ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కాండ్లా పోర్టు పేరును మార్చి దీన్‌దయాళ్ పోర్టు గా పెట్టేందుకు తన ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
దేశంలో నౌకాశ్రయాలకు సాధారణంగా అవి ఉన్న నగరం యొక్క లేదా పట్టణం యొక్క పేర్లను పెడుతుంటారు. అయితే, ప్రభుత్వం తగిన పరిశీలన చేపట్టిన అనంతరం గతంలో కొన్ని ఓడరేవుల పేర్లను మార్చి వాటికి మహా నాయకుల పేర్లను పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
కాండ్లా పోర్టు పేరును మార్చి ‘‘దీన్‌దయాళ్ పోర్టు, కాండ్లా’’ అని పెట్టడం ద్వారా భారతదేశం ముద్దుబిడ్డలలో ఒకరైన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సేవలను ఒక గొప్ప దేశం స్మరించుకొన్నట్లు అవుతుంది. ఇది గుజరాత్ ప్రజలకు, మరీ ముఖ్యంగా మహా నేత అందించిన సేవలను గురించి పూర్తిగా తెలియని యువతకు, ప్రేరణను అందించగలుగుతుంది.
పూర్వరంగం:
కాండ్లా పోర్టు పేరును మార్చి దీన్‌దయాళ్ పోర్టుగా కొత్త పేరును పెట్టాలంటూ గుజరాత్ లోని వివిధ వర్గాల ప్రజల నుండి, ప్రత్యేకంగా కచ్ఛ్ జిల్లా నుండి, అభ్యర్థనలు ఉన్నాయి. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ (25.9.1916 – 1.2.1968) తన జీవితాన్ని దేశ ప్రజల సేవకే అంకితం చేసినటువంటి ఒక ప్రముఖ నాయకుడు. ఆయన తన జీవిత పర్యంతం దేశ సేవకు పాటుపడుతూ, సామాన్య ప్రజానీకంతో కలసి పనిచేసి పేదల, శ్రామిక వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేశారు. సహనం, క్రమశిక్షణ, నిస్వార్థం, చట్టం పట్ల ఆదరం వంటి పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తూ, ఆయన చర్యలన్నీ కూడాను ‘సమగ్ర మానవతా’ సూత్రంతో ముడిపడ్డాయి. ఆయన ఆజన్మాంతం ప్రజాస్వామ్యం యొక్క భారతీయీకరణకు అలుపెరుగక కృషి చేశారు. ప్రజాభిప్రాయాన్ని, చట్టాలను గౌరవించారు. పేదల, అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడంలో సాదాతనం, నిజాయతీ మూర్తీభవించిన వ్యక్తిత్వం పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ది.
2017, సెప్టెంబర్ 25 వ తేదీని పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతిని జరుపుకొంటున్న కారణంగా, ఈ ఘనమైన జాతీయ నాయకుడి జయంతి వేడుకలో భాగంగా కాండ్లా పోర్టు పేరును మార్చి దీన్‌దయాళ్ పోర్టు గా పెట్టే నిర్ణయాన్ని తీసుకోవడం అత్యంత సముచితంగా ఉండగలదని భావించడమైంది.
******