Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాంగ్లాదేశ్ ప్రధాని భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

బాంగ్లాదేశ్ ప్రధాని భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

బాంగ్లాదేశ్ ప్రధాని భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

బాంగ్లాదేశ్ ప్రధాని భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన


శ్రేష్ఠురాలైన ప్రధాని శేఖ్ హసీనా,
మీడియా ప్రతినిధులారా,

భారతదేశాన్ని సందర్శిస్తున్న శ్రేష్ఠురాలైన ప్రధాని శేఖ్ హసీనా గారికి స్వాగతం పలకడం నిజంగా సంతోషకరమైన విషయం.

ఎక్సెలెన్సీ,

మీ భారతదేశ పర్యటన సరిగ్గా पोयला बोइशाख కు కేవలం కొద్ది రోజుల ముందు ఒక శుభ సమయంలో జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు, బాంగ్లాదేశ్ ప్రజలకు शुवो नबा बर्षो శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పర్యటన మన దేశాల మధ్య, మన ప్రజల మధ్య మరో స్వర్ణ యుగాన్ని సూచిస్తోంది. మన సంబంధాలతో, మన భాగస్వామ్యంతో సాధించిన విజయాల లోని సాధారణ పరివర్తన మీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వానికొక స్పష్టమైనటువంటి గుర్తింపు. 1971 విమోచన యుద్ధం లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల కుటుంబాలను గౌరవించాలని మీరు తీసుకున్న నిర్ణయం భారతీయ ప్రజలందరినీ కదిలించివేసింది. తీవ్రవాద పాలన నుండి బాంగ్లాదేశ్ ను విముక్తం చేయడం కోసం భారతీయ సైనికులు, बीर मुक्तिजोधा కలసి పోరాడారని తెలుసుకొని ప్రతి భారతీయుడు గర్వపడతాడు.

మిత్రులారా,

ఈ రోజు ఎక్సెలెన్సీ శేఖ్ హసీనా గారు, నేను మన పూర్తి భాగస్వామ్యంపై ఫలప్రద, సమగ్ర చర్చలు జరిపాం. మన సహకార కార్యాచరణ ప్రయోజనపూర్వక చర్యలపైన దృష్టి నిలిపి సాగాలని మేం తీర్మానించాం. మన సంబంధాలు పురోగమించడం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని, నూతన అవకాశాలను అందుకోవాలని మేం ప్రత్యేకంగా తీర్మానించాం. మన రెండు సమాజాల యువతను మరింతగా అనుసంధానం చేసే విధంగా నూతన అంశాలలో ముఖ్యంగా కొన్ని ఉన్నత సాంకేతిక రంగాలలో సహకారాన్నిపెంపొందించుకోవాలని నిర్ణయించాం. వీటిలో ఎలక్ట్రానిక్స్, సమాచార పరిజ్ఞానం, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష పరిశోధన, పౌర అణు ఇంధనం మొదలైనవి ఉన్నాయి.

మిత్రులారా,

భారతదేశం ఎల్లపుడూ బాంగ్లాదేశ్ మరియు ఆ దేశ ప్రజల శ్రేయస్సు కోసమే నిలచింది. మేం చిర కాలంగా బాంగ్లాదేశ్ కు నమ్మకమైన అభివృద్ధి భాగస్వామ్య దేశంగా ఉన్నాం. మన సహకారం ఫలితాలు మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, భారతదేశం, బాంగ్లాదేశ్ లు రెండు కూడా కృతనిశ్చయంతో ఉన్నాయి. బాంగ్లాదేశ్ లోని ప్రాజెక్టుల అమలు కోసం 4.5 బిలియన్ డాలర్ల ఒక కొత్త రాయితీ తో కూడిన ఋణ సదుపాయాన్ని (Line of Credit ) కల్పిస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. దీనివల్ల బాంగ్లాదేశ్ కోసం మా వనరుల కేటాయింపు గత ఆరేళ్లుగా 8 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. మన అభివృద్ధి భాగస్వామ్యంలో శక్తి భద్రత ఒక ముఖ్యమైన అంశం. దీంతో పాటు, మన శక్తి భాగస్వామ్యం పెంపొందుతూనే ఉంటుంది. భారతదేశం నుండి బాంగ్లాదేశ్ కు ఇంతవరకు సరఫరా అవుతున్న 600 మెగా వాట్ల విద్యుత్తు కు అదనంగా ఈ రోజు మరో 60 మెగా వాట్ల విద్యుత్తు సరఫరాను జత చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అంతర్గత అనుసంధానం ద్వారా మరో 500 మెగా వాట్లు సరఫరా చేయాలని ఇప్పటికే ఒప్పందం కుదిరింది. నుమాలిగఢ్ నుండి పర్బతీపూర్ డీజిల్ ఆయిల్ గొట్టపు మార్గం కోసం ఆర్ధిక సహాయం అందించాలని కూడా మేం అంగీకరించాం. బాంగ్లాదేశ్ కు హై స్పీడ్ డీజిల్ ను సరఫరా చేయడానికి మా కంపెనీలు ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. గొట్టపు మార్గం నిర్మాణం పూర్తయ్యే వరకు ఒక నిర్ణీత కాల వ్యవధితో క్రమం తప్పకుండా సరఫరా కోసం కూడా మేం అంగీకరించాం. ఈ రంగంలో ప్రవేశించవలసిందిగా మా ఇరు దేశాలకు చెందిన ప్రయివేటు రంగాలను మేం ప్రోత్సహిస్తున్నాం. రానున్న రోజులలో బాంగ్లాదేశ్ లో శక్తి రంగంలో పెట్టుబడుల కోసం భారతీయ సంస్థలు పలు ఒప్పందాలపైన సంతకాలు చేయనున్నాయి. బాంగ్లాదేశ్ ఇంధన అవసరాలను తీర్చడంలో భారతదేశం ఒక అనుకూల భాగస్వామిగా కొనసాగుతుంది. ‘2021 నాటికి అందరికీ శక్తి’ అనే తన లక్ష్యాన్ని చేరుకోనుంది.

