ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ కింద ప్రస్తావించిన నాలుగు జిఎస్ టి సంబంధిత బిల్లులకు ఆమోదం తెలిపింది:
1. ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు 2017 (ది సిజిఎస్ టి బిల్)
2. ది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు 2017 (ది ఐజిఎస్ టి బిల్)
3. ది యూనియన్ టెరిటరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు 2017 (ది యుటిజిఎస్ టి బిల్)
4. ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (కాంపన్సేశన్ టు ది స్టేట్స్) బిల్లు 2017 (ది కాంపన్సేశన్ బిల్)
జిఎస్ టి కౌన్సిల్ గత ఆరు నెలలలోను 12 సార్లకు పైగా సమావేశాలు జరిపి క్షుణ్నంగా, ఒక్కొక్క క్లాజు వారీగా చర్చను చేపట్టిన అనంతరం పైన పేర్కొన్న నాలుగు బిల్లులకు ఇంతకుముందే ఆమోదం తెలిపింది.
వస్తువులు లేదా సేవల అంతర్రాష్ట్ర సరఫరాలపై లేదా ఈ రెండింటిపై కేంద్ర ప్రభుత్వం పన్నును విధించేందుకు మరియు పన్నును వసూలు చేసేందుకు సంబంధించిన నిబంధనలను సిజిఎస్ టి బిల్లు లో ఉల్లేఖించడమైంది. మరో వైపు, వస్తువులు లేదా సేవలు లేదా ఈ రెండింటి అంతర్రాష్ట్ర సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం పన్నును విధించేందుకు మరియు పన్నును వసూలు చేసేందుకు సంబంధించిన నిబంధనలను ఐజిఎస్ టి బిల్లు లో పొందుపరచడమైంది.
శాసన సభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల అంతర్గత సరఫరాలపై పన్ను విధించి ఆ పన్నును వసూలు చేసేందుకు సంబంధించిన నిబంధనలను యుటిజిఎస్ టి బిల్లులో నిర్దేశించడమైంది. కేంద్ర పాలిత ప్రాంత వస్తువులు, సేవల పన్ను కూడా రాష్ట్రాల వస్తువులు, సేవల పన్ను ను (ఎస్ జిఎస్ టి) పోలి ఉంటుంది. ఈ పన్నును రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల లోపల వస్తువులు లేదా సేవలు లేదా ఈ రెండింటి సరఫరాలపై విధించి, వసూలు చేయడం జరుగుతుంది.
రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం, 2016 లోని 18వ సెక్షన్ లో ఉల్లేఖించిన ప్రకారం వస్తువులు మరియు సేవల పన్ను ను అమలు చేసినందువల్ల అయిదు సంవత్సరాల కాలం పాటు రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయ నష్టానికి సంబంధించి రాష్ట్రాలకు నష్టపరిహారం ఇవ్వడాన్ని గురించి కాంపెన్సేశన్ బిల్లులో పొందుపరచడం జరిగింది.
పూర్వ రంగం:
ప్రభావవంతమైన సంస్కరణలలో ఒక సంస్కరణ అయినటువంటి జిఎస్ టి ని దేశంలో త్వరితగతిన ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న జులై 1వ తేదీ నాటి నుండి జిఎస్ టిని అమలుచేయడం మొదలుపెట్టాలని జిఎస్ టి కౌన్సిల్ నిర్ణయించింది. జిఎస్ టి నిబంధనలను గురించి వ్యాపార మరియు పరిశ్రమ వర్గాల వారికి వివరించడానికి దేశవ్యాప్తంగా విస్తృతమైన అవగాహన సదస్సులు చేపడతామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.