీటి నాణ్యత సబ్-మిషన్ (ఎన్‌డబ్ల్యుక్యుఎస్‌ఎమ్)ను తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ 2017 ఫిబ్రవరి లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం దాదాపు 28 వేల ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత గృహాలకు (ఇప్పటికే గుర్తించిన) స్వచ్ఛమైన తాగునీటిని తక్షణమే అందించేందుకు ఉద్దేశించింది. అంచనాల ప్రకారం, ఇందుకోసం మార్చి 2021 వరకు (నాలుగు సంవత్సరాలు) కేంద్రం రూ.12,500 కోట్లను గ్రాంటుగా ఇవ్వనుంది. ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి నిధుల నుండే ఈ కేటాయింపులు జరుగుతాయి.
4.ఆమోదించిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఆర్థిక సహాయం చేయాలి (రెండో కీస్తీ లో కనీసం సగం నిధులు ఇవ్వడం). ఈ మొత్తం కేంద్ర నిధుల నుంచి తరువాత రీయింబర్స్ అవుతాయి. ఒకవేళ రాష్ట్రాలు ఈ మొత్తాన్ని నవంబర్ 30 లోగా పొందలేని పక్షంలో ఈ నిధులన్నీ కామన్ పూల్ లో భాగం అవుతాయి. ఈ నిధులు బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు (కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం దరఖాస్తు చేస్తుకున్న) అందజేయబడతాయి.
5.రెండో కిస్తీ లోని మిగిలిన భాగం నిధులు రాష్ట్రాలకు.. పూర్తి చేసిన గొట్టపుమార్గం నీటి సరఫరా పథకం కార్యాచరణ స్థాయి ఆధారంగా విడుదల అవుతాయి. ఈ స్థాయిని మూడో పక్షం సమీక్షిస్తుంది.
6.మంత్రివర్గం 2017-18 నుండి 2019-20 మధ్య కాలంలో ఈ కార్యక్రమం కోసం రూ.23,050 కోట్లను కేటాయించేందుకు అంగీకారం తెలిపింది.
ఆర్సెనిక్/ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలున్న గ్రామాలన్నింటికీ ఎన్‌డబ్ల్యుక్యుఎస్‌ఎమ్ వర్తిస్తుంది. ఆ ప్రాంతాలలో స్థిరమైన ఆధారంతో 2021 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం లో వివిధ అంశాలను తగ్గించుకోవడం ద్వారా ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి నిధుల వినియోగంలో రాష్ట్రాలకు మరింత సరళత్వాన్ని కేంద్రం కల్పించింది.
తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ లోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎమ్‌ఐఎస్) ద్వారా దేశం లోని దాదాపు 77 శాతం గ్రామీణ ప్రాంతాలు ఫుల్లీ కవర్డ్ స్టేటస్ (ప్రతి ఒక్కరికి రోజుకు 40 లీటర్ల స్వచ్ఛమైన నీరు)ను సాధించగా.. 56 శాతం గ్రామీణ ప్రజలు బహిరంగ కేంద్రాల ద్వారా నల్లా నీరు పొందుతున్నారు. 16.7 శాతం ఇళ్లకే నల్లా కనెక్షన్ లు ఉన్నాయి.
పూర్వరంగం:
ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి 2009లో ప్రారంభమైంది. తాగేందుకు అనుకూలమైన, సంపూర్ణమైన, సౌలభ్యమైన, అందుబాటులో, అందరికీ సమానంగా తాగునీటిని అందించే ప్రధాన లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇందులో కేంద్ర, రాష్ట్రాలకు 50:50 నిధుల భాగస్వామ్యం ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా.. ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి పథకం విజయవంతం కావడం, ఇందులోని లోపాల ద్వారా.. ప్రస్తుత మార్గదర్శకాలకు, రాష్ట్రాలకు నిధుల విడుదలకు కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందని భావించడమైంది. తద్వారా లక్ష్యాలతో ముందుకుపోయేందుకు, పోటీతత్వం పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి ని మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా, సుస్థిరతపై దృష్టిపెట్టేలా రాష్ట్రాల మధ్య పోటీని ప్రోత్సహించేలా, రాష్ట్రాలు, భాగస్వాములు, నిపుణుల, అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్ లతో వరుసగా చర్చలు జరపడం ద్వారా మార్గదర్శకాలలో సవరణలు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలోని వివిధ అంశాల్లో పలు మార్పులు చేయడం ద్వారా రాష్ట్రాలు ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి నిధుల వినియోగంలో స్వతంత్రతను కల్పిస్తున్నాయి. పైపుల ద్వారా నీటి సరఫరాపై దృష్టి, ఉన్నతమైన సేవలు అందించడంలో నీటి నాణ్యత సరిగా లేని ప్రాంతాలను (జాతీయ తాగునీటి నాణ్యత ఉప-మిషన్ ద్వారా ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత నివాసాలు, జెఇ, ఎఇఎస్ తదితర ప్రాంతాలు) ఈ పరిధిలోకి తీసుకురావడం, బహిరంగ మలమూత్రాదుల విసర్జన రహిత ప్రాంతాలుగా ధ్రువీకరించబడిన గ్రామాలు, ఎస్‌ఎఇవై గ్రామ పంచాయతీలు, గంగా గ్రామ పంచాయతీలు, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (ఐఎపి) జిల్లాలు, సరిహద్దు ఔట్‌పోస్టులు (బిఒపి)లకు గొట్టపుమార్గాల ద్వారా నీటిని సరఫరా చేయటం, నీటి సరఫరా ఆస్తుల ఒ అండ్ ఎమ్ కోసం సంస్థల ఏర్పాటు మొదలైనవి ప్రారంభిచబడ్డాయి.
***