శ్రీ చరణ్‌సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నూర్‌పూర్‌లో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 1923లో సైన్సులో డిగ్రీ తీసుకున్నారు. 1925లో ఆగ్రా యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. న్యాయవాది శిక్షణ కూడా పొంది ఘజియాబాద్‌లో ప్రాక్టీస్ పెట్టారు. 1929లో మీరట్ నుంచి మకాం మార్చి తరువాత కాంగ్రెస్‌లో చేరారు.
చరణ్‌సింగ్ మొదట 1937లో చాప్రోలి నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం 1946, 1952, 1962, 1967లలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 1946లో పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, మెడికల్, పబ్లిక్ హెల్త్, జస్టిస్, ఇన్ఫర్మేషన్ వంటి వివిధ శాఖల్లో పనిచేశారు. 1951 జూన్‌లో రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ఆయనకు న్యాయ, సమాచార శాఖలు అప్పగించారు. ఆ తరువాత 1954లో డాక్టర్ సంపూర్ణానంద్ కేబినెట్‌లో రెవెన్యూ, వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1959 ఏప్రిల్‌లో రాజీనామా చేసేనాటికి ఆయన రెవెన్యూ, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
చరణ్‌సింగ్ 1960లో జి.బి.గుప్తా మంత్రివర్గంలో హోం, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 1962 -63లో శ్రీమతి సుచేత కృపలానీ మంత్రివర్గంలో వ్యవసాయం, అటవీశాఖ మంత్రిగా ఉన్నారు. 1965లో వ్యవసాయశాఖను వదిలిపెట్టి 1966లో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ శాఖను చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీలో చీలిక అనంతరం 1970 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు. అయితే, 8 నెలల వ్యవధిలోనే అక్టోబర్ 2న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
ఉత్తరప్రదేశ్‌కు వివిధ హోదాల్లో సేవలు అందించిన చరణ్‌సింగ్ పరిపాలనలో అసమర్థతను, ఆశ్రిత పక్షపాతాన్ని, అవినీతిని సహించని బృహత్తర లక్ష్య సాధకునిగా ఖ్యాతిగాంచారు.
ఉన్నత విలువలు కలిగిన పార్లమెంటేరియన్‌గా వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెట్టగల సత్తా ఉన్న నాయకునిగా చరణ్‌సింగ్ తన వాగ్ధాటితోను, సాహసోపేత లక్షణాలతోను పేరు తెచ్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో భూ సంస్కరణలకు ప్రధాన సూత్రధారిగా చంద్రశేఖర్ 1939లో డిపార్ట్ మెంట్ రిడంప్షన్ బిల్లు రూపకల్పనలోను, ఖరారులోను సారధ్య పాత్ర వహించారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రుణ భారం నుంచి ఉపశమనం కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లో మంత్రుల వేతనాలను, అధికారాలను గణనీయంగా తగ్గించేందుకు కూడా ఆయన చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన 1960 లాండ్ హోల్డింగ్ చట్టం భూకమతాలపై పరిమితిని తగ్గించి రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండేందుకు దోహదం చేసింది.
అట్టడుగు స్థాయిలో ప్రజాదరణ కలిగిన చాలా కొద్దిమంది రాజకీయ నాయకులు మాత్రమే చరణ్‌సింగ్‌తో పోల్చడానికి వీలవుతుంది. అంకితభావం కలిగిన సేవకునిగా, సామాజిక న్యాయం పట్ల దృఢమైన విశ్వాసం కలిగిన నేతగా చరణ్‌సింగ్ లక్షలాది మంది రైతుల విశ్వాసం చూరగొన్నారు.
నిరాడంబర జీవితాన్ని గడిపిన చౌధురి చరణ్‌సింగ్ తన తీరిక సమయాన్ని పుస్తక పఠనానికి, రచనా వ్యాసాంగానికి వెచ్చించారు. ‘అబాలిషన్ ఆఫ్ జమీందారీ’, ‘కో-ఆపరేటివ్ ఫార్మింగ్’, ‘ఎక్స్-రేడ్’, ‘ఇండియాస్ పావర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్’, ‘పీజంట్ ప్రొప్రైటర్ షిప్ ఆర్ ల్యాండ్ టు ది వర్కర్స్’, ‘ప్రివెన్షన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ హోల్డింగ్స్ బిలో ఏ సర్టెన్ మినిమమ్’ తో సహా అనేక పుస్తకాలు, కర పత్రాలు ఆయన రచించారు.