Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేబినెట్ ముందుకు జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎమ్) ప్ర‌గ‌తి, ఎన్‌హెచ్ఎమ్‌ కు చెందిన సాధికారిక కార్య‌క్ర‌మం క‌మిటీ, మిష‌న్ స్టీరింగ్ గ్రూప్ నిర్ణ‌యాలు కేబినెట్ ముందుకు జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎమ్) ప్ర‌గ‌తి, ఎన్‌హెచ్ఎమ్‌ కు చెందిన సాధికారిక కార్య‌క్ర‌మం క‌మిటీ, మిష‌న్ స్టీరింగ్ గ్రూప్ నిర్ణ‌యాలు


జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎమ్‌) కింద సాధించిన ప్ర‌గ‌తి వివ‌రాలను ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ముందుంచ‌డం జ‌రిగింది. అంతే కాదు ఎన్‌హెచ్ఎమ్‌ కు సంబంధించిన‌ సాధికారిక కార్య‌క్ర‌మం క‌మిటీ (ఇపిసి), మిష‌న్ స్టీరింగ్ గ్రూప్ (ఎంఎస్‌జి)ల‌కు సంబంధించిన‌ నిర్ణ‌యాలు కూడా కేబినెట్ ముందుకొచ్చాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్య‌క్ర‌మాన్ని (ఎన్ఆర్‌హెచ్‌ఎమ్‌) ను 2005 ఏప్రిల్ నెల‌లో ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసింది. దీన్ని 2013లో జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మంగా (ఎన్‌హెచ్ఎమ్‌)గా రూపాంత‌రం చేశారు. జాతీయ ప‌ట్ట‌ణ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్ యు హెచ్ ఎం)ను 2013లో ప్రారంభించ‌డం వ‌ల్ల ఎన్‌హెచ్ఎమ్‌ కింద ఎన్ఆర్‌హెచ్‌ఎమ్‌, ఎన్ యు హెచ్ ఎం అనే రెండు ఉప కార్య‌క్ర‌మాలు త‌యార‌య్యాయి.
ఎన్‌హెచ్ఎమ్ కింద సాధించిన ప్ర‌గ‌తిని కేబినెట్ గుర్తించింది. ఎంఎంఆర్‌, ఐ ఎం ఆర్‌, యు5ఎంఆర్ , టి ఎఫ్ ఆర్ ల విష‌యంలో త‌గ్గుద‌ల‌ను కూడా గుర్తించింది. అంతే కాదు టీబీ, మ‌లేరియా, లెప్ర‌సీ మొద‌లైన రోగాల‌ను నియంత్రించే కార్య‌క్ర‌మాల ప్ర‌గ‌తిని కూడా కేబినెట్ గుర్తించింది.

కేబినెట్ గుర్తించిన మ‌రి కొన్ని అంశాలు:

– ఎన్‌హెచ్ఎమ్ కాలంలో యు5ఎంఆర్ త‌గ్గుద‌ల రేటు దాదాపుగా రెండింత‌ల‌యింది.

– ఎంఎంఆర్ త‌గ్గుద‌ల రేటు సాధ‌న కార‌ణంగా ఎండిజి 5 ల‌క్ష్యాన్ని భార‌త‌దేశం చేరుకుంటుంది.

– మ‌లేరియా, టీబీ, హెచ్ఐవి/ఎయిడ్స్ ల‌ను నిలుపుద‌ల చేయ‌డం, వాటి కేసుల్లో త‌గ్గుద‌ల సాధించ‌డమ‌నే స‌హస్రాబ్ది వృద్ధి ల‌క్ష్యం 6ను అందుకోవ‌డం జ‌రిగింది.

– కాలా అజార్‌ను తీసుకుంటే 2010నాటికి ప్ర‌తి ప‌దివేల జ‌నాభాకుగాను ఒక కేసు కంటే ఎక్కువ‌గా వ్యాధి వ్యాపించే ప్రాంతాలు 230గా వుండేవి. 2016 నాటికి ఇలాంటి ప్రాంతాల‌ను 94కు త‌గ్గించ‌డం జ‌రిగింది.

– పోస్ట్ పార్ట‌మ్ యుటెరిన్ కంట్రాసెప్టివ్ డివైజ్ (పిపిఐయుసిడి) స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ కు 150 రూపాయ‌ల వంతున ప్రోత్సాహం అందించ‌డం జ‌రిగింది. పిపిఐయుసిడి అమ‌లుకోసం గాను క్ల‌యింట్ ను ఒప్పించి తీసుకొచ్చే ఆశా వ‌ర్క‌ర్ కు 150 రూపాయ‌లు అందించ‌డం జ‌రిగింది. పిపిఐయుసిడి, పోస్ట్ అబార్ష‌న్ ఇంట్రా యుటెరిన్ కంట్రాసెప్టివ్ డివైజ్ (పిఎఐయుసిడి) సేవ‌ల‌ను పెంచ‌డానికిగాను ఈ సేవ‌ల‌ను పొందేవారికి ప్రోత్సాహ‌కాల‌ను అందించాల‌నే ప్ర‌తిపాద‌న‌ల్ని ఎంఎస్ జి ముందు వుంచ‌డం జ‌రిగింది. పిపిఐయుసిడిని అనుమ‌తించే వారికి ప్రోత్స‌హ‌కాలందించాల‌నే ప్ర‌తిపాద‌న‌కు ఎంఎస్ జి అంగీకరించింది. వీరికి అయ్యే ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను, ఫాలో అప్ సంద‌ర్శ‌న‌ల‌కు అయ్యే ఖ‌ర్చుల‌తో స‌హా ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న‌కు అనుమ‌తి ల‌భించింది. అలాగే పిఎఐయుసిడి విష‌యంలో దీని క్ల‌యింట్‌, సేవ‌లందించేవారు, ఆషా వ‌ర్క‌ర్ వీరంద‌రికీ పిపిఐయుసిడి కి అమ‌ల‌య్యే రేట్ల ప్ర‌కార‌మే ప్రోత్సాహ‌కాలందిస్తారు.

– ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు ఒక ఎంఎంయు వుండాల‌నే నిబంధ‌న‌ను స‌డ‌లించారు. మైదాన ప్రాంతాల్లో ప్ర‌తి రోజూ 60 రోగుల‌ కంటే ఎక్కువ‌గాను, కొండ ప్రాంతాల్లో ప్ర‌తి రోజూ 30 రోగుల‌ కంటే ఎక్కువ‌గానూ వుండే ప్రాంతాలకు మాత్ర‌మే ఈ స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. ఎంఎంయుల ప‌నివిధానంలోని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎంఎస్ జి గుర్తించింది.

– యుక్త‌వ‌య‌స్సు బాలిక‌ల కోసం అమ‌లు చేస్తున్న మెన్ స్ట్రువ‌ల్ హైజీన్ స్కీమ్ కింద కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు. 1. ఈ ప‌థ‌కాన్ని చేప‌ట్ట‌బోయే 19 రాష్ట్రాల‌కు మొద‌టి ఏడాదిలో 6 శానిట‌రీ నాప్ కిన్స్ కోసం ఇచ్చే మొత్తాన్ని రూ. 8 నుంచి రూ.12కు పెంచాలి. ఆ త‌ర్వాత ఏడాది నుంచి ఈ మొత్తం ప్ర‌తి 6 శానిట‌రీ నాప్ కిన్స్ కోసం రూ. 8 గానే వుంటుంది. 2. త‌ర్వాత సంభ‌వించే వ్య‌య పెరుగుద‌ల‌కు అనుమ‌తివ్వ‌డానికి వీలుగా మంత్రిత్వ‌శాఖ‌కు అధికారం వుండాలి.

– ఎన్‌హెచ్ఎమ్ కింద కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ బ‌డ్జెట్ సీలింగును పెంచ‌డం జ‌రుగుతుంది. ప‌ర్య‌వేక్ష‌ణ‌, మ‌దింపు వ్య‌యం కూడా ఇందులోనే వుంటుంది. ఈ బ‌డ్జెట్‌ను పెద్ద రాష్ట్రాల వార్షిక ప‌ని ప్ర‌ణాళిక‌కు సంబంధించి 6.5 శాతాన్నుంచి 9 శాతానికి పెంచుతారు. అలాగే ప్ర‌స్తుతం చిన్న రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు వున్నబ‌డ్జెట్‌ను 11 శాతం నుంచి 14 శాతానికి పెంచుతారు.

– ఎన్ హెచ్ కింద చేప‌ట్టే పాఠ‌శాల‌ ఆరోగ్య కార్య‌క్ర‌మాల‌ను బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఇది అన్నిప‌బ్లిక్, ప్రైవేట్ స్కూళ్ల‌లో కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ ద్వారా చేయాల్సి వుంటుంది. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న కార్య‌క‌లాపాల్లాంటి ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా ఈ ప‌ని చేయాలి.

– ప్ర‌తి నెలా ఆశా వ‌ర్క‌ర్ల‌కు రూ. 100 ప్రోత్సాహ‌కం ఇవ్వాలి. మ‌ద‌ర్స్ అబ్ స‌ల్యూట్ అఫెక్ష‌న్ (ఎంఏఏ) కింద త‌ల్లి పాల‌ను ప్రోత్స‌హించ‌డానికి గాను మాతృమూర్తుల స‌మావేశం నిర్వ‌హించ‌డానికి వీలుగా ఆశా వ‌ర్క‌ర్ల‌కు ప్రోత్సాహ‌కం అందిస్తారు.

