Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హాంబ‌ర్గ్ లో బిఆర్ఐసిఎస్ నేత‌ల ఇష్టాగోష్ఠి స‌మావేశం

హాంబ‌ర్గ్ లో బిఆర్ఐసిఎస్ నేత‌ల ఇష్టాగోష్ఠి స‌మావేశం

హాంబ‌ర్గ్ లో బిఆర్ఐసిఎస్ నేత‌ల ఇష్టాగోష్ఠి స‌మావేశం


జ‌ర్మ‌నీ లోని హాంబ‌ర్గ్ లో జి-20 శిఖ‌రాగ్ర స‌మావేశాలను పుర‌స్క‌రించుకొని అయిదు బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) దేశాల నేత‌లు ఒక ఇష్టాగోష్ఠి స‌ద‌స్సును నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సును చైనా లోని శియామెన్ లో సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న బ్రిక్స్ 9వ శిఖ‌రాగ్ర స‌మావేశానికి స‌న్నాహ‌క చ‌ర్య‌గా నిర్వ‌హించారు. చైనా ప్రెసిడెంట్ శ్రీ శీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, బ్రిక్స్ నేత‌ల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు తాను ఎదురుచూస్తున్నాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ, రానున్న శియామెన్ శిఖ‌రాగ్ర స‌మావేశం యొక్క స‌న్నాహ‌క చ‌ర్య‌లను గురించి, ఇంకా ఆ స‌మావేశం తాలూకు ప్రాధాన్యాల‌ను గురించి చ‌ర్చించారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగిస్తూ, బ్రిక్స్ కు ఒక గ‌ట్టి స్వ‌రం ఉన్న‌ద‌ని, ఉగ్ర‌వాదం మ‌రియు ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ వంటి అంశాల‌లో బ్రిక్స్ నాయ‌క‌త్వాన్ని చాటి చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉగ్ర‌వాదుల‌కు అందుతున్న ఆర్థిక స‌హాయాన్ని, ల‌భిస్తున్న ఆశ్ర‌య స్థానాల‌ను, మ‌ద్ద‌తును, ఉగ్ర‌వాదానికి కొమ్ము కాస్తున్న వ‌ర్గాల‌ను జి-20 ఉమ్మ‌డిగా ఎదుర్కోవాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. భార‌త‌దేశంలో ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్టిన జిఎస్ టి స‌హా ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ప్ర‌పంచ ఆర్థిక స్వ‌స్థ‌త యొక్క నిలకడతనం కోసం అందరూ క‌లిసి ప‌ని చేయ‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని చెప్పారు. ర‌క్ష‌ణాత్మ‌క విధానాలను- ప్ర‌త్యేకించి వాణిజ్యం, విజ్ఞానాన్ని పంచుకోవ‌డం మ‌రియు వృత్తి నిపుణులకు చెందిన అంశాల‌లో ర‌క్ష‌ణాత్మ‌క ప‌ద్ధ‌తుల‌ను- అనుస‌రించ వ‌ద్దని, స‌మ‌ష్టి స్వ‌రాన్ని వినిపించాల‌ని ఆయ‌న సూచించారు. ప్యారిస్ ఒప్పందాన్ని తు.చ. త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌డానికి భార‌త‌దేశం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. జ‌ల‌, వాయు ప‌రివ‌ర్త‌న పై పోరాటం సాగించ‌డానికి ఈ ఒప్పందం ప్ర‌పంచవ్యాప్తంగా అమ‌లులోకి రావ‌డం అత్య‌వ‌స‌ర‌మ‌ని శ్రీ మోదీ అభివ‌ర్ణించారు. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటుచేసే దిశ‌గా స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా ఆయ‌న పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆఫ్రికా అభివృద్ధి అంశంలో స‌హ‌కారాన్ని అంద‌జేయ‌డానికి పెద్ద పీట వేయాల‌ని కూడా ఆయ‌న కోరారు. దేశాల మ‌ధ్య ప్ర‌జా సంబంధాలు మ‌రింత‌గా పెంపొందాల‌ంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

ప్రెసిడెంట్ శ్రీ శీ అధ్య‌క్ష‌త‌న బ్రిక్స్ నిర్వ‌హ‌ణ తీరు జోరు అందుకుందని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. బ్రిక్స్ శియామెన్ శిఖ‌రాగ్ర స‌మావేశానికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టిస్తూ, ఆ స‌ద‌స్సు విజ‌య‌వంతం కావాల‌ని శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే సమావేశాన్ని ప్రెసిడెంట్ శ్రీ శీ ముగిస్తూ ఉగ్ర‌వాదాన్ని ఎదిరిస్తున్న భార‌త‌దేశం దృఢ సంక‌ల్పాన్ని అభినందించారు. భార‌త‌దేశం అధ్య‌క్ష‌త‌న బ్రిక్స్ నిర్వ‌హ‌ణ చురుకుద‌నాన్ని సంత‌రించుకొంద‌ని, 2016లో గోవా శిఖ‌రాగ్ర స‌మావేశం తాలూకు ప‌ర్య‌వ‌సానాలు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని శ్రీ శీ అన్నారు. ఆర్థికాభివృద్ధిలోను, సామాజిక అభివృద్ధి లోను భార‌త‌దేశం సాధించిన విజ‌యాన్ని కూడా ఆయ‌న మెచ్చుకొన్నారు. భార‌త‌దేశం మ‌రింత ఘ‌న‌మైన‌టువంటి విజ‌యాన్ని అందుకోవాల‌ని ఆయన ఆకాంక్షించారు.

*****