ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం… సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం, 1860 కింద ఒక సొసైటీగా భారత సంకేత భాషా పరిశోధన, శిక్షణా కేంద్రం (ఐ. ఎస్. ఎల్. ఆర్. టి. సి) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధీనంలోని వికలాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఐ. ఎస్. ఎల్. ఆర్. టి. సి పని చేస్తుంది. ఈ కేంద్రాన్ని తొలుత న్యూ ఢిల్లీలోని వికలాంగుల సంక్షేమ సంస్థలో ప్రారంభిస్తారు.
కేబినెట్ నిర్ణయంతో దేశంలో వినికిడి సమస్య కలిగిన(బధిరుల) 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. బధిరుల చదువులో, పనిచేసే కార్యాలయాలలో, ప్రజా జీవితంలోనూ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ శిక్షణా కేంద్రం ఓ సొసైటీగా ఉంటుంది. ఇందులో అధ్యక్షుడు, జనరల్ కౌన్సిల్‌లో 12 మంది సభ్యులు ఉంటారు. కార్య నిర్వాహక మండలి కూడా ఉంటుంది. ఇందులో ఛైర్ పర్సన్, తొమ్మిది మంది సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు, ఇతరులు ఉంటారు. బధిరుల కోసం పనిచేసే జాతీయ స్థాయి సంస్థలు / విశ్వవిద్యాలయాలు / విద్యా సంస్థలు, భారత సంకేత భాష(ఐ.ఎస్.ఎల్)కు చెందిన నిపుణులు కూడా ఉంటారు.
బధిరుల కోసం ఏకరీతిలో భారత సంకేత భాష రూపొందించడం, ఇతరత్రా అంశాలను దీర్ఘకాలంగా విస్మరించారు. బధిరుల కోసం పనిచేస్తున్న పలు సంస్థలు వారి సమస్యలపై నివేదికలు రూపొందించాయి. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం నేపథ్యంలో అకాడమిక్ డెవలప్ మెంట్, శిక్షణ, భారత సంకేత భాషను విస్తృత పరచడం, సంకేత భాష వ్యాఖ్యాతల అభివృద్ధి, పరిశోధన, నూతన సాంకేతికతలే ప్రాధాన్యాంశాలుగా ఐ. ఎస్. ఎల్. ఆర్. టి. సి పనిచేయనుంది. ఈ శిక్షణా కేంద్రం నిత్య జీవితంలో బధిరులు కూడా ప్రతీ రంగంలోనూ సమాన అవకాశాలు పొందేందుకు తోడ్పాటును అందిస్తుంది.