స్వాతంత్ర్యానంతరం దేశ రక్షణలో నిమగ్నమై ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది సైనికుల త్యాగాలను ప్రతి తరమూ గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఓ స్మృతి కేంద్రాన్ని నిర్మించబోతున్నాది. న్యూఢిల్లీలోని ఇండియాగేట్ సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో దీన్ని నిర్మిస్తారు.. దీనితోపాటు జాతీయ యుద్ధ ప్రదర్శనశాలను కూడా కట్టనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.500 కోట్ల దాకా ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు.
దేశ ప్రయోజనాలను కాపాడడానికి, దేశ సౌర్వభౌమాధికారానికి, ఐకమత్యానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూడడానికి సైనికులు చేసిన త్యాగాలు అమూల్యమైనవి. స్వాతంత్ర్యానంతరం 22,500 మందికి పైగా సైనికులు విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దేశానికి స్వాతంత్ర్యంవచ్చి 69 సంవత్సరాలు దాటినప్పటికీ అమరవీరులైన సైనికులకు ఇవ్వాల్సిన గౌరవాన్నిఇంతవరకూ ఇవ్వలేదు. వారికోసం ఎక్కడా స్మృతి కేంద్రాన్ని నిర్మించుకోలేకపోయాం. కేంద్రకేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ లోటును పూడ్చుకోగలిగాం. ఎంతో కాలంగా సైనిక బలగాలు డిమాండ్ చేస్తూ వచ్చిన స్మృతి కేంద్ర నిర్మాణం ఎట్టకేలకు రూపుదాల్చనున్నది.
రక్షణ శాఖ కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ స్టీరింగ్ కమిటీకి అంకితభావంతో పని చేసే ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ బృందం సాయం చేస్తుంది. స్మృతి కేంద్రం, మ్యూజియం పూర్తయిన తర్వాత వాటి నిర్వహణకోసం ఓ సంస్థను ఏర్పాటు చేస్తారు.
దేశం కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టిన సైనికులకు తగిన గౌరవం ఇచ్చి వారిపట్ల కృతజ్ఞతను చాటుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధ స్మృతి కేంద్రాన్ని, ప్రదర్శన శాలను నిర్మిస్తోంది. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలుచుకోవడంద్వారా ప్రజల్లో దేశభక్తి పెంపొందుతుంది. అంతేకాదు దేశప్రజలుఈ యుద్ధ స్మృతి కేంద్రాన్ని, ప్రదర్శనశాలను సందర్శించిడం ద్వారా అమరవీరులైన సైనికులపట్ల తమకున్న కృతజ్ఞతను చాటుకోవచ్చు.
దేశంకోసం చేసిన పోరాటంలో ప్రాణాలను లెక్క చేయకుండా సైనికులు చేసిన పోరాటాల్ని వారి చివరి పోరాట పటిమను వారిలో ఉన్న నిబద్ధతను ఈ ప్రదర్శన శాలద్వారా భవిష్యత్ తరాలు తెలుసుకుంటాయి. అమరవీరులైన వారిలో కొంతమందికి వారికి దక్కాల్సిన అంతిమ సంస్కారాలు కూడా దక్కని పరిస్థితి తలెత్తుతుంటుంది. వారిని ఎక్కడ ఖననం చేశారో ఒక్కోసారి ఎవరికీ తెలియదు. అలాంటి వారందరి స్మృతిని భవిష్యత్ తరాలకోసం ఈ మ్యూజియంలో నిక్షిప్తం చేస్తారు.
అమరవీరులైన సైనికుల అంకితభావం దేశ నిర్మాణంలో భాగమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వారి త్యాగాలు వూరికే పోలేదు. అవి చిరస్మరణీయాలు. వారు దేశానికి చేసిన సేవతో భారతదేశం మరింత సుసంపన్నమైంది. ఈ స్మృతి కేంద్రాన్ని సందర్శించడంద్వారా మనలో మనం స్ఫూర్తిని నింపుకోవచ్చు. అంతే కాదు అది దేశ నిర్మాణంలో మనల్ని మనం పనరంకితం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.
The National War Memorial will be a perfect tribute to our brave soldiers who have given their lives for the nation. http://t.co/gpTywHGjlB
— Narendra Modi (@narendramodi) October 7, 2015