వ్యూహం అమ‌లు:

– అంద‌రూ నాణ్య‌మైన ఆరోగ్య సేవ‌లు పొంద‌డానికి గాను అందుబాటు సౌక‌ర్యం క‌లిగించాలి.
– కేంద్ర‌, రాష్ట్ర, స్థానిక ప్ర‌భుత్వాల మ‌ధ్య‌న భాగ‌స్వామ్యం నెల‌కొల్పాలి.
– ప్రాధ‌మిక ఆరోగ్య కార్య‌క్ర‌మాలు, సౌక‌ర్యాల నిర్వ‌హ‌ణ‌కు గాను పంచాయితీ రాజ్ సంస్థ‌లు, ప్ర‌జ‌లు భాగ‌స్వాముల‌య్యేలా వేదికను ఏర్పాటు చేయాలి.
– సామాజిక న్యాయం, స‌మాన‌త్వాన్ని ప్రోత్స‌హించ‌డానికి అవ‌కాశాలు క‌ల్పించాలి.
– స్థానిక కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించ‌డానికిగాను వీలుగా రాష్ట్రాల‌కు, ప్ర‌జ‌ల‌కు కావాల్సిన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డానికి ఏర్పాట్లు చేయాలి.
– రోగాలు రాకుండా ముందే నియంత్రణ క‌లిగి వుండే ఆరోగ్య భ‌ద్ర‌త కోసం, దాన్ని ముందు తీసుకెళ్ల‌డానికి గాను అంత‌ర్గ‌త విభాగాల క‌ల‌యిక‌ను ప్రోత్స‌హించ‌డానికి ఒక విధివిధానాల వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేయాలి.

ల‌క్ష్యాలు:

– ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా బాధ్య‌తాయుత‌మైన అంద‌రికీ అందుబాటులో ఉండ‌ గ‌లిగే నాణ్య‌మైన, అంద‌రికీ స‌మానంగా అంద‌గ‌లిగే ఆరోగ్య భ‌ద్ర‌తా సేవ‌ల సాధ‌న‌.

ప్ర‌ధాన‌మైన ప్ర‌భావం:

– అండర్ 5 మ‌ర‌ణాల రేటు (యు5ఎంఆర్‌) : 2010 లో 59 వుంటే 2015 నాటికి 43కు త‌గ్గింది. ఈ విష‌యంలో 1990-2010లో వార్షిక త‌గ్గుద‌ల రేటు 3.7 శాతం వుంటే ఇది 2010-2015 నాటికి 6.1 శాతానికి పెరిగింది. 2014-15 ఏడాదికి తీసుకుంటే ఈ వార్షిక తగ్గుద‌ల రేటు 4.4 శాతం. ప్ర‌స్తుతం వున్న త‌గ్గుద‌ల రేటు ప్ర‌కారం చూసిన‌ప్పుడు అండ‌ర్‌ 5 ఎంఆర్ విష‌యంలో భార‌తదేశం స‌హ‌స్రాబ్ది అభివృద్ధి ల‌క్ష్యం 4ను చేరుకునే అవ‌కాశం వుంది.

– ప్ర‌సూతి మ‌ర‌ణాల శాతం ( ఎంఎంఆర్‌) : ప‌్ర‌తి ల‌క్ష జ‌న‌నాల‌కు సంభ‌వించే ప్ర‌సూతి మ‌ర‌ణాలు) ఈ విష‌యంలో 2010-11 నాటికి 178 వుంటే 2011-13 నాటికి ఈ సంఖ్య 167కు ప‌డిపోయింది. త‌ర్వాత ల‌భించే స‌మాచారాన్ని భార‌తీయ రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ గుర్తించాల్సి వుంది. ప్ర‌సూతి మ‌ర‌ణాల త‌గ్గుద‌ల‌లో సాధిస్తున్న రేటును తీసుకున్న‌ప్పుడు స‌హ‌స్రాబ్ది అభివృద్ధి ల‌క్ష్యం 5ను త్వ‌ర‌లోనే భార‌త‌దేశం సాధిస్తుంది.

– శిశు మ‌ర‌ణాల రేటు (ఐఎంఆర్) (ప్ర‌తి వేయి జ‌న‌నాల‌కుగాను ఏడాది లోపు వ‌య‌సు గ‌ల శిశు మ‌ర‌ణాల సంఖ్య‌) ఈ సంఖ్య 2014లో 39 వుంటే 2015లో ఇది 37కు చేరుకుంది.

– మొత్తం సంతానోత్ప‌త్తి రేటు (టిఎఫ్ ఆర్): ఇది 2010లో 2.5 ఉంటే 2015 నాటికి 2.3కి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2015-16 ప్ర‌కారం ఇది 2.2. ప‌న్నెండో పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళికలో నిర్దేశించుకున్న ల‌క్ష్యం 2.1ను 2017నాటికి సాధించ‌డానికి అవ‌కాశం వుంది.

– మ‌లేరియా ఎపిఐ 2011లో 1.10. ఇది 2016 నాటికి 0.84కు త‌గ్గింది. 12వ పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌తి వేయి మంది జ‌నాభాకు ఒకటికంటే త‌క్కువ‌గా మ‌లేరియా కేసులు న‌మోద‌వుతున్నాయి.

