ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ స్టడీస్ రంగంలో సైనిక విద్యకు సంబంధించిన సహకారం కోసం వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ కు, ఢాకా లోని మీర్ పూర్ లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ కు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ స్టడీస్ రంగంలో సైనిక విద్యకు సంబంధించి ఇతోధిక సహకారం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేసేందుకు మరియు ఉభయ దేశాల మధ్య సన్నిహితమైన, దీర్ఘకాలికమైన సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఎమ్ఒయు వీలు కల్పిస్తుంది.
రెండు దేశాల మధ్య భౌగోళిక మరియు సాంస్కృతిక సాన్నిహిత్యం ఉంది. ఉగ్రవాదాన్ని నిరోధించడం వంటి ఉమ్మడి సవాళ్లు కూడా ఇరు దేశాల మధ్య అనేకం ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సంయుక్త చర్యలు అవసరమవుతాయి. ఈ కారణంగా, సాయుధ బలగాల మధ్య మెరుగైన సమన్వయం మరియు సహకారం ఏర్పడవలసిన ఆవశ్యకత ఉంది. సంయుక్తంగా చేపట్టే శిక్షణ మరియు అభ్యాసాలు సాయుధ బలగాల సామర్థ్యాలలో సమానత్వాన్ని తీసుకురావడానికి తోడ్పడడంతో పాటు, ఉమ్మడి బెదిరింపులకు, ఉమ్మడి సవాళ్లకు ఎదురొడ్డి నిలవడానికి చేదోడుగా ఉంటాయి. భారతదేశం మరియు బాంగ్లాదేశ్ ల మధ్య సమాచారం, సాంకేతికతల ఆదాన ప్రదానం ద్వారా ఇరు పక్షాల బహిరంగ జవాబుదారీతనాన్ని కూడా ఈ ఎమ్ఒయు పెంపొందిస్తుంది.