భారత ప్రభుత్వంలో అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా సేవలు అందిస్తున్న 70 మందికి పైగా కూడిన బృందంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు సమావేశమయ్యారు. ఈ తరహా సమావేశాలు అయిదింటిలోనూ ఇది ఒకటో సమావేశం.
ఈ సమావేశంలో అధికారులు ‘డిజిటల్ & స్మార్ట్ గవర్నెన్స్’, ‘పాలన విధానాలు మరియు జవాబుదారీతనం’, ‘పారదర్శకత్వం’, ‘వ్యవసాయదారుల ఆదాయాలను రెట్టింపు చేయడం’, ‘నైపుణ్యాలకు పదును పెట్టడం’,‘’స్వచ్ఛ భారత్’, ‘వినియోగదారు హక్కులు’, ‘పర్యావరణ పరిరక్షణ’తో పాటు ‘2022 కల్లా ‘‘న్యూ ఇండియా’’ నిర్మాణం’ వంటి అంశాలపై వారి ఆలోచనలను వెల్లడించారు.
పౌరుల సంక్షేమానికీ, వారి సంతృప్తికీ అభివృద్ధి మరియు సుపరిపాలనల జోడింపు అత్యవసరమని ప్రధాన మంత్రి అన్నారు. సుపరిపాలన అనేది అధికారులకు ఒక ప్రాథమ్యంగా ఉండాలని ఆయన చెప్పారు. సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను సాధించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు కలిసి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు సామాన్య పౌరులనూ, పేదలనూ అధికారులందరూ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు.
ప్రపంచం భారతదేశాన్ని సకారాత్మకమైన అంచనాలతో వీక్షిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచ సమతుల్యతకు విజయవంతమైన భారతదేశం ఎంతో కీలకమని యావత్ ప్రపంచం భావిస్తోందని ఆయన చెప్పారు. భారతదేశ సామాన్య పౌరులలో శ్రేష్ఠత కోసం తపన నెలకొందని కూడా ఆయన పేర్కొన్నారు. వినయశీల నేపథ్యాల నుండి వచ్చిన యువతీ యువకులు చాలా పరిమితమైన వనరులతో పోటీ పరీక్షలలో మరియు క్రీడలలో ఉత్తమ స్థానాలను చేజిక్కించుకొంటున్నారని ఆయన తెలిపారు. ఈ విధమైనటువంటి స్వతస్సిద్ధ ప్రతిభా వికాసాన్ని ప్రోత్సహించడం కోసం కృషి చేయవలసిందిగా అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అధికారులు వారు ఉద్యోగాలలో చేరిన మొదటి మూడు సంవత్సరాలలో వారు స్వయంగా తమలో వ్యక్తం చేసినటువంటి స్ఫూర్తిని, శక్తిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దేశ ప్రజల మేలు కోసం అత్యున్నత స్థాయిలో సేవలు అందించడానికి అధికారులకు ఇది ఒక అపూర్వ అవకాశమని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్య అడ్డంకులను అధిగమించడానికీ, అంతర్గతంగా మెరుగైన సమాచార ప్రసారానికీ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన నొక్కిచెప్పారు. నిర్ణయాలు తీసుకోవడంలో సామర్థ్యాన్ని మరియు వేగాన్ని కనబరచవలసిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. సదుద్దేశంతో కూడిన, నిజాయతీతో తీసుకొనేటటువంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం సదా ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. భారతదేశంలోని అత్యంత వెనుకబడిన 100 జిల్లాల పై దృష్టిని కేంద్రీకరించాలని, అలా చేసినందువల్ల వాటిని వేరు వేరు అభివృద్ధి పరామితులలో జాతీయ సగటు స్థాయికి తీసుకురావడం సాధ్యపడుతుందని ప్రధాన మంత్రి వివరించారు.