– ప్ర‌తి ల‌క్ష జ‌నాభా తీసుకుంటే టీబీతో చ‌నిపోయేవారి సంఖ్య 2010లో 40 వుంటే ఈ సంఖ్య 2015 నాటికి 36కు ప‌డిపోయింది. అలాగే టీబీ వ్యాధి వ్యాప్తి విష‌యాన్ని తీసుకుంటే ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు 1990లో 465 మందికి వ్యాపిస్తుండేది. ఇది 2014నాటికి 195కు ప‌డిపోయింది. అలాగే ప్ర‌తి ల‌క్ష జ‌నాబాను తీసుకుంటే వ్యాధి సంక్ర‌మ‌ణ 2000 సంవ‌త్స‌రంలో 289 వుంటే 2010లో 247కు చేరుకోగా 2015లో 217గా న‌మోదైంది. 1990 స్థాయిని తీసుకుంటే ప్ర‌తి ఏడాది టీబీ విస్త‌ర‌ణ‌, మ‌ర‌ణాలు స‌గానికి ప‌డిపోయాయి.

– ప్ర‌తి ప‌దివేల జ‌నాభాను తీసుకుంటే జాతీయ స్థాయిలో లెప్ర‌సీ సంభ‌వించే రేటు 2012, మార్చి 31నాటికి 0.68 వుంటే 2017 మార్చి 31నాటికి 0.66. 2017 మార్చి నాటికి దేశంలోని 556 జిల్లాలు 12వ ప్ర‌ణాళిక ల‌క్ష్యాన్ని అందుకున్నాయి.

– కాలా అజార్‌ – ఈ వ్యాధి రావ‌డానికి అవ‌కాశ‌మున్న ప్రాంతాల సంఖ్య‌ను తీసుకుంటే ప్ర‌తి ప‌దివేల జ‌నాభాలో ఒక‌రికి పైగా కాలా అజార్ వ‌చ్చే అవ‌కాశ‌మున్న ప్రాంతాలు 2010లో 230 వుంటే ఈ సంఖ్య 2016 నాటికి 94కు ప‌డిపోయింది.

– బోదాకాలు – దేశంలో ఈ వ్యాధి రావ‌డానికి అవ‌కాశ‌మున్న ప్రాంతాల్లో (256) ట్రాన్సిమిష‌న్ అసెస్ మెంట్ స‌ర్వే (టిఏఎస్‌) జ‌రిగింది. 2017 మార్చి 31నాటికి 94 జిల్లాలు ఒక శాతానికి త‌క్కువ‌గా ఎంఎఫ్ రేటును సాధించాయి. దాంతో సార్వ‌త్రికంగా మందును స‌ర‌ఫ‌రా చేసే మాస్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ఆప‌డం జ‌రిగింది.

2012-13నుంచి 2016-17వ‌ర‌కు రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు విడుద‌ల చేసిన నిధులు రూ. 88,353.59 కోట్లు (కైండ్ గ్రాంటుల‌తో క‌లిపి). 2016-17 ఏడాదిని మాత్ర‌మే తీసుకుంటే రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు విడుద‌ల చేసిన నిధులు (కైండ్ గ్రాంటుల‌తో క‌లిపి) రూ. 18,436.03 కోట్లు.

సమాజంలోని అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూర్చ‌డానికి ఎన్‌హెచ్ఎమ్ ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల‌ను సంద‌ర్శించే వారంద‌రూ ఎన్‌హెచ్ఎమ్ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. 2016-17లో 146.82 కోట్ల మంది అవుట్ పేషంట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకున్నారు. 6.99 కోట్ల మంది ఇన్ పేషంట్ సేవ‌ల‌ను పొందారు. 2016-17లో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో 1.55 కోట్ల స‌ర్జ‌రీలు జ‌రిగాయి.

దేశంలోని అన్నిరాష్ట్రాల్లో, అన్ని జిలాల్లో ఎన్‌హెచ్ఎమ్ అమ‌ల‌వుతోంది.

ఇప్ప‌టికే కొన‌సాగుతున్న కార్య‌క్ర‌మాలు:

జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎమ్) కింద జాతీయ గ్రామీణ ఆరోగ్య మిష‌న్ (ఎన్ ఆర్ హెచ్ ఎం), జాతీయ ప‌ట్ట‌ణ ఆరోగ్య మిష‌న్ (ఎన్ యు హెచ్ ఎం) పేరు మీద రెండు ఉప మిష‌న్లున్నాయి. 2005 ఏప్రిల్లో ఎన్ ఆర్ హెచ్ ఎం ను ప్రారంభించ‌డం జ‌రిగింది. 2013 మే 1 ఎన్ యు హెచ్ ఎంకు కేంద్ర కేబినెట్ ఆమోదం ల‌భించింది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా, బాధ్య‌తాయుగ‌తంగా వుంటూ అంద‌రికీ అందుబాటులో, స‌మానంగా సేవ‌లు అందుతూ, నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించ‌డానికిగాను ఎన్ హెచ్ ఎంను రూపొందించారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం, గ‌ర్భ‌ధార‌ణ‌, మాతృత్వం, శిశు ఆరోగ్యం, చిన్నారుల ఆరోగ్యం, యుక్త‌వ‌య‌స్సుకు వ‌చ్చిన‌ వారి ఆరోగ్యం త‌దిత‌ర అంశాల్లో వైద్యం, అంటువ్యాధుల‌తోపాటు, ఇత‌ర వ్యాధుల నియంత్ర‌ణ ఈ ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలోని ముఖ్య‌మైన అంశాలు.

