Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త్వరలో చైనాలో మరియు మయన్మార్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 సెప్టెంబర్ 3-5 తేదీల మధ్య చైనా లోని జియామెన్ లో 9వ బ్రిక్స్ శిఖర సమ్మేళనానికి హాజరు కానున్నారు. అలాగే, ప్రధాన మంత్రి 2017 సెప్టెంబర్ 5-7 తేదీల మధ్య మయన్మార్ లో ఆధికారిక పర్యటనను కూడా జరపనున్నారు.

ప్రధాన మంత్రి ఫేస్ బుక్ లోని తన ఖాతాలో ఈ కింద పేర్కొన్న వివరాలు వరుసగా నమోదు చేశారు :

‘‘ నేను 2017 సెప్టెంబర్ 3-5 తేదీల మధ్య చైనా లోని జియామెన్ లో 9వ బ్రిక్స్ శిఖర సమ్మేళనానికి హాజరు కాబోతున్నాను.

మునుపటి శిఖర సమ్మేళనానికి గత సంవత్సరం అక్టోబర్ లో గోవాలో ఆతిథ్యం ఇచ్చే విశేషాధికారం భారతదేశానికి దక్కింది. గోవా శిఖర సమ్మేళనం లో లభించిన ఫలితాలు మరియు పరిణామాల ఆధారంగా తాజా శిఖర సమ్మేళనం మరింత పురోగతిని సాధించాలని నేను ఆశిస్తున్నాను. బ్రిక్స్ సభ్యత్వ దేశాల భాగస్వామ్యం చైనా అధ్యక్షతన మరింత బలపడే దిశగా తాజా కార్యక్రమాలలో నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు మరియు సకారాత్మక ఫలితాలు లభించాలని నేను ఎదురుచూస్తూ ఉన్నాను.

మొత్తం అయిదు దేశాలకు చెందిన పరిశ్రమ రంగ సారథులు ప్రాతినిధ్యం వహించే బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తో మేము ముఖాముఖి సంభాషిస్తాం.

దీనికి తోడు, ప్రెసిడెంట్ శ్రీ శీ జిన్ పింగ్ సెప్టెంబర్ 5వ తేదీన ఆతిథ్యమిచ్చే ‘ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలప్ మెంట్ కంట్రీస్ డైలాగ్’లో నేను బ్రిక్స్ భాగస్వాములతో పాటు మరో తొమ్మిది దేశాల నాయకులతో కలిసి, పాలు పంచుకోబోతున్నాను.

శిఖర సమ్మేళనం సందర్భంగా నాయకులతో ద్వైపాక్షిక భేటీలకు నాకు అవకాశం లభించనుంది.

శాంతి మరియు పురోగతి సాధన దిశగా తన భాగస్వామ్య పయనాన్ని ఆరంభించి ప్రస్తుతం రెండో దశాబ్దంలోకి ప్రవేశించిన బ్రిక్స్ కూటమి పోషిస్తున్నటువంటి పాత్రకు భారతదేశం అధిక ప్రాముఖ్యాన్నిస్తోంది. ప్రపంచ శాంతి మరియు భద్రతలను పరిరక్షించడంలోనూ, ప్రపంచ సవాళ్లకు పరిష్కారాన్ని వెతకడంలోనూ బ్రిక్స్ అందజేసిన సేవలు ఎన్నదగ్గవి.

మయన్మార్ గణతంత్రం ప్రెసిడెంట్ శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానించిన మీదట సెప్టెంబర్ 5- 7 తేదీల మధ్య నేను మయన్మార్ లో పర్యటించబోతున్నాను. నేను ఇంతకు ముందు 2014లో ఎఎస్ఇఎఎన్- ఇండియా సమిట్ కోసమని ఈ సుందరమైన దేశంలో పర్యటించాను, కానీ ఇది మయన్మార్ లో నేను జరపబోయే ప్రథమ ద్వైపాక్షిక పర్యటన కానుంది.

ప్రెసిడెంట్ శ్రీ యు హతిన్ క్యావ్ తోను, స్టేట్ కౌన్సెలర్, విదేశీ వ్యవహారాల మంత్రి మరియు ప్రెసిడెంట్ కార్యాలయ మంత్రి అయిన డావ్ ఆంగ్ సాన్ సూ కీ తోను భేటీ కావడం కోసం నేను ఆసక్తితో వేచివున్నాను. వారు ఉభయులు 2016లో భారతదేశంలో పర్యటించిన సందర్భంగా ఆ మాననీయ వ్యక్తులతో చర్చలు జరిపే అవకాశం నాకు దక్కింది.

నా పర్యటన సందర్భంగా, మేము మన ద్వైపాక్షిక సంబంధాలలో పరిణామాలను, ప్రత్యేకించి మయన్మార్ లో భారతదేశం చేపడుతున్న సామాజిక, ఆర్థిక సహకార పథకాలు మరియు అభివృద్ధికి సంబంధించిన విస్తృత సహకార కార్యక్రమాలను సమీక్షించనున్నాము. మేము కలిసి పనిచేయగల నూతన రంగాలేమైనా ఉన్నాయా అనేది కూడా అన్వేషిస్తాము.

భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, వ్యాపారం, పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి, అవస్థాపన, శక్తి మరియు సంస్కృతిల పరంగా ప్రస్తుతం అందించుకొంటున్న సహకారాన్ని పటిష్టపరచుకోవడం కోసం ఎలాగన్నది కూడా మేము ఉపాయాలను ఆలోచిస్తాము.

వారసత్వ నగరంగా ప్రసిద్ధమైన బాగాన్ ను సందర్శించాలని నేను కుతూహలపడుతున్నాను. అక్కడి ఆనంద దేవాలయం పునరుద్ధరణలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గొప్పగా కృషి చేసింది. అక్కడే గత సంవత్సరం భూకంపంలో ధ్వంసమైన పలు పగోడాలను మరియు కుడ్యచిత్రాలను పునరుద్ధరించే పనిని సైతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టబోతోంది.

నేను నా పర్యటనను యంగూన్ లో ముగిస్తాను. భారతదేశం మరియు మయన్మార్ ల మధ్య వారసత్వ ప్రతీకలుగా అలరారుతున్న యంగూన్ లోని వేరు వేరు చారిత్రక స్థలాలను సందర్శించాలని నేను భావిస్తున్నాను.

ఒక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన మయన్మార్ లోని భారతీయ సంతతి సముదాయం ప్రతినిధులతో భేటీ అయ్యి, వారితో సంభాషించాలన్న ఆసక్తి కూడా నాలో ఉంది.

ఈ పర్యటన భారతదేశం- మయన్మార్ సంబంధాలలో ఒక ప్రకాశవంతమైనటువంటి నూతన అధ్యాయానికి బాట వేయగలదని, మన ప్రభుత్వాలు, మన వ్యాపార సముదాయాలు మరియు ఇరు దేశాల ప్రజల మధ్య మరింత సన్నిహిత సహకారానికి ఒక మార్గసూచీని సిద్ధం చేయడంలో తోడ్పడుతుందన్న నమ్మకం నాకుంది. ’’