Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పి.ఎన్‌. పనికర్ ప‌ఠ‌న‌ దినోత్స‌వం- ప‌ఠ‌న‌ మాసోత్స‌వాల ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగం

s20170617107706


ప‌ఠ‌న మాసోత్స‌వాల ప్రారంభం సంద‌ర్భంగా మీ మ‌ధ్య ఉండ‌టం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసినందుకు నేను పి.ఎన్‌. పనికర్ ఫౌండేష‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు, అభినంద‌న‌లు తెలుపుతున్నాను. ప‌ఠ‌నానికి మించిన ఆనందం, జ్ఞ‌ానానికి మించిన బ‌లం వేరే ఏమీ లేవు.

మిత్రులారా,

అక్ష‌రాస్య‌త విష‌యంలో దేశానికే కేర‌ళ చైత‌న్య స్ఫూర్తిగా, దారి దీపంగా వెలుగొందుతోంది.

వంద శాతం అక్ష‌రాస్య‌త సాధించిన తొలి ప‌ట్ట‌ణం, వంద శాతం అక్ష‌రాస్య‌తను సాధించిన తొలి జిల్లా కేర‌ళ‌ లోనివే. నూరు శాతం ప్రాథ‌మిక విద్య‌ను సాధించిన తొలి రాష్ట్రం కూడా కేర‌ళే. దేశంలోని ఎన్నో పురాత‌న క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌లు, గ్రంథాల‌యాలు కేర‌ళ‌లోనే ఉన్నాయి.

ఇది కేవ‌లం ప్ర‌భుత్వం వ‌ల్ల మాత్ర‌మే సాధ్య‌ం కాలేదు. పౌరులు, సామాజిక సంస్థ‌లు ఈ గొప్ప ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి క్రియాశీల పాత్ర‌ను పోషించారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ భాగ‌స్వామ్యానికి సంబంధించి కేర‌ళ ఒక ఆద‌ర్శంగా నిలుస్తొంది. పి.ఎన్‌. పనికర్ కృషి, వారి ఫౌండేష‌న్ చేప‌డుతున్న కార్య‌క‌లాపాల‌ను నేను ఎంత‌గానో ఆరాధిస్తాను. కేర‌ళ‌లో గ్రంథాలయాల ఏర్పాటు వెనుక మ‌హోన్న‌త స్ఫూర్తి పి.ఎన్‌. పనికర్‌. 1945లో స్వ‌యంగా 47 గ్రామీణ‌ గ్రంథాల‌యాల‌తో ఏర్పాటు చేసిన కేర‌ళ గ్రంథ‌శాల సంఘం ద్వారా పి.ఎన్‌. పనికర్ గ్రంథాల‌యాల ఏర్పాటును కొన‌సాగించారు.

ప‌ఠనాన్ని, జ్ఞ‌ానాన్ని కేవ‌లం ప‌ని సంబంధ కార్య‌క‌లాపాల‌కు ప‌రిమితం చేయ‌రాద‌ని నేను విశ్వ‌సిస్తాను. ఇది సామాజిక బాధ్య‌త‌, దేశానికి సేవ చేయ‌డం, మాన‌వ‌ జాతికి సేవ‌ చేయ‌డం వంటి అల‌వాట్ల‌ను పెంపొందించేదిగా ఉండాలి. ఇది దేశంలోని , స‌మాజంలోని రుగ్మ‌త‌ల‌ను తొలగించేదిగా ఉండాలి. ఇది దేశ స‌మైక్య‌త‌ను, దేశ స‌మ‌గ్ర‌త‌ను గౌర‌వించేదిగా, శాంతి భావ‌న‌ను పెంపొందించేదిగా ఉండాలి.

ఒక మ‌హిళ రెండు కుటుంబాల‌ను విద్యావంతుల‌ను చేస్తుందంటారు. ఈ విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల‌కు కేరళ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింది.

పి.ఎన్. పనికర్ ఫౌండేష‌న్ వివిధ ప్ర‌భుత్వ ఏజెన్సీలు, ప్రైవేటు రంగ సంస్థలు, పౌర స‌మాజ సంస్థల స‌హకారంతో ప్ర‌జ‌ల‌లో ప‌ఠ‌నాభిలాష‌ను పెంపొందించే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న‌ట్లు నేను తెలుసుకున్నాను.

2022 సంవ‌త్స‌రం నాటికి 3 కోట్ల మంది అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను చేరాల‌న్న‌ది వారి ల‌క్ష్యం. ప‌ఠ‌నం ద్వారా ఎదిగి, సుసంప‌న్న‌త సాధించేందుకు ఇది మార్గంకావాల‌న్న‌ది ఈ ప్ర‌య‌త్న ల‌క్ష్యం.

ప‌ఠ‌నం ఆలోచ‌నా ప‌రిధిని విస్తృతం చేస్తుంది. బాగా చ‌దువుకున్న ప్ర‌జ‌లు భార‌త‌దేశం అంత‌ర్జాతీయంగా స‌మ‌ర్ధంగా రాణించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తారు.