2016-17లో ఎన్ హెచ్ ఎం కింద సాధించిన ప్ర‌గ‌తి

ఎన్‌హెచ్ఎమ్ కింద 2016-17లో కింద తెలిపిన కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది.

నూత‌న టీకాల ప్రారంభం:

– మీజిల్స్ – రుబెల్లా (ఎంఆర్‌) వ్యాక్సిన్ : సార్వ‌త్రిక వ్యాధి నిరోధ‌క కార్య‌క్ర‌మంలో రుబెల్లా వ్యాక్సిన్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. దీన్ని మీజిల్స్‌- రుబెల్లా కాంబినేష‌న్ వ్యాక్సిన్‌గా ఇస్తున్నారు. రుబెల్లా ఇన్ ఫెక్ష‌న్ కార‌ణంగా వ‌చ్చే జ‌న్యుప‌ర‌మైన జ‌న‌న స‌మ‌స్య‌ల‌ నుంచి చిన్నారుల‌ను కాపాడ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాక్సిన్ ను 2017 ఫిబ్ర‌వ‌రి 5న ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. మొద‌ట త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, గోవా, పుదుచ్ఛేరి, ల‌క్ష‌ద్వీప్ ల‌లో ఎంఆర్ వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింది. 9 నెల‌ల‌ నుంచి 15 ఏళ్ల‌ మ‌ధ్య‌ గ‌ల పిల్ల‌ల‌కు దీన్ని ఇస్తున్నారు. 2017 మార్చి 31 నాటికి 3.32 కోట్ల మంది పిల్ల‌ల‌కు ఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వ‌డం జ‌రిగింది.

– ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపివి) : భార‌త‌దేశం పోలియో ర‌హిత దేశంగా అవ‌త‌రించింది. అయితే ఇదే ప‌రిస్థితి కొన‌సాగ‌డానికి గాను 2015 న‌వంబ‌ర్ 30న ఐపివి ని ప్రారంభించ‌డం జ‌రిగింది.

– వ‌యోజ‌నుల‌ జ‌పనీస్ ఎన్ సెఫ‌లైటిస్ (జెయి) వ్యాక్సిన్ : అస్సాం, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మెద‌డువాపు వ్యాధి అధికంగా వ‌చ్చే 21 జిల్లాలున్నాయి. వీటిని నేష‌న‌ల్ వెక్ట‌ర్ బార్న్ డిజీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ విబిడిసిపి) కింద గుర్తించారు. ఈ జిల్లాల్లో జెయి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. 15-65 ఏళ్ల‌ వ‌య‌స్సున్న వారికి ఈ 21 జిల్లాల్లో జెయి వ్యాక్సిన్ ఇచ్చారు. 2.6 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు.

– రోటా వైర‌స్ వ్యాక్సిన్ : రోటా వైర‌స్ కార‌ణంగా చిన్నారుల్లో సంభ‌వించే మ‌ర‌ణాల‌ను నిరోధించ‌డానికి గాను రోటా వైర‌స్ వ్యాక్సిన్ ను జాతీయ సార్వ‌త్రిక వ్యాధి నిరోధ‌క కార్య‌క్ర‌మంలో ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. మొద‌టి ద‌శ‌లో ఈ వ్యాక్సిన్ ను 4 రాష్ట్రాల్లో ప్ర‌వేశ‌పెట్టారు. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, హ‌రియాణా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అమ‌లు చేశారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో అమ‌లు ఏ విధంగా సాగిందో అధ్య‌యనం చేసిన త‌ర్వాత మ‌రికొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్ర‌వేశ‌పెడ‌తారు.

– మిష‌న్ ఇంద్రధ‌నుష్ (ఎంఐ): దేశంలోని క‌నీసం 90 శాత‌మంది పిల్ల‌ల‌ను వ్యాధినిరోధ‌క కార్య‌క్ర‌మం కింద‌కు తేవ‌డానికి గాను ఈ కార్య‌క్ర‌మాన్ని 2014 డిసెంబ‌ర్ నెల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. దీన్ని 2020 వ‌ర‌కు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు.

– మిష‌న్ ఇంధ్ర‌ధ‌నుష్ లో మూడు ద‌శ‌లు పూర్త‌య్యాయి. నాలుగో ద‌శ కొన‌సాగుతోంది. నాలుగు ద‌శ‌ల్లో మొత్తం 528 జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతోంది. ఈ మూడు ద‌శ‌ల్లోనూ, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న నాలుగో ద‌శ‌లోను 2017 మార్చి 31 నాటికి 2.11 కోట్ల చిన్నారుల‌కు ఈ కార్య‌క్ర‌మం చేరువ‌యింది. వీరిలో 55 ల‌క్ష‌ల మంది పూర్తిగా ల‌బ్ధి పొందారు. అంతే కాదు 56 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు టెట‌న‌స్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు.

– మిష‌న్ ఇంద్రధ‌నుష్ రెండు ద‌శ‌లు పూర్త‌య్యే నాటికి దేశ‌ వ్యాప్తంగా వ్యాధి నిరోధ‌క కార్య‌క్ర‌మంలో 6.7 శాతం వృద్ధి కనిపించింది.