మిత్రులారా,

ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యం, ఉప ప్రాంతీయ ఆర్ధిక పథకాలు, భారీ ప్రాంతీయ ఆర్ధిక అభివృద్ధి విజయానికి అనుసంధానం చాలా కీలకం. గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారితో కలసి, మేం ఈ రోజు పెరుగుతున్న అనుసంధానానికి పలు కొత్త మార్గాలను జత చేయడం జరిగింది. కోల్ కతా – ఖుల్నా మరియు రాధికాపూర్ – బీరోల్ మధ్య బస్సు, రైలు మార్గాలను ఈ రోజు పునరుద్ధరించడం జరిగింది. స్వదేశంలో జల మార్గాలను అనుకూలంగా మార్చుకోవడం జరుగుతోంది. అలాగే, కోస్తా నౌకా రవాణా ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. రెండువైపుల సరకు రవాణాలో ప్రగతి ని చూస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. B.B.I.N. మోటర్ వాహనాల ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని మేం ఎదురుచూస్తున్నాం. ఉప ప్రాంతీయ సమన్వయంలో ఇది ఒక కొత్త శకానికి నాంది కాగలదు.

మిత్రులారా,

మన వాణిజ్య ఒప్పందాలను విస్తరించవలసిన అవసరాన్ని ప్రధాని శేఖ్ హసీనా గారు, నేను గుర్తించాం. కేవలం మన రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యాలను విస్తరించడమే కాక, తద్వారా అధిక ప్రాంతీయ ప్రయోజనాలను కూడా పొందగలగాలి. ఈ దశగా చేపట్టిన చర్యలలో రెండు దేశాలకు చెందిన వ్యాపార రంగం, పారిశ్రామిక రంగం కృషి ప్రధానమైంది. ప్రధాని సారథ్యం లోని ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధివర్గానికి స్వాగతం పలకడం చాలా ఆనందాన్నిచ్చింది. కొత్త సరిహద్దు మార్గాలను ప్రారంభించాలన్న మన ఒప్పందం సరిహద్దు సమాజాలు వాణిజ్యం ద్వారా అభివృద్ధి చెందడానికి, వారి జీవనోపాధికి దోహదపడనుంది.

మిత్రులారా,

మన సామర్ధ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాల విజయాలను ప్రధాని శేఖ్ హసీనా గారు, నేను గుర్తించాం. భారతదేశంలో – బాంగ్లాదేశ్ కు చెందిన 1500 పౌర అధికారుల శిక్షణ దాదాపు పూర్తయ్యింది. ఇదే తరహాలో బాంగ్లాదేశ్ కు చెందిన న్యాయ అధికారులకు కూడా మన జ్యుడీషియల్ అకాడమీలలో శిక్షణ కార్యక్రమాన్ని మేం చేపట్టనున్నాం.

