విద్య, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్ డీ ఏ ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలు.
విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవడానికి ఎన్ డీ ఏ ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాల, ఉపకార వేతనాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఒక పూర్తి స్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అధికార సంస్థ పని చేస్తుంది. ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యత పెంచడానికిగాను పండిట్ మదన్ మోహన్ మాలవీయ మిషన్ ను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గురువులు భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వీలుగా గ్లోబల్ ఇనీషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్ (జిఐఏ ఎన్.. గ్యాన్) ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అధ్యాపకులను, శాస్త్రవేత్తలను, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి వారితో వేసవి, శీతాకాల సమయాల్లో పాఠాలు చెప్పించడం జరుగుతుంది. ‘స్వయం’ కార్యక్రమం ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (ఎమ్ ఓఓసి) లను సంపూర్ణంగా వినియోగించుకొని భారతీయ విద్యార్థులు ఆన్లైన్ విద్యను పొందడానికి మార్గం వేస్తారు. జాతీయ ఎలక్ట్రానిక్ గ్రంథాలయం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యాసంబంధిత సమాచారాన్ని, విజ్ఞాన వనరులను అందుబాటులోకి తేవడం జరుగుతుంది, తల్లిదండ్రులు ఇంటిదగ్గరే ఉండి స్కూళ్లలో తమ పిల్లల విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకోవడానికి వీలుగా ‘శాలా దర్పణ్’ మొబైల్ సాంకేతితకను వినియోగించడం జరుగుతోంది. బాలికల విద్యాభివృద్ధికి గాను ఉద్దేశించిన కార్యక్రమం ‘ఉడాన్’. దీని ద్వారా బాలికల విద్యను ప్రోత్సహిస్తారు. వారి ప్రవేశ శాతాన్ని పెంచుతారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్కూలు పిల్లలు, ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థులు తమ సెలవుల్లో ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఐఐఎస్ ఇఆర్ విద్యాసంస్థలను సందర్శించి స్ఫూర్తి పొందడానికిగాను ‘ఇషాన్ వికాస్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సంప్రదాయక కళలు, చేతివృత్తుల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచి వారికి శిక్షణ ఇవ్వడానికిగాను యుఎస్ టిటిఏడి కార్యక్రమానికి అనుమతినివ్వడం జరిగింది. సంప్రదాయ కళాకారుల, చేతివృత్తిదారుల సామర్థ్య నిర్మాణానికి, వారి కళల్లో, చేతివృత్తుల్లో ప్రమాణాలు తేవడానికి, వారికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించడానికి, వారికి సంబంధించిన అన్ని విషయాలను డాక్యుమెంట్ చేయడానికి ఉద్దేశించినదే ఈ పథకం.
నైపుణ్య భారతదేశాన్ని రూపొందించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యం రహస్యమేమీ కాదు. ఇందుకోసం ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖనే కొత్తగా ప్రారంభించి యువతకు సాధికారతను కలగజేయడానికి కృషి చేస్తోంది. ఇంతవరకు పలు కార్యక్రమాల కింద 76 లక్షల మంది యువతీయువకులకు నైపుణ్యాల సాధనలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ‘స్కూల్ టు స్కిల్’ కార్యక్రమం కింద నైపుణ్యాల సాధన పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వాటికి అకాడమీ సర్టిఫికెట్ల స్థాయిని కల్పించడం జరిగింది. రూ.1,500 కోట్ల బడ్జెట్ తో ‘ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన’ కార్యక్రమానికి అనుమతినివ్వడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన కింద పది లక్షల మంది గ్రామీణ యువతీయువకులకు మూడు సంవత్సరాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
అప్రెంటిస్ షిప్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఉద్యోగ శిక్షణ సమయంలోనే మరిన్ని అవకాశాలు పొందడానికి వీలుంటుంది. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం స్టయిపండ్లో యాభై శాతాన్ని పంచడం ద్వారా ఒక లక్ష మంది అప్రెంటిస్ లకు భరోసా కల్పించనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.9 లక్షల మంది అప్రెంటిస్ లు ఉన్నారు.
రానున్న కొన్ని సంవత్సరాల్లో ఈ సంఖ్యను 20 లక్షలకు పైగా పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. జాతీయ కెరీర్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా అవకాశాలు ఎలా వున్నాయనే విషయాన్నితెలుసుకోగలగడమే కాకుండా అన్ని రకాల ఆన్ లైన్ సేవలు లభ్యమయ్యేలా వీటిని రూపొందించడం జరిగింది. కెరీర్ కు సంబంధమున్న నాణ్యతగల సమాచారం, స్వయంమదింపు విధానాలను ఈ కేంద్రాలు యువతకు అందిస్తాయి. వీటిద్వారా కౌన్సిలర్ల నెట్ వర్క్ యువతకు అందుబాటులో ఉంటుంది.