– 2016-17లో 216 జిల్లాల్లో మిష‌న్ ఇంద్రధ‌నుష్ మూడో ద‌శ అమ‌ల‌య్యింది. ఈ స‌మ‌యంలో 61.84 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం చేరింది. వీరిలో 16.28 ల‌క్ష‌ల మంది చిన్నారులు పూర్తిగా ల‌బ్ధి పొందారు. అంతే కాదు 17.78 ల‌క్ష‌ల గ‌ర్భిణీలకు టెట‌న‌స్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు.

ఉచిత మందుల సేవా కార్య‌క్ర‌మం:

– ఉచిత మందుల‌ను అందించ‌డానికి వీలుగా రాష్ట్రాల‌కు కావాల్సిన స‌హాయం అందించ‌డం జ‌రిగింది. మందుల సేక‌ర‌ణ‌, నాణ్య‌త‌ పై హామీ, ఐటీ ఆధారిత‌ స‌ర‌ఫ‌రా నిర్వ‌హ‌ణా వ్య‌వ‌స్థ‌, శిక్ష‌ణ‌, ఫిర్యాదుల ప‌రిష్కారం మొద‌లైన విష‌యంలో స‌హాయం అందించ‌డం జ‌రిగింది.

– ఆరోగ్య భ‌ద్ర‌తా కేంద్రాల ద‌గ్గ‌ర నిర్దేశిత వ్య‌యాన్ని మించి ఖ‌ర్చు జ‌ర‌గ‌కుండా చూశారు.
2015 జులై 2న ఆయా రాష్ట్రాల‌కు కార్య‌క్ర‌మానికి సంబంధించిన వివ‌ర‌ణాత్మ‌క మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అందివ్వ‌డం జ‌రిగింది.

– డ్ర‌గ్స్ అండ్ వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూష‌న్ మేనేజ్ మెంట్ సిస్ట‌మ్స్ (డివిడిఎంఎస్‌) అనే మోడ‌ల్ ఐటీ అప్లికేష‌న్ ను ఆయా రాష్ట్రాల‌కు అందివ్వ‌డం జ‌రిగింది.

– 23 రాష్ట్రాల్లో ఐటీ ఆధారిత మందుల పంపిణీ నిర్వ‌హ‌ణా వ్య‌వ‌స్థ‌ల ద్వారా మందుల సేక‌ర‌ణ‌, నాణ్య‌త వ్య‌వ‌స్థ‌ను, పంపిణీనిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించడం జ‌రిగింది.

– ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అత్య‌వ‌స‌ర మందుల‌ను ఉచితంగా అందివ్వాల‌నే విధానాన్ని అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు తెలియ‌జేయ‌డం జ‌రిగింది.

ఉచిత వైద్య ప‌రీక్ష‌ల సేవా కార్య‌క్ర‌మం:

– దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌యారు చేసి 2015 జులై 2న పంచుకోవ‌డం జ‌రిగింది.

– ప్ర‌భుత్వ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యానికి సంబంధించిన మోడ‌ల్ ఆర్ ఎఫ్ పి డాక్యుమెంట్లు ఇందులో వున్నాయి. ఇవి టెలి రేడియాల‌జీ, ల్యాబ్ ప‌రీక్ష‌ల‌ కోసం హ‌బ్‌ అండ్ స్పోక్ మోడ‌ల్, జిల్లా ఆసుప‌త్రుల్లో సిటి స్కాన్ మొద‌లైన వాటికి సంబంధించిన‌వి.

జీవ వైద్య ప‌రిక‌రాల నిర్వ‌హ‌ణ‌:

– ప‌లు ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల్లో జీవ వైద్య ప‌రిక‌రాలున్న‌ప్ప‌టికీ అవి చాలా మ‌టుకు నిరుప‌యోగంగా వుంటున్నాయి. ఇవి ప‌ని చేసేలా చేసి నిరుప‌యోగాన్ని తొల‌గించేలా చేయ‌డానికి దీన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. వీటి విలువ దాదాపు రూ. 11 వేల కోట్లు. (ఈ నిరుప‌యోగం ఆయా రాష్ట్రాల్లో 20 శాతం నుంచి 60 శాతం వ‌ర‌కు ఉంది)

– ఆయా రాష్ట్రాలు ఇన్వెంట‌రీ మ్యాపింగ్ ను పూర్తి చేశాయి. 2016-17 మ‌ధ్య‌న 13 రాష్ట్రాల్లో బిఎంఎంపిని ప్ర‌తిభావంతంగా అమ‌లు చేయ‌డం జ‌రిగింది.

– 29 రాష్ట్రాల్లోని 29, 115 ఆరోగ్య కేంద్రాల్లో 7, 56, 750 ప‌రికాలున్నాయని తేలింది. వీటి విలువ దాదాపు రూ. 4, 564 కోట్లుగా గుర్తించ‌డం జ‌రిగింది.