ఇదే స్ఫూర్తితో ఇటువంటి ఉద్య‌మాన్నే ‘వాంచే గుజ‌రాత్’ పేరుతో నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్రారంభించాను. దీనికి ‘‘గుజ‌రాత్ చ‌దువుతోంది’’ అని అర్థం. ప్ర‌జ‌ల‌లో ప‌ఠ‌నాభిలాష‌ను ప్రోత్స‌హించ‌డం కోసం నేను గ్రంధాల‌యానికి వెళ్ళాను. ఈ ఉద్య‌మాన్ని యువ‌త ల‌క్ష్యంగా సాగించాం. ప్ర‌జ‌లు త‌మ త‌మ గ్రామాల‌లో ‘గ్రంథ‌-మందిర్’ ఏర్పాటు గురించి ఆలోచించాలని పిలుపునిచ్చాను. ఈ గ్రంథ మందిర్‌ను క‌నీసం 50 లేదా 100 పుస్త‌కాల‌తో ఆరంభించ‌వ‌చ్చు.

శుభాకాంక్ష‌లు తెలిపే సందర్భంలో పూల గుత్తి ని ఇచ్చేందకు బ‌దులుగా ఒక పుస్త‌కాన్ని ఇవ్వ‌ాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేశాను. ఇటువంటి ప్ర‌య‌త్నం గొప్ప మార్పుకు దారి తీయ‌వ‌చ్చు.

మిత్రులారా,

ఉప‌నిష‌త్ కాలం నుండీ త‌ర త‌రాలుగా జ్ఞాన‌మూర్తుల‌ను గౌర‌వించుకుంటున్నాం. మ‌నం ఇప్పుడు స‌మాచార యుగంలో ఉన్నాం. ఈ రోజుకు కూడా జ్ఞాన‌మే ఉత్త‌మ మార్గ‌ద‌ర్శ‌క జ్యోతిగా వెలుగొందుతోంది.

డిజిట‌ల్ గ్రంథాలయాల పైల‌ట్ ప్రాజెక్టు కింద పనికర్ ఫౌండేష‌న్ న్యూ ఢిల్లీ లోని ఇండియ‌న్ ప‌బ్లిక్ లైబ్ర‌రీ మూవ్‌మెంట్‌తో క‌ల‌సి కేర‌ళ‌లోని 18 ప‌బ్లిక్ లైబ్ర‌రీ ల‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్న‌ట్టు నాకు చెప్పారు.

ఇటువంటి ప‌ఠ‌న ఉద్య‌మం, గ్రంథాల‌య ఉద్య‌మం దేశ‌వ్యాప్తం కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ ఉద్య‌మం ప్ర‌జ‌లు కేవ‌లం అక్ష‌రాస్యులుగా కావ‌డానికి మాత్ర‌మే ప‌రిమితం కారాదు. ఇది సామాజిక మార్పును, ఆర్థిక మార్పును తీసుకు వ‌చ్చే అస‌లైన ల‌క్ష్య‌ సాధ‌న‌కు కృషి చేయాలి. స‌మున్న‌త జ్ఞానం పునాదిగా ఆపైన ఒక మెరుగైన స‌మాజ నిర్మాణం జ‌ర‌గాలి.

జూన్ 19 వ తేదీని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప‌ఠ‌న దినోత్స‌వంగా ప్ర‌క‌టించ‌డం సంతోష‌దాయకం. విశేష‌ కృషితోనే ఇదొక ప్ర‌జా కార్య‌క్ర‌మంగా రూపుదిద్దుకుంటోంది.

పనికర్ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల‌కు భార‌త ప్ర‌భుత్వం కూడా తోడ్పాటును అందిస్తోంది. ఈ ఫౌండేష‌న్‌కు గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లో సుమారు 1.20 కోట్ల రూపాయ‌లు మంజూరు చేసినట్లు నాకు తెలిసింది.

ఫౌండేష‌న్ ప్ర‌స్తుతం డిజిట‌ల్ లిట‌ర‌సీపై దృష్టి పెట్టింద‌ని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఇది తక్షణావ‌స‌రం.

మిత్రులారా,

నేను ప్ర‌జ‌ల శ‌క్తిని విశ్వ‌సిస్తాను. దీనికి మెరుగైన స‌మాజాన్ని, మెరుగైన దేశాన్ని అందించగలిగిన సామర్థ్యం ఉంది.

ఈ సంద‌ర్భంగా మేము చ‌దువుతాము అంటూ ప్ర‌తిజ్ఞ చేయవలసిందిగా ఇక్కడ గుమికూడిన వారిలో ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను. అలాగే, ప్ర‌తి ఒక్క‌రూ చ‌దివేటట్లు కూడా చూడండి.

మ‌నంద‌రం క‌లిసి భార‌త‌దేశాన్ని మ‌రోసారి జ్ఞాన భూమిగాను, విజ్ఞాన భూమిగాను తీర్చి దిద్దుదాం. మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.