Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి సమావేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో ఈ రోజు సమావేశమయ్యారు. ‘‘భారతదేశాన్ని పరివర్తన చెందింపచేయడంలో చోదక శక్తులుగా రాష్ట్రాలు’’ అనే ఇతివృత్తంపై ఏర్పాటైన ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ తరహా కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించడం ఇదే ప్రథమం.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శులు వారి వారి రాష్ట్రాలకు చెందిన ఒక ఉత్తమ ప్రయోగ పద్ధతిని గురించి సంక్షిప్తంగా వివరించారు.

గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాలకు సాన పెట్టడం, పంట బీమా, ఆరోగ్య బీమా, మూడో అంచె ఆరోగ్య సంరక్షణ, దివ్యాంగ చిన్నారుల సంక్షేమం, శిశు మరణాల రేటును తగ్గించడం, ఆదివాసీల సంక్షేమం, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, త్రాగు నీరు, నదుల సంరక్షణ, నీటి నిర్వహణ, ఇ-గవర్నెన్స్, పెన్షన్ సంస్కరణ, అత్యవసర సేవలు, ఖనిజ సమృద్ధ ప్రాంతాల వికాసం, పిడిఎస్ సంస్కరణ, సబ్సిడీ యొక్క ప్రయోజనాన్ని నేరుగా బదలాయించడం, సౌర శక్తి, క్లస్టర్ డివెలప్ మెంట్, సుపరిపాలన మరియు వ్యాపారం చేయడంలో సరళత్వం వంటివి ప్రధాన కార్యదర్శులు వివరించిన ఉత్తమ ప్రయోగ పద్ధతులలో ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, పరిపాలన ప్రక్రియలో ప్రాథమ్య నిర్దేశానికి, దానిని సాధించేందుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. సమస్యలకు మరియు సవాళ్లకు ఉత్తమ పరిష్కారాలను అందించగల రాష్ట్రాల అనుభవాల నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఆయన చెప్పారు. సవాళ్లను అధిగమించడానికి గాను అగ్రగామి ప్రభుత్వ అధికారుల వద్ద సమష్టి దార్శనికత ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయంలో, అనుభవాన్ని పంచుకోవడం ఎంతో ముఖ్యమైనటువంటిదని కూడా ఆయన వివరించారు.

రాష్ట్రాల నుండి విచ్చేసిన యువ అధికారుల బృందం ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ పర్యటించడం ద్వారా ఈ ఉత్తమమైన ప్రయోగ పద్ధతులపై చర్చించి వాటి నుండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. ఇది రాష్ట్రాలన్నింటిలోనూ ఉత్తమ ప్రయోగ పద్ధతులను సమర్ధంగా స్వీకరించడంలో తోడ్పడుతుందని ఆయన అన్నారు.

‘స్పర్ధాత్మక సహకారయుత సమాఖ్య విధానం’ సూత్రాన్ని మనస్సులో నిలుపుకోవాలని అధికారులకు ప్రధాన మంత్రి సూచించారు. అభివృద్ధి మరియు సుపరిపాలన తాలూకు స్పర్ధాత్మక వాతావరణంలో నగరాలు మరియు జిల్లాలు కూడా తప్పక భాగం పంచుకోవాలని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు సాధించిన విజయాలను పెద్ద రాష్ట్రాలు తొలుత ఒక జిల్లాలో అనుసరించాలని ఆయన తెలిపారు. హరియాణా మరియు చండీగఢ్ లు కిరోసిన్ వినియోగానికి స్వస్తి పలికిన విషయాన్ని ఈ సందర్భంలో ఆయన ప్రస్తావించారు.

దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి అనేక పథకాలకు నిర్ణయాత్మకమైన జోరును సంతరించిన నెలవారీ ‘ప్రగతి’ (PRAGATI) సమావేశాలను ప్రధాన మంత్రి ఒక ఉదాహరణగా వివరించారు. జడత్వం బారి నుండి బయటపడాలని, కేంద్రం తోను మరియు సాటి రాష్ట్రాల తోను కలసి పనిచేయాలని రాష్ట్రాలను ఆయన కోరారు.