– ఈ కార్య‌క్ర‌మం కింద 2016-17 సంవ‌త్స‌రంలో రూ. 113.11 కోట్ల విడుద‌ల‌కు ఆమోదం ల‌భించింది.

– ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల‌కు అవార్డు ప్ర‌దానం చేయ‌డానికిగాను కాయ‌క‌ల్ప కార్య‌క్ర‌మ ప్రారంభం
ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల్లో శుభ్ర‌త‌ను, రోగ నిరోధ‌క చ‌ర్యల‌ను, పారిశుద్ధ్య చ‌ర్య‌ల‌ను పెంచ‌డానికిగాను ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

– 2016-17 సంవ‌త్స‌రంలో ఈ కార్య‌క్ర‌మాన్ని జిల్లా ఆసుప‌త్రుల‌ నుంచి స‌బ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రులకు, సిహెచ్‌సిలు, పిహెచ్‌సీల‌కు విస్త‌రించ‌డం జ‌రిగింది.

– 27 రాష్ట్రాల‌కుగాను రూ. 107.99 కోట్ల నిధుల‌ను ఖ‌ర్చు పెట్ట‌డానికి వీలుగా అనుమ‌తి ల‌భించింది.
30 వేల‌కు పైగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల‌ను ప‌రిశీలించారు. వీటిలో 1100 ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాలు (179 జిల్లా ఆస్పత్రులు, 324 స‌బ్ డిస్ట్రిక్ట్ హాస్పిట‌ల్స్‌, 632 ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రాల‌తో క‌లుపుకొని) కాయ‌క‌ల్ప్ అవార్డుల‌ను పొందాయి.

కిల్కారి అండ్ మొబైల్ అకాడ‌మీ:

– గ‌ర్భం, జ‌న‌నం, చిన్నారుల భ‌ద్ర‌త మొద‌లైన అంశాల‌కు సంబంధించి ఆడియో సందేశాల‌ను ఆయా కుటుంబాల మొబైల్ ఫోన్ల‌కు నేరుగా పంపడం జ‌రుగుతోంది. ఈ ప‌ని గ‌ర్భ‌వ‌తికి నాలుగో నెల వ‌చ్చిన‌ప్ప‌టినుంచీ చిన్నారికి ఒక ఏడాది నిండేంత‌వ‌ర‌కూ చేస్తున్నారు. ప్ర‌తి వారం ఆయా త‌గిన స‌మ‌యాల్లో వీటిని పంపుతారు.

– కిల్కారి కార్య‌క్ర‌మాన్ని బిహార్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఢిల్లీ, హ‌రియాణా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిశా, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నారు.

– కిల్కారి కార్య‌క్ర‌మం కింద 2017 మార్చి 31 నాటికి దాదాపుగా 5.82 కోట్ల సందేశాల‌ను పంప‌డం జ‌రిగింది. (ప్ర‌తి సందేశంలో స‌రాస‌రి స‌మ‌యం 1 నిమిషం).

– అక్రిడిటెడ్ సోష‌ల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశాలు) క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాల‌ను మెరుగుపర‌చ‌డానికి గాను వారి విజ్ఞానాన్ని అప్ డేట్ చేయ‌డానికిగాను ఉచిత ఆడియో శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని మొబైల్ అకాడ‌మీ ద్వారా నిర్వ‌హిస్తున్నారు.

– ఈ కార్య‌క్ర‌మాన్ని బిహార్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నారు.

– ఎంసీటిఎస్ ల‌లో రిజిస్ట‌రైన 79, 660 మంది ఆశాలు మొబైల్ అకాడ‌మీ కోర్సును మొద‌లుపెట్టారు. వీరిలో 68, 803 మంది( దాదాపుగా 86 శాతంమంది) ఆశాలు 2017 మార్చి 31 నాటికి ఈ కోర్సును పూర్తి చేశారు.

మ‌ద‌ర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్ట‌మ్ (ఎంసిటిఎస్‌)/రీప్రొడ‌క్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (ఆర్ సి హెచ్ ) పోర్ట‌ల్‌:

– ఎంసిటిఎస్ అనేది త‌ల్లి, పిల్ల‌ల ఆరోగ్యాన్ని నిరంత‌రం గ‌మ‌నించే వ్య‌వ‌స్థ‌. దీన్ని అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా స‌రైన స‌మ‌యానికి జ‌న‌నం జ‌రిగేలా చూస్తారు. అంతే కాదు త‌ల్లికి పిల్ల‌కు నాణ్య‌మైన ఆరోగ్య సేవ‌లు అందిస్తారు. గ‌ర్భ‌వ‌తిగా వున్న‌పుడు, బాలింత‌గా ఉన్నప్పుడు భ‌ద్ర‌తా సేవ‌ల‌ను అంద‌రూ గ‌ర్భ‌వ‌తుల‌కు అందిస్తారు. అంతే కాదు రోగ నిరోధ‌క కార్య‌క్ర‌మం ద్వారా పిల్ల‌లంద‌రికీ ఆరోగ్య భ‌ద్ర‌త ల‌భిస్తుంది.

