Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి జ‌ర్మ‌నీ, స్పెయిన్‌, ర‌ష్యా, ఫ్రాన్స్ ల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరివెళ్లే ముందు విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌ర్మ‌నీ, స్పెయిన్‌, ర‌ష్యా, ఫ్రాన్స్ ల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరివెళ్లే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది:

‘‘నేను మే నెల 29, 30 తేదీలలో జ‌ర్మ‌నీలో పర్యటించనున్నాను. నాలుగవ ఇండియా- జ‌ర్మ‌నీ ఇంటర్ గవర్న మెంటల్ కన్సల్టేషన్స్ (ఐజిసి)లో పాల్గొనవలసిందిగా జర్మనీ చాన్స్ ల‌ర్ ఏంజెలా మర్కెల్ ఆహ్వానించారు.

రెండు పెద్ద ప్ర‌జాస్వామ్య దేశాలైన భార‌త‌దేశం, జ‌ర్మ‌నీలు ప్ర‌పంచంలో ప్ర‌ధాన‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కావ‌డంతో పాటు ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో కూడా ముఖ్య‌మైన పాత్రను పోషిస్తున్నాయి. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌పై ఆధార‌ప‌డిన మా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి దాప‌రికం లేని, సంఘ‌టిత క‌ట్టుబాటు స‌హా ప్ర‌పంచ క్ర‌మంలో నియ‌మ‌బ‌ద్ధ ప్రాతిప‌దిక కూడా ఉంది. మా అభివృద్ధి కృషిలో జ‌ర్మ‌నీ ఎంతో విలువైన భాగ‌స్వామి మాత్ర‌మే కాక ప‌రివ‌ర్తిత భార‌తం దిశ‌గా నా దార్శనికతకు కూడా జ‌ర్మ‌నీ సామ‌ర్థ్యం ఎంత‌గానో అనువైంది.

ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ ప్రాముఖ్యం గ‌ల అంశాల‌పై చ‌ర్చ‌ల కోసం చాన్స్ ల‌ర్ మర్కెల్ న‌న్ను సాద‌రంగా ఆహ్వానించిన మేర‌కు జ‌ర్మ‌నీ రాజ‌ధాని బెర్లిన్ స‌మీపంలోని మీజెబెర్గ్ నుండి నేను నా ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభిస్తాను.

ఈ సంద‌ర్భంగా మా ద్వైపాక్షిక సంబంధాల స్థితిగ‌తుల‌ను స‌మీక్షించేందుకు మే 30న చాన్స్ లర్ మర్కెల్‌, నేను సంయుక్తంగా నాలుగో ఐజీసీని నిర్వ‌హిస్తాం. అటుపైన రెండు దేశాల మ‌ధ్య వివిధ రంగాల‌లో స‌హ‌కారంపై భ‌విష్య‌త్ మార్గ ప్ర‌ణాళిక‌ను కూడా మేం రూపొందిస్తాం. ఇందులో భాగంగా వాణిజ్యం, పెట్టుబ‌డులు, భ‌ద్ర‌త‌, ఉగ్ర‌వాద నిరోధం, ఆవిష్క‌ర‌ణలు, శాస్త్ర-సాంకేతిక‌ విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ప‌ట్ట‌ణ ప్రాంతాలలో మౌలిక స‌దుపాయాలు, రైల్వేలు, పౌర విమాన‌యానం, శుద్ధ శక్తి, అభివృద్ధి భాగ‌స్వామ్యం, ఆరోగ్యం, ప్ర‌త్యామ్నాయ వైద్యం త‌దిత‌రాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారిస్తాం.

జ‌ర్మ‌నీ గ‌ణ‌తంత్ర స‌మాఖ్య అధ్య‌క్షుడు, అత్యంత గౌర‌వ‌నీయులైన డాక్ట‌ర్ ఫ్రాంక్‌-వాల్ట‌ర్ స్టీన్‌మీయ‌ర్‌ తోనూ నేను స‌మావేశ‌మ‌వుతాను.

వాణిజ్యం, సాంకేతిక‌త‌, పెట్టుబ‌డుల రంగాల్లో జ‌ర్మ‌నీ మా ప్ర‌ధాన భాగ‌స్వామి. త‌ద‌నుగుణంగా వాణిజ్యం, పెట్టుబ‌డుల రంగాల్లో మా సంబంధాన్ని మ‌రింత బలోపేతం చేసుకునే దిశ‌గా బెర్లిన్‌లో రెండు దేశాల అగ్ర శ్రేణి వాణిజ్య దిగ్గ‌జాల‌తో నేను, చాన్స్ లర్ మర్కెల్ ఇష్టాగోష్ఠి స‌మావేశంలో పాల్గొంటాం.