మిత్రులారా,

మన భాగస్వామ్యం ఒక వైపు మన ప్రజలకు శ్రేయస్సును కలుగజేస్తూనే మరొక వైపు వారిని తప్పుదోవ పట్టించే తీవ్రవాద దళాల నుండి రక్షణను కల్పించడానికి కూడా పనిచేస్తోంది. తీవ్రవాదుల విస్తరణ భారతదేశం, బాంగ్లాదేశ్ లకు మాత్రమే కాదు, అది ఈ ప్రాంతం మొత్తానికి పెనుముప్పుగా పరిణమించింది. తీవ్రవాద సమస్య పరిష్కారానికి ప్రధాని శేఖ్ హసీనా చేస్తున్న కృషిని మేం చాలా అభినందిస్తున్నాం. తీవ్రవాదం పట్ల ఆమె ప్రభుత్వం అనుసరిస్తున్న ‘అసలు సహనం చూపని’ విధానం మా అందరికి ఒక స్ఫూర్తి గా నిలచింది. మన ప్రాంతం, మన ప్రజల శాంతి, రక్షణ, అభివృద్దే మన ముఖ్యమైన ధ్యేయంగా ఉందన్న విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. మన సాయుధ దళాల మధ్య సన్నిహిత సహకారం పై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా దీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఒక పనిని కూడా ఈ రోజు మనం చేపట్టాం. బాంగ్లాదేశ్ రక్షణ కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు అవసరమైన 500 మిలియన్ అమెరికా డాలర్ల ఋణ సహాయాన్ని ప్రకటించడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. బాంగ్లాదేశ్ అవసరాలకు, ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ ఋణ సహాయాన్ని అమలు చేయడం జరుగుతుంది.

మిత్రులారా,

మన రెండు దేశాలు అతి పొడవైన భూ సరిహద్దులను కలిగివున్నాయి. 2015 జూన్ నెలలో నా ఢాకా పర్యటన సందర్భంగా భూ సరిహద్దు ఒప్పందాన్ని మనం నిర్ధారించుకున్నాం. దాని అమలు ఇప్పుడు ఆచరణలో ఉంది. భూ సరిహద్దులతో పాటు నదులను కూడా మనం సరిహద్దులుగా కలిగివున్నాం. అవి మన ప్రజలతో మమేకమై ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాగే, మరింతగా దృష్టిని ఆకర్షించేది ” తీస్తా”. ఇది భారతదేశానికి ముఖ్యమైనది, అలాగే బాంగ్లాదేశ్ కీ ముఖ్యమైనది, భారతదేశం- బాంగ్లాదేశ్ సంబంధాలకు ముఖ్యమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన గౌరవనీయ అతిథి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. బాంగ్లాదేశ్ పట్ల నా భావాలు ఎంత హార్దికంగా ఉంటాయో ఆమె భావాలు కూడా అంతేనన్న విషయం నాకు తెలుసు. మా చిత్తశుద్ధి, ప్రయత్నాలు ఇలాగే కొనసాగుతాయని మీకు, బాంగ్లాదేశ్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. తీస్తా జల పంపకానికి ఒక సత్వర పరిష్కారాన్ని మా ప్రభుత్వం మరియు ఎక్సెలెన్సీ శేఖ్ హసీనా గారూ, మీ ప్రభుత్వం మాత్రమే కనుగొనగలుగుతాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

బంగబంధు శేఖ్ ముజిబుర్ రెహ్మాన్ గారు భారతదేశానికి ఒక ప్రియమైన స్నేహితుడు, ఒక మహోన్నతమైన నాయకుడు. బాంగ్లాదేశ్ పితామహుని పట్ల గౌరవం, అమితమైన అభిమానానికి గుర్తుగా మా రాజధాని నగరంలోని ఒక ముఖ్యమైన రహదారికి ఆయన పేరును పెట్టుకోవడం జరిగింది. ఆయన శత జయంతి సంవత్సరమైన 2020 లో విడుదల చేసే విధంగా బంగబంధు జీవితంపైన, సేవలపైన సంయుక్తంగా ఒక చలనచిత్రాన్ని నిర్మించాలని కూడా మనం అంగీకరించాం. ప్రధాని శేఖ్ హసీనా గారితో కలసి బంగబంధు యొక్క ‘అసంపూర్ణ స్మృతులు’ హిందీ అనువాదాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కింది. ఆయన జీవితం, బాంగ్లాదేశ్ నిర్మాణానికి ఆయన నిర్వహించిన పోరాటం, చేసిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. 2021 లో బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధంపై సంయుక్తంగా ఒక డాక్యుమెంటరీ చిత్రం నిర్మించాలని మనం అంగీకరించాం.

ఎక్సెలెన్సీ !

బంగబంధు దూరదృష్టిని, వారసత్వాన్ని ముందుకు నడిపించడంలో మీరు విజయం సాధించారు. ఈ రోజు, మీ నాయకత్వంలో బాంగ్లాదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. బాంగ్లాదేశ్ తో సంబంధాల పట్ల భారతదేశంలో మేం చాలా సంతోషిస్తున్నాం. మన అనుబంధాలు తర తరాల రక్త సంబంధంతోను, బంధు ప్రీతితోను ముడిపడి ఉన్నాయి. ఈ బంధాలు మన ప్రజలకు ఉజ్జ్వల భవిష్యత్తును, భద్రతను కల్పించాలని కోరుకొనేవే. ఈ మాటలతో ఎక్సెలెన్సీ, మీకూ, మీ ప్రతినిధివర్గానికి మరోసారి భారతదేశానికి నేను స్వాగతం పలుకుతున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు.

మీకు మరీ మరీ ధన్యవాదాలు..