– 2017 మార్చి 31 నాటికి 1.68 మంది గ‌ర్భ‌వ‌తులు, 1.31 కోట్ల చిన్నారులు ఎంసిటిఎస్/ఆర్ సి హెచ్ పోర్ట‌ల్ లో రిజిస్ట‌ర‌య్యారు.

కుటుంబ నియంత్ర‌ణ : జాతీయ కుటుంబ నియంత్ర‌ణ కార్య‌క్ర‌మంలో మూడు నూత‌న విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

– ఇంజెక్ష‌న్ ద్వారా గ‌ర్భం రాకుండా చూడ‌డాన్ని ఇంజెక్ట‌బుల్ కంట్రాసెప్టివ్ డిఎంపిఎ (అంత‌ర‌) అంటారు. నెల‌కొక‌టి చొప్పున మూడు ఇంజెక్ష‌న్లు.

– సెంట్‌క్రోమాన్ పిల్ (ఛాయ‌)- ఇది హార్మొనేత‌ర పిల్‌. వారానికి ఒక‌టి.

– ప్రొజిస్టిరాన్ ను పిల్స్ ద్వారా అందిస్తారు (పిఓపి)- పాలిచ్చే త‌ల్లుకు మాత్ర‌మే.

నూత‌న కుటుంబ నియంత్ర‌ణ మీడియా క్యాంపెయిన్‌:

– నూత‌న లోగోతో స‌మ‌గ్ర‌మైన కుటుంబ నియంత్ర‌ణ క్యాంపెయిన్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది.

స‌వ‌రించిన జాతీయ టీబీ నియంత‌ర‌ణ కార్య‌క్ర‌మం (ఆర్ ఎన్ టిసిపి):

– 2016 నాటికి 121 క్యాట్రిడ్జ్ ఆధారిత న్యూక్లియిక్ ఆసిడ్ ఆంప్లిఫికేష‌న్ ప‌రీక్ష‌ల (సిబి ఎన్ ఏఏటి) మెషీన్లు అందుబాటులో వున్నాయి.

– అద‌నంగా 500 సిబిఎన్ ఎఎటి మెషీన్ల‌ను రాష్ట్రాల్లో, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అందించారు.

– ఈ కార్య‌క్ర‌మం కింద టీబీని నియంత్రించ‌డానికి ముఖ్యంగా డిఆర్ టీబీని అరిక‌ట్ట‌డానికి ర్యాపిడ్ క్వాలిటీ వైద్య ప‌రీక్ష‌ల అందుబాటు.

– మందుల‌కు లొంగ‌ని టీబీకి ఇచ్చే చికిత్స‌లో మెరుగుద‌ల సాధించ‌డానికి గాను కండిష‌న‌ల్ యాక్సెస్ ప్రోగ్రామ్ (సిఎపి) కింద నూత‌న యాంటీ టీబీ మందు బెడాకిలిన్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

నేప‌థ్యం:

ఎన్‌హెచ్ఎమ్ విధివిధానాల‌కు కేబినెట్ అనుమ‌తుల కార‌ణంగా మిష‌న్ స్టీరింగ్ గ్రూప్ (ఎంఎస్‌జి)ను, ఎంప‌వ‌ర్డ్ ప్రోగ్రామ్ క‌మిటీ (ఇపిసి)ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఎంఎస్‌జికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఛైర్మ‌న్‌గా వుంటారు. సంబంధిత ప‌ది శాఖ‌ల‌కు చెందిన మంత్రులు, 16 మంది కార్య‌ద‌ర్శులు, ప‌ది మంది నిపుణులు, న‌లుగురు రాష్ట్రాల కార్య‌ద‌ర్శులు ఈ గ్రూప్ స‌భ్యులుగా వుంటారు. అలాగే ఇపిసికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ‌కు చెందిన సెక్ర‌ట‌రీ ఛైర్మ‌న్‌గా వుంటారు. ఎన్ ఆర్ హెచ్ ఎంకు సంబంధించిన అన్ని అంశాల్లోను, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఆర్ధిక నిబంధ‌న‌లకు అనుమ‌తివ్వ‌డానికి, స‌వ‌రించ‌డానికి ఈ క‌మిటీల‌కు హ‌క్కు వుంటుంది. అంతే కాదు విధాన‌ప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌యారు చేయ‌డానికి వీటికి అధికారాలున్నాయి. వీటికి కేటాయించిన అధికారాలు అమ‌లు కావాలంటే ఎన్ ఆర్ హెచ్ ఎంకు సంబంధించిన అభివృద్ధి నివేదిక‌ను ప్ర‌తి ఏడాది కేబినెట్‌కు స‌మ‌ర్పించాల్సి వుంటుంది. ఆర్ధిక నిబంధ‌న‌ల్లో తేడాలు వ‌చ్చినా, అమ‌ల‌వుతున్న కార్య‌క్ర‌మాల్లో స‌వ‌ర‌ణ‌లు చేసినా, నూత‌న ప‌థ‌కాల‌కు సంబంధించిన వివ‌రాలతో ఈ ప్ర‌గ‌తి నివేదిక‌ను రూపొందించాల్సి వుంటుంది.