Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వరల్డ్‌ ఫూడ్‌ ఇండియా 2017 లో ప్రధాన మంత్రి ప్రసంగం

వరల్డ్‌ ఫూడ్‌ ఇండియా 2017 లో ప్రధాన మంత్రి ప్రసంగం

వరల్డ్‌ ఫూడ్‌ ఇండియా 2017 లో ప్రధాన మంత్రి ప్రసంగం

వరల్డ్‌ ఫూడ్‌ ఇండియా 2017 లో ప్రధాన మంత్రి ప్రసంగం


శ్రేష్ఠులు,

వ్యాపారం, పరిశ్రమ రంగాల సారథులు,

మహిళలు మరియు సజ్జనులారా,

ప్రపంచ నాయకులు, ఫూడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోని నిర్ణయాత్మక వ్యక్తులు పాల్గొన్న ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. వరల్డ్‌ ఫూడ్‌ ఇండియా 2017 కు మీ అందరికీ ఇదే నా స్వాగతం.

భారతదేశంలో ఉన్న అవకాశాలను తెలిపేందుకు ఈ కార్యక్రమం ఓ వేదిక కానుంది. ఫూడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో మా శక్తి సామర్థ్యాలను ఇది మీకు ప్రదర్శిస్తుంది. వివిధ భాగస్వాములతో అనుసంధానం అయ్యేందుకు, పరస్పర శ్రేయస్సు కోసం కలసి పని చేసేందుకు ఓ వేదికను కల్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నోరు ఊరించే భారతీయ రుచికరమైన వంటకాలను మీ ముందుకు తెస్తుంది.

మహిళలు మరియు సజ్జనులారా,

వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న శక్తులు అనేకమే కాక విభిన్నమైనవి కూడా. వ్యవసాయ యోగ్యమైన భూభాగంలో రెండో అతి పెద్ద దేశం. దేశంలో 127 భిన్నమైన వ్యవసాయ శీతోష్ణ మండలాలు ఉన్నాయి. ఇవి అరటి, మామిడి, జామ, బొప్పాయి, బెండకాయల వంటి రక రకాల పంటలలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెడుతున్నాయి. బియ్యం, గోధుమలు, చేపలు, పండ్లు, కాయగూరల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మేం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం లోని పాల ఉత్పత్తిలో భారతదేశానిదే ఒకటో స్థానం. మా ఉద్యానవన విభాగం గత పది సంవత్సరాలుగా ఏడాదికి 5.5 శాతం సగటు వృద్ధి రేటును కనబరుస్తోంది.

శతాబ్దాలుగా.. సుదూర ప్రాంతాల నుండి భిన్నమైన సుగంధ ద్రవ్యాలను వెదకుతూ వచ్చే వ్యాపారులకు భారతదేశం స్వాగతం పలుకుతోంది. పలుమార్లు వారి భారతదేశ పర్యటన చరిత్రగా మారింది. సుగంధ ద్రవ్యాల ద్వారా యూరోప్‌ తో, ఆగ్నేయ ఆశియా తో మా వ్యాపార సంబంధాలు సుపరిచితం. క్రిస్టోఫర్‌ కొలంబస్‌ గారు కూడా భారతదేశం సుగంధ ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అయ్యారు. అమెరికాకు చేరుకుని భారతదేశానికి ప్రత్యామ్నాయ సముద్ర మార్గాన్ని ఆయన అన్వేషించారు.

ఫూడ్‌ ప్రాసెసింగ్‌ భారతదేశంలో ఓ జీవన విధానం. తరతరాలుగా ఇది కొనసాగుతోంది. గౌరవంగా ఉండే ఇళ్లలోనూ ఇది కొనసాగుతోంది. పులియబెట్టడం వంటి (కిణ్వ ప్రక్రియ) సరళమైన గృహ ఆధారిత సాంకేతికత ద్వారా ప్రఖ్యాతమైన ఊరగాయలు, పాపడ్‌ లు, చట్నీలు, మురబ్బాలను తయారుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని మంచి ఆదరణ ఉంది.

మహిళలు మరియు సజ్జనులారా,

ఓసారి భారీ చిత్రాన్ని మనం చూద్దాం.

