ఎన్ డీ ఏ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న భారీ ఆర్థిక వ్యవస్థగల దేశంగా గుర్తింపు పొందిందింది.
గడిచిన సంవత్సరం భారతదేశ ఆర్థికరంగంలో చరిత్రాత్మక సంవత్సరంగా మిగిలిపోయింది. ఎన్ డీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల్లో భారీగా తగ్గుదల ఉండేవి. ఆ పరిస్థితి నుంచి బైటపడడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలను బలోపేతం చేసింది. అంతే కాదు, ఆర్థిక రంగాన్ని అధిక వృద్ధి పథంలోకి నడిపించింది. భారతదేశ జీడీపీ వృద్ధి 7.4 శాతానికి ఎగబాకింది. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాలను తీసుకుంటే ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల.
ఎన్ డీ ఏ ప్రభుత్వ పాలన కింద రానున్న కొద్ది సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పలు రేటింగు ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు, ఇతర ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. ఎన్ డీ ఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, బలమైన ఆర్థిక పునాదుల కారణంగా ఇండియా రేటింగ్ ‘స్టేబుల్’ స్థాయి నుంచి ‘పాజిటివ్’ స్థాయికి చేరుకుందని ఈ మధ్యనే ప్రతిష్టాత్మక రేటింగ్ సంస్థ ‘మూడీస్’ ప్రకటించింది.
బీఆర్ ఐ సీ ఎస్ సంస్థను ప్రారంభంచినప్పుడు అందులో భాగమైన భారతదేశానికి ఆ స్థాయి లేదని పలువురు భావించారు. అందరూ ఇండియా పట్ల అపనమ్మకంగా చూశారు. ఇప్పుడు బీఆర్ ఐ సీ ఎస్ సంస్థ అభివృద్ధిలో ఇండియానే కీలక పాత్ర పోషిస్తోంది.
తయారీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) 2.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఈ విషయంలో రుణాత్మక వృద్ధి ఉండేది. ద్రవ్యోల్బణం స్థిరంగా పడిపోతోంది. 2014 ఏప్రిల్ నెలలో ఇది 5.55 శాతం ఉంటే 2015 ఏప్రిల్ నాటికి ఇది -2.64 శాతంగా నమోదైంది. కనీవినీ ఎరగని రీతిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ లు) పెరుగుతున్నాయి. ఎఫ్‌డిఐ ఈక్విటీలు నలభై శాతం పెరిగి రూ.1,75,886 కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఎఫ్‌డీఐల విలువ రూ.1,25,960 కోట్లు.
ఆర్థిక లోటు స్థిరంగా పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు గత సంవత్సరం జీడీపీలో 4.7 శాతం ఉంటే ఈ సంవత్సరం ఇది జీడీపీలో 1.7 శాతం. భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు గణనీయంగా పెరిగాయి. 311.8 బిలియన్ డాలర్ల నుంచి 352.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తినా మనకున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో వాటిని ఎదుర్కొనవచ్చు.