Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘జాతీయ ఉక్కు విధానం- 2017’కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


నూత‌న విధానం- దీర్ఘ‌కాలిక దార్శ‌నిక‌త‌కు ప్ర‌తిబింబం

ఉక్కు రంగాన్ని అంత‌ర్జాతీయంగా పోటీపడే స్థాయికి తీర్చిదిద్దడం, అత్యున్న‌త శ్రేణి నాణ్య‌త‌ కలిగిన ఉక్కు ఉత్పత్తి, దేశీయంగా ఉక్కు వినియోగాన్ని పెంపొందించడంపైన శ్రద్ధ తీసుకోవడం

 

2017 జాతీయ ఉక్కు విధానానికి (ఎన్ ఎస్ పి) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఉక్కు రంగానికి ఊతం ఇవ్వాల‌న్న ప్ర‌భుత్వ దీర్ఘ‌కాలిక దార్శ‌నిక‌త‌కు నూత‌న ఉక్కు విధానం అద్దం ప‌డుతోంది. దేశీయంగా ఉక్కు వినియోగాన్ని పెంపొందించ‌డంతో పాటు అత్యంత నాణ్య‌త గ‌ల ఉక్కు త‌యారీకి ఈ విధానం పూచీప‌డ‌నుంది. అలాగే అధునాత‌న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డ‌మే కాకుండా, అంతర్జాతీయంగా ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను పోటీకి త‌ట్టుకునేలా చేయ‌నుంది.

ఎన్ఎస్‌పి 2017 లోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి:

1. ప్రైవేటు ఉత్ప‌త్తిదారుల‌కు, ఎమ్ఎస్‌ఎమ్ఇ ఉక్కు ఉత్ప‌త్తిదారుల‌కు, సిపిఎస్ఇ ల‌కు విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తును అందించడం, మార్గ‌ద‌ర్శ‌నం వహించడం ద్వారా ఉక్కు ఉత్ప‌త్తి రంగంలో స్వావ‌లంబ‌నను సాధించ‌డం.
2. తగినంత సామ‌ర్ధ్యం జోడింపును ప్రోత్స‌హించ‌డం,
3. అంత‌ర్జాతీయ‌ పోటీకి త‌గిన‌ట్టు ఉక్కు తయారీ సామ‌ర్ధ్యాల అభివృద్ధి
4. త‌క్కువ ఉత్ప‌త్తి వ్య‌యంతో ఉక్కు ఉత్ప‌త్తి
5. దేశీయంగా ముడి ఇనుప ఖ‌నిజం, కోకింగ్‌ బొగ్గు, స‌హ‌జ‌ వాయువు అందుబాటు
6. విదేశీ పెట్టుబ‌డి అందుబాటును సుల‌భ‌త‌రం చేయడం
7. ముడిస‌ర‌ుకుకు సంబంధించిన ఆస్తుల‌ను సేక‌రించ‌డం
8. దేశీయంగా ఉక్కుకు గిరాకీని పెంపొందించ‌డం

నూత‌న ఉక్కు విధానం ముడి ఉక్కు సామ‌ర్ధ్యాన్ని 2030-31 నాటికి 300 మిలియ‌న్‌ ట‌న్నులు (ఎంటి)లుగా, ఉత్ప‌త్తిని 255 మిలియ‌న్‌ ట‌న్నులుగా, ఫినిష్‌డ్ స్టీల్ త‌ల‌సరి వినియోగం 158 కేజీల‌కు పెంచాల‌ని అంచ‌నావేస్తోంది. ప్ర‌స్తుతం ఫినిష్‌డ్ స్టీల్ త‌ల‌స‌రి వినియోగం 61 కేజీలుగా ఉంది. అలాగే వ్యూహాత్మ‌క వినియోగానికి సంబంధించి ఉన్న‌త స్థాయి ఆటోమోటివ్ స్టీల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌ స్టీల్‌, స్పెష‌ల్ స్టీల్స్‌, మిశ్రిత ఉక్కుకు దేశీయంగా గల మొత్తం డిమాండ్‌ను తీర్చ‌డం, దానితో పాటు 2030-31 నాటికి కోకింగ్ కోల్ దిగుమ‌తుల‌ను 85 శాతం నుండి 65 శాతానికి త‌గ్గించే ఉద్దేశంతో వాష్‌డ్ కోకింగ్ కోల్ అందుబాటును దేశీయంగా పెంచాల‌ని ఈ విధానం సూచిస్తోంది.

