ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు మొత్తం 90 మందికి పైగా అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో కూడిన బృందంతో భేటీ అయ్యి, వారితో సంభాషించారు. ఈ తరహా ముఖాముఖి సమావేశాలు అయిదింటిలో ఇది చివరి సమావేశం.
ఈ సందర్భంగా అధికారులు పరిపాలన, సామాజిక సంక్షేమం, ఆదివాసీల అభివృద్ధి, వ్యవసాయం, తోటల పెంపకం, పర్యావరణం మరియు అడవులు, విద్య, పథకాల అమలు, పట్టణ ప్రాంతాల అభివృద్ధి మరియు రవాణా ల వంటి అంశాలలో తమ అనుభవాన్ని గురించి వెల్లడి చేశారు.
పరిపాలన ప్రక్రియలను సులభతరంగా మార్చే దిశగా పనిచేయవలసిందంటూ అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. చక్కగా అమలుపరచిన పథకాలు మరియు ప్రాజెక్టులు అధ్యయన అంశాలుగా ఉపయోగపడాలని, తద్వారా వాటి విజయాన్ని అనుకరించడం సాధ్యపడుతుందని ఆయన వివరించారు.
ప్రపంచంలోని ప్రస్తుత సకారాత్మక వాతావరణం భారతదేశానికి సానుకూలంగా ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేస్తూ, 2022కల్లా ఒక న్యూ ఇండియా నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని ప్రధాన మంత్రి సూచించారు.