సవరించిన జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి కార్యక్రమానికి (ఎన్పీడీడీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సవరించిన జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర రంగ పథకంగా, అదనంగా రూ.1000 కోట్లు కేటాయించారు. దీంతో 15వ ఆర్థిక సంఘం (2021-22 నుంచి 2025-26) కాలానికి మొత్తం బడ్జెట్ రూ.2790 కోట్లకు చేరింది. ఈ కార్యక్రమం పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, విస్తరణతో పాటు ఈ రంగం సుస్థిర అభివృద్ధి, ఉత్పాదకత పై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
సవరించిన ఎన్పీడీడీ పాల సేకరణ, ప్రాసెసింగ్ సామర్థ్యం మెరుగైన నాణ్యత నియంత్రణ కోసం మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా పాడి పరిశ్రమకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది. విలువ జోడింపు ద్వారా మెరుగైన ధరకు హామీ ఇస్తుంది. సరఫరా మార్గాల సామర్థ్యాన్ని పెంచి అధిక ఆదాయాన్ని ఇస్తుంది. మరింతగా గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఈ పథకంలో రెండు కీలక భాగాలుంటాయి.
1. పాల శీతలీకరణ ప్లాంట్లు, అధునాతన పాల పరీక్షా ప్రయోగశాలలు, సర్టిఫికేషన్ వ్యవస్థలు వంటి అవసరమైన డెయిరీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కాంపోనెంట్ ‘ఎ‘ ను ఉద్దేశించారు. ఇది కొత్త గ్రామీణ పాడి సహకార సంఘాల ఏర్పాటుకు కూడా తోడ్పాటును ఇస్తుంది. ఈశాన్య ప్రాంతం, (ఎన్ఈఆర్), కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పాల సేకరణ, ప్రాసెసింగ్ సామర్ధ్యాలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా మారుమూల, వెనుకబడిన ప్రాంతాలలో, అలాగే ప్రత్యేక గ్రాంట్ తో రెండు పాల ఉత్పత్తి కంపెనీల (ఎంపీసీ) ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది.
2. సహకార సంఘాల ద్వారా పాడి పరిశ్రమ (డెయిరీ త్రూ కోఆపరేటివ్స్ -డీటీసీ) అని పిలిచే కాంపోనెంట్ బి, జపాన్ ప్రభుత్వం తోనూ, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) తోనూ కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం, భాగస్వామ్యాల ద్వారా పాడిపరిశ్రమ అభివృద్ధిని కొనసాగిస్తుంది. ఈ భాగం తొమ్మిది రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్) లో పాడి సహకార సంఘాల సుస్థిర అభివృద్ధి, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.
ఎన్పీడీడీ అమలు వల్ల ఇప్పటికే 18.74 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగింది. 30,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది. పాల సేకరణ సామర్థ్యాన్ని రోజుకు అదనంగా 100.95 లక్షల లీటర్ల మేర పెంచింది. మెరుగైన పాల పరీక్ష, నాణ్యత నియంత్రణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో ఎన్పీడీడీ మద్దతు ఇస్తోంది. గ్రామస్థాయిలో 51,777 పాల పరీక్షా ప్రయోగశాలలను బలోపేతం చేసింది. అలాగే, 123.33 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 5,123 బల్క్ మిల్క్ కూలర్లను ఏర్పాటు చేసింది. ఇంకా, 169 ప్రయోగశాలలను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ (ఎఫ్టిఐఆర్) పాల అనలైజర్లతో అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు 232 పాల కర్మాగారాలు కల్తీని గుర్తించే ఆధునిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి.
సవరించిన జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం 10,000 కొత్త పాల సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈశాన్య ప్రాంతంలో ప్రాసెసింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు, కొనసాగుతున్న ఎన్పీడీడీ ప్రాజెక్టులకు అదనంగా ప్రత్యేక గ్రాంట్ తో రెండు పాల ఉత్పత్తి కంపెనీలను (ఎంపీసీ) ఏర్పాటు చేస్తుంది. ఇది 3.2 లక్షల మేర కొత్త ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది. ప్రత్యేకంగా, పాడి పరిశ్రమలో 70% ఉన్న మహిళా కార్మికులకు మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది.
సవరించిన జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి కార్యక్రమం శ్వేత విప్లవం 2.0కు అనుగుణంగా భారతదేశ ఆధునిక మౌలిక సదుపాయాలను మారుస్తుంది. కొత్త సాంకేతికత, నాణ్యమైన పరీక్షా ప్రయోగశాలలను అందించడం ద్వారా కొత్తగా ఏర్పడిన సహకార సంఘాలకు మరింత మద్దతు ఇస్తుంది. ఈ కార్యక్రమం గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు, సంబంధిత వర్గాలకు ప్రయోజనం చేకూర్చే బలమైన, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగల మరింత సుస్థిర పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది.
***