నేటి భారతం ప్రపంచంలో వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. వస్తువులు,సేవల పన్ను (జిఎస్ టి) దేశంలోని వివిధ రకాల పన్నులను తొలగించివేసింది. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో 30 ర్యాంకులు ఊర్థ్వ ముఖంగా ఎగసింది. ఇది భారతదేశపు అత్యుత్తమ ప్రదర్శన. 2014లో 142లో ఉన్నాం; ఈసారి టాప్‌-100కు చేరుకొన్నాం. ఈ సంవత్సరం ఏ దేశం కూడా ఇన్ని స్థానాలు ఎగబాకలేదు.

గ్రీన్‌ఫీల్డ్‌ పెట్టుబడుల్లో 2016లో ప్రపంచంలోనే భారతదేశం ఒకటో స్థానంలో నిలచింది. ప్రపంచ నవకల్పన సూచీ, ప్రపంచ లాజిస్టిక్స్‌ సూచీ, ప్రపంచ స్పర్ధ సూచీల లోనూ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టడం గతంలో కంటే చాలా సులభం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందడం సరళీకృతమైంది. పాత చట్టాలన్నీ రద్దు చేశాం. అనుమతులకు భారాన్ని తగ్గించుకొన్నాం

ఇప్పుడు, ఫూడ్‌ ప్రాసెసింగ్ రంగం గురించి ప్రత్యేకంగా చెబుతాను.

ప్రభుత్వం చాలా పరివర్తన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ రంగంలో పెట్టుబడులకు ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ప్రాధాన్యమైన దేశంగా మారింది. ‘మేక్ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో దీనికి ప్రాధాన్యమిస్తున్నాం. భారతదేశంలో తయారుచేసిన ఆహార ఉత్పత్తులను ఇ-కామర్స్‌తో పాటు నేరుగా వ్యాపారం చేసుకొనే విషయంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చాం. విదేశీ పెట్టుబడిదారులకు ఏక గవాక్ష కేంద్రం ఈ దిశగా సహాయం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఆహార, వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ చైన్లకు రుణాలివ్వటాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నారు.

ఓ ప్రత్యేకమైన పోర్టల్‌ ‘నివేశ్‌ బంధు’ (పెట్టుబడిదారుడి మిత్రుడు)ను ఇటీవలే ప్రారంభించాం. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ఫూడ్ ప్రాసెసింగ్‌ రంగంలో అందిస్తున్న ప్రోత్సాహకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. క్షేత్ర స్థాయి వరకు ఉన్న వనరులను, ప్రాసెసింగ్‌ అవసరాలతో సహా చూపిస్తుంది. రైతులు, ప్రాసెసర్లు, వ్యాపారులు, లాజిస్టిక్‌ ఆపరేటర్ల మధ్య అనుసంధాన వేదికగానూ ఇది నిలుస్తుంది.

మిత్రులారా,

వేల్యూ చైన్‌ లోని వివిధ భాగాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా వేగంగా పెరుగుతోంది. కాంట్రాక్టును నిర్ణయించడం, ముడిసరుకు అందుకోవడం, వ్యవసాయ సంబంధాలను సృష్టించుకోవడంలో మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన చాలా విదేశీ కంపెనీలు.. కాంట్రాక్ట్‌ ఫ్రేమింగ్‌ కార్యక్రమాల పైనే దృష్టి పెట్టాయి. ప్రపంచ సూపర్‌ మార్కెట్‌ చైన్‌లకు భారతదేశాన్ని ప్రధాన అవుట్‌సోర్సింగ్‌ కేంద్రంగా గుర్తించడంలో ఇదో స్పష్టమైన అవకాశం.

ఓ వైపు, ప్రాథమిక ప్రాసెసింగ్‌, నిల్వ ఉంచడం, మౌలిక పరిరక్షణ, శీతల గిడ్డంగులు, శీతల రవాణాల వంటి పంట కోత అనంతర నిర్వహణ లోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు, ఫూడ్‌ ప్రాసెసింగ్‌, అదనపు విలువ కల్పించడం మరీ ముఖ్యంగా సేంద్రియ, బలవర్దక ఆహారం ఉత్పత్తి చేసే సరైన ప్రాంతాలలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి.

