ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. సాంప్రదాయక వైద్య విధానాలు, హోమియోపతి రంగాలలో సహకారానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రజాస్వామిక సామ్యవాద శ్రీలంక రిపబ్లిక్ కు చెందిన ఆరోగ్యం, పౌష్టికాహారం, దేశీయ వైద్యవిధానాల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత ఎమ్ఒయు పై సంతకాలయితే, ఉభయ దేశాల మధ్య సాంప్రదాయక వైద్య విధానాలు, హోమియోపతి విభాగాలలో ద్వైపాక్షిక సహకారం విస్తరించగలదు. ఉభయ దేశాల మధ్య నెలకొన్న సాంస్కృతిక వారసత్వం నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలువగలదు.
దీని వల్ల అదనంగా పడే ఆర్థిక భారం ఏమీ ఉండదు. ఈ విభాగాలలో పరిశోధన, శిక్షణ తరగతుల నిర్వహణ, సమావేశాలు/సదస్సుల నిర్వహణకు అయ్యే వ్యయాలన్నింటినీ ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేటాయించిన ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుత ప్రణాళికా స్కీమ్ ల నుంచే భరిస్తారు.
ఈ ఎమ్ఒయు పై ఉభయ దేశాలు సంతకాలు చేసినప్పటి నుండి రెండు దేశాలలో కార్యకలాపాలు ఆరంభం అవుతాయి. సంతకం చేసిన ఎమ్ఒయు లోని నియమ నిబంధనలకు అనుగుణంగానే ఉభయ దేశాలు ఈ రంగాలలో సహకారానికి చొరవ తీసుకొంటాయి. ఎమ్ఒయు అమలులో ఉన్నంత కాలం ఈ కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతాయి.
పూర్వ రంగం
భారతదేశానికి దీర్ఘకాలిక చరిత్ర గల సాంప్రదాయక వైద్యవిధానం అందుబాటులో ఉంది. భారత్ కు గల ఓషధి మొక్కలకు ప్రస్తుతం ప్రపంచలో నెలకొన్న ఆరోగ్య వాతావరణంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీలంకకు కూడా సాంప్రదాయక వైద్య విధానాల్లో దీర్ఘకాలిక చరిత్ర ఉంది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, యోగ, ప్రకృతి చికిత్స, హోమియోపతి వైద్య విధానాలు శ్రీ లంక సాంప్రదాయక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఆయుర్వేద, సిద్ధ, యునాని విభాగాలలో ఉభయ దేశాల మధ్య ఉమ్మడి సంస్కృతీ బంధం ఉంది. ఉభయ దేశాల భౌగోళిక, వాతావరణ పరిస్థితుల సారూప్యత, ప్రత్యేకించి ఉష్ణ మండలాల్లో భారీ సంఖ్యలో ఓషధి మొక్కలు లభిస్తూ ఉంటాయి.
భారతదేశం, శ్రీ లంక ల మధ్య పలు సాంస్కృతిక, భాషా, సాహిత్య సారూప్యతలు ఉన్నాయి. ఉభయ దేశాల మధ్య నెలకొన్న సాంస్కృతిక, నాగరిక వారసత్వ సంపద ఉభయ దేశాల ప్రజల మధ్య బంధానికి విస్తృతమైన వారధిగా నిలుస్తోంది. ఉభయ దేశాల మధ్య బహుముఖీన భాగస్వామ్యాలు, సామరస్యపూర్వక ద్వైపాక్షిక బంధానికి పునాదిగా నిలిచింది.
భారతీయ వైద్య విధానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే బాధ్యత భుజస్కంధాలపై గల ఆయుష్ మంత్రిత్వ శాఖ 11 దేశాలతో ఎమ్ఒయు లను కుదుర్చుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. వాటిలో చైనా సాంప్రదాయక వైద్యవిధాన ప్రభుత్వ యంత్రాంగం, చైనా రిపబ్లిక్; మలేసియా ప్రభుత్వం; ట్రినిడాడ్ & టొబాగో ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ; హంగరి ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ; పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ; నేపాల్ ప్రభుత్వ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ; మారిషస్ ప్రభుత్వ ఆరోగ్యం, జీవన ప్రమాణాల మంత్రిత్వ శాఖ; మంగోలియా ప్రభుత్వ ఆరోగ్యం మరియు క్రీడల మంత్రిత్వ శాఖ; తుర్క్ మినిస్తాన్ ప్రభుత్వ ఆరోగ్య మరియు ఔషధ పరిశ్రమ మంత్రిత్వ శాఖ; మయన్మార్ ప్రభుత్వ ఆరోగ్యం, క్రీడల మంత్రిత్వ శాఖ ఉన్నాయి. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కూడా ఉమ్మడి సహకార ప్రకటనపై సంతకాలు చేసింది.
—