Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల అభివృద్ధి కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం


గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక స్వావలంబన పెంచటంతోపాటు.. మౌలిక వసతుల్లోనూ మార్పులు తీసుకువచ్చేందుకు రూ. 5142.08 కోట్లతో ఉద్దేశించిన ప్రతిష్టాత్మకమైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ (ఎస్పీఎమ్ఆర్ఎమ్)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎదుగుదలకు విస్తృత‌మైన అవకాశాలున్న గ్రామీణ ప్రాంతాల క్లస్టర్లను గుర్తించి వాటిని అభివృద్ధి చేయటం ఈ మిషన్ ముఖ్యోద్దేశం. ఇలా గ్రామాలను అభివృద్ధి చేయటం ద్వారా ప్రాంతాలు ముందడుగేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్లస్టర్లకు సరైన ఆర్థిక అవకాశాలు, నైపుణ్యాభివృద్ధితోపాటు స్థానికంగా వ్యాపారవేత్తలను తయారు చేసేందుకు మౌలిక వసతులు కల్పించటమే ఈ పథకం ఉద్దేశం. ఈ రుర్బన్ మిషన్ ద్వారా స్మార్ట్ విలేజెస్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్లస్టర్ల నిర్మాణం కోసం ప్రణాళికాబద్ధమైన లే-ఔట్లను రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తించిన ప్రకారం కింది విధంగా సిద్ధం చేస్తారు. (రాష్ట్ర, కేంద్ర ప్రణాళికా చట్టాల్లో పేర్కొన్న ప్రకారం/ కేంద్ర, రాష్ట్ర చట్టం అమలయ్యే అవకాశం ఉంది). ఈ ప్రణాళికలను జిల్లాలు/మాస్టర్ ప్రణాళికలతో అనుసంధానం చేస్తారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అమలుకోసం సిద్ధం చేసిన ఫ్రేమ్‌వర్క్‌ లో రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్లను గుర్తించాల్సి ఉంటుంది. పక్క పక్క గ్రామపంచాయతీలతో కలిపి క్లస్టర్లు గుర్తించాలి. మైదాన, కోస్తా తీర ప్రాంతాల్లో ఒక్కో క్లస్టరు జనాభా 25వేల నుంచి 50వేల వరకు ఉండవచ్చు. అదే.. ఎడారులు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో అయితే ఆ సంఖ్య 5వేల నుంచి 15 వేల వరకు ఉండాలి. గిరిజన, గిరిజనేతర జిల్లాలో క్లస్టర్ల గుర్తింపునకు వేర్వేరు విధానాలుంటాయి. ఆచరణ విషయంలోకి వస్తే.. గ్రామాల క్లస్టర్లు గ్రామ పంచాయతీల పరిపాలన విభాగంలోకి వస్తాయి.

ఈ క్లస్టర్ల గుర్తింపునకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సాంకేతిక పద్ధతులను ఎంచుకుంటోంది. ఇందులో ప్రాంతం, ఆర్థిక పరిస్థితులు, పర్యాటకం, యాత్రాస్థల ప్రాముఖ్యత, రహదారి మార్గాల ఆధారంగా జిల్లా, ఉప జిల్లాలుగా విభజించనున్నారు. మంత్రిత్వ శాఖ ఈ విశ్లేషణ ద్వారా రాష్ట్రంలోని ఉప జిల్లాలను విభజించిన జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తుంది. దీని ఆధారంగా ఆ ప్రభుత్వాలు పథకం అమలుకు మార్గదర్శకాలను రూపొందించుకుంటాయి.

దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో ఇలాంటి 300 రుర్బన్ అభివృద్ధి క్లస్టర్లను నిర్మించాలనేది ఈ పథకం ఉద్దేశం. తద్వారా వివిధ ప్రభుత్వ పథకాలను ఈ క్లస్టర్ల ద్వారా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ రుర్బన్ క్లస్టర్ల ప్రాజెక్టు ఖర్చు కోసం.. క్రిటికల్ గ్యాప్ ఫండింగ్ రూపంలో ఎస్పీఎమ్ఆర్ఎమ్ ద్వారా 30శాతం అదనపు నిధులను కేంద్రం ఇవ్వనుంది.

గరిష్ఠంగా అభివృద్ధి సాధించేందుకు 14 ముఖ్యమైన విషయాలను కేంద్రం సూచించింది. ఇందులో.. ఆర్థిక పరమైన విషయాలపై నైపుణ్య శిక్షణ అందించటం, వ్యవసాయ విధానం/వ్యవసాయ సేవలు/నిల్వ చేసుకునే పద్ధతులు, సాంకేతిక అక్షరాస్యత, పారిశుద్ధ్యం, పైపుల ద్వారా నీటి వాడకం, తడి, పొడి చెత్త వాడకం, గ్రామాల వీధులు, కాలువలు, వీధి దీపాలు, పూర్తి వసతులతో కూడిన మొబైల్ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల నవీకరణ, ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయటం, గ్రామాల మధ్య రోడ్డు కనెక్టివిటీ, ఈ-పౌర సేవా కేంద్రాలు, ఈ-గ్రామ్ కనెక్టివిటీ, ప్రజా రవాణా వ్యవస్థ, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు మొదలైనవి ఉన్నాయి.
క్లస్టర్ల నిర్మాణం, ఈ పథకం ద్వారా వీటి నుంచి ఆశిస్తున్న ప్రతిఫలాలు, వనరులను ప్రభుత్వ సెక్టార్లుగా మార్చే అవకాశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, సదరు క్లస్టరుకు అందించాల్సిన క్రిటికల్ గ్యాప్ ఫండింగ్ అవసరాలు.. తదితర విషయాలపై రాష్ట్రాలు ‘సమగ్ర క్లస్టర్ అభివృద్ధి ప్రణాళిక’ను రూపొందిస్తాయి.

క్రిటికల్ గ్యాప్ ఫండింగ్‌తోపాటుగా రాష్ట్రాలు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు అమలు, అభివృద్ధి విషయంలో వాటికి కేటాయించాల్సిన బడ్జెట్, రాష్ట్రాల సామర్థ్య నిర్మాణం (కేపాసిటీ బిల్డింగ్), ఇతర సంస్థాగత ఏర్పాట్లు, అవి (రాష్ట్రాలు) సమకూర్చుకునే నిధులపై ముందస్తు ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది.

ఈ పథకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ మిషన్‌పై పరిశోధన, అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించనున్నారు.
ఈ క్లస్టర్ల నిర్మాణం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా రెండు లక్ష్యాల సాధనలో భాగంగా.. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఒకదానితోపాటు మరొకటిగా అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.

****