పెరుగుతున్న నగరీకరణం, పెరుగుతున్న మధ్యతరగతి కారణంగా పరిపూర్ణమైన, ప్రాసెస్డ్‌ ఫూడ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. మీతో ఒకే ఒక్క గణాంకాన్ని పంచుకొంటాను. భారతదేశంలో ఒక రోజులో 10 లక్షలకు పైగా మందికి భోజనాలు అందుతాయి. వీరిలో ప్రతి ఒక్కరూ ఫూడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు సంభావ్య వినియోగదారు. ఇది ఎదురుచూస్తున్న గొప్ప అవకాశాన్ని సూచిస్తోంది.

మహిళలు మరియు సజ్జనులారా,

జీవన శైలి వ్యాధి.. సహజమైన, నాణ్యమైన భోజనాన్ని పొందడంపై ప్రపంచ వ్యాప్తంగా చైతన్యాన్ని పెంచుతోంది. కృత్రిమ రంగులు, రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌ వంటి వాటిపై విరక్తి పెరుగుతోంది. భారతదేశంఈ దిశగా అందరికీ పరిష్కారాలు చూపించగలదు. అంతే కాక, ఇరు పక్షాలకు అనుకూలంగా ఉండే భాగస్వామ్యాన్ని కూడా అందించగలదు.

ఆధునిక సాంకేతికతకు భారత సంప్రదాయక ఆహారం తోడైతే.. ప్రపంచానికి అవసరమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో భారతదేశం సాయం చేయగలుగుతుంది. పసుపు, అల్లం, తులసి ల వంటి భారతీయ ఆహార పధార్థాలను రుచి చూడడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పరిశుభ్రమైన, పౌష్టిక, రుచికరమైన ప్రాసెస్డ్‌ ఫూడ్‌ను సమ్మిళితం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణకు ప్రయోజనాలు కలిగేలా తక్కువ ఖర్చుతోనే భారతదేశంలో తయారు చేయవచ్చు.

ఫూడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా భారతదేశంలో తయారైన ప్రాసెస్డ్‌ ఫూడ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఎప్పటికప్పుడు పోల్చి చూస్తుంది. కోడెక్స్‌ ద్వారా ఆహార సంకలిత ప్రమాణాలను క్రమబద్ధీకరణ, ఆరోగ్యవంతమైన పరీక్ష, ప్రయోగశాల మౌలిక వసతుల నిర్మాణం.. రెండూ కలసి ఆహార వ్యాపారానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో దోహపడతాయి.

మహిళలు మరియు సజ్జనులారా,

మేం గౌరవంగా ‘మా అన్నదాత’ (ఆహారాన్ని అందించే వారు) అని పిలుచుకొనే రైతులు.. ఫూడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో మా ప్రయత్నాలకు కీలకం. రానున్న అయిదు సంవత్సరాలలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాం. ఇందుకోసం ఇటీవలే జాతీయ స్థాయి పథకం ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సంపద యోజన’ను ప్రారంభించాం. ప్రపంచ స్థాయి ఫూడ్‌ ప్రాసెసింగ్‌ మౌలిక వసతుల కల్పనకు ఇది దోహదపడుతుంది. ఇది ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని సృష్టిస్తుందని ఆశిస్తున్నాం. దీని ద్వారా 20 లక్షల మంది రైతులకు మేలు జరగడంతో పాటు రానున్న మూడు సంవత్సరాలలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించగలదు.

మెగా ఫూడ్‌ పార్క్‌లను ఏర్పాటుచేయడం ఈ పథకంలో అత్యంత కీలకం. ఈ ఫూడ్‌ పార్కుల ద్వారా ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రాలతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ క్లస్టర్లను అనుసంధానిస్తాం. ఇది ఆలుగడ్డ, అనాస, నారింజ, ఆపిల్‌ వంటి పంటల విలువను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ పార్కులలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రైతుల బృందాలకు ప్రోత్సహిస్తాం. దీని ద్వారా రైతుల ఉత్పత్తుల వ్యర్థాలు, రవాణా ఖర్చులు చాలా మట్టుకు తగ్గుతాయి. కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి. ఇటువంటి 9 పార్కులు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 30 కి పైగా ఇలాంటి పార్కులు త్వరలో రానున్నాయి.

