Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్‌లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఏడో సమావేశం

ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్‌లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఏడో సమావేశం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లో గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏడో సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఆయా వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన విభిన్న కార్యక్రమాలను నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమీక్షించింది. సరికొత్త రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం, ‘ప్రాజెక్ట్ టైగర్’, ‘ప్రాజెక్ట్ ఎలీఫెంట్’, ‘ప్రాజెక్ట్ స్నో లెపర్డ్’ వంటి జాతి విశిష్ట ప్రధాన కార్యక్రమాలతో సాధించిన విజయాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. డాల్ఫిన్లను, ఆసియా సింహాలను సంరక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలను, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్‌ ఏర్పాటును కూడా బోర్డు చర్చించింది.

సమావేశం కొనసాగిన క్రమంలో, ప్రధానమంత్రి దేశంలోనే నదితీర ప్రాంతాలలో మనుగడ సాగించే డాల్ఫిన్ల అంచనాకు సంబంధించిన  తొలి నివేదికను ఆవిష్కరించారు. ఈ నివేదికలో తెలిపిన ప్రకారం, దేశంలో నదీతీర ప్రాంతాల్లో జీవించే డాల్ఫిన్ల మొత్తం సంఖ్య 6,327గా ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 28 నదుల వెంబడి సర్వే చేశారు. 8,500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రాంతాన్ని పరిశీలించడానికి 3150 రోజులు పట్టింది. ఉత్తరప్రదేశ్‌లో అన్నింటి కన్నా ఎక్కువ సంఖ్య నమోదు అయింది. బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం ఆ తరువాతి స్థానాలలో నిలిచాయి.

ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు, పల్లెవాసులకు భాగస్వామ్యాన్ని కల్పించి మరీ డాల్ఫిన్ల సంరక్షణ విషయమై చైతన్యాన్ని పెంచాలని ప్రధాని స్పష్టం చేశారు. డాల్ఫిన్ల నివాస స్థానాలను గురించి బడిపిల్లలు తెలుసుకోవడానికి వారిని ఆయా చోట్లకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

జునాగఢ్‌లో నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది వన్యప్రాణుల స్వస్థత, వన్యప్రాణులకు రోగాలు వస్తే నయం చేయడానికి సంబంధించిన వివిధ అంశాల్ని సమన్వయపరచడానికి ఓ కూడలి (హబ్)గా పనిచేయనుంది.  

ఆసియా సింహాల సంఖ్యను అంచనా వేసే ప్రక్రియను ప్రతి అయిదు సంవత్సరాలకోసారి చేపడుతుంటారు. కిందటిసారి 2020లో ఇలాంటి ప్రక్రియను పూర్తి చేశారు. సింహాల సంఖ్యను అంచనా వేయడానికి  పదహారో రౌండును ఈ ఏడాది మొదలుపెడతారని ప్రధానమంత్రి ప్రకటించారు.

ఆసియా సింహాలు ఇక ప్రాకృతిక విస్తరణ మాధ్యమం ద్వారా బర్దా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని తమ నివాసంగా మార్చుకొన్న సంగతిని లెక్కలోకి తీసుకొని, వేటకు అనుకూల స్థితులను మరింతగా పెంచుతూ, ఇతరత్రా నివాసస్థాన సంబంధిత మెరుగుదల యత్నాలను చేపడుతూ బర్దాలో సింహాల సంరక్షణకు తగిన విధంగా మద్దతివ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. వన్యప్రాణుల నివాస స్థానాలను అభివృద్ధిపరచడంలో, సంరక్షించడంలో ఇకో-టూరిజానిది ముఖ్యపాత్ర అని ఆయన స్పష్టం చేస్తూ వన్యప్రాణి అభయారణ్యాల సందర్శన ప్రధాన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికిగాను యాత్రలు చేయడంలో సౌలభ్యం, సంధాన సదుపాయాల కల్పనలో సౌలభ్యం.. వీటిని కల్పించాలన్నారు.    

మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ చోటుచేసుకోకుండా చూడడం కోసం ఒక శ్రేష్ఠత్వ కేంద్రాన్ని (ఎక్స్‌లెన్స్ సెంటర్) కోయంబత్తూరులోని సకోన్ (‘సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ..‘ఎస్ఏసీఓఎన్’ )లో గల వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో ఏర్పాటుచేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కేంద్రం ఉన్నత టెక్నాలజీని దన్నుగా తీసుకొని పనిచేసే సత్వర ప్రతిస్పందన బృందాలను, ట్రాకింగుతోపాటు ముందస్తు హెచ్చరికలను సైతం చేయగలిగే యంత్రసాధనాలను సమకూర్చుకోవడంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాయపడుతుంది. అంతేకాక మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ తలెత్తడానికి ఆస్కారం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో గస్తీ తిరగడం, చొరబాట్లను గుర్తించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో కూడా తోడ్పడుతుంది. సంఘర్షణలను తగ్గించే చర్యలను చేపట్టడానికి ఫీల్డ్ ప్రాక్టీషనర్లతోపాటు సాముదాయిక సామర్థ్యాలను సైతం పెంపొందిస్తుంది.  

అడవుల్లో మంటలు, మనుష్య-వన్యప్రాణి సంఘర్షణలు వంటి సమస్యలను ఎదుర్కోవడానికి రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ మ్యాపింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించాలని ప్రధానమంత్రి చెప్పారు. మనుష్య-వన్యప్రాణి సంఘర్షణ సవాలును పరిష్కరించడానికి భారతీయ వన్యప్రాణి సంస్థ (వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ను భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (బిఐఎస్ఏజి-ఎన్) తో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.

అటవీ మంటల పర్యవేక్షణ, నిర్వహణను మెరుగుపరచడానికి,  ముఖ్యంగా అత్యంత సున్నితమైన సంరక్షిత ప్రాంతాలలో, అంచనా వేయడం, గుర్తించడం, నివారణ, నియంత్రణపై దృష్టి సారించేందుకు  డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, బిఐఎస్ఎజి- ఎన్  మధ్య అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సహకారాన్ని అందించాలని ప్రధానమంత్రి సూచించారు..

మధ్యప్రదేశ్ లోని గాంధీసాగర్ అభయారణ్యం, గుజరాత్ లోని బన్ని గడ్డిభూములు సహా ఇతర ప్రాంతాలలో చిరుత లను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని విస్తరిస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారు.

పులుల సంరక్షణను పులుల అభయారణ్యాల వెలుపల కూడా విస్తరించే ప్రత్యేక పథకాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని  అభయారణ్యాల వెలుపల ఉన్న ప్రాంతాల్లో జనాలు- పులుల మధ్య ఇతర మాంసాహార జంతువుల మధ్య సంఘర్షణలను నివారించి, స్థానిక సమూహాలతో సహజీవనాన్ని ప్రోత్సహించే విధంగా రూపొందించారు.

ఘరియల్ మొసళ్ళ జనాభా క్రమంగా తగ్గిపోతున్న దృష్ట్యా వాటి సంరక్షణ కోసం ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేకపిట్ట) సంరక్షణ కోసం చేపట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ దిశగా సంరక్షణ చర్యలను మరింత విస్తృతంగా కొనసాగించడానికి నేషనల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని ప్రకటించారు.

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి పై భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ పరిజ్ఞానం, రాతప్రతులను సేకరించాలని ఈ సమీక్షా సమావేశంలో ప్రధాన మంత్రి బోర్డును, పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరారు. వన్యప్రాణుల సంరక్షణ వ్యూహం, మంత్రిత్వశాఖ భవిష్యత్ చర్యలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను నిర్దేశించిన ప్రధానమంత్రి, ఇండియన్ స్లోత్ బేర్(ఎలుగుబంటి ) ఘరియల్ మొసళ్ళు , గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేకపిట్ట) సంరక్షణ, అభివృద్ధిపై ప్రత్యేకంగా పనిచేయడానికి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సింహాలు, చిరుతల సంరక్షణలో గిర్ ని విజయవంతమైన నమూనాగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సంప్రదాయ పరిజ్ఞానాన్ని కృత్రిమ మేధ (ఎఐ) సహాయంతో డాక్యుమెంట్ చేసి, ఇతర జాతీయ పార్కులు,  అభయారణ్యాల్లో ఉపయోగించేందుకు అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు.

వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (సీఎంఎస్) కింద సమన్వయ విభాగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ప్రధాని సూచించారు.

ప్రత్యేక కమ్యూనిటీ అభయారణ్యాల ఏర్పాటు ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక సమాజాల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. గత దశాబ్దంలో, భారతదేశంలో కమ్యూనిటీ అభయారణ్యాల సంఖ్య ఆరింతలు పెరిగింది. వన్యప్రాణుల సంరక్షణలో కృత్రిమ మేధ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

జంతువుల ఆరోగ్య నిర్వహణకు ఎంతో అవసరమయ్యే అటవీ ప్రాంత ఔషధ మొక్కలపై పరిశోధన, పత్రాల తయారీ చేపట్టాలని ప్రధాని సూచించారు, అలాగే, మొక్కల ఆధారిత ఔషధ వ్యవస్థల వాడకాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించే అవకాశాలను ఆయన ప్రస్తావించారు.

ఈ సమావేశం అనంతరం ప్రధానమంత్రి – ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ సిబ్బంది సంచార సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన మోటారు సైకిళ్లను జెండా ఊపి ప్రారంభించారు. గిర్ లో ఫ్రంట్ లైన్ సిబ్బంది, ఎకో గైడ్స్, ట్రాకర్లతో సహా క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానమంత్రి సంభాషించారు.