భారతదేశ 14వ ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్సింగ్ ఆలోచనాపరుడుగా, మేధావిగా సరైన గుర్తింపు పొందారు. పనితీరులో సామర్థ్యం, దృక్పథం పరంగా సర్వాదరణ పొందారు. సమస్యల పట్ల స్పందన, నడవడిలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జన్మించారు. 1948లో పంజాబ్ యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. తరువాత ఆయన చదువు పంజాబ్ నుంచి బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి మారింది. అక్కడ ఆయన 1957లో ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీ తీసుకున్నారు. తరువాత 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని నఫ్పీల్డ్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో డీఫిల్ తీసుకున్నారు. ఆయన పుస్తకం ‘ఇండియాస్ ఎక్స్ పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ -సస్టెయిండ్ గ్రోత్’ (క్లారెండన్ ప్రెస్, ఆక్స్ ఫర్డ్, 1964) భారతదేశ అంతర్గత కేంద్రీకృత వాణిజ్య విధానానికి తొలి విమర్శనా రచనగా గుర్తింపు పొందింది.
డాక్టర్ మన్మోహన్సింగ్ విద్యా పాండిత్యం ఆయన పంజాబ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా పనిచేసిన సంవత్సరాల్లో మరింతగా వికసించింది. ప్రతిష్ఠాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా ఆయన రాణించారు. ఇదే సమయంలో ఆయన అంక్టాడు సెక్రటేరియట్లో కొద్దికాలం పని చేశారు. తరువాత 1987- 90 మధ్య జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.
1971లో డాక్టర్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారుగా చేరారు. ఆ తరువాత కొద్ది కాలానికే 1972లో ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన అనేక పదవులలో ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రధానమంత్రి సలహాదారు, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీ ఛైర్మన్ మొదలైనవి ఉన్నాయి.
1991 నుంచి 1996 వరకు డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న ఐదు సంత్సరాల కాలం స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పింది. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానం ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఆ సమయం డాక్టర్ సింగ్ వ్యక్తిగత జీవితంతో ముడిపడిందన్నది ప్రజాభిప్రాయం.
ప్రజా జీవితంలో డాక్టర్ సింగ్ ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మ విభూషణ్ (1987)తో బాటు, జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటినరీ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాంగ్రెస్ (1995), ది ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993) మరియు (1994), ది యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), ద ఆడమ్‌స్మిత్ ప్రైజ్ ఆఫ్ ద యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (1956), రైట్స్ ప్రైజ్ ఫర్ డిస్టింగ్ విష్ట్ ఫర్మార్మెన్స్ ఎట్ సెయింట్ జోన్స్ కాలేజ్ ఇన్ కేంబ్రిడ్జ్ (1955) మొదలైన అవార్డులను అందుకున్నారు. జపాన్‌కు చెందిన నిహాన్ కిజై షింబన్ తో సహా అనేక అసోసియేషన్ల నుంచి పురస్కారాలను కూడా అందుకున్నారు. అలాగే, యూనివర్శిటీస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ ఫర్డ్ తో సహా అనేక యూనివర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పొందారు.
అనేక అంతర్జాతీయ సదస్సులకు, పలు అంతర్జాతీయ సంస్థలకు డాక్టర్ సింగ్ భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1993లో సైప్రస్‌లో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి, 1993లో వియన్నాలో మానవహక్కులపై జరిగిన ప్రపంచ సదస్సుకు హాజరైన భారత ప్రతినిధి వర్గాలకు డాక్టర్ మన్మోహన్సింగ్ నాయకత్వం వహించారు.
డాక్టర్ మన్మోహన్సింగ్ తమ రాజకీయ జీవితంలో 1991 నుంచి భారత పార్లమెంట్ ఎగువ సభ (రాజ్యసభ) సభ్యునిగా ఉన్నారు. 1998 – 2004 మధ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 సాధారణ ఎన్నికల తరువాత మే 22వ తేదీన దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరిగి వరుసగా రెండవ పర్యాయం కూడా 2009 మే 22న ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు.
డాక్టర్ సింగ్, ఆయన సతీమణి శ్రీమతి గురుచరణ్ కౌర్‌లకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.