చిట్టచివరి వినియోగదారుడి వరకు ఉత్పత్తులు చేరేందుకు డిజిటల్‌ సాంకేతిక సౌలభ్యాన్ని పెంచడం ద్వారా పాలనలో మార్పులు తీసుకువస్తున్నాం. నిర్ణీత సమయంలో మా గ్రామాలన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా అనుసంధానం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. భూ రికార్డులను డిజిటైజ్‌ చేస్తున్నాం. మొబైల్ యాప్‌ ల ద్వారానే వివిధ సేవలను అందిస్తున్నాం. ఈ ప్రయత్నాలు రైతులకు నైపుణ్యాలు, జ్ఞానం, సమాచారాన్ని సరైన సమయంలో సరఫరా చేసేందుకు ఉపయోగపడతాయి. మా జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ విపణి అయిన e-NAM ద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు అనుసంధానమ్యాయి. దీని ద్వారా మా రైతులకు స్పర్ధాత్మక ధరలను, ఎంపికలో స్వేచ్ఛను లభిస్తున్నాయి.

సహకారాత్మకమైన, స్పర్ధాత్మకమైన సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తితో.. మా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలసి నిబంధనలు, విధానాల సరళీకరణకు సహకరిస్తున్నాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు చాలా రాష్ట్రాలు అద్భుతమైన ఫూడ్‌ ప్రాసెసింగ్‌ పాలిసీ లను రూపొందించాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ప్రత్యేకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు గుర్తింపు పొందాలని నేను కోరుతున్నాను. ఇలాగే, ప్రతి జిల్లా కూడా ఓ ప్రత్యేక ఆహార పదార్థాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకత సాధించాలి.

మహిళలు మరియు సజ్జనులారా,

నేడు మన బలమైన ఆర్థిక ఆధారమే.. ఉత్సాహపూరితమైన ఫూడ్‌ ప్రాసెసింగ్‌ రంగాన్ని సృష్టించే బలమైన ప్రయోగ కేంద్రాన్ని అందిస్తోంది. విస్తృతమైన మన వినియోగదారుల సంఖ్య.. ఆదాయాన్ని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని పెంచుతోంది. వ్యాపారానుకూలతను పెంచే ప్రభుత్వం.. ఇవన్నీ కలిస్తే.. ప్రపంచ ఫూడ్‌ ప్రాసెసింగ్‌ కూటమిలో భారతదేశానికి గొప్ప స్థానాన్ని కట్టబెడతాయి. భారతదేశ ఆహార రంగంలోని ప్రతి ఉప విభాగం విస్తృతమైన అవకాశాలను కల్పిస్తుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ కీలకంగా మారింది. పాల ఆధారంగా వివిధ ఉత్పత్తులను పెంచటం ద్వారా.. మేం దీన్ని తదుపరి స్థాయికి తీసుకుపోవాలనుకుంటున్నాం. మానవాళికి తేనె ప్రకృతి ఇచ్చిన బహుమతి. దీని ద్వారా మైనం వంటి పలు విలువైన ఉప ఉత్పత్తులు అందుతాయి. దీనికి వ్యవసాయ ఆదాయాన్ని పెంచే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం తేనె ఉత్పత్తి, ఎగుమతుల్లో భారతదేశం ఆరో స్థానంలో ఉంది. తీపి విప్లవం దిశగా భారతదేశం పరిణతిని సాధిస్తోంది.

ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారతదేశం భాగస్వామ్యం ఆరు శాతానికి పైనే. చిన్న రొయ్యల ఎగుమతిలో ప్రపంచంలోనే మేం రెండో స్థానంలో ఉన్నాం. భారతదేశం నుండి చేపలు, మత్స్య సంబంధిత ఉత్సత్తులు దాదాపు 95 దేశాలకు వెళ్తాయి. నీలి విప్లవం ద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థలో భారీ ముందడుగు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు స్పృషించని ఆర్నమెంటల్‌ ఫిషరీస్‌, ట్రౌట్ ఫార్మింగ్‌ రంగాల పైనే మా దృష్టి ఉంది. ముత్యాల వెలికితీత వంటి కొత్త అంశాల్లోనూ అన్వేషణ చేపట్టాలని భావిస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంపై విశ్వాసం.. సుస్థిర అభివృద్ధి దిశగా మా చిత్తశుద్ధికి నిదర్శనం. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిమ్.. దేశంలోనే తొలి సంపూర్ణ సేంద్రియ రాష్ట్రంగా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాలన్నీ సేంద్రియ ఉత్పత్తుల కోసం మౌలిక వసతులను సృష్టించే అవకాశాలను కల్పిస్తున్నాయి.

మిత్రులారా,

భారతదేశ విపణిలో విజయాన్ని సాధించే క్రమంలో.. భారతదేశ ఆహారపుటలవాట్లను, రుచులను అర్థం చేసుకోవటం చాలా కీలకం. ఇందుకోసం మీకో ఉదాహరణ చెబుతాను. పాల ఉత్పత్తులు, ఫల రసాలు భారతదేశపు ఆహార అలవాట్లలో అంతర్భాగం. అందుకే, వారి ఉత్పత్తులో కనీసం ఐదు శాతం పళ్ల రసాలుండేలా చూసుకోవాలని శీతల పానీయాల తయారీదారులకు సూచిస్తున్నా.

పౌష్టికాహార భద్రకు ఫూడ్‌ ప్రాసెసింగ్‌ ఓ పరిష్కారం. ఉదాహరణకు, మన ముతక ధాన్యాలు, చిరు ధాన్యాలలో పౌష్టికాహార విలువలు చాలా ఎక్కువ. ఇవి విపత్కర వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడతాయి. వీటిని ‘పౌష్టికాహార, వాతావరణ అనుకూల’ పంటలుగా కూడా పిలుస్తారు. వీటిపైన మనం సంస్థలను ఏర్పాటుచేయవచ్చా ? మా పేద రైతుల్లో కొందరి ఆదాయం దీని ద్వారా పెరుగుతుంది. దీంతో పాటు పౌష్టికత స్థాయినీ పెంచుతుంది. ఇలాంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా సరైన స్థానం దొరుకుతుంది.

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన సామర్థ్యాలను జతచేద్దామా ? మానవాళి భవిష్యతుతకు భారత సాంప్రదాయాన్ని అనుసంధానం చేద్దామా ? భారతదేశ రైతులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లతో కలుపుదామా ? ఇటువంటి కొన్ని ప్రశ్నలకు యువతకు వదిలేస్తున్నా.

ఈ దిశగా కొన్ని నిర్దిష్ట నిర్ణయాలు తీసుకొనేందుకు వరల్డ్‌ ఫూడ్‌ ఇండియా దోహదపడుతుందని విశ్వసిస్తున్నా. మన ఘనమైన వంటింటి విలువైన విషయాలను, మన పురాతన ఫూడ్‌ ప్రాసెసింగ్‌ జ్ఞానాన్నీ ప్రపంచానికి తెలియజేస్తుంది.

ఈ సందర్భంగా తపాలా శాఖ భారత వంటకాల భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు 24 స్మారక స్టాంపుల సెట్‌ను విడుదల చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది.

మహిళలు మరియు సజ్జనులారా,

భారతదేశ ఫూడ్‌ ప్రాసెసింగ్‌ రంగ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని మీ అందరినీ పేరుపేరునా కోరుతున్నా. అవసరమైనప్పుడు నా సంపూర్ణ సహకారం ఉంటుందని మీకు భరోసా ఇస్తున్నా.

రండి.. భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి.

ఈ దేశం వ్యవసాయం నుండి ఫోర్క్‌ (ఒక రకమైన చెంచా) వరకు విస్తృత అవకాశాలు కల్పిస్తుంది.

ఉత్పత్తికి, ప్రాసెస్‌కు మరియు సమృద్ధికి నిలయం ఈ దేశం.

భారతదేశం కోసమూ, ప్రపంచం కోసమూ తరలి రండి.

మీకు ఇవే ధన్యవాదాలు.