నూత‌న ఉక్కు విధానం లోని కొన్ని ముఖ్య‌మైన అంశాలు

– గ‌త కొన్ని సంవ‌త్స‌రాల‌లో భార‌త ఉక్కు రంగం గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. ప్ర‌స్తుతం ఇది అంత‌ర్జాతీయ‌గా మూడ‌వ అతి పెద్ద ఉక్కు ఉత్ప‌త్తిదారు. ఇది దేశ జిడిపి కి 2 శాతం స‌మ‌కూరుస్తోంది. 2016-17లో విక్రయానికి ఉద్దేశించిన ఉక్కు ఉత్ప‌త్తి భారతదేశం 100 ఎంటి ల స్థాయిని అధిగమించింది.

– 2030 నాటికి 300 ఎం.టిల ఉక్కు త‌యారీ సామ‌ర్ధ్యాన్ని స‌మ‌కూర్చుకోవాల‌ని 2017 నూత‌న ఉక్కు విధానం ఆకాంక్షిస్తోంది. 2030-31 నాటికి దీనివ‌ల్ల అద‌నంగా ప‌దిల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల అద‌న‌పు పెట్టుబ‌డులు స‌మ‌కూర‌నున్నాయి.

– మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ రంగం, ఆటోమొబైల్స్‌, గృహ‌నిర్మాణ రంగం వంటి ప్ర‌ధాన రంగాల‌లో ఉక్కు వినియోగాన్ని పెంచాల‌ని ఈ విధానం ఆకాంక్షిస్తోంది..
– కొత్త ఉక్కు విధానం ప్ర‌స్తుత ఉక్కు త‌ల‌స‌రి వినియోగాన్ని 60 కేజీల నుండి 2030 నాటికి 160 కేజీల‌కు పెంచాల‌ని ఆకాంక్షిస్తోంది.

– ఉక్కు రంగంలో ఎమ్ఎస్‌ఎమ్ఇ సామ‌ర్ధ్యాన్ని నూత‌న ఉక్కు విధానం గుర్తించింది. ఇంధ‌నపరంగా మెరుగైన‌, స‌మ‌ర్థ‌త క‌లిగిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఎమ్ఎస్‌ఎమ్ఇ రంగంలో వాడేందుకు , మొత్తం ఉత్పాద‌క‌త‌ను మెరుగుప‌రిచేందుకు, ఎక్కువ ఇంధ‌న వినియోగంపై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించేందుకు ఈ విధానం వీలు క‌ల్పిస్తోంది.

– స్టీల్ రిసర్చ్ అండ్ టెక్నాల‌జీ మిష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఆర్‌టిఎమ్ఐ) ఏర్పాటు ద్వారా ఉక్కు మంత్రిత్వ‌ శాఖ ప‌రిశోధ‌న‌ & అభివృద్ధి కి వీలు క‌ల్పించ‌నుంది. ఉక్కు ప‌రిశ్ర‌మ‌, జాతీయ స్థాయి అభివృద్ధి , ప‌రిశోధన శాల‌లు, విద్యాసంస్థ‌ల స‌మ‌ష్ఠి కృషితో జాతీయ స్థాయిలో ఉక్కు రంగంలో ప‌రిశోధ‌న‌ & అభివృద్ధి ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న‌ది ఈ నూత‌న విధాన ల‌క్ష్యం.

– ముడి ఇనుప ఖ‌నిజం, కోకింగ్ కోల్‌, నాన్ కోకింగ్ కోల్‌, స‌హ‌జ‌వాయువు వంటి వాటిని పోటీ ధ‌ర‌ల వ‌ద్ద అందుబాటులో ఉండే విధంగా వివిధ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను దీని మంత్రిత్వ‌ శాఖ అమ‌లు చేయ‌నుంది.