ఇవాళ భారతదేశం పట్ల యావత్తు ప్రపంచానికి నమ్మకం ఉందని, భారతదేశంపై ప్రపంచానికి కొన్ని అంచనాలు ఉన్నాయని, భారతదేశంతో ప్రపంచ దేశాలు భాగస్వామ్యాన్ని కోరుకొంటున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. ఇది మనకు ఒక సువర్ణావకాశమని ఆయన చెప్పారు. ‘‘వ్యాపారం చేయడంలో సరళత్వాని’’కి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలకు ఎంతగానో తోడ్పడగలుగుతుందని ఆయన వివరించారు. ‘‘వ్యాపారం చేయడంలో సరళత్వం’’ అనేది మెరుగుపడిందంటే గనక అది రాష్ట్రాలకు ఇతోధిక పెట్టుబడులను తీసుకురాగలదని ప్రధాన మంత్రి చెప్పారు. అభివృద్ధికి తగిన అవకాశాలు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఉన్నాయని ఆయన అన్నారు.

గుజరాత్ లో ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన తొలి రోజులను, కచ్ఛ్ లో భూకంపం అనంతరం చేపట్టిన పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ఆ రోజులలో అధికారులు ఒక జట్టుగాను, అంకితభావంతోను చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఇదే సందర్భంలో, అతి ప్రాచీన చట్టాలను మరియు నియమాలను తొలగించడం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి వ్యవసాయ రంగాన్ని గురించిమాట్లాడుతూ, సాంకేతిక విజ్ఞ‌ానాన్ని ఉపయోగించడం తప్పనిసరి అని స్పష్టంచేశారు. వ్యవసాయ దిగుబడిలో వ్యర్ధాలను పరిహరించాలని, ఫూడ్ ప్రాసెసింగ్ పై శ్రద్ధ వహించాలని ఆయన నొక్కిచెప్పారు. వ్యవసాయ సంస్కరణలు, మరీ ముఖ్యంగా ఇ-ఎన్ఎఎమ్ (e-NAM) పై దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్రాలకు ప్రధఆన మంత్రి పిలుపునిచ్చారు.

కొత్త కార్యక్రమాల పట్ల సకారాత్మకమైన వైఖరిని అనుసరించవలసిందని అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. సిద్దాంతాలకు అతీతంగా నూతనమైన, సకారాత్మకమైన ఆలోచనలను ఎన్నికైన రాజకీయ నాయకత్వం ఎల్లప్పటికీ స్వీకరిస్తుందని ఆయన అన్నారు.

‘ఆధార్’ యొక్క ఉపయోగం లీకేజీలను పరిహరించిందని, సర్వతోముఖ లబ్ధిని ప్రసాదించిందని ప్రధాన మంత్రి అన్నారు. సభకు హాజరైనవారందరు సుపరిపాలనలో దీనిని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) ప్రభుత్వం జరిపే సేకరణ ప్రక్రియకు పారదర్శకత్వాన్ని, దక్షతను, పొదుపును సంతరించగలదని ఆయన చెప్పారు. ఆగస్టు 15 కల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జిఇఎమ్ ఉపయోగాన్ని గరిష్ఠ స్థాయికి తీసుకుపోవాలని ఆయన స్పష్టంచేశారు.

‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ను గురించి ఆయన మాట్లాడుతూ, మనం మనను కలిపి ఉంచే అంశాలను సదా జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. ఈ పథకం దిశగా కృషి చేయవలసిందిగా ప్రధాన కార్యదర్శులకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావడంలో మరియు అభివృద్ధి లక్ష్యాల సాధనలో సుపరిపాలన అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రాలలో సాపేక్షంగా జూనియర్ అధికారులైన వారు క్షేత్ర అంశాల పైన ప్రత్యక్ష అవగాహనను కలిగివుండటానికి వీలుగా క్షేత్ర పర్యటనలలో చాలినంత సమయాన్ని వెచ్చించాలని ఆయన చెప్పారు. సంస్థాగత జ్ఞాపక శక్తిని పరిరక్షించుకోవటం ముఖ్యమని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. జిల్లాలలో రాజపత్రాలను అధికారులే రాయటాన్ని తప్పనిసరి చేయాలని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యం సిద్ధించి 2022 లో 75 సంవత్సరాలు పూర్తి అవుతాయని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. దేశ సర్వతోముఖ అభివృద్ధి సాధన కోసం ప్రతి ఒక్కరు తదేక లక్ష్యంతోను, ఉమ్మడి ప్రేరణతోను పని చేసేందుకు ఇది ఒక అవకాశాన్ని ప్రసాదిస్తోందని ఆయన అన్నారు.

ప్రణాళిక శాఖ సహాయ మంత్రి శ్రీ రావ్ ఇందర్ జీత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పాన్ గఢియా, నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాంత్ లతో పాటు ప్రభుత్వం, పిఎమ్ఒ మరియు కేబినెట్ సెక్రటేరియట్ లకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***