నా ప్ర‌స్తుత ప‌ర్య‌ట‌న వ‌ల్ల జ‌ర్మ‌నీతో మా ద్వైపాక్షిక స‌హ‌కారంలో కొత్త అధ్యాయం మొద‌ల‌వుతుంద‌ని, మా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

మే 30,31 తేదీల‌లో నేను స్పెయిన్‌లో అధికారికంగా ప‌ర్య‌టించనున్నాను. భార‌తదేశ ప్ర‌ధాన‌ మంత్రి స్పెయిన్ లో ప‌ర్య‌టించ‌డం దాదాపు మూడు ద‌శాబ్దాల త‌రువాత ఇదే మొదటి సారి అవుతుంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గౌర‌వ‌నీయులైన‌ స్పెయిన్ రాజు ఆరవ ఫెలిప్ గారిని క‌లుసుకునే గౌర‌వం కూడా నాకు దక్కనుంది.

ఇక 31వ తేదీన అధ్య‌క్షుడు శ్రీ మారియానో రాజోయ్‌ తో భేటీ కావడం కోసం నేను వేచిఉన్నాను. ప్ర‌ధానంగా ఆర్థిక రంగానికి సంబంధించి ద్వైపాక్షిక సర్దుబాట్లను పెంపొందించుకోదగ్గ అవకాశాలపై మేం చ‌ర్చించ‌బోతున్నాం. అలాగే ఉమ్మ‌డి అంత‌ర్జాతీయ స‌మస్య‌ల గురించి ప్ర‌త్యేకించి ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డంపై స‌హ‌కారం పైనా సంభాషించ‌నున్నాం.

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబ‌డుల సంబంధాల‌ను మ‌రింత వృద్ధి చెంద‌గ‌ల గ‌ణ‌నీయ సంభావ్య‌త కూడా ఉంది. మౌలిక స‌దుపాయాలు, అత్యాధునిక న‌గ‌రాలు, డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, నవీకరణ యోగ్య శక్తి, ర‌క్ష‌ణ‌, ప‌ర్యాట‌క రంగం స‌హా వివిధ భార‌తీయ ప్రాజెక్టుల‌లో స్పెయిన్ పారిశ్రామిక రంగ చురుకైన భాగ‌స్వామ్యాన్ని మేం కోరుతున్నాం.

స్పెయిన్ పారిశ్రామిక రంగంలో అగ్ర గామి కంపెనీల ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారులను కూడా నేను క‌లుసుకోబోతున్నాను. ఈ క్రమంలో మన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మంలో వారు భాగస్వామ్యం పంచుకొనేటట్లుగా వారిని ప్రోత్స‌హిస్తాను.

నా పర్యటన‌లో భాగంగా భార‌త‌దేశం-స్పెయిన్ సిఇఒ ల వేదిక తొలి స‌మావేశం కూడా నిర్వ‌హించ‌బోతున్నారు. భార‌త‌దేశం- స్పెయిన్ ఆర్థిక భాగ‌స్వామ్య బ‌లోపేతానికి వారి విలువైన సిఫార‌సుల కోసం నేను ఎదురుచూస్తున్నాను.

ర‌ష్యా లోని సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో నిర్వ‌హించే భార‌త‌దేశం-ర‌ష్యా 18 వార్షిక శిఖ‌రాగ్ర స‌భలో భాగంగా నేను మే 31వ తేదీ నుండి జూన్ 2వ తేదీ దాకా అక్క‌డ ప‌ర్య‌టించ‌బోతున్నాను.

జూన్ 1వ తేదీన అధ్య‌క్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్‌ తో నేను స‌మావేశమ‌వుతాను. ఈ సంద‌ర్భంగా గోవాలో 2016 అక్టోబ‌రులో నిర్వ‌హించిన శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నాటి మా చ‌ర్చ‌ల‌ను ముందుకు తీసుకెళ్ల‌డంపై ఆయ‌న‌తో చ‌ర్చిస్తాను. ఆర్థిక సంబంధాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారిస్తూ రెండు దేశాల సిఇఒ ల‌తో పుతిన్, నేను ఇష్టాగోష్ఠి నిర్వ‌హించ‌బోతున్నాం. మ‌రుసటి రోజు అధ్య‌క్షుడు శ్రీ పుతిన్‌ తో సంయుక్తంగా సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (ఎస్ పిఐఇఎఫ్) స‌ద‌స్సులో నేను ప్ర‌సంగించ‌బోతున్నాను. ఈ వేదిక స‌ద‌స్సుకు ముఖ్యఅతిథిగా న‌న్ను ఆహ్వానించ‌డం ఎంతో ముదావ‌హం. ఈ ఏడాది ఎస్ పిఐఇఎఫ్ కు భార‌తదేశం అతిథి దేశంగా హాజ‌ర‌వుతోంది.

ఇలాంటి ఈ తొలి స‌మావేశంలో భాగంగా ర‌ష్యా లోని వివిధ ప్రాంతీయ గ‌వ‌ర్న‌ర్ల‌తో చ‌ర్చించే అవ‌కాశం నాకు ల‌భించింది. ఈ సంద‌ర్భంగా విస్తృత పునాది గ‌ల ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంతో పాటు ఆయా రాష్ట్రాల‌/ప్రాంతాల‌ను, ఇత‌ర వైవిధ్య భాగ‌స్వాముల‌ను ఇందులో మ‌రింత చురుకైన భాగ‌స్వాముల‌ను చేయ‌డంపై దృష్టి సారిస్తాను. లెనిన్‌గ్రాడ్ ముట్ట‌డిలో అమ‌రులైన వారికి శ్ర‌ద్ధాంజ‌లిని ఘ‌టించ‌డం కోసం నా ర‌ష్యా ప‌ర్య‌ట‌న మొదట్లోనే నేను పిస్క‌రోవ్‌స్కయ్ స్మార‌క స‌మాధి ప్ర‌దేశానికి వెళ్ల‌బోతున్నాను. అలాగే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ‘స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియం, పురాత‌న రాత‌ప్ర‌తుల సంస్థ‌’ల‌ను సంద‌ర్శించే అవ‌కాశం కూడా నాకు ల‌భించింది.

రెండు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాల‌కు సంబంధించి 70వ వార్షికోత్స‌వాలు చేసుకోబోతున్న ఈ ప్ర‌త్యేక ద్వైపాక్షిక సంబంధాల సంవ‌త్స‌రంలో సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ ను సంద‌ర్శ‌ించడానికి నేనెంతో ఉవ్విళ్లూరుతున్నాను.

జూన్ 2, 3 తేదీల‌లో నేను ఫ్రాన్స్‌లో ప‌ర్య‌టించ‌బోతున్నాను. అక్క‌డ ఫ్రాన్స్ కొత్త అధ్య‌క్షుడు గౌర‌వ‌నీయులైన శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రో తో 3వ తేదీన ఆధికారికంగా స‌మావేశమ‌వుతాను. మా కీల‌క వ్యూహాత్మ‌క భాగ‌స్వాముల‌లో ఫ్రాన్స్ అత్యంత ముఖ్య‌మైన‌ది. ఆ మేర‌కు అధ్యక్షుడు మేక్రాన్‌తో ప‌ర‌స్ప‌ర ఆస‌క్తి గ‌ల అంశాల‌పై చ‌ర్చ‌ల కోసం ఎదురుచూస్తున్నాను. ఇందులో భాగంగా ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి సంస్క‌ర‌ణ‌లు, మండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వంస‌హా వివిధ బ‌హుళ‌ ప‌క్ష ఎగుమ‌తి నియంత్ర‌ణ చ‌ట్టాలు, ఉగ్ర‌వాద నిరోధంలో స‌హ‌కారం, వాతావ‌ర‌ణ మార్పుపై సంయుక్త కృషి, ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ వంటి ప్ర‌ధాన‌మైన అంత‌ర్జాతీయ అంశాల‌పై ఫ్రాన్స్ అధ్య‌క్షుడితో అభిప్రాయాల ఆదాన‌ప్ర‌దానం కూడా సాగుతుంది.

భార‌తదేశానికి పెట్టుబ‌డి భాగస్వాముల‌లో ఫ్రాన్స్ 9వ అతి పెద్ద దేశం. అంతేకాకుండా ర‌క్ష‌ణ‌, అంత‌రిక్షం, పరమాణు శక్తి మరియు నవీకరణ యోగ్య శక్తి, ప‌ట్ట‌ణాభివృద్ధి, రైల్వే త‌దిత‌ర రంగాల్లో అభివృద్ధి కృషికి సంబంధించి కీల‌క భాగ‌స్వామిగానూ ఉంది. ఇంత‌టి కీల‌క దేశ‌మైన ఫ్రాన్స్‌తో బ‌హుముఖ భాగ‌స్వామ్యాన్ని గ‌ణ‌నీయంగా బ‌లోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లేందుకు నేను క‌ట్టుబ‌డి ఉన్నాను.’’

****