– ‘జాతీయ ఉక్కు విధానం, 2017’ ను అమలుచేయడం ద్వారా అధునాత‌న‌ సాంకేతిక ప‌రిజ్ఞానంతో, అంత‌ర్జాతీయ పోటీకి దీటుగా ఉక్కు వినియోగ డిమాండ్ పెరుగుద‌ల అంచ‌నాల‌కు అనుగుణంగా దేశీయ ఉక్కును ప్రోత్స‌హించే వాతావ‌ర‌ణం ఏర్ప‌ాటు చేయ‌డం జ‌రుగుతుంది. వివిధ మంత్రిత్వ‌ శాఖ‌ల ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో అవ‌స‌ర‌మైన రీతిలో ఉక్కు మంత్రిత్వ‌శాఖ ఇది సాకార‌మ‌య్యేట్టు చూస్తుంది.

పూర్వ రంగం

ఆధునిక ప్ర‌పంచంలో ఉక్కు ఒక ముఖ్య‌మైన ఉత్ప‌త్తి. ఏ పారిశ్రామిక ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌కైనా ఇది వెన్నెముక వంటిది. ప్ర‌పంచంలో శ‌ర‌వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో భార‌త దేశం ఒక‌టి. అందులోనూ ఉక్కు నిర్మాణ రంగంలో, మౌలిక స‌దుపాయాల రంగంలో, విద్యుత్తు, ఏరో స్పేస్‌, పారిశ్రామిక యంత్రాల తయారీ నుండి వినియోగ వ‌స్తువుల వ‌ర‌కు ఉక్కు వినియోగం విరివిగా ఉంటోంది. దేశానికి ఇది వ్యూహాత్మ‌కంగా ఎంతో కీల‌క‌మైన రంగం. భార‌త ఉక్కు రంగం గ‌త కొద్ది సంవ‌త్స‌రాల‌లో అద్భుత‌మైన ప్ర‌గ‌తిని సాధించి అంత‌ర్జాతీయంగా ఉక్కు ఉత్ప‌త్తిలో మూడ‌వ స్థానానికి చేరింది. ఇది దేశ జిడిపికి రెండు శాతం స‌మ‌కూరుస్తోంది. ఐదు ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగాను, 20 ల‌క్ష‌ల మందికి ప‌రోక్షంగానూ ఉపాధి స‌మ‌కూరుస్తోంది.

గ‌ట్టి విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు, సామ‌ర్ధ్య స‌ద్వినియోగం అనేవి ప్ర‌గ‌తికి స‌రైన వేదిక‌గా నిలుస్తాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ఈ రంగంలో భారీ మార్పుల అవ‌స‌రాన్ని, ఈ రంగం వ్యూహాత్మ‌క ప్రాధాన్య‌ాన్ని దృష్టిలో పెట్టుకొని ‘నూత‌న ఉక్కు విధానం, 2017’ త‌ప్ప‌నిస‌రైంది. 2005 నాటి జాతీయ ఉక్కు విధానం ఆనాటి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ నుండి చేకూరే ల‌బ్ధి నుండి ఫ‌లితాల‌ను సంఘ‌టిత ప‌ర‌చ‌డానికి అవ‌స‌ర‌మైన విధి విధానాల‌ను సూచించడ‌మే కాక ఉక్కు రంగం స‌మ‌ర్థంగా మ‌రింత ముందుకు పోవ‌డానికి అవ‌స‌ర‌మైన మార్గ సూచిని కూడా ఆవిష్కరించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారిన‌ ప్ర‌స్తుత‌ ప‌రిస్థితుల‌కు అనుగుణంగానూ అలాగే, ఉక్కు రంగంలో డిమాండ్‌, స‌ర‌ఫ‌రాల‌కు అనుగుణంగా నూత‌న ఉక్కు విధానాన్ని తీసుకురావ‌డం ఆవశ్యకమైంది.

***