Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం

సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం


సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (ఎస్ పి ఐఇఎఫ్‌) సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ‘‘ప్ర‌పంచ వేదిక‌పైన నూత‌న స‌మ‌తుల్య‌త‌ను సాధించ‌డం’’ అనే అంశం సర్వ సభ్య సదస్సు ప్ర‌ధాన అంశం.

ఈ సంవ‌త్స‌రం ఎస్ పి ఐఇఎఫ్ లో భార‌త‌దేశం ‘‘అతిథి దేశం’’. ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ‘‘గౌర‌వ అతిథి’’గా పాల్గొంటున్నారు.

ఆయన తన ప్రసంగంలో అంద‌మైన సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ న‌గ‌రంలో ఏర్పాటు చేసిన ఎస్ పిఐఇఎఫ్ లో పాల్గొనే అవ‌కాశాన్ని ఇచ్చినందుకు ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

భార‌త్- ర‌ష్యా సంబంధాల‌ను ప్రస్తావించిన ప్ర‌ధాన మంత్రి, ఇరు దేశాల బంధాలు స‌రైన గ‌మ‌నంతో ముందుకు పోతున్నాయ‌న్నారు. ప‌ర‌స్ప‌ర న‌మ్మ‌కం పై ఆధార‌ప‌డి బంధం ఏర్ప‌డ‌డ‌మ‌నేది కొన్ని సంబంధాల్లోనే వుంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. గ‌త 70 ఏళ్లుగా భార‌త‌దేశం, ర‌ష్యాల సంబంధం న‌మ్మ‌కం మీద ఆధార‌పడి వుంద‌ని అది మ‌రింత బలోపేత‌మైంద‌ని, మారుతున్న ప్ర‌పంచంలోనూ బ‌లంగా ఉంద‌ని శ్రీ మోదీ అన్నారు.

భార‌త‌దేశానికిచెందిన 1.25 బిలియ‌న్ ప్ర‌జ‌ల ప్ర‌తినిధిగా తాను ఎస్ పి ఐఇఎఫ్ లో పాల్గొంటున్నాన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆసియా మీద ప్ర‌పంచం దృష్టిని కేంద్రీక‌రించింద‌ని, ఈ సంద‌ర్భంలో స‌హ‌జంగానే ప్ర‌పంచం దృష్టి భార‌త‌దేశం మీద ప‌డింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. గ‌త మూడేళ్లుగా ప్ర‌ధాన మంత్రిగా ఉన్న తాను, త‌న ప్ర‌భుత్వ సాయంతో అన్ని రంగాల్లో ప్ర‌గ‌తిదాయ‌క నిర్ణ‌యాలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. భార‌త‌దేశం 7 శాతం వార్షిక జిడిపి వృద్ధి రేటును సాధిస్తోంద‌ని వివ‌రించారు.

కనిష్ఠ స్థాయి ప్ర‌భుత్వం- గరిష్ఠ స్థాయి ప‌రిపాల‌న, పనిలో జాప్యానికి (రెడ్ టేప్) బ‌దులుగా ఎర్ర తివాచీ (రెడ్ కార్పెట్) అనే అంశాలు భార‌త‌దేశంలో ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధార‌మ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. రాజ‌కీయ సంక‌ల్పం, స్ప‌ష్ట‌మైన దూర‌దృష్టి సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్ట‌డానికి చాలా అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. అధికారులు చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప్ర‌భుత్వ నాయ‌క‌త్వంతో క‌లిసి ప‌ని చేయాల‌ని ఆయన వివ‌రించారు.

భార‌త‌దేశ బ‌లం దేశంలోని వైవిధ్య‌మేన‌ని చెబుతూ, జులై 1 నుండి వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను అమ‌ల‌వుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇది దేశ‌మంతా ఒకేలా వుండే ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను అమ‌లులోకి తెస్తుంద‌ని చెప్పారు.

తన కంటే ముందు మాట్లాడిన ర‌ష్యా ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ ప్ర‌స్తావించిన అంశాల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఏకీభవిస్తూ, సాంకేతికత‌ ప్ర‌ధాన పాత్ర పోషించగలదంటూ ‘డిజిట‌ల్ ఇండియా’ కార్య‌క్ర‌మాన్ని గురించి ప్ర‌స్తావించారు. స‌మాజంలో డిజిటల్ అంతరాన్ని పాతుకుపోనివ్వరాదని పేర్కొన్నారు.

అంద‌రికీ ఆర్ధిక సౌక‌ర్యాల క‌ల్ప‌న దిశగా చేపట్టిన ‘జ‌న్ ధ‌న్‌- ఆధార్‌- మొబైల్’ ( జామ్ ) త్రయం గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. కేంద్ర ప్ర‌భుత్వం 1200కు పైగా ప‌నికిరాని చ‌ట్టాల‌ను తుడిచిపెట్టిందని తెలిపారు.

సులువుగా వాణిజ్యాన్ని నిర్వ‌హించుకోవ‌డానికి వీలుగా భార‌త‌దేశం 7 వేల సంస్క‌ర‌ణ‌లు చేసింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ సంస్క‌ర‌ణ‌లు కేవలం కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలో చేసిన‌వ‌ని వివ‌రించారు.

ఎఫ్ డి ఐ కోసం, పోటీపడే త‌త్వం కోసం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోనే ఎఫ్ డిఐల ప్ర‌వాహం అధికంగా గ‌ల మొద‌టి మూడు దేశాల్లో భార‌త‌దేశం ఒక‌టిగా ఉంద‌నే విష‌యాన్ని అంత‌ర్జాతీయ రేటింగు సంస్థ‌లు పేర్కొన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

పెట్టుబ‌డిదారుల భ‌ద్ర‌త‌కు గ‌ల ప్రాధ‌న్య‌ాన్ని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. భార‌త‌దేశంలోని ఉజ్జ్య‌ల ప్ర‌జాస్వామ్యం, ఇంగ్లీషు భాష వినియోగం నిరంత‌రం భ‌ద్ర‌త‌ను అందిస్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

నూత‌న భార‌త‌దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, భార‌త‌దేశంలోని 800 మిలియ‌న్ల బ‌ల‌మైన సామ‌ర్థ్యం గ‌ల యువ‌తీయునవకులలో నైపుణ్యాల‌ను అభివృద్ధి చేయ‌డానికి ప్రాధాన్య‌మిస్తున్న‌ట్టు ప్ర‌ధానమంత్రి వివరించారు. ఈ సంద‌ర్భంగా ఆయన భార‌త‌దేశ మార్స్ మిష‌న్ మొద‌టి ప్ర‌యత్నంలోనే విజ‌య‌వంతం కావ‌డాన్ని గురించి ప్ర‌స్తావించారు. నూతన భార‌త‌దేశంలో ఉద్యోగాల‌ను కోరుకునే యువ‌కులు ఉండ‌ర‌ని, ఉద్యోగాల‌ను క‌ల్పించే యువ‌తే ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. నైపుణ్యం గ‌ల మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వుంద‌ని, ఈ లోటును భారత యువ‌త తీర్చగలదని చెప్పారు.

భార‌త‌దేశంలో పెరుగుతున్న పట్టణీక‌ర‌ణకు ఆధునిక మౌలిక వ‌స‌తులు కావాల్సి ఉంద‌ని మెట్రో నెట్ వ‌ర్క్ లు, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌లు మొద‌లైన‌వి ఆవశ్యకం అవుతాయ‌ని ప్ర‌ధానమని అన్నారు. రైల్వే నెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ ల గురించి ఆయన మాట్లాడారు. గంగా న‌ది శుద్ధి కోసం ప్రారంభించిన కార్య‌క్ర‌మాన్ని గురించి పేర్కొన్నారు. ఇవ‌న్నీ పెట్టుబ‌డిదారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాల‌ను ఇస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

వ్య‌వ‌సాయ‌ రంగంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి వివ‌రిస్తూ, సేంద్రియ వ్య‌వ‌సాయం, ఆహార ప‌దార్థాల త‌యారీ రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టవ‌చ్చ‌ని ప్రధాన మంత్రి అన్నారు. త‌యారీ రంగానికి వ‌స్తే, ఆరోగ్య రంగ ప‌రిక‌రాల త‌యారీ, ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాల త‌యారీ విదేశీ పెట్టుబ‌డుల‌కు కీల‌క‌మైన రంగాల‌ని పేర్కొన్నారు.

సేవల రంగానికి వ‌స్తే, ప‌ర్యాట‌కం, ఆతిథ్యం రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌మివ్వవచ్చ‌ని చెప్పారు.

భార‌త‌దేశంలో 5,000 సంవ‌త్స‌రాల క్రిత‌మే వేదాల్లో ఒక‌టైన అధ‌ర్వ వేదం ప్ర‌కృతికి ఇచ్చిన మ‌హోన్నత ప్రాధాన్య‌ం గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ప్ర‌కృతిని దోచుకోవ‌డంపైన భార‌త‌దేశ ఆర్ధిక ప్ర‌గ‌తి ఆధార‌ప‌డ‌లేద‌ని, అలా చేయ‌డం నేర‌మ‌ని చెప్పారు. ప్ర‌కృతి సంర‌క్ష‌ణ‌, గౌర‌వాల‌ మీద‌నే త‌మ ఆర్ధిక వృద్ధి ఆధార‌ప‌డింద‌ని ఆయ‌న అన్నారు. 2022 నాటికి 175 గీగా వాట్ల నవీకరణ యోగ్య శక్తిని ఉత్ప‌త్తి చేయాల‌ని భార‌త‌దేశం ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు ప్ర‌ధానమంత్రి ప్ర‌త్యేకంగా చెప్పారు. బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్ప‌త్తి రంగంలో కంటే నవీకరణ యోగ్య శక్తి రంగంలోనే విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచుతున్నామ‌ని వివ‌రించారు. వాతావ‌ర‌ణానికి సంబంధించి భార‌త‌దేశం బాధ్యతాయుత దేశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌ధానమంత్రి స్పష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని జ‌ర‌గ‌కుండా ఎలాంటి లోటుపాట్లు లేని త‌యారీ రంగం దిశగా సాగుతున్నామని వివ‌రించారు. ఎల్ ఇడి బ‌ల్బుల పంపిణీ కార్య‌క్ర‌మాల వంటి వాటి వ‌ల్ల ఇప్ప‌టికే భారీ స్థాయిలో విద్యుత్తు ను ఆదా చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునేవారికి ఆకాశమే హ‌ద్దు అని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగంలో నొక్కిచెబుతూ, పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే విదేశీ పెట్టుబ‌డిదారుల‌ కోసం భార‌త‌దేశం త‌ర‌ఫున బ‌ల‌మైన వాద‌